Tuesday, July 3, 2012

Justice HR Khanna ఎమర్జెన్సీ’కి బెదరని ధీరుడు

నివారక నిర్బంధం’, విచారణ లేకుండా నిర్బంధించడం అనే విషయాలు వ్యక్తిగత స్వేచ్ఛను ప్రేమించే వ్యక్తిని కలచివేస్తాయి. జీవితంలో అత్యం త విలువైనది స్వేచ్ఛ. ఇలాంటి చట్టాలు, చర్యలు మౌలికమైన స్వేచ్ఛను భగ్నం చేస్తాయి. అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ జబల్‌పూర్ వర్సెస్-శివకాంత్ శుక్లా, 1976 సుప్రీంకోర్టు (రిపోర్టర్ 172) కేసులో హన్స్‌రాజ్ ఖన్నా భిన్నాభివూపాయం న్యాయ చరిత్రలో చారిత్రాత్మకమైనది. ఎవరీ హన్స్‌రాజ్ ఖన్నా? అతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాలేకపోయిన న్యాయమూర్తి. ఆ పదవిని త్యజించిన మహోన్నతుడు. ఎమ్జన్సీ రోజుల్లో ప్రాథమిక హక్కుల కేసుల్లో భిన్నాభివూపాయాన్ని వ్యక్తపరిచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని పోగొట్టుకున్న వ్యక్తి. పౌరహక్కుల గురించి, ప్రాథమిక హక్కుల అమలు గురించి, న్యాయ వ్యవస్థ స్వతంవూతత గురించి ఒంటరిగా పోరాడిన న్యాయమూర్తి. ‘హెబియస్ కార్పస్’ కేసు లో తనతోటి నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విభేదించి ధైర్యంగా ఎమ్జన్సీ రోజుల్లో పౌరహక్కుల గురించి చెప్పిన వారు. వ్యక్తులను సుదీర్ఘకాలం నిర్బంధించే అధికారం రాజ్యానికి లేదని,తోటి న్యాయమూర్తులతో విభేదించి తీర్పు రాశా రు. ఎ.డి.ఎమ్. జబల్‌పూర్ కేసు ఎమ్జన్సీ రోజుల్లో ఓ సంచలనం. ఇప్పటికీ అది మర్చిపోలేని తీర్పు. ఈ తీర్పు తర్వాత న్యూయార్క్ టైమ్స్ తన సంపాదకీయంలో ‘భారత దేశంలో ప్రజాస్వామ్యం నెలకొన్న తర్వాత ఎవరో ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హన్స్‌రాజ్ ఖన్నా కీర్తి స్తంభం నిర్మిస్తారు’ అని రాసింది. ఆయన కీర్తిస్తంభం ఎవరూ నిర్మించలేదు. కానీ సుప్రీంకోర్టులోని రెండవ కోర్టులో న్యాయమూర్తి హెచ్.ఆర్. ఖన్నా చిత్రపటాన్ని ఆవిష్కరించారు. 1912జూలై 3న జస్టిస్ ఖన్నా జన్మించారు. 2008 ఫిబ్రవరి25న చనిపోయా రు. ఈ ఏడాది ఆయన శత జయంతి సంవత్సరం . మే నెలలో సాదత్ హస న్ మంటో శత జయంతి జరిగింది. ఈ నెలలో హెచ్.ఆర్. ఖన్నా శత జయంతి. ఈ ఇద్దరికీ సాన్నిహిత్యం లేదు. కానీ ఒకరు ‘నయా కానూన్’ అన్న కథని... (నయా కానూన్ అంటే కొత్త రాజ్యాంగం) రాశారు. మరొకరు రాజ్యాంగాన్ని వివిధ తీర్పుల్లో వ్యాఖ్యానించిన వ్యక్తి. ఎ.డి.ఎమ్ జబల్‌పూర్ కేసులోనే కాదు కేశవానంద భారతి (1973) కేసులో కూడా విలక్షణమైన అభివూపాయాన్ని వెలిబుచ్చిన వ్యక్తి హెచ్.ఆర్.ఖన్నా. న్యాయమూర్తులు ఎస్.ఎమ్. సిక్రీ పధాన న్యాయమూర్తి) జే.ఎం. శెలత్, కె.ఎస్. హెగ్డే, పి. జగన్‌మోహన్‌డ్డి, ఎ.ఎన్. గ్రోవర్, ఎస్. ముఖర్జీయాల ప్రకారం పార్లమెంట్ అధికారం పరిమితమైనది. రాజ్యాంగంలో సహజ సిద్ధమైన పరిమితులున్నాయి. మిగతా ఆరుగురు న్యాయమూర్తులు ఎ.ఎం.రే, జి.జి. పలేకర్, కె.కె. మూథ్యూ, ఎస్.ఎన్. ద్వివేదీ, ఎం.హెచ్. బేగ్, వైవీ చంద్రచూడ్‌ల ప్రకారం- పార్లమెంట్‌కు అలాంటి పరిమితులు లేవు. న్యాయమూర్తి ఖన్నా ఎటువైపు తీసుకోలేదు. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరించే హక్కు ఉన్న ది. కానీ దాన్ని మౌలికమైన నిర్మాణాన్ని మార్చే హక్కు లేదు. ఇదీ ఖన్నా అభివూపాయం. రెండేళ్ల తర్వాత ఇందిరాగాంధీ ఎన్నిక తీర్పు తర్వాత దీని మీద చాలా చర్చ జరిగింది. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో ఉంటాయని, ఆస్తి హక్కు ఉండదని ఖన్నా వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్యానికి గొప్ప భరోసాను ఇచ్చిన తీర్పు కేశవానంద భారతి కేసు.మొత్తం 13 మందిలో ఆరుగురు న్యాయమూర్తులు ఒకవైపు, మరో ఆరుగురు న్యాయమూర్తులు మరో వైపు ఉన్న కేసులో నిర్ణయాత్మకమైన తీర్పును వెలువరించిన వ్యక్తి హెచ్.ఆర్. ఖన్నా. హెచ్.ఆర్.ఖన్నా తీర్పుల్లో అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ జబల్‌పూర్ వర్సెస్ శివకాంత్ శుక్లా కేసు విషిష్టమైనది. ఎందుకంటే అది ఎమ్జన్సీ రోజుల్లో వెలువరించినది. జయవూపకాశ్ నారాయణ్ ఉద్యమం నేపథ్యంలో వేలాదిమందిని అరెస్టు చేశారు. ‘మీసా’ చట్టాన్ని ప్రయోగించి ఎంతోమందిని నిర్బంధించారు. రాజ్యాంగంలో వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కును లేకుండా చేసిన రోజులు. అధికరణ 21ని సస్పెండ్ చేసే అధికారాన్ని సవాల్ చేస్తూ దాఖలైన కేసు ఎ.డి.ఎం. జబల్‌పూర్ కేసు. అప్పుడున్న సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు- ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ ‘రే’, జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా, జస్టిస్ బేగ్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్. పి.ఎన్. భగవతి. ఇద్దరు న్యాయమూర్తుల సీనియారిటీని కాదని జస్టిస్ ‘రే’ను ప్రధా న న్యాయమూర్తిగా నియమించారు. బెంచ్‌ను ఏర్పాటు చేయడం ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారానికి సంబంధించిన అంశం. కానీ సీనియర్ న్యాయమూర్తులతో బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. ఇలా కోరడం అసాధారణ విషయం. ఇది ప్రధాన న్యాయమూర్తికి నచ్చనప్పటికీ సీనియర్ న్యాయమూర్తులతో బెంచ్‌ని ఏర్పాటు చేశారు. మానవహక్కుల గురించి ఎక్కువగా మాట్లాడే న్యాయమూర్తులు వైవీ చంద్రచూడ్, పి.ఎన్. భగవతి. ప్రధాన న్యాయమూర్తి, ఎం.హెచ్. బేగ్ ఎమ్జన్సీని సమర్థించినప్పటికీ మిగతా ముగ్గురు న్యాయమూర్తుల వల్ల ప్రాథమిక హక్కులకు అనుకూలంగా తీర్పు వస్తుందని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా తీర్పు వచ్చింది. ఈ కేసులో రాష్ట్రపతి 27.6.1975న రాజ్యాంగంలోని అధికరణ 359(1) ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేయడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకా రం వ్యక్తిగత స్వేచ్ఛను అమలు పరుచమని ఆర్టికల్ 226 ద్వారా కానీ, ఇతర రిట్ ల ద్వారా కానీ కోరడానికి వీల్లేదు. ‘మీసా’ చట్టం ప్రకారం నిర్బంధంలో ఉన్న వ్యక్తులు కూడా తమ నిర్బంధాన్ని సవాల్ చేయడానికి వీల్లేదు. ఐదుగురు న్యాయమూర్తుల బృందంలో నలుగురు దాన్ని సమర్థించారు. ఈ ఉత్తర్వులను వ్యతిరేకించి తన భిన్నాభివూపాయాన్ని తీర్పు ద్వారా వ్యక్తపరిచిన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నా. ఆయన మాటల్లో ‘ ఆర్టికల్ 226 ప్రకారం రిట్‌లు జారీచేసే అధికారాన్ని రాజ్యాంగం హైకోర్టులకు సంక్రమింప చేసింది. ఈ అధికారాన్ని సస్పెండ్ చేసే అధికారం రాజ్యాంగం ఏ అధికార యంత్రాంగానికి ఇవ్వలేదు’. ఎమ్జన్సీ కాలంలో ఒక ఒంటరి గొంతుక ఈ తీర్పు చెప్పడం మామూలు విషయం కాదు. ఆ తీర్పు చెప్పినందుకు తగిన మూ ల్యాన్ని ఖన్నా చెల్లించారు. దేశ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఈ విషయం తెలిసి తీర్పును వెలువరించిన ధీశాలి. దేశ పౌరుల ప్రాథమిక హక్కులను జెండాలాగా ఎగరవేసిన వారు జస్టిస్ ఖన్నా. రాజ్యాంగం నిబంధనలు, అధికరణలు తెలియడం కాదు. వాటి అమ లు కోసం మనస్సాక్షిగా పనిచేశారు హెచ్.ఆర్.ఖన్నా. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనబెట్టి ప్రజాహితం కోసం పనిచేయాలనుకునే వ్యక్తులకు, న్యాయమూర్తులకు ఆదర్శవూపాయుడు జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా. ఎ.డి. ఎం. జబల్‌పూర్ కేసులోని మరో ఇద్దరు న్యాయమూర్తులు ఖన్నా లాగా ఆలోచిస్తే అత్యవసర పరిస్థితి త్వరగా అంతమయ్యేది. తనకన్నా జూనియర్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడంతో జస్టిస్ ఖన్నా 29-1-1977న తన పదవికి రాజీనామా చేశారు. ఆ తీర్పు చెప్పినందుకు ఖన్నా గర్వపడ్డారు. దేశం గర్వపడింది. ఖన్నా తీర్పు 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అమలు చేయబడింది. అధికర ణ 20,21లు ఎమ్జన్సీలో సస్పెండ్ చేయడానికి వీల్లేదని ఈ సవరణ చెబుతుంది.మంటో ‘నయా ఖానూన్’ కథలో రాజ్యాంగం వస్తుంది. జీవితంలో మార్పు ఉండదు.రాజ్యంగ ప్రకారం ప్రాథమిక హక్కులున్నాయి. కానీ వాటి ఉల్లంఘనలను ఆపలేకపోతున్నాం. జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా లాంటి న్యాయమూర్తులు మన దేశానికి అవసరం.

