Thursday, August 4, 2011

అరుదైన నేరాలపై ‘సుప్రీం’ కొరడా!

అరుదైన నేరాలపై ‘సుప్రీం’ కొరడా!
-విశ్లేషణ
మంగారి రాజేందర్, మూడవ అదనపు మరియు జిల్లా సెషన్స్ జడ్జి, వరంగల్

న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ద్విగుణీకృతం చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్య కాలంలో రెండు ప్రధానమైన కేసుల్లో మరణశిక్షలు విధించడాన్ని ఖరారు చేసింది. అందులో మొదటిది ‘పరువు’ హత్యలకు చెందినది కాగా, రెండవది ఎన్‌కౌంటర్ హత్యలకు సంబంధించినది. ఈ రెండు రకాల ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ తీర్పులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి . పరువు హత్యలకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని కేంద్రం ప్రతిపాదిస్తున్న నేపథ్యం కూడా ఒక సందర్భం. ఎన్‌కౌంటర్ హత్యలను నేరాలుగా నమోదుచేసి దర్యాప్తు చేయాలన్న వాదన గత 30 సంవత్సరాలుగా కొనసాగుతోంది. వాటిని హత్యా నేరాలుగా నమోదు చేయాలని చట్టాలు నిర్దేశిస్తున్నప్పటికీ దర్యాప్తు ఆ వెలుగులో జరగడం లేదన్నది ప్రధాన విమర్శ.

‘భారత శిక్షాసృ్మతి’ ప్రకారం ఆరు రకాలైన నేరాల్లో న్యాయస్థానాలు మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అవి- ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారన్న నేరారోపణలో (సెక్షన్ 121), సిపాయిలను రాజ్యంపై తిరగబడేలా ప్రేరేపించినపుడు (సె.132), మరణశిక్ష పడేలా తప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు (సె.194), హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు (సె.302), 18 సంవత్సరాలు నిండని వారినీ, మానసిక రుగ్మతలున్న వారినీ ఆత్మహత్యకు ప్రేరేపించినపుడు (సె.305), దోపిడీకి పాల్పడుతూ హత్యగావించినప్పుడు (సె.396). కొన్ని సందర్భాల్లో ఎవరినైనా చంపడానికి ప్రయత్నించినపుడు సెక్షన్ 307 ప్రకారం కూడా మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే, ప్రత్యేక చట్టాల్లో కూడా అలాంటి శిక్ష విధించే అవకాశం ఉంది.

అయితే ఈ నేరాలన్నింటిలో కూడా నేరం రుజుైవె నప్పటికీ మరణశిక్ష విధించాలన్న నియమం లేదు. కేసులోని తీవ్రతనుబట్టి జీవితఖైదు గానీ, మరణశిక్ష గానీ కోర్టులు విధిస్తాయి. కానీ జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలు ఎవరినైనా చంపితే, సెక్షన్ 303 ప్రకారం విచారించి నేరం రుజువైతే వారికి కోర్టులు విధిగా మరణశిక్షను విధించాల్సి ఉంటుంది.

ఇలాంటి నేరాల్లో మరణశిక్ష విధించడం సహేతుకం కాదని అనడానికి ఎలాంటి కారణం కనిపించడంలేదనీ, ప్రజాహితం కోసం ఈ శిక్ష ఉండాల్సిందేననీ, ఇది రాజ్యాంగంలోని జీవించే హక్కుకు వ్యతిరేకం కాదనీ గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో గుర్తుచేయడం గమనార్హం. బచన్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో దీన్ని మరింత స్పష్టంగా ప్రకటించింది . క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 354 ప్రకారం హత్యానేరం రుజువైన వ్యక్తులకి జీవిత ఖైదు శిక్ష విధించడమనేది నియమంకాగా, మరణశిక్ష కూడా విధించవచ్చన్నది మినహాయింపు. అయితే సెక్షన్ 354(3) ప్రకారం మరణశిక్ష విధించడానికి గల ప్రత్యేకమైన కారణాలను తీర్పులో పేర్కొనాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన కొలబద్దల్ని కూడా సుప్రీంకోర్టు బచన్‌సింగ్ కేసులో స్పష్టపరుస్తూ, మార్గదర్శకాలను నిర్దేశించింది (ఏఐఆర్ 1983 సుప్రీంకోర్టు 957).

