Wednesday, November 9, 2011

ధర్మం’ కాదు... రాజ్యాంగ ‘హక్కు’!

ధర్మం’ కాదు... రాజ్యాంగ ‘హక్కు’!





‘‘న్యాయాన్ని ఎవరికీ అమ్మం
న్యాయాన్ని ఎవరికీ నిరాకరించం
న్యాయాన్ని ఎవరికీ ఆలస్యం చేయం
న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తాం’’

ఏడు శతాబ్దాల క్రితం ఇంగ్లండ్‌ రాజు కింగ్‌ జాన్‌ తన సామంతులకు న్యాయాన్ని వాగ్దానం చేస్తూ జారీ చేసిన ‘మాగ్నాకార్టా’ చార్టర్‌లోని ఈ వాక్యాలు నేటికీ చర్చనీయాంశాలు కావడం విశేషం. న్యాయసహాయం, న్యాయసేవ అన్న పదాలు ఆ వాక్యాల్లో లేకున్నా, అలాంటి అర్థం అందులో స్పష్టంగానే ఇమిడి ఉంది. న్యాయసహాయం అన్న భావన అలా అంకురించి, శతాబ్దాల కాలంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పక తప్పదు. అందులో భాగమే, నేడు దేశంలో ప్రతి ఏడూ నవంబర్‌ 9న ‘న్యాయసేవా దినం’గా పాటించడం.

భారత రాజ్యాంగంలోని ప్రవేశిక దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తానని అభయం ఇచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు, శారీరక వైకల్యాలతో బాధపడుతున్న వ్యక్తులకు సమాన న్యాయం అందించడానికి కృషి చేయాలన్న భావన రాజ్యాంగంలోని 14, 16 అధికరణల్లో మిళితమై ఉంది. రాజ్యాంగం అమల్లోకొచ్చిన తొలిరోజుల్లో న్యాయసహాయం పట్ల అంత స్పష్టత లేకున్నప్పటికీ, 1951లో ‘జనార్ధన్‌రెడ్డి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ కేసులో సుప్రీంకోర్టు పరిమితంగానే అయినప్పటికీ ‘న్యాయసహాయం’ ఆవశ్యకతను వివరిస్తూ ‘న్యాయవాదిని నియమించుకోవడం ముద్దాయి హక్కు. అది అతను సొంతంగా లేదా బంధువుల ద్వారా గానీ నియమించుకోవచ్చు. ఆ అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత సంబంధిత మేజిస్ట్రేట్‌పై ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది. న్యాయవాదిని నియమించాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద మోపకున్నా, అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరణశిక్ష విధించే కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయాన్ని వ్య క్తం చేస్తూ, న్యాయవాదిని నియమించుకోనంత మాత్రాన కోర్టులు కేసును కొట్టివేయడం కుదరదని అభిప్రాయపడింది. కాలక్రమంలో అలాంటి ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడమే కాక ‘న్యాయసహాయం, న్యాయసేవలు’ అన్నవి ప్రతి పౌరుడి హక్కుగా రూపొంది ఎనలేని ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.

1978లో ‘సునీల్‌ భట్రా వర్సెస్‌ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్‌’ కేసులో జైలు నిర్బంధాన్ని అనుభవిస్తున్న వ్యక్తులకు న్యాయ సహాయం జీవించే హక్కులో భాగంగా ఉంటుం దని సుప్రీంకోర్టు గుర్తించింది. జైలు అధికారుల దగ్గర న్యాయం పొందడానికి, జైలు అధికారుల నిర్ణయాలను సవాలు చేయడానికి న్యాయసహాయా న్ని అందించాలని కోర్టు అభిప్రాయపడింది. ఇందులో న్యాయపరమైన, పాల నాపరమైన అంశాలు ఇమిడి ఉండటం తో, 1980లో ‘హుస్సేనియార ఖాటూన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌’ కేసులో ‘జైలు నుంచి విముక్తి పొందడానికి అవసరమైన న్యాయసహాయం అందించాల్సిన బాధ్యత రాజ్యాంగంపై ఉంది’ అని సుప్రీంకోర్టు అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసింది.

ఉచిత న్యాయసహాయాన్ని పొందడమనేది రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం జీవించే హక్కులో భాగమని అత్యున్నత న్యాయస్థానం ప్రకటిం చినా, దేశంలోని అనేక రాష్ట్రాలు ఆ ఆదేశాన్ని సరిగా పాటించలేదనే చెప్పాలి. అందుకే, న్యాయసహాయం అందరికీ సమానంగా అందేలా కృషి జరగాలని నిర్దేశించిన భారత రాజ్యాంగంలోని 39-ఏ అధికరణం ప్రకారం, ఆ అంశంపై సమగ్ర అధయయనం కోసం భారత ప్రభుత్వం 1980లో ‘సిలాస్‌’ కమిటీని నియమించింది. దేశవ్యాప్తంగా న్యాయసహాయం అందరికీ ఒకేలా అందుబాటులోకి తేవడానికి ఆ కమిటీ విస్తృతస్థాయిలో చర్చించి నివేదికను సమర్పించింది. 1986లో మరో సందర్భంలో ‘న్యాయసహాయం కావాలని ముద్దాయి కోర్టుని అభ్యర్థించాల్సిన అవసరం లేదు. న్యాయసహాయం అందించడం కోర్టు బాధ్యత’ అని చెప్పడమే కాక, ‘న్యాయసహాయాన్ని అందించకపోవడం న్యాయాన్ని అవహేళన చేయడమే’నని వ్యాఖ్యానిస్తూ, ముద్దాయి రిమాండ్‌ దగ్గర నుంచి అప్పీలు వరకూ న్యాయసహాయాన్ని కల్పించాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో పార్లమెంటు ‘న్యాయసేవాధికార సంస్థల చట్టం - 1987’ను ఆమోదించింది. 1987 అక్టోబర్‌ 12న గజెట్‌లో ప్రచురితమైన ఆ చట్టం ఎంతో కాలయాపన అనంతరం, 1995 నవంబర్‌ 9న అమలుకు నోచుకుంది. ముద్దాయిలకు న్యాయసహాయం అందించకుండా ఏ కోర్టు, ట్రిబ్యునల్‌, అథారిటీ గానీ విచారణ జరపడానికి వీలు లేదు. న్యాయసహాయం అందించడమన్నది సంక్షేమ చర్య కాదు. ధర్మం అంతకన్నా కాదు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రకారం దఖలుపడ్డ ‘హక్కు’. అంతేకాదు, యోగ్యత కలిగిన న్యాయవాదిని నియమించాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాలపైనే ఉంది. బ్రిటన్‌ వంటి దేశాల్లో న్యాయసహాయకులుగా వ్యవహరించడానికి సీనియర్‌ న్యాయవాదులు ముందుకు రావడం పరిపాటి. మన దేశంలో కూడా న్యాయసహాయాన్ని అందించడానికి పెద్ద మనసుతో విజ్ఞులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది గుర్తించాలి.

-మంగారి రాజేందర్‌, 3వ అదనపు జిల్లా జడ్జి, వరంగల్‌
(నేడు ‘జాతీయ న్యాయసేవల దినం’)

Followers