Wednesday, April 25, 2012

Impartiality in courts

కోర్టుల్లో నిష్పక్ష పాతం న్యాయ వ్యవస్థ ప్రజల విశ్వాసం చూరగొనాలంటే న్యాయ నిర్ణయ ప్రక్రియలో నిష్పక్షపాతం ఉండాలి. ఆర్‌ వర్సెస్‌ సుసెక్స్‌ (1924) కేసులో ప్రధాన న్యాయమూర్తి లాడ్డ్‌ హేవర్ట్‌ ‘న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్టుగా కనిపించాలి. కేసుల విచారణ ఎలాంటి పక్షపాతం లేకుండా జరగాలి’ అన్నారు. పక్షపాతం అనేది ఆరు రకాలుగా ఉంటుందని వర్గీకరించారు. అవి వ్యక్తిగత పక్షపాతం, ఆర్ధిక పరమైన పక్షపాతం, కేసులోని విషయంమీద పక్షపాతం, శాఖాపరమైన పక్షపాతం, ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాల వల్ల పక్షపాతం, మొండితనం- మూర్ఖత్వం వల్ల ఏర్పడిన పక్షపాతం. కోర్టు విచారణల్లో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కోర్టు ఏదైనా విషయంలో పక్షపాతంలో ఉందన్న అభిప్రాయం కోర్టుకు వచ్చిన వ్యక్తులకు ఏర్పడకూడదు. ఆ విధంగా కోర్టు వాతావరణం ఉండాలి. కోర్టుకు అంటే న్యాయమూర్తికి పూర్వభావనలు, ప్రతికూలాభిప్రాయాలు ఉండవని కాదు. అలాంటి భావనలు ఉండకూడదు. అలాంటి అభిప్రాయాలు కొన్నిసార్లు పైకి కనుపించేఉ విధంగా ఉంటాయి. మరికొన్నిసార్లు పైకి కనుపించకుండా ఉంటాయి. వర్గం, మతం, కులం, లింగం, భాష, ప్రాంతం అనే విషయాలు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తుంటాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అవి ప్రభావితం చేయకుండా న్యాయమూర్తి వ్యవహరించాలి. కిరాయిదారుడుగా ఉన్న న్యాయమూర్తి యజమానితో ఇబ్బందులపాలైతే అతనికి యజమానుల పట్ల కొన్ని పూర్వ భావనలు ఉంటాయి. అదే విధంగా అతను యజమాని అయి ఉండి కిరాయిదారునితో ఇబ్బందులు పడినప్పుడు అతనికి కిరాయిదారుల పట్ల కొన్ని పూర్వభావనలు ఉంటాయి. అదే విధంగా పోలీసులతో ఇబ్బందులు పడ్డ న్యాయమూర్తికి వాళ్ళ పట్ల పూర్వభావనలు ఉండే అవకాశం ఉంది. ఈ భావనలను గుర్తించి వాటినుంచి బయట పడాల్సింది. గుర్తించినప్పుడు ఈ పూర్వభావనలు తీర్పుల్లో ప్రతిబింబించే అవకాశం ఏర్పడుతుంది. ఈ పూర్వభావనలు, పక్షపాత దృష్టి బయటపడడం సులువుకాదు గానీ దుస్సాధ్యం మాత్రం కాదు. కోర్టులు అందరి హక్కులను కాపాడాలి. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, సాక్షులు కావచ్చు, బాధితులు కావచ్చు. కోర్టుకు వచ్చే వ్యక్తులందరి హక్కులు కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. వారి సాధక బాధకాలను సానుభూతితో అనే బదులు చట్టపరంగా చూడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడే కోర్టులు నిష్పక్షపాతంగా ఉన్నట్టు అనిపిస్తుంది.సుప్రీకోర్టు- స్టేట్‌ ఆఫ్‌ యుపి వర్సెస్‌ శంభూనాథ్‌ సింగ్‌ మరి ఇతరులు (ఏఐఆర్‌ 2001 సుప్రీంకోర్టు 403) కేసులో అభిప్రాయపడినట్టు ‘కోర్టు నుంచి సమన్లు రాగానే సాక్షులు వణికిపోతారు. కోర్టుల్లో జరిగే విచారణకు వాళ్ళ కాళ్ళు వణికిపోవడం లేదు, కోర్టు చుట్టూ ఎన్నిరోజులు తిరగాల్సి ఉంటుందోనని వాళ్ళు వణికి పోతారు. ఎందుకంటే వాళ్ళు తమ పనులను వదిలివేసి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్క సారితో అయిపోదు. మన దేశంలోని ప్రతి కోర్టులో కనుపించే దృశ్యమే ఇది. కోర్టులు ఓ నిర్ణయానికి రావడానికి వచ్చిన అతిథులని విచారించే కోర్టులు భావించాల్సిన సమయం ఆసన్నమైంది..’. కోర్టుల్లో సాక్షులు కూర్చోవడానికి సరైన స్థలం ఉండదు. తాగడానికి నీటి సౌకర్యం ఉండదు. మరుగుదొడ్లు కూడా ఉపయోగించడానికి వీలు లేకుండా ఉంటాయి. కోర్టు అటెండర్లు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. భయానికి గురి చేస్తూఉంటారు. వారి పరిస్థితులను, సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకుని వారి రోజు వారి కూలి దెబ్బతినకుండా, వాళ్ళు ఎక్కువసార్లు కోర్టుకి తిరగకుండా తేదీలను వేస్తే అది కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టనిపిస్తుంది. కోర్టుకు హాజరైనప్పుడు వారికి ఇవ్వాల్సిన వేతనం ఇస్తే కూడా అది నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టు అనిపిస్తుంది. నిష్పక్షపాతంగా ఉండడం ఎంత అవసరమో కొన్ని సందర్భాల్లో పక్షపాతంగా ఉండడం కూడా నిష్పక్షపాతంగా ఉండడంగా భావించాల్సి ఉంటుంది. బీద వాళ్ళ పట్ల, పిల్లల పట్ల, మహిళలపట్ల పక్షపాతంగా ఉండాలి. రాజ్యాంగం పట్ల పక్షపాతంతో ఉండాలి. రాజ్యంగం వీరి హక్కులను గౌరవిస్తుంది. ప్రత్యేకమైన అధికరణలు కూడా రాజ్యాంగంలో ఉప్పాయి అదేవిధంగా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు సంబంధించిన వ్యక్తుల కోసం, మైనారిటీల కోసం కూడా రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలున్నాయి. వీరికి కోర్టు గురించి, అక్కడ జరిగే ప్రొసీడింగ్స్‌ గురించి ఏమీ తెలియదు. అందుకని వాళ్ళు సరైన న్యాయం పొందే విధంగా కోర్టు ప్రయత్నం చేయాలి. చర్యలు తీసుకోవాలి. కొన్ని చట్టాలు, కొన్ని నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంటుంది. అందులో కొంత వాస్తవం ఉందని అనుకున్నప్పటికీ ఏ చట్టం, ఏ నిబంధన దుర్వినియోగం కావడం లేదన్న ప్రశ్నకు చాలామంది దగ్గర సమాధానం ఉండదు. మరీ ముఖ్యంగా భారతీయ శిక్షాస్మృతి లోని సె.498 ఎ. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతున్నదన్న వాదనను చాలా మంది లేవనెత్తుతుంటారు. అది సరైనది కాదు. ఆ విధంగా ఉండడం అంటే పక్షపాతంతో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రతి కేసుని ఆ కేసులోని విషయాలను బట్టి చూడాల్సి ఉంటుంది. అప్పుడే నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ కేసులను విచారించేటప్పుడు మిగతా కేసుల కంటె ఎక్కువ సున్నితంగా ఆలోచించాల్సి ఉంటుంది. కోర్టుకు వచ్చే వ్యక్తులకు కోర్టు పద్ధతులు తెలియవు. చట్టమూ తెలియదు. వాళ్ళ హక్కులు బాధ్యతలు తెలియవు. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, బాధితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, ఎవరూనా కావచ్చు. అందుకని వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. నిబంధనల ప్రకారం బెయిలబుల్‌ నేరాలలో బెయిలు అనేది హక్కు. అది పోలీసులే ఇవ్వాలి. పోలీసులు ఇవ్వనప్పుడు మేజిస్ట్రేట్‌ బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ముద్దాయి బెయిల్‌ కోరినా కోరకపోయినా బెయిలబుల్‌ నేరాల్లో బెయిలు మంజూరు చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. అదేవిధంగా అరెస్టు అయిన వారం రోజుల్లోగా అతను జామీను పెట్టుకోనప్పుడు అతన్ని నిరుపేదగా పరిగణించి వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలి పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా చార్జిషీటును పోలీసులు 60, 90 రోజుల్లో దాఖలు చేయలేనప్పుడు కూడా వాళ్ళని బెయిలు పైన విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేయాలి. వాళ్ళు కోరినా కోరకపోయినా ఈ బెయిళ్ళను మంజూరు చేయాల్సి ఉంటుంది. కోర్టు పద్ధతులు, నియమాలు, నిబంధనలు చాలా మందికి తెలియవు. కోర్టు పద్ధతులను అందరూ పాటించాలి. అందరూ పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. కోర్టు అనేది పూర్తిగా ఆ కోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఉంటుంది. అందుకని అందరూ కోర్టు పద్ధతులను పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత ఆ కోర్టు న్యాయమూర్తిపై ఉంటుంది. ఇవన్నీ పాటించినప్పుడే ఆ విచారణ, ఆ కోర్టు నిష్పక్షపాతంగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. రూల్‌ఆఫ్‌లామంగారిరాజేందర

