Tuesday, April 27, 2010

వీలునామా ఎందుకు రాయాలి?

వీలునామా ఎందుకు రాయాలి?
April 27th, 2010

వీలునామాల ప్రసక్తి పూర్వకాలంలో లేదు. వీలునామాను హిందూ చట్టం గుర్తించలేదు. హిందూ వారసత్వ చట్టంలో వీలునామాల ప్రసక్తి లేదు. బ్రిటీష్ పరిపాలకుల అజమాయిషీలో వున్న నగరాల్లో వాళ్ళ ప్రభావం వల్ల ఈ వీలునామాని గుర్తించడం జరిగింది. కాలక్రమంలో మిగతా నగరాలు ప్రజలు ఈ వీలునామాలని గుర్తించడం మొదలుపెట్టారు. కోర్టులు కూడా వీలునామాలను గుర్తించడం మొదలుపెట్టాయి. చివరికి వీలునామాలకి చట్టబద్ధత కల్పించారు. భారతీయ వారసత్వ చట్టంలో ఈ వీలునామాని గుర్తించినారు. తరువాత ఈ వీలునామాని హిందూ వారసత్వ చట్టం కూడా గుర్తించింది.
చావు అనివార్యమైనప్పటికీ చాలామంది ఈ విషయాన్ని అంగీకరించరు. అంగీకరించినా తగు చర్యలు తీసుకోరు. అందుకనే చాలామంది విద్యావంతులు కూడా వీలునామాలు రాయకుండానే తమ జీవితాలను ముగిస్తున్నారు. తమ స్థిర చరాస్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం చేయకుండానే తమ జీవితాలను పూర్తిచేస్తున్నారు. అలా చేయడంవల్ల అతని కుటుంబీకులు కలతలకి, కక్షలకి, అశాంతులకి గురవుతున్నారు.
హిందూ వారసత్వ ‘లా’లో వీలునామాల ప్రసక్తి లేకపోవడానికి ప్రధానకారణం పూర్వం చనిపోయిన వ్యక్తి అభిలాష ప్రకారం పంపకాలు చేసుకునే వాళ్ళు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పూర్వంలా ఇపుడు వాటిని మన్నించడంలేదు. అందుకని మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం వీలునామా రాయడం అవసరమైపోయింది. ఒక వ్యక్తి తన మరణం తరువాత తనకున్న ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియపరిచే చట్టబద్ధమైన ప్రకటనగల పత్రాన్ని వీలునామా అంటారు. వీలునామా దాని కర్త తదనంతరమే అమల్లోకి వస్తుంది.

వీలునామా ఉద్దేశ్యమేమిటీ?
------------------------------
ఒక వ్యక్తి తన మరణం తరువాత తను ఏవి నిర్వర్తించాలని అనుకుంటున్నాడో దాని చట్టబద్ధమైన ప్రకటనే వీలునామా. తన ఆస్తి ఏ విధంగా చెందాలో తెలియచేసే ప్రకటనని వీలునామా అని అనవచ్చు. వీలునామా రాసి ఎవరైనా వ్యక్తి చనిపోతే వీలునామా రాసి చనిపోయిన వ్యక్తి అని ఆ విధంగా కానప్పుడు వీలునామా రాయకుండా చనిపోయిన వ్యక్తి అని అంటారు. వీలునామా రాసినప్పుడు ఆ వ్యక్తి వీలునామాలో రాసిన విధంగా ఇతరులకి చెందుతుంది. వీలునామా రాయకుండా మరణించితే ఆ వ్యక్తి వ్యక్తిగత చట్టప్రకారం అతని వారసులకి అతని ఆస్తి చెందుతుంది. ఏ ఏ వారసునికి ఎంత ఆస్తి చెందుతుందన్న విషయం వాళ్ళ వ్యక్తిగత చట్టాలని బట్టి వుంటుంది. వాళ్ళు ఆస్తి పొందడానికి అర్హత లేకున్నా వాళ్ళకి ఆ ఆస్తి చెందుతుంది. అంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులని సరిగ్గా చూడరు. వాళ్ళని గాలికి వదిలేస్తారు. అలాంటి వ్యక్తులకి కూడా వారసత్వ చట్ట ప్రకారం ఆస్తి లభిస్తుంది. వీలునామా ఉన్నప్పుడు వీలునామాలో పేర్కొన్న విధంగానే లభిస్తుంది. చనిపోయిన వ్యక్తికి బాగా సేవలు చేసిన వ్యక్తులు వారసులు కానప్పుడు వాళ్ళకి అతని ఆస్తిలో ఎలాంటి వాటా రాదు. నమ్మకంగా వున్న వ్యక్తులకి, సేవలు అందించిన సేవకులకి, స్నేహితులకి ఆస్తి ఇవ్వాలని అనుకున్నప్పుడు వీలునామా రాయడం అవసరం. అదేవిధంగా ఒక వ్యక్తి మరణానంతరం ఎలాంటి తగవులు రాకుండా వుండడానికి కూడా వీలునామా అవసరం.
ఎవరైనా వ్యక్తి తన మరణం తరువాత అతను కోరుకున్న విధంగా ఆస్తి ఇతరులకి చెందాలని అనుకున్నపుడు వీలునామా రాయడం అవసరం.