అవి ప్రధానంగా- హత్య జరిగిన తీరు, నేరం జరగడానికి కారణం, సాంఘికంగా తిరస్కరించే విధంగా ఉన్న నేరాలు, నేర తీవ్రత, హత్యకు సంబంధించిన బాధితుల వ్యక్తిత్వం. అలాగే దుర్మార్గంగా, అస్వాభావికంగా, పైశాచికంగా, పిరికితనంగా లేక మోసపూరితంగా చంపినప్పుడు మరణశిక్ష విధించవచ్చు. ఉదాహరణకు- బాధితుడు నిప్పులో కాలి చనిపోవాలన్న ఉద్దేశంతో అతని ఇంటికి నిప్పు పెట్టి చంపినప్పుడు, బాధితులు చనిపోవాలని అతన్ని చిత్రహింసల పాల్జేయడం, అమానవీయంగా ప్రవర్తించడం, బాధితుల శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయడం లేక ఛిన్నాభిన్నం చేసి పైశాచికంగా ప్రవర్తించడం.

ఎన్‌కౌంటర్ మరణాల్లో, పరువు హత్యల్లో ఈ అంశాలు లేకపోవచ్చు. కానీ, ఈ నేరాలను కూడా సుప్రీంకోర్టు అరుదైన వాటిల్లో అరుదైనవిగా పరిగణించి మరణశిక్షలను ఖరారు చేసింది. ఎన్‌కౌంటర్ మరణాల పేరుతో అమాయకులను చంపే అధికారులకు ఒక హెచ్చరికగానూ, వెనుకంజవేసే విధంగానూ ఈ తీర్పులు తోడ్పడతాయనడంలో సందేహం లేదు. అదేవిధంగా పరువు, ప్రతిష్టల పేరుతో నేడు జరుగుతున్న హత్యలని నిరోధించడానికి కూడా ఈ తీర్పులు దోహదపడతాయని భావించవచ్చు.

ప్రకాశ్ కదమ్ మరి ఇతరులు వర్సెస్ రాంప్రసాద్ విశ్వనాథ్ గుప్తా మరి ఇతరులు (క్రిమినల్ అప్పీలు నంబరు 1174-1178 / 2011) కేసులో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్ హత్యలను అరుదైన కేసులో అరుదైనవిగా అభివర్ణించింది. ముంబైలో ప్రకాశ్ కదమ్ అనే పోలీసు అధికారి నేతృత్వంలో ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారి కోసం అతని మిత్రుణ్ణి ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. ఈ కేసులో అక్కడి సెషన్స్ కోర్టు పోలీసు అధికారులకు బెయిల్ మంజూరు చేయగా, హైకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. దీనిపై పోలీసు అధికారులు సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారు. అప్పీలు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్ హత్యలను అరుదైన కేసుల్లో అరుదైనవిగా అభివర్ణించింది. ఆ నేర తీవ్రతను సుప్రీంకోర్టు మాటల్లో చెప్పాలంటే-

‘‘ఎన్‌కౌంటర్ల పేరుతో అమాయకులని చంపడం అతి హేయమైన నేరం.

ఈ నేరాన్ని కూడా అరుదైన వాటిలో అరుదైన కేసుగా పరిగణించాల్సి ఉంటుంది. పోలీసు అధికారి నేరం చేశాడని రుజువైతే అతనికి మరణశిక్షను విధించాలి. మామూలు వ్యక్తి హత్య చేస్తే అది మామూలు హత్య. కానీ పోలీసు అధికారి చేస్తే, అది అతని విద్యుక్త ధర్మానికి వ్యతిరేకమైనది. సమాజంలో శాంతిభద్రలు కాపాడే విధంగా విధులను నిర్వర్తించాల్సిన వ్యక్తి వాటికి విఘాతం కలిగించినప్పుడు అతనికి మరణశిక్షే సరైన శిక్ష’’.తన పైఅధికారి చంపమని ఆదేశిస్తే ఎన్‌కౌంటర్ పేరుతో చంపకూడదు. దాన్ని తిరస్కరించాలి. ఆ విధంగా చేయనప్పుడు అతనికి మరణశిక్ష విధించాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంటూ న్యూరెంబర్గ్ విచారణలను ఉదహరించింది. ‘‘ఆ విచారణల్లో ‘ఉత్తర్వులు ఉత్తర్వులే’ అని అధికారులు డిఫెన్స్ తీసుకున్నప్పటికీ ‘నాజీ’ అధికారులకు మరణశిక్షని విధించారు’’.

బూటకపు ఎన్‌కౌంటర్లంటే దారుణమైన హత్యలనీ, చట్టాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులే ఉల్లంఘనలకు పాల్పడటం తగదని అభిశంసించింది. సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులే కిరాయి రౌడీలుగా మారి హతమార్చడం అత్యంత హేయమైన విషయమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒక వ్యక్తిని చంపుతున్న పోలీసులు, మరో వ్యక్తిని రక్షించడానికి సాక్షులను కూడా చంపరన్న గ్యారంటీ ఏమిటి? అని సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రశ్నించింది. తమని రక్షించుకోవడం కోసం తమ బంధువులని కూడా వాళ్లు చంపగలరని కోర్టు తీవ్రంగా స్పందించింది. సొహ్రాబుద్దీన్, ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసుల నేపథ్యంలో ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది.