Tuesday, April 17, 2012

Trafficking

మనుషుల క్రయ విక్రయాలు

వ్యభిచారం, మనుషుల క్రయ విక్రయాలు అన్న విషయాలు మరోసారి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అవినీతికర పనుల కోసం మహిళలను, చిన్న పిల్లలను అక్రమ రవాణా చేయడం అనేది అనాదిగా ఉంది. ఈ ఆధునిక కాలంలో అది వికృత రూపం దాలుస్తున్నది. అందుకు కారణాలు అనేకం. ఆర్ధిక పరమైన ఒత్తిడులు, సాంఘిక పరమైన ఒత్తిడులు, పేదరికం, నగరీకరణ, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం వంటి కారణాలు ఎన్నో. వ్యభిచారం అనేది మన సమాజంలో అనాదిగా ఉంది. అనాదిగా ఉన్న వ్యభిచారాన్ని రద్దు చేయలేం. కాని నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనుషుల క్రయ విక్రయాలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యభిచారాన్ని రద్దు చేయలేం కానీ దాన్ని తగు నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని లా కమిషన్‌ తన 64వ నివేదికలో పేర్కొంది. నియంత్రణలో ఉంచాల్సిందని ప్రభుత్వానికి సూచించింది. ‘సీటా’ బిల్లును ప్రవేశపెట్టే ముందు హోమ్‌ మంత్రి లోక్‌సభలో ఈ విధంగా అన్నారు ‘వ్యభిచారాన్ని నియంత్రించలేమని కాదు, కానీ సులభంగా అందుబాటులో ఉంచకుండా ఉంచే ప్రయత్నమే ఈ బిల్లు’. సీటా చట్టం వ్యభిచారాన్ని రద్దు చేయలేదు. అది మానవ అక్రమ రవాణాను రద్దు చేస్తుంది. బహిరంగ స్థలాల్లో వ్యభిచారాన్ని రద్దు చేస్తుంది. నేరంగా గుర్తిస్తుంది.

సీటా చట్టం పరోక్షంగా మగవాళ్ళని సమర్ధించి, వ్యభిచారం చేస్తున్న ఆడవాళ్ళని సంఘ బహిష్కృతులుగా భావిస్తుంది. ఈ చట్టం ద్వంద్వ విలువలను ప్రతిపాదించింది. సీటా చట్టానికి 1986 మార్పులు తీసుకు వచ్చారు. వ్యభిచారం అన్న నిర్వచనం కూడా మారిపోయింది. చట్టం పేరు కూడా మారిపోయింది. అణిచివేత అన్న పదం చట్టం నుంచి తొలగిపోయింది. అది అవినీతి పనులకోసం మనుషుల క్రయ విక్రయాల (నిరోధక) చట్టంగా మారిపోయింది. అది ‘పీటా’ చట్టంగా మారింది. నిర్వచనాన్ని, చట్టాన్ని మార్చినప్పటికీ అది మహిళల క్రయ విక్రయాలను తగ్గించలేకపోయింది. భారతీయ శిక్షా స్మృతికి అనుబంధంగా మారింది తప్ప అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 23 ప్రకారం- శరీర క్రయ విక్రయాలను నిషేధించారు. ఆర్టికల్‌ 39 (ఇ) ప్రకారం మహిళల ఆరోగ్యాన్ని అదే విధంగా పిల్లలని వాళ్ళ ఆర్ధిక అవసరాలకు గాను దోపిడీకి గురి చేయకూడదు. పీటా చట్టమే కాకుండా భారతీయ శిక్షా స్మృతిలో కూడా వ్యభిచారాన్ని మనుష్యుల క్రయ విక్రయాలని అరికట్టడానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ చట్టాలలోని సె. 366 ఎ, 366 బి, 373 ప్రకారం వ్యభిచారం కోసం ఆడపిల్లలను కొనడం, అమ్మడం హీనమైన నేరంగా పరిగణిస్తుంది. వాటికి కూడా కఠినమైన శిక్షలు ఉన్నాయి. చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ మనుష్యుల క్రయవిక్రయాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో మనుషుల క్రయ విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఖండాంతరం వ్యాపించలేదు. ఈ క్రయ విక్రయాలు 90 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి.

