Thursday, February 23, 2012

దత్తతకో లౌకిక చట్టం

దత్తతకో లౌకిక చట్టం

భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి చాలా సంవత్సరాలు గడచినా, ఇంకా అన్ని మతాలకు వర్తించే సివిల్‌ కోడ్‌ రాలేదు. ఒక్కో మతానికి ఒక్కో రకమైన వ్యక్తిగత చట్టం ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాజ్యాగంలోని అధికరణ 44 ప్రకారం భారత పౌరులందరికీ ఒకే రకమైన సివిల్‌ కోడ్‌ ఉండే విధంగా రాజ్యం కృషి చేయవలసి ఉంటుంది. అందరికీ ఒకే రకమైన సివిల్‌ కోడ్‌ తీసుకురానున్నట్టు ప్రభుత్వం ప్రకటించగానే అందుకు వ్యతిరేకంగా తీవ్రమైన స్పందన వస్తుంది. ప్రత్యక్షంగా తీసుకుని రావడం కష్టం. కానీ, పరోక్షంగా అందరికీ వర్తించే విధంగ కొన్ని అంశాలతో చట్టం తీసుకువచ్చే అవకాశం ఉంది. అందుకు ఉదాహరణ బాలల చట్టంలోని దత్తత అంశం.

పిల్లలు లేని దంపతులకు, పెళ్ళి చేసుకోని వ్యక్తులకు దత్తత అవసరం. దత్తత తీసుకోవడం వల్ల ఒక వ్యక్తికి మంచి భవిష్యత్తు ప్రసాదించే అవకాశం ఏర్పడుతుంది. ఎలాంటి ఇల్లు, తల్లిదండ్రులు లేని అనాథలైతే వారికి మంచి జీవితాన్ని ప్రసాదించినట్టవుతుంది. అయితే దత్తత తీసుకోవడానికి ఒక్క హిందువుల వ్యక్తిగత చట్టాలే అనుమతిస్తాయి. మిగతా మతాలకి సంబంధించిన వ్యక్తిగత చట్టాల్లో అలాంటి నిబంధనలు లేవు.

దత్తత తీసుకునే విషయంలో లౌకిక చట్టాన్ని తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. కానీ అవి ఏవీ ఫలప్రదం కాలేదు. 1972లో పిల్లల దత్తత చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. దానికి ముస్లింలనుంచి వ్యతిరేకత వచ్చింది. ముస్లింలను మినహాయించి మిగతా మతాలవారికి దత్తత చట్టం తేవడానికి ప్రభుత్వం 1980లో పిల్లల బిల్లును ప్రతిపాదించింది. దానికి పార్టీలనుంచి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి వ్యతిరేకతల వల్ల లౌకిక దత్తత చట్టం అమల్లోకి రాకుండా పోయింది. ఈ పరిస్థితి వల్ల మిగిలిన చట్టాలు రెండే రెండు. అవి- హిందూ దత్తత మనోవర్తి చట్టం- 1956, గార్డియన్‌, వార్డుల చట్టం- 1890. హిందువులు మాత్రమే దత్తత తీసుకోవడానికి అవకాశం ఉంది. మిగతా మతాలకు చెందిన వారు సంరక్షకులుగా మాత్రమే ఉండే అవకాశం ఉంది.

హిందూ దత్తత మనోవర్తి చట్ట ప్రకారం హిందువులు తీసుకున్న దత్తత వల్ల ఆ పిల్లవాడికి ఆ తల్లిదండ్రుల వారసత్వ హక్కులు సహజంగా వస్తాయి. దత్తత తీసుకునే విషయంలో చట్టం కొన్ని ఆంక్షలను ఏర్పరచింది. హిందువులు కాకుండా ముస్లిం, క్రైస్తవ, పార్సీ, యూదు మతాలకు చెందిన వ్యక్తులు దత్తత తీసుకునే అవకాశం లేదు. వారు సంరక్షకులుగా నియామకం కావడానికి అవకాశం గార్డియన్‌ అండ్‌ వార్డ్‌ చట్టం ప్రకారం ఉంది. అయితే ఆ వ్యక్తికి 21 సంవత్సరాలు వచ్చాక సంరక్షకుని బాధ్యత ఉండదు. అదే విధంగా వారికి వారసత్వపు హక్కులు కూడా లభించవు.