ఇక పరువు హత్యలను కూడా అరుదైన కేసుల్లో అరుదైన వాటిగానే పరిగణించాలని సుప్రీంకోర్టు భగవాన్‌దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, క్రిమినల్ అప్పీలు నంబరు 1117/11 కేసులో స్పష్టం చేసింది. ఈ కేసులోని విషయాలకు వస్తే, భగవాన్‌దాస్ తన సొంత కూతురినే చంపేశాడు. కూతురు భర్తను వదిలిపెట్టి వేరే వ్యక్తితో కలిసి జీవిస్తోందన్న కోపంతో, అతను కుటుంబం పరువు పోయిందని ఆమెని చంపేశాడు. పరువు హత్యలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న వ్యక్తులు బిక్కుబిక్కుమంటూ పోలీసుల రక్షణలో బతుకుతున్నారు. ఏ కారణాలతో ఈ హత్యలు చేసినప్పటికీ, వీటిని అరుదైన కేసుల్లో అరుదైనవిగా బావించాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. అహంకారపూరితమైన, హీనమైన ఈ నేరాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు పేర్కొంది. మేజరైన వ్యక్తులు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకునే అధికారం ఉంది. పరువు ప్రతిష్టల పేరుతో ఈ హత్యలకు పాల్పడే వ్యక్తులు తమకు ఉరితాళ్లు ఎదురు చూస్తున్నాయన్న విషయం గమనిస్తే మంచిదని సుప్రీంకోర్టు తీర్పులో హెచ్చరించింది.

బూటకపు ఎన్‌కౌంటర్‌లను, పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా భావించి మరణశిక్షని విధించాలని సుప్రీంకోర్టు ఈ రెండు తీర్పుల్లో నొక్కి చెప్పింది. బచన్‌సింగ్ కేసులో నిర్దేశించిన అంశాలకి మరో రెండు కొత్త అంశాలును జతచేయడం హర్షించదగిందే. పరువు హత్యల కన్నా, ఎన్‌కౌంటర్ హత్యల్లో కేసు నమోదు అవడం చాలా కష్టం. పొరపాటున నమోదైనా పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చెయ్యాలంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 132, 197 ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి కావాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడం కష్టం. ఈ అనుమతి లభించడానికే సంవత్సరాలు పట్టవచ్చు. అవినీతి కేసుల్లో అనుమతి రాక ఎన్నో కేసులు మూలన పడుతున్నాయి. వచ్చినా వాటి పరిష్కారానికి ఎంత కాలం పడుతుందో కళ్ల ముందు కనిపిస్తున్నదే. అలాగని నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. రాజ్యాంగలోని జీవించే హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది. చట్టం నిత్యనూతనమైంది. కాలానుగుణంగా అది మార్పు చెందుతుంది. కోర్టుల వ్యాఖ్యానాలు కూడా దానికి దోహదపడతాయి. ఆ నేపథ్యంలో వచ్చినవే ఈ రెండు తీర్పులన్నది గుర్తించాలి.

బూటకపు ఎన్‌కౌంటర్లకి పాల్పడే వ్యక్తులు ఒక్క విషయం గమనంలో ఉం చుకోవాలి. ముంబైలో రాజ్‌బీర్‌సింగ్ అనే పోలీసు అధికారి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా ప్రతీతి పొందాడు. రాష్ట్రపతి గేలంటరీ అవార్డు కూడా వచ్చింది. అతనికి రియల్ ఎస్టేట్ వ్యక్తులతో తెరచాటు సంబంధాలు ఉన్నాయన్నది ఆరోపణ.

అతన్ని మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కాల్చిచంపాడు. అతని శవాన్ని చూడటానికి ఒక్క సీనియర్ పోలీసు అధికారి కూడా రాలేదనీ, కనీసం ఒక్క పుష్పగుచ్ఛానికీ నోచుకోలేదనీ విన్నప్పుడు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఈ దేశంలో అది సాధ్యమా అని! సీనియర్లందరూ గతంలో అతన్ని అభినందించిన వారే. ఈ సంఘటనతోపాటు, సుప్రీంకోర్టు తీర్పుని కూడా దేశంలోని పోలీసులంతా ఒక బాధ్యతగా సంయమనంతో అధ్యయనం చేయగలిగితే భవిష్యత్ సమాజం వారికి నీరాజనాలు పడుతుందనడంలో సందేహం లేదు!

Followers