ఇవి మన దేశంలో జరుగుతున్న సరియైన చర్యలని ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తీసుకోలేక పోతోంది. ఈ క్రయ విక్రయాలు వ్యభిచారం కోసమే కాదు, పనుల కోసం బానిసలుగా ఉపయోగించుకోవడానికి కూడా నిర్వహిస్తున్నారు. నేరస్థులకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఉన్న సయోధ్య వల్ల ఈ క్రయ విక్రయాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నేరస్థుల మధ్య, ప్రభుత్వ యంత్రాంగం మధ్య లాలూచీ ఎంత ఉందో తెలపడానికి ఒక పదిహేను రోజుల క్రితం జరిగిన మధ్యప్రదేశ్‌ ఉదంతం చాలు. 2012 ఫిబ్రవరి 10 తేదీన ఇమ్రాబీ కుమార్తెను ఓ గూండా రేప్‌ చేశాడు. భోపాల్‌ నగరానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీటల్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాణీ యాదవ్‌ అనే యువతి సహాయంతో 15 సంవత్సరాల బాలికను రాజేశ్‌ హీరోలే తన సైకిల్‌ మోటారు మీద కిడ్నాప్‌ చేసి ఆమె పై రేప్‌ చేశాడు.

ఆమెను అతను అపహరించుకొని పోతున్నప్పుడు దాదాపు 1200 మంది చూశారు. కానీ ఎవరూ దానిని ప్రతిఘటించలేదు. ఆ ప్రాంతంలో రాజేశ్‌ హీరోలేకి తిరుగు లేదు. అతను భూ ఆక్రమణ దారుడు, వడ్డీ వ్యాపారి. అతన్ని ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. అయినా ఇమ్రాబీ బాయి అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఎందుకంటే 2006 సంవత్సరంలో ఆమె మరో కుమార్తె కనుపించకుండా పోయింది. రాణీ యాదవ్‌ ఆమెని వైష్ణవీ దేవి గుడికి అని తీసుకు వెళ్ళి వ్యభిచార గృహంలో అమ్మేశారు. మూడు సంవత్సరాల తర్వాత ఈ విషయం ఇమ్రాబీ బాయికి తెలిసింది. ఆ కుమార్తె పారిపోయి రావడం వల్ల ఈ సంగతి ఇమ్రాబీ బాయికి తెల్సింది.

రెండవ కుమార్తెకు కూడా అలాంటి పరిస్థితి రావద్దని ఆమె రాజేశ్‌ హీరోలేకి ఎదురు తిరగాలని అనుకొని రాజేశ్‌ హీరోలేపైన ఫిర్యాదు చేసింది. పోలీసులు భారతీయ శిక్షా స్మృతిలోని సె. 376, 342 ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఆమె నోరు మూయించడానికి రాజేశ్‌ హీరోలే తన గ్యాంగ్‌తో ఆమె దగ్గరకు వచ్చాడు. అతని గ్యాంగ్‌ లోని మంటూ యాదవ్‌ అనే వ్యక్తి ఆమె కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపాడు. రేప్‌ కేసు నమోదైన తరువాత రాజేశ్‌ హీరోలే ఇమ్రాబీ బాయి దగ్గరకొచ్చి కేసును వదిలించుకోవడానికి ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఫలితం లేకపోవడంతో ఆమెను బెదిరించాడు. ఆ తరువాత కాల్చి చంపారు. అతను ఒత్తిడి చేయడం మొదలు పెట్టిన తరువాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కానీ పోలీసులనుంచి సరైన స్పందన రాలేదు. ఆమెను రక్షించడానికి పోలీసులు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ఆమె హత్యకు గురైంది. షెడ్యూల్డు తెగకు చెందిన ఇమ్రాబీ బాయి హత్య మన 60 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని ప్రశ్నిస్తున్నది. మన చట్టాన్ని ప్రశ్నిస్తున్నది. కఠినమైన శిక్షలను ఏర్పరచినంత మాత్రాన చట్టం సమర్ధవంతంగా అమలు జరగదు. చట్టాన్ని అమలు చేయడంలో శ్రద్ధ వహిస్తేనే ఏ చట్టానికైనా పరమార్ధం.

Saturday, March 31, 2012

విడాకులు సులభతరం

విడాకులు సులభతరం

వివాహ బంధంలో ఉన్న దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు-2010ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2010లో మొదటిసారిగా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. లా కమిషన్‌ తన 271వ నివేదికలో వివాహాల (సవరణల) బిల్లు-2010ను సూచించింది. సరిదిద్దడానికి వీలు లేని వివాహాలను- విడాకులు పొందడానికి ఒక ఆధారంగా ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ బిల్లు చట్టంగా మారితే కలుగచేసే ప్రభావాలను సభ్య సమాజం చర్చించింది. కొందరు భయాందోళనలను కూడా వ్యక్తం చేశా రు. చాలామంది న్యాయ కోవిదులు, వ్యాసకర్తలు ఈ బిల్లులోని అంశాలను వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీకి పంపి తగు సూచనలు, సలహాలు ఇవ్వమని ప్రభుత్వం కోరింది. ఈ కమిటీ ప్రజలనుంచి సూచనలు, అభ్యంతరాలు కోరి వాటిని పరిశీలించి తన 45వ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. జయంతి నటరాజన్‌ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ 2011 మార్చి 1న సమర్పించిన తన నివేదికలో ఈ బిల్లులో తీసుకురావలసిన మార్పుల్ని సూచించింది. మార్పులు తీసుకొచ్చిన వివాహాల సవరణల బిల్లు- 2010ను కేంద్ర ప్రభుత్వం మార్చి 22న ఆమోదించింది. ఇక పార్లమెంట్‌ ఆమోదం పొంది రాష్టప్రతి ఆమోదముద్ర పొందితే చట్ట రూపం దాలుస్తుంది.

ఈ మార్పులపై కూడా విభిన్నమైన స్పందనలు వినిపిస్తున్నాయి. హిందూ సమాజం విడాకుల్ని ఆమోదించలేదు. అలాంటి భావన 19వ శతాబ్దం తొలి దశలో మన చట్టంలో లేదు. ఆ తర్వాత కాలంలో అది చట్టంలో చోటు చేసుకుంది. హిందువులకు సంబంధించి హిందూ వివాహ చట్టం, మతంతో సంబంధంలేకుండా ప్రత్యేక వివాహ చట్టం అమలులోకి వచ్చాయి. ఈ రెండు చట్టాల్లో విడాకులు పొందడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. కాలక్రమంలో పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి కూడా అవకాశం కల్పిస్తూ సవరణలు తీసుకొచ్చారు. ఆ అవకాశం ఉండగా మళ్ళీ ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహం’ అన్న కొత్త ఆధారం ఎందుకని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడున్న చట్టాల ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదం చేసినప్పుడే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టులు విడాకులు మంజూరు చేస్తున్నాయి. ఈ ఆధారాలకు మరో ఆధారం తోడైంది.

అదే పరస్పర ఆమోదంతో విడాకులు. దీనికి కూడా అదనంగా ఇప్పుడు మరో కొత్త ఆధారం 13 సి రూపంలో రాబోతోంది. ఈ నిబంధన ప్రకారం మొదట ప్రతిపాదించిన ప్రకారం మూడు సంవత్సరాలు భార్యా భర్తలు వేరుగా ఉంటే వారు విడాకులు పొందడానికి ఆస్కారం ఉంది. వైవాహిక తప్పిదం చేసిన వ్యక్తి కూడా వివాహం రద్దు చేయమని, తమది సరిదిద్దడానికి వీల్లేని వివాహమనీ కోరడానికి అవకాశం ఉంది. ఇది మహిళలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్న అభిప్రాయం రావడంతో సరికొత్త రూపంలో బిల్లును తీసుకురావాలని జయంతీ నటరాజన్‌ కమిటీ తన నివేదికలో కోరింది. ఈ కమిటీ ప్రధానంగా మూడు సూచనలు చేసింది.అవి- 1.సరిదిద్దడానికి వీల్లేని వివాహాలు అన్నది విడాకులు పొందడానికి ఒక ఆధారం కావాలి 2. భార్యకు, పిల్లలకు పోషణ కోసం తగు రక్షణలు కల్పించాలి.3. పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తు చేసినప్పుడుదంపతులుతప్పకుండా ఆరు మాసాలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. దానిని తొలగించాలి.

సరిదిద్దడానికి వీల్లేని వివాహం అంటే ఏమిటో ప్రతిపాదిత బిల్లులో పేర్కొనలేదు. కాని ఈ ఆధారంతో దంపతులు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. 3 సంవత్సరాలు వేరుగా ఉంటున్న దంపతులు ఈ ఆధారం ప్రకారం విడాకులు కోరడానికి అవకాశం ఉంది. సవరించి ప్రతిపాదిత బిల్లులోని నిబంధన ప్రకారం ఈ ఆధారం ప్రకారం భర్త విడాకులు కోరినప్పుడు భార్య ఆ విడాకులను వ్యతిరేకించవచ్చు. సరిదిద్దడానికి వీల్లేని వివాహం అన్న ఆధారంగా భార్య విడాకులు కోరినప్పుడు మాత్రం భర్త వ్యతిరేకించడానికి వీల్లేదు. ఈ నిబంధన మగవారిపట్ల వివక్షతో ఉన్నదని కొందరి వాదన. ఈ వాదనలో బలంలేదు. ఎందుకంటే, రాజ్యాంగంలోని అధికరణ 15 ప్రకారం పిల్లలు, స్ర్తీల కోసం ప్రత్యేక చట్టాలను రాజ్యం తయారు చేయవచ్చు.