స్వాధీనం చేసిన అనాథలు, వదిలివేసిన పిల్లల విషయంలో ఆ రెండు చట్టాల్లో ఎటువంటి నిబంధనలు లేవు. దానివల్ల వారి దత్తత, సంరక్షకుని విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని అధిగమించడానికి ప్రభుత్వం బాలల చట్టంలో అధ్యాయం ఐగను చేర్చి ఇలాంటి వ్యక్తులను దత్తత తీసుకోవడానికి అవకాశం కల్పించింది. మరోరకంగా చెప్పాలంటే దత్తత విషయంలో ఇది లౌకిక చట్టం. ఇందులోని ముఖ్య విషయం ఆ చట్టం ‘దత్తత’ అనే పదాన్ని నిర్వచించి వారి హక్కులను కూడా స్పష్టం చేసింది. సె.2 (ఎఎ) ప్రకారం దత్తత తీసుకునే వ్యక్తి తన స్వంత తల్లిదండ్రులతో శాశ్వతంగా వేరుపడి దత్తత తీసుకున్న తల్లిదండ్రుల పిల్లవాడు అవుతాడు. వారి పిల్లలకు ఉండే హక్కులు, ప్రత్యేక హక్కులు, బాధ్యతలు వారికి లభిస్తాయి. దిక్కు దివాణం లేని పిల్లలకు అవసరమైన పునరావాసాన్ని, గౌరవాన్ని ఇవ్వడం కోసం ఆ నిబంధనను ఏర్పరచారు. ఒక రకంగా ఈ నిబంధన వల్ల ప్రభుత్వం వ్యక్తిగత చట్టాల్లోకి చొరబడిందని చెప్పవచ్చు.

అనాథలు, పారేసిన పిల్లలని, స్వాధీనం చేసిన పిల్లల రక్షణను చూసే బాధ్యత పిల్లల సంరక్షణ కమిటీలకు బాలల చట్టం సంక్రమింపచేసింది. బాలలచట్ట ప్రకారం పిల్లల సంక్షేమ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయా ల్సి ఉంటుంది. పారేసిన పిల్లలను దత్తత తీసుకోవడాన్ని కమిటీలోని ఇద్దరు సభ్యులు ప్రకటించాల్సి ఉంటుంది. స్వాధీనం చేసిన పిల్లల విషయంలో ఈ విధంగా ప్రకటించడానికి, ఆ తల్లిదండ్రులు పునరాలోచించుకోవడానికి రెండు నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. సమ్మతి చెప్పే పరిస్థితిలో ఉన్న వ్యక్తుల విషయంలో ఆ వ్యక్తి సమ్మతి తీసుకున్న తర్వాత అతన్ని దత్తత తీసుకోవచ్చునని ప్రకటించే అవకాశం ఉంది. ఇంత గురుతరమైన బాధ్యతను అప్పగించిన కమిటీకి సరైన వనరులను సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు. దత్తత తీసుకునే వ్యక్తుల విషయంలో కూడా ఈ చట్టం ఉదారంగావ్యవహరించింది. వివాహంతో సంబంధం లేకుండా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు. జువెనైల్‌ జస్టిస్‌ (రక్షణ, సంరక్షణ) చట్టం- 2000ని మార్పులు చేసి పిల్లల్ని రక్షించే విధంగా, పిల్లల సంక్షేమ దృష్ట్యా తయారు చేశారు. ఇది లౌకిక చట్టమని ఒప్పుకోక తప్పదు. కానీ ఈ చట్టంలో కూడా కొన్ని తప్పిదాలు దొర్లినాయని చెప్పక తప్పదు. వాటిని సరిదిద్దవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

వివాహం అయిన వ్యక్తి దత్తత తీసుకోవచ్చు. కాని దంపతుల్లో రెండో వ్యక్తి సమ్మతి అవసరం లేదు. ఇది హిందూ దత్తత, మనోవర్తి చట్టానికి విరుద్ధం. ఇలాంటి నిబంధన ఉండడం వల్ల భార్యా భర్తల మధ్య దత్తత విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. దత్తత తీసుకునే వ్యక్తికి, పిల్లవానికి మధ్య ఉండే వయస్సును కూడా చట్టం పేర్కొనలేదు. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. హిందూ దత్తత మనోవర్తి చట్ట ప్రకారం మగవాడు ఆడపిల్లను దత్తత తీసుకున్నప్పుడు వారి మధ్య 21 సంత్సరాల భేదం ఉండాలి. అదే విధంగా స్త్రీ మగపిల్లవాడిని దత్తత తీసుకున్నప్పుడు కూడా వారి మధ్య 21 సంవత్సరాలు భేదం ఉండాలి. ఇది లేనప్పుడు పిల్లల సంక్షేమం దెబ్బతినే అవకాశం ఉంది. పిల్లలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఈ విషయం గురించి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Followers