Wednesday, October 27, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు

పరస్పర ఆమోదంతో విడాకులు
October 26th, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలనుకునే వ్యక్తులు సె.-13-బి ప్రకారం ఈ విషయాలను సంతృప్తి పరచాల్సి వుంటుంది. అవి -
ఆ దంపతులు ఒక సంవత్సరం నుంచి గానీ, అంతకు మించి గానీ వేరువేరుగా నివసిస్తూ వుండాలి.
వారిద్దరూ కలిసి నివసించలేని పరిస్థితులు వుండాలి.
తమ వివాహం ఇద్దరూ రద్దు కావాలని పరస్పర ఆమోదంతో కోరుకుని ఉండాలి.
హిందూ వివాహాన్ని రద్దు చేసుకోవడం కోసం విడాకులు దరఖాస్తుని దాఖలు చేయడానికి సంవత్సరం కాలం పాటు కాలపరిమితిని విధించారు. వివాహమైన సంవత్సర కాలం తరువాత వాళ్లు దరఖాస్తుని దాఖలు చేసుకోవాల్సి వుంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో సె.-14ప్రకారం కోర్టు దీనికి మినహాయింపుని ఇవ్వవచ్చు. దంపతులు పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవాలంటే వాళ్లు సంవత్సరం నుంచి గానీ, అంతకు మించి గాని వేరువేరుగా నివశిస్తూ వుండాలి. ఈ విధంగా కానప్పుడు పరస్పర ఆమోదంతో విడాకులని కోరడానికి అవకాశం లేదు. సె.-14 ప్రకారం అనుమతి ఇవ్వవచ్చా? ఇవీ ప్రశ్నలు.
స్వీటీ, ఆమె భర్త సునీల్ కుమార్ పరస్పర ఆమోదంతో సె.-13-బి ప్రకారం విడాకుల కోసం కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తుని దాఖలు చేశారు. అయితే వారి వివాహమైన సంవత్సరంలోపే దరఖాస్తుని దాఖలు చేసి సె.-14 ప్రకారం కోర్టు అనుమతిని కోరారు. కోర్టు ఆ అనుమతిని ఇవ్వలేదు.
తామిద్దరూ కలిసి ఒక్కరోజు కూడా జీవించలేదని, అందుకని మినహాయింపుని ఇవ్వాలని వారు కోర్టుని కోరారు. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల వల్ల వాళ్లు కలిసి జీవించలేని పరిస్థితులు ఉన్నాయని, అందువల్ల వాళ్లు మానసిక, శారీరక క్షోభని భరించలేమని దరఖాస్తులో పేర్కొన్నారు. పరస్పర ఆమోదంతో విడాకులు పొందడంవల్ల తమ జీవితాలని తిరిగి నిర్మించుకునే అవకాశం వుందని కూడా వాళ్లు తమ దరఖాస్తులో పేర్కొన్నారు. భర్త ఉద్యోగరీత్యా, విదేశాల్లో వుంటున్నాడు. వివాహం కాగానే అతను బెంగళూరులో కొంతకాలం ఉద్యోగం చేసి లండన్‌కి వెళ్లిపోయాడు. అక్కడ ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఉద్యోగాన్ని వదిలి భారత దేశానికి వచ్చే పరిస్థితుల్లో లేడు. భార్య భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తోంది. ఆమె విదేశాలకు వెళ్లే యోచనలో లేదు. అందుకని తాము కలిసి వుండే పరిస్థితి లేదని వాళ్లు భావించి పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తుని దాఖలు చేసుకున్నారు. సంవత్సర కాలంగా తాము వేరుగా నివసించడం లేదు కాబట్టి సె.-14 ప్రకారం మినహాయింపుని ఇవ్వమని కుటుంబ న్యాయస్థానం కోర్టుని కోరారు. కోర్టు వారి దరఖాస్తుని తిరస్కరించింది. దీనిపై కర్నాటక హైకోర్టులో అప్పీలుని దాఖలు చేశారు.
వారిద్దరి మధ్య పరిష్కరించడానికి వీల్లేని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. తన భర్త శాశ్వతంగా విదేశాల్లో వుండదల్చుకున్నాడు. అందుకు తాను ఇష్టపడటం లేదని భార్య తన ప్రమాణ పత్రంలో స్పష్టంగా తెలియజేసింది. భార్య వయస్సు 25 సంవత్సరాలు. భర్త వయస్సు 33 సంవత్సరాలు. వారి పెద్దవాళ్లు బాధ్యతలు తెలిసిన వాళ్లు. వాళ్లిద్దరూ తాము కలిసి వుండలేమని చెబుతున్నప్పుడు వారిని వివాహ బంధం నుంచి విముక్తి చేయక పోవడానికి ఎలాంటి కారణం కన్పించడం లేదు.
సె.-13-బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలంటే సంవత్సర కాలంగా లేదా అంతకు మించి వేరుగా నివశిస్తూ వుండాలి. దీనికి కూడా సె.-14 ప్రకారం కోర్టు మినహాయింపుని ఇచ్చి దరఖాస్తు దాఖలు చేసుకోవడానికి అనుమతిని ఇవ్వవచ్చు. ఒత్తిడివల్ల, బెదిరింపు వల్ల దరఖాస్తు దాఖలు చేయడం లేదని, అదే విధంగా పరస్పర ఆమోదంతో విడాకులు పొందడంవల్ల ఉత్పన్నమయ్యే విషయాలు వాళ్లకి తెలిసి వుండాలి. వీటి విషయంలో కోర్టు సంతృప్తి చెందాల్సి వుంటుంది.
సంవత్సర కాలానికి మినహాయింపు ఇవ్వాలంటే కోర్టు ఈ విషయాల గురించి సంతృప్తి చెందాల్సి ఉంటుంది. అవి:-
దంపతులకి విషయాలను అర్థం చేసుకునే యోగ్యత
ఒత్తిడి, బెదిరింపులు లేకపోవడం
ఇద్దరూ కలిసి వుండే పరిస్థితులు లేకపోవడం
వాహం రద్దు కోరుతున్న పరిధి
తప్పుడు విషయాలు చెప్పడం
పార్టీల వయస్సు, వివాహం పొడిగింపు వల్ల వారి పునర్వివాహ అవకాశాలు దెబ్బతినడం
ఈ విషయాలను గమనించి అనుమతిని ఇవ్వాలి. ఈ కేసులో వీరి వివాహం కొనసాగించడంవల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందుకని సె.-14 ప్రకారం సంవత్సర కాలం పాటు వేరుగా వుండటానికి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం వుంది. (శ్రీమతి స్వీటీ, ఎమ్. వర్సెస్ సునీల్ కుమార్ కె.బి. కర్నాటక లా జర్నల్ బి (2007) 244)
తీర్పులోని ముఖ్యాంశం: భార్యా భర్తలు విడాకులు పొందాలంటే వివాహమైన సంవత్సరం తరువాతే దరఖాస్తు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అంతలోపు దరఖాస్తు చేసుకోవాలంటే సె.-14 ప్రకారం కోర్టు అనుమతి ఉండాల్సి వుంటుంది. అదే విధంగా సె.-13-బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలంటే కనీసం సంవత్సరకాలం వేరుగా వుండాలి. అయితే సె.-14 ప్రకారం కోర్టు మినహాయింపు ఇవ్వవచ్చు.

No comments:

Post a Comment

Followers