భారతీయ శిక్షా స్మృతిలోని సె. 498 ఎ మాదిరిగా ఇది కూడా దుర్వినియోగం అవుతుందన్న వాదనను కొందరు లేవనెత్తుతున్నారు. ఆ వాదనలో కూడా పస లేదు. పురుషులకు అందుబాటులో ఉన్నంతగా కోర్టులు స్త్రీలకు లేవు. అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతే స్ర్తీలు కోర్టుకు వస్తారు. పురుషులు మోజు తీరిన తర్వాత మూడు సంవత్సరాలు విడిగా ఉండి విడాకులు కోరే అవకాశం ఉంది. అందువల్ల మార్పు చేసిన నిబంధన మహిళల పక్షం ఉండడం సమంజసం. ఈ ఆధారమే సరైనది కాదన్న వాదన కూడా హేతుబద్ధం కాదు. కోర్టుల్లో కేసుల విచారణకు చాలా సమయం పడుతుంది. కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేసినప్పటికీ, సత్వరంగా కేసుల పరిష్కారం జరగడంలేదు. ఫలితంగా యవ్వనం కోల్పోయిన తర్వాత కేసుల పరిష్కారం వల్ల అనుకున్న ప్రయోజనం నెరవేరదు.

ఇక రెండవ సూచన కూడా అవసరమనిపిస్తుంది. పిల్లలకు, భార్యకు మనోవర్తి భరణం వంటి అంశాలు అమల్లో ఉన్న చట్టంలో ఉన్నప్పటికీ దానివల్ల మహిళలకు పూర్తి న్యాయం జరగడం లేదు. కోర్టులు మంజూరు చేసే మొత్తాలు సహేతుకంగా ఉండడం లేదు. వివాహ బంధంలో ఉన్న సమయంలో భర్త ఆర్జించిన ఆస్తిలో భార్యకు హక్కు కల్పించాలని కమిటీ సూచించింది. ఆ ఆస్తి సముపార్జనలో భార్య సహాయం ప్రత్యక్షంగా ఉంటుంది. ఆమె ఉద్యోగి అయితే డబ్బు సహాయం చేస్తుంది. సహజంగా ఆ ఆస్తి భర్త పేరుతోనే రిజిస్టరయ్యే అవకాశం ఉంటుంది. ఆమె ఉద్యోగి కానప్పుడు గృహిణిగా ఆస్తి సంపాదనలో ఆమె వంతు సహాయం పరోక్షంగా ఉంటుంది. అందువల్ల, ఈ నిబంధనను ప్రతిపాదించడంలో సహేతుకత ఉంది. ఈ ప్రయోజనాన్ని దత్తత పిల్లలకు కూడా ఇవ్వాలని సూచించారు. అది కూడా సమంజసమే.

అయితే ఈ హక్కు భర్త ఉమ్మడి ఆస్తిలో, వివాహానికి ముందు ఆర్జించిన ఆస్తిలో ఉండదు. వివాహబంధంలో ఆర్జించిన ఆస్తి లేనపుడు భరణం మాత్రమే కోరే అవకాశం ఉంది.
మూడవ ప్రతిపాదిత అంశం పరస్పర ఆమోదంతో విడాకులు. ఈ మేరకు దరఖాస్తు చేశాక, ఆరు మాసాలు వేచి ఉండాలి. 6 నుంచి 18 మాసాలలోపు ఈ విడాకులు మంజూరు చేసే అవకాశం ఉంది. దీనివల్ల దంపతులు ఇబ్బందులకు లోనవుతున్నారు. 6 మాసాల కాలాన్ని తగ్గించే విధంగా కోర్టులకు విచక్షణాధికారం ఇవ్వడం ద్వారా ఈ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. ఈబిల్లు చట్టరూపం దాలుస్తే మహిళలకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తునర్‌

రూల్‌ఆఫ్‌లా మంగారి రాజేందర్‌


Wednesday, March 21, 2012

మధ్య వర్తిత్వమే మేలు!

మన దేశంలో మూడు రకాలైన కేసులు ఎక్కువగా దాఖలవుతున్నాయి. అవి- రోడ్డు ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, చెక్కులు చెల్లలేదన్న కేసులు, వివాహాలకు సంబంధించిన కేసులు. ఈ కేసుల సంఖ్య మిగతా కేసులతో పోలిస్తే చాలా ఎక్కువ. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా జరగకుండా కాకపోయినా, కొంత వరకూ నియంత్రించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా! చెక్కుల్ని నిరాకరించినప్పుడు దాఖలయ్యే కేసులు ఎక్కువగా ఫైనాన్స్‌ సంస్థలు దాఖలు చేస్తున్న కేసులు. చెక్కు చెల్లనప్పుడు గతంలో సివిల్‌ కేసులు మాత్రమే దాఖలయ్యేవి. 1988లో నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టానికి మార్పులు తీసుకొచ్చి క్రిమినల్‌ చర్యలు తీసుకునే విధంగా మార్చారు. ఫలితంగా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

ఫైనాన్షియల్‌ సంస్థలు, బ్యాంకులు రుణాలు ఎంత సులువుగా ఇస్తున్నాయో వసూలు చేయడంలో అంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వాయిదా వాయిదాకి చెల్లించాల్సిన డబ్బు గురించి ముందుగానే చెక్కులు తీసుకుంటున్నాయి. ఆ చెక్కులు చెల్లనప్పుడు క్రిమినల్‌ కేసులు దాఖలు చేస్తున్నాయి. ఈ విధంగా ఆ కేసుల సంఖ్య పెరిగిపోయాయి. ఫలితంగా ప్రత్యేక కోర్టుల్ని నగరాల్లో ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటిని కూడా ప్రభుత్వం కొంత నియంత్రించే అవకాశం ఉంది.
మూడవ రకమైన కేసులు వివాహ సంబంధ కేసులు. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోయి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంఖ్యని నియంత్రించడం ప్రభుత్వం చేతుల్లో లేదు. ఆధునిక జీవితంలో వచ్చిన మార్పులు, సమాజంలో వచ్చిన మార్పులు, వ్యక్తుల ఆలోచనా ధోరణుల్లో వచ్చిన మార్పులు వీటికి కారణాలు. కారణాలు ఏమైనప్పటికీ వీటి సంఖ్య పెరగడం అందరినీ కలవర పెడుతున్న విషయం.

ఈ మూడు రకాలైన కేసులు పెరగడం వల్ల కేసుల పరిష్కారంలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. ఫలితంగా కోర్టుల మీద విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మూడు రకాలైన కేసుల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఆ పని అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఆ విధంగా పరిష్కారం చేసుకోకపోతే కేసులు సంఖ్య పెరిగి విచారణలో జాప్యం జరిగి కోర్టుల మీద విశ్వాసం, నమ్మకం పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
రోడ్డు ప్రమాదాల కేసుల విచారణల్లో జాప్యం కంటె, చెక్కుల కేసుల విచారణల్లో జాప్యం కంటె- వివాహాలకు సంబంధించిన కేసుల విచారణలో జాప్యం జరిగితే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. వయస్సు దాటిపోయిన తర్వాత విడాకులు మంజూరు చేసి ఫలితం ఉండదు. ఈ విషయాన్ని గమనించే శాసన కర్తలు హిందూ వివాహ చట్టంలో, ప్రత్యేక వివాహ చట్టంలో పార్టీల మధ్య సామరస్యం నెలకొల్పడానికి కోర్టులు చర్యలు తసుకోవడానికి సె.23, సె.34 వంటి నిబంధనల్ని ఈ రెండు చట్టాల్లో ఏర్పరచారు.

అయినా కూడా అనుకున్న పద్ధతిలో వేగంగా కేసుల పరిష్కారాలు జరగడం లేదని లా కమిషన్‌ తన 59వ నివేదికలో కొన్ని సూచనలు చేసింది. ఈ ఆర్డర్‌ ప్రకారం వివాహ వివాదాలను ప్రత్యేక పద్ధతిలో పరిష్కరించాలి. ఈ ఆర్డర్స్‌ని సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో ఏర్పాటు చేసినప్పటికీ వివాదాల పరిష్కారం మామూలు పద్ధతిలో కోర్టులు పరిష్కరించాయి. ఈ విషయాన్ని గమనించి ప్రత్యేక చట్టం ఆవశ్యకతను గుర్తించి శాసనకర్తలు కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని తీసుకువచ్చారు.
భార్యా భర్తల వివాదాలను సామరస్యకంగా మధ్యవర్తిత్వం నెరపి పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఒక మిలియన్‌ జనాభా దాటిన నగరాల్లో విధిగా కుటుంబ న్యాయస్థానాలను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

కుటుంబ న్యాయస్థానాల చట్టంలోని సె.9 ప్రకారం కుటుంబ న్యాయస్థానం ముందుకు వచ్చిన కలహాలను సామరస్యకంగా పరిష్కరించడానికి విధిగా ప్రయత్నించాలి. పార్టీలు సదవగాహనకు రావడానికి కేసు పూర్వపరాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలను ఒప్పించడానికి కుటుంబ న్యాయస్థానం కృషి చేయాలి. అంతే కాకుండా పార్టీల మధ్య సదవగాహన రావడానికి న్యాయస్థానం తోడ్పడాలి.
హిందూ వివాహ చట్టంలోని సె.23 (2) ప్రకారం, దాఖలయ్యే దరఖాస్తులను పరిష్కరించే ముందు ఆ దంపతుల మధ్య సామరస్యం నెలకొల్పడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. కుటుంబ న్యాయస్థానంలోని నిబంధన 9 అటువంటిదే. వివాహ వ్యవస్థను రక్షించాలన్న ఉద్దేశంతో ఈ నిబంధనను ఈ చట్టంలో పొందు పరచారు. భార్య భర్త మధ్య ఏర్పడిన వివాదాలను సామరస్యంగా మధ్యవర్తిత్వం జరిపి పరిష్కరించవలసిన ఆవశ్యకతను గుర్తించి ఈ చట్టాన్ని తయారు చేశారు.

అన్ని మతాలకు సంబంధించి ఒకే రకమైన పద్ధతిలో కేసుల విచారణ జరగాలని, అది కూడా లింగ వివక్ష లేకుండా విచారణలు జరగాలన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనను ఏర్పాటు చేశారు. కుటుంబ న్యాయస్థానాల్లో అన్ని వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన కేసులు వస్తాయి. కొన్ని చట్టాల్లో సామరస్యం, రాజీ కుదిర్చే నిబంధనలు లేవు. కానీ కుటుంబ న్యాయస్థానాల్లో ఏర్పడిన నిబంధన 9 ప్రకారం పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి కుటుంబ న్యాయస్థానం కృషి చేయాల్సి ఉంటుంది.

దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీలు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆర్టికల్‌32 ఎ, కుటుంబ న్యాయస్థానంలోని సె.9, హిందూ వివాహ చట్టంలోని సె. 23, ప్రత్యేక వివాహ చట్టంలోని సె.34 చెబుతున్నది ఇదే విషయం. హిందూ వివాహ చట్టంలోని సె.23, సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని ఆర్టికల్‌ 32ఎ నిబంధనలను సుప్రీంకోర్టు వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి జిగ్‌రాజ్‌ సింగ్‌ వర్సెస్‌ బీర్‌పాల్‌ కౌర్‌ (జె.టి. 2007 (3) సుప్రీంకోర్టు 389) ఏర్పడింది. ఈ కేసులో సుప్రీంకోర్టు- ‘ఈ రెండు నిబంధనల ప్రకారం పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి మొదటి దశలో కోర్టులు ప్రయత్నం చేయాలి. ఈ ఉద్దేశంతోనే పార్టీలు కోర్టుముందు వ్యక్తిగతంగా హాజరు కావలసి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పార్టీలు హాజరు కాకపోతే వారి ‘ఏకపక్షం’ చేయాలన్న వాదన ఆమోదించలేము. ఆ విధంగా ఆమోదిస్తే ఈ ఉపయుక్తమైన నిబంధన ఎందుకూ పనికిరానిదిగా మారిపోతుంది.


ఫలితంగా పార్టీల మధ్య సయోధ్య కుదర్చాలన్న ఉద్దేశమే దెబ్బతింటుంది’. అందుకని ప్రతివాది హాజరుకోసం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను హైకోర్టు జారీ చేయడం సమంజసమని, చట్టం ఉద్దేశం నెరవేర్చడానికి అది ఉద్దేశించినదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.హిందూ వివాహ చట్టంలోని సె.13 ప్రకారం విడాకులు పొందడానికి చాలా ఆధారాలున్నాయి. దంపతుల్లో ఎవరైనా మతం మారినప్పుడు, వక్రమైన మానసిక అస్వస్థతకు గురైనప్పుడు, సుఖ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, కుష్టు వ్యాధితో బాధపడుతున్నప్పుడు- మరొకరు విడాకులు పొందవచ్చు. ఈ ఆధారాలతో విడాకులు కోరినప్పుడు వారి మధ్య సయోధ్య కుదర్చాల్సిన బాధ్యత, రాజీ కుదర్చాల్సిన బాధ్యత కోర్టులమీద లేదు.

ఈ విషయం గురించి కేరళ హైకోర్టు బివి వర్సెస్‌ కేవి. సుందరన్‌ కేసులో చర్చించి ఆ పరిస్థితుల్లో కూడా కోర్టు మధ్యవర్తిత్వం నెరపాలని వ్యాఖ్యానించింది. కోర్టు మాటల్లో- ‘మతం మార్పిడి జరిగినంత మాత్రాన పార్టీలు సుఖప్రదమైన వైవాహిక జీవితాన్ని గడపలేరని అనుకోవడానికి అవకాశం లేదు. సయోధ్య నెరపడానికి హిందూ వివాహ చట్టం కొన్ని ఆధారాలకు మినహాయింపులను ఇచ్చింది. కానీ కుటుంబ న్యాయస్థానం అలాంటి మినహాయింపులను ఇవ్వలేదు. కుటుంబ న్యాయస్థానాల చట్టం ప్రకారం అన్ని వివాహ సంబంధమైన కేసుల్లో మధ్యవర్తిత్వం నెరపి పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి కోర్టు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.

ఇది తప్పక చేయాల్సిన చర్య. ఈచట్టం ద్వారా వచ్చిన మార్పు ఇదే’!
ఈ తీర్పుల ద్వారా, చట్టాల ద్వారా అర్ధం అవుతున్న విషయం ఒక్కటే. వివాహ సంబంధ విషయాల్లో పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి, రాజీ కుదర్చడానికి కోర్టు ప్రయత్నం చేయాలి. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను సత్వరం పరిష్కరించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల సమయం, డబ్బు, ఖర్చులు మిగులుతాయి. ఇది మన దేశానికి కొత్తదేమీ కాదు, ఎప్పటినుంచో ఉన్నదే.

రూల్‌ఆఫ్‌లా మంగారి రాజేందర్‌

Saturday, March 17, 2012

విరోధి పద్ధతి విచారణ

పోలీసులు, కోర్టుల నిష్పక్షపాతంగా ఉండాలి. ఆ విషయానికి వస్తే ఎవరైనా నిష్పక్షపాతంగానే ఉండాలి. ఈ నిష్పక్షపాతం అనేది అందరిపట్లా ఉండాలి. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, బాధితులు కావచ్చు. చాలా నేరాలు సమాజానికి వ్యతిరేకంగా జరిగినవి కాబట్టి, ఆ సమాజం పట్ల కూడా పోలీసులు, కోర్టులు నిష్పక్షపాతంగా ఉండాలి. క్రిమినల్‌ కేసుల విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి. రాజ్యాంగంలోని 21వ అధికరణ చెబుతున్నది కూడా ఇదే. ఈ శాసనం ప్రకారం నిర్దేశించిన పద్ధతుల్లో తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, వ్యక్తిగత స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు. మన దేశంలో ‘ఏడ్వర్సరీ సిస్టం’ (ప్రతికూల పద్ధతి) అమలులో ఉంది.

అంటే ప్రతికూల వ్యవస్థ అన్నమాట. ఈ పద్ధతిలో న్యాయమూర్తి ఇరుపక్షాలకు నిష్పక్షపాతంగా ఉండాలి. ఆయన కేసుల విచారణలో సాధారణంగా చురుకుగా పాల్గొనకూడదు. ఈ పద్ధతి ఎక్కువగా ‘కామన్‌ లా’ దేశాలలో ఉంది. ఈ పద్ధతిలో ఇరుపక్షాలు ఉంటాయి. ముద్దాయి పక్షం ఒకటి, ప్రాసిక్యూషన్‌ పక్షం ఒకటి. కేసును రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంటుంది. ముద్దాయిని సాక్ష్యం పెట్టాలని ఒత్తిడి చేయడానికి వీలు లేదు. అతని ప్రాసిక్యూటర్‌ (అభియోక్త) ప్రశ్నించడాకి వీల్లేదు. కానీ ముద్దాయి తనను తాను విచారించుకోవడానికి అతనికి విచక్షణాధికారం ఉంది. ఆ విధంగా అతడు నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం అతని అభియోక్త క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయడానికి అవకాశం ఉంది. అదే విధంగా కేసు దర్యాప్తులో ఉన్నప్పుడు మౌనంగా ఉండే అవకాశం కూడా ఉంది.

ఈ ప్రతికూల పద్ధతిలో న్యాయమూర్తి చురుకుగా పాల్గొనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో న్యామూర్తి విచారణ క్రమంలో చురుకుగా పాల్గొనే అవకాశం కల్పించే నిబంధనలు కొన్ని ఉన్నాయి. కొన్ని నిబంధనలు అపారమైన అధికారాలను కూడా న్యాయమూర్తికి ఇచ్చాయి. అందుకు ఉదాహరణే భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోని సె.165. ఈ నిబంధన కేసు విచారణ క్రమంలో సంబంధం ఉన్న, సంబంధం లేని విషయాలను న్యాయమూర్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధనని ఉపయోగిస్తున్న న్యాయమూర్తులు చాలా అరుదు. ఈ నిబంధనే కాకుండా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కూడా చాలా నిబంధనలు ఉన్నాయి ఈ ఏడ్వర్సరీ సిస్టంలో ఇరు పక్షాల న్యాయవాదులు ఇరుపక్షాల సాక్షులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అయితే ముద్దాయి సాక్షులను విచారించినప్పుడే ప్రాసిక్యూషన్‌కి అవకాశం లభిస్తుంది.

ఇక ఇన్క్విస్టోరియల్‌ విధానం (పరిశోధన పద్ధతి)లో చాలా చురుకైన పాత్ర పోషించేది న్యాయమూర్తి. విచారణలో సాక్షులను విచారించేది న్యాయమూర్తే. ఈ పద్ధతి ఉద్దేశం సత్యాన్ని తెల్సుకోవలసిన బాధ్యత న్యాయమూర్తిపై ఉంటుంది. ఏడ్వర్సరీ విధానంలో నేరం నిరూపణ అయ్యేంతవరకు ముద్దాయిని అమాయకుడుగా పరిగణిస్తారు. ఇన్క్విస్టోరియల్‌ విధానంలో ముద్దాయి నేరం చేశాడన్న భావనలో కోర్టులు ఉంటాయన్న అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. అదేవిధంగా అతను నిరపరాధి అన్న విషయం రుజువు చేసుకోవలసిన బాధ్యత అతనిపైనే ఉన్నదని కూడా చాలా మంది అనుకుంటారు. ఈ రెండు అభిప్రాయాలు సరైనవి కావు. ఉదాహరణకు, ఫ్రాన్స్‌లో ఇన్క్విస్టోరియల్‌ విధానం గత వంద సంవత్సరాలకు పైబడి ఉంది. అక్కడ నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పై ఉంది. జర్మనీలో కూడా ఇదే పరిస్థితి.

అంతర్జాతీయ సివిల్‌, రాజకీయ హక్కుల ఒప్పందంలోని అధికరణ ప్రకారం నేరం నిరూపణ అయ్యేవరకే ముద్దాయిని నిరపరాధిగా పరిగణించాలి. ఈ సూత్రానికి అనుగుణంగానే ఇన్క్విస్టోరియల్‌ పద్ధతిని పాటిస్తున్న యూరోపియన్‌ దేశాల్లో చట్టాలున్నాయి. ఈ రెండు పద్ధతులకు ప్రధానమైన భేదం ఒకటుంది. ఏడ్వర్సరీ విధానంలో ముద్దాయిని అతను అనుకున్నప్పుడు తప్ప మరో సందర్భంలో ప్రాసిక్యూషన్‌ విచారించే అవకాశం లేదు. సాక్ష్యం ఇవ్వాలని అతణ్ణి ఒత్తిడికి గురిచేసే అవకాశం లేదు. రాజ్యాంగం, అదే విధంగా ఇతర శాసనాలు ముద్దాయికి ఈ హక్కులను ప్రసాదించాయి. ఇదే పద్ధతి ఈ ఇన్క్విస్టోరియల్‌ పద్ధతిని అనుసరిస్తున్న దేశాల్లో ఉంది.ఇన్క్విస్టోరియల్‌ విధానంలో కూడా దాదాపు ఇదే పద్ధతి ఉంటుంది. దర్యాప్తు క్రమంలో, కేసు విచారణ క్రమంలో ముద్దాయిని మాట్లాడమని ఒత్తిడి చేసే అవకాశం లేదు.

ముద్దాయిని బలవంతంగా ప్రశ్నిస్తారన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకు కారణాలు రెండు- ముద్దాయి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రాసిక్యూషన్‌ పరిశోధనను, సోదాలను నిర్వహిస్తుంది. విచారణ సమయంలో ముందుగా ముద్దాయిని న్యాయమూర్తి విచారిస్తాడు. కేసుకు సంబంధించిన కాగితాలను న్యాయమూర్తి ముద్దాయికి అందచేసి, అతని కథనాన్ని, అదే విధంగా అతని మానసిక స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. దీన్ని బట్టి ఈ ఇన్క్విస్టోరియల్‌ విధానంలో ముద్దాయిని బలవంతంగా ప్రశ్నిస్తారనే అపప్రథ ఏర్పడింది.

విరోధి పద్ధతి ముద్దాయికి అనుకూలంగా ఉందని, దానివల్ల చాలామంది శిక్షలు పడకుండా తప్పించుకుంటున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కాని నేర న్యాయ వ్యవస్థని దగ్గరగా చూసిన వ్యక్తుల అభిప్రాయం వేరుగా ఉంటుంది. లోపభూయిష్టమైన దర్యాప్తు, సాక్షులు సహకరించకపోవడం, దర్యాప్తు విచారణలో జాప్యం వంటి కారణాలు ఎన్నో. కేసు నిరూపణ అయ్యేంత వరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలన్న అభిప్రాయం ‘విరోధి పద్ధతి’లో ఉండడం వల్లే కేసులు వీగిపోతున్నాయని, దీనిని మార్చాలని చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇదికూడా సరైన పద్ధతి కాదు. రెండు రకాలైన వ్యవస్థలకు ఇది వర్తిస్తుంది.
మన దేశంలో అభివృద్ధి చెందిన జ్యూరిస్‌ప్రుడెన్స్‌ ప్రకారం అమాయకుడికి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తిపై ఎలా ఉందో, అదేవిధంగా తప్పు చేసిన వ్యక్తి తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిని నిరపరాధిగానే భావించాల్సి ఉంటుంది. నేరనిరూపణ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌ది.

బాధితుడికి, సమాజానికి కష్టం, నష్టం కలిగించే విధంగా ఈ నిబంధన ఉందనే భిన్నాభిప్రాయాన్నీ చాలా మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను, సాక్ష్యాధారాల చట్టాన్ని ఏ ఒక్కరికో లబ్ధి చేకూర్చే విధంగా తయారు చేయలేదు. అందరికీ తగు న్యాయం జరిగే విధంగానే తయారు చేశారు. నేరనిరూపణ బాధ్యత ప్రాసిక్యూషన్‌పై కాక తాను నేరం చేయలేదని నిరూపించుకోవలసిన బాధ్యత ముద్దాయిపై ఉంచాలన్న వాదన తరచు వస్తూ ఉంది. మరీ ముఖ్యంగా నేరాలు, హీనమైన నేరాలు జరిగినప్పుడు ఈ వాదన వస్తుంది. ఏమైనప్పటికీ ఈ వాదనతో ఏకీభవించలేం. ఎందుకంటే మన దేశంలోని నేరస్థుల్లో ఎక్కువమంది నిరుపేదలు, దిక్కు దివాణం లేని వ్యక్తులు. నేరం తాము చేయలేదని రుజువు చేసుకోవడంలో విఫలమవుతారు. అలాంటి సందర్భాల్లో న్యాయమూర్తి వారికి శిక్ష విధించాల్సి వస్తుంది. అమాయకులు కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని, నేరం నిరూపణ అయ్యేవరకు ముద్దాయిని నిరపరాధిగా చూడాలన్న సూత్రానికి ఆవశ్యకత ఉంది. శక్తివంతమైన రాజ్యాన్ని ఎదుర్కొనడానికి అది కవచంలా ఉపయోగపడుతుంది.
మంగారి రాజేందర్‌

Thursday, March 8, 2012

బాలల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తే...

బాలల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తే...

ఓచిన్న దొంగతనం చేశాడని ఓ కుర్రవాడిని నెల రోజులు బంధించారన్న వార్త కనిపించింది. అది జరిగిన నాలుగు రోజులకి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాలలో మరో సంఘటన జరిగింది. మొదటి పని చేసింది ఆ ఊరి గ్రామస్థులు. రెండవ సంఘటనలో పాల్గొన్న వ్యక్తి పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌. ఇది అమానుష చర్య. వచ్చిన వార్తల ప్రకారం ఆ పిల్లవాడు చేసిన నేరం మోటారు వాహనాల్లో పెట్రోల్‌ దొంగతనం. ఆ నేరానికి ఇన్స్‌పెక్టర్‌, కానిస్టేబుల్‌ అతన్ని రోడ్డుమీద చితకబాదారు. అది రివాల్వార్‌ చూపిం చడం దాకా వెళ్ళింది. మీడియా చాలా క్రియాశీలంగా ఉందన్న విషయం తెలిసి కూడా పోలీసులు ఎలాంటి మొహమాటం పోలేదు.

ఈ విషయమై ఓ చానల్‌ యాంకర్‌ ఆ ఇన్స్‌పెక్టర్‌ను ప్రశ్నించింది. అతను సరైన సమాధానాలు చెప్పలేదు, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని ఖండించనూ లేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్‌ బి. లోకూర్‌ మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జువెనైల్‌ జస్టిస్‌ గురించి వర్క్‌ షాపుల్ని జ్యుడిషియల్‌ అకాడమీ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది.జువెనైల్‌ జస్టిస్‌ చట్టాన్ని మన దేశం 1986లో తీసుకొని వచ్చింది. ఆ చట్ట ప్రకారం 16 సంవత్సరాల లోపున్న పిల్లవాడిని, 18 సంవత్సరాల లోబడి ఉన్న ఆడపిల్లను ఈ చట్టం జువెనైల్‌గా పరిగణించింది. మగ పిల్లల వయస్సును కూడా 18 సంవత్సరాలకు పెంచాలని పిల్లల గురించి పనిచేస్తున్న వ్యక్తులు కోరుతున్నారు.

భారత దేశం 1992 డిసెంబర్‌ 11న పిల్లల హక్కుల ఒప్పందంపై సంతకం చేసింది. 2000లో ఈ చట్టాన్ని ఆ ఒప్పందానికి అనుగుణంగా మార్చింది. మగ పిల్లలకి కూడా 18 సంవత్సరాల వయస్సును నిర్ధారించారు. ఆర్టికల్‌ 1 సిఆర్‌సి ప్రకారం 18 సంవత్సరాలకు లోబడిన వ్యక్తులందరూ పిల్లలే. 2006లో ఈ చట్టానికి మళ్ళీ మార్పులు తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం రెండు రకాల పిల్లలున్నారు. వాళ్ళు చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లలు- రక్షణ, పోషణ లేని పిల్లలు. నేరం చేసిన పిల్లలని చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లలని, ఆలనా పాలన లేని ప్లిలలను రక్షణ, పోషణ లేని పిల్లలని అంటారు. అలాగే రెండు రకాలైన నేరాలనూ చట్టం గుర్తించింది.

అవి బాలలు చేసే నేరాలు- బాలలపై జరిగే కొన్ని ప్రత్యేక నేరాలు.
పైన పేర్కొన్న ఇన్స్‌పెక్టర్‌ చేసిన నేరం బాలలపై జరిగిన ప్రత్యేకమైన నేరం. ఈ నేరాలను జువెనైల్‌ జస్టిస్‌ చట్టంలోని సె.23 నుంచి 26 వరకు పేర్కొన్నారు. సె.27 ప్రకారం ఈ నేరాలు కాగ్నిజబుల్‌ నేరాలు. అంటే మేజిస్ట్రీట్‌ అనుమతి లేకుండా పోలీసులు దర్యాప్తు చేయడానికి అవకాశం ఉన్న నేరాలు. సె. 23 ప్రకారం బాలల పట్ల క్రూరంగా వ్యవహరించడం నేరం. బెదిరించడం, వదిలిపెట్టడం, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం లేదా బెదిరించే ప్రయత్నం చేయడం, వదిలి పెట్టడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలకి శారీరకంగా, మానసికంగా బాధ కలగచేయడం. ఎవరైనా సరే, పిల్లల పట్ల క్రూరంగా వ్యవహరించకూడదు. అలా వ్యవహరిస్తే వారికి 6 మాసాల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

బాలల్ని బిచ్చం ఎత్తుకునే వృత్తిలో నియమించి వారి ఆదాయాన్ని వాడుకున్న వ్యక్తులను, ఆ విధంగా బిచ్చం ఎత్తుకునే వ్యక్తులకు సహకరించిన వక్తులకు సె.24 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. డాక్టర్లు నిర్దేశించినప్పుడు కాకుండా ఇతర సందర్భాలలో పిల్లలకి మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు ఇచ్చిన వ్యక్తులకు సె. 25 ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. బాలలను ఉద్యోగాలలో నియమించి దోపిడీకి గురి చేసినప్పుడు, అపాయకరమైన వృత్తిలో నియమించినప్పుడు, వారి ఆదాయాన్ని నిలిపివేసినప్పుడు సె. 26 ప్రకారం వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

నేరం చేసిన పిల్లలు మొదట తారసపడేది పోలీసుతోనే. మామూలు వ్యక్తులు వాళ్ళని పట్టుకున్నా వారిని పోలీసులకు అప్పగిస్తారు. వారు చేసిన నేరాలను విచారించే అధికారం పోలీసులకు ఉంది. అయితే నేరాలు చేసిన పెద్దవాళ్ళని ట్రీట్‌ చేసిన విధంగా పిల్లలను పోలీసులు ట్రీట్‌ చేయకూడదు. ఈ చట్టప్రకారం- పిల్లలు చేసిన నేరాలను విచారించే అధికారులుగా మానవ దృక్పథంతో ఉన్న వ్యక్తులను, సున్నితంగా ఆలోచించే వ్యక్తులను నియమించాలి. ఈ చట్ట ప్రకారం పిల్లల పట్ల సున్నితంగా నడుచుకోవాలి. అయితే ఈ మధ్య మీడియాలో కనుపించిన దృశ్యం ఆ విధంగా కనుపించదు. పిల్లలను నేరస్థుల కంటె అధ్యాన్నంగా పరిగణించడం జరిగింది. ఎందుకంటే హింసను ప్రదర్శించే, ఉపయోగించే అధికారం పోలీసులకు లేదు. కొన్ని ప్రత్యేకమైన సందర్బాలలోనే పోలీసులు బలప్రయోగాన్ని ఉపయోగించుకోవచ్చు.

బాలలు ఏదైనా నేరం చేసినప్పుడు ఆ దర్యాప్తును పోలీసులు సాధారణంగా త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది. బాలు చేసిన నేరాలు ఎంతో తీవ్రమైనవైనా వారికి బెయిలు మంజూరు చేసే అధికారం పోలీసులకు ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే బెయిల్‌ను పోలీసులు తిరస్కరించాల్సి ఉంటుంది. నేరం చేసిన వ్యక్తుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించకూడదు. వాళ్ళని చిత్రహింసలకు గురి చేయకూడదు. ఇక పిల్లల విషయానికి వస్తే వారు మరీ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది బాలల చట్టంలోని సె. 23 ప్రకారం నేరమే కాక, ఆ నేరం రుజువైతే వారు తమ ఉద్యోగాన్ని కూడా కోల్పోవలసి ఉంటుంది. మామూలు వ్యక్తులకు, పిల్లలకు బేధం ఉంది.

మామూలు వ్యక్తులు సె. 23 ప్రకారం విచారణను మాత్రమే ఎదుర్కొంటారు. నేర నిరూపణ జరిగితే శిక్ష పడే అవకాశం ఉంది.. పోలీసుల విషయానికి వస్తే శిక్ష మాత్రమే కాక ఉద్యోగాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. నియమాలు ఏర్పరచడంతోనే సరిపోదు. అవి సక్రమంగా అమలు జరిగినప్పుడే అందరిలో, ముఖ్యంగా పోలీసుల్లో మార్పు వస్తుంది.

Followers