వీలునామా రాయడంవల్ల
ప్రయోజనాలు ఏమిటీ?
----------------------------
వీలునామా రాయడంవల్ల ప్రయోజనాలు ఉన్నాయి. అందులో మచ్చుకు కొన్ని-

1.ఒక వ్యక్తి మరణం తరువాత అతని ఆస్తిని ఏ విధంగా వినియోగించాలో అన్న విషయంలో ఎలాంటి గందరగోళం అతని కుటుంబసభ్యులలో బంధువులో తలెత్తదు. వాళ్లకు తెలియాల్సిన విషయం ఒక్కటే. ఆ చనిపోయిన వ్యక్తి వీలునామా రాసాడన్న విషయం.
2.వీలునామా అన్నది పూర్తిగా వ్యక్తిగత పత్రం. అందులో చాలా వ్యక్తుల గురించి అభిప్రాయాలు, అనుభూతులని వ్యక్తపరిచే అవకాశం వుంటుంది.
3.వారసత్వ చట్టప్రకారం కాకుండా వారసుల స్థాయిని బట్టి వారికి ఆస్తిని ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉదాహరణకి- చిన్నపిల్లల, అంగవైకల్యం వున్న పిల్లలకి, వితంతువు అయిన కూతురికి వారి అవసరాలను బట్టి ఆస్తి వారికి చెందేట్టు రాయవచ్చు.
4.వారసులకే కాకుండా నమ్మకంగా పనిచేసిన సేవకులకి, నర్సులకి, స్నేహితులకి వీలునామా ద్వారా ఆస్తిని సంక్రమింపచేయవచ్చు.
5.ఏ ఆస్తి ఎవరికి చెందాలో స్పష్టంగా రాయడంవల్ల వారసుల మధ్యన వివాదాలు రాకుండా చూడవచ్చు.
6.వీలునామా ద్వారా అవిధేయత వున్న వ్యక్తులకి ఆస్తి చెందకుండా నిరోధించే అవకాశం వుంది.
7.రోజురోజుకీ ప్రమాదాలు పెరుగుతున్న దృష్ట్యా యుక్తవయస్సులో వున్న వ్యక్తులు కూడా వీలునామా రాయడం అవసరం.
8.ఇన్ని ప్రయోజనాల దృష్ట్యా

Tuesday, April 20, 2010

విడాకులు కోరి, ఉపసంహరించుకోవచ్చా?

విడాకులు కోరి, ఉపసంహరించుకోవచ్చా?

మంగారి రాజేందర్, April 20th, 2010

భార్యాభర్తలు విడాకుల కోసం పరస్పర ఆమోదంతో దరఖాస్తు చేసుకొని తరువాత విడాకుల కోసం ఇచ్చిన ఆమోదం ఉపసంహరించుకోవచ్చా? అనే ప్రశ్నలకి సుప్రీంకోర్టు ఓం ప్రకాశ్ వర్సెస్ శ్రీమతి సురేష్టా దేవి (జె.టి.1991(1) సుప్రీంకోర్టు 321) తెరదించింది.

సె.13 (బి) (1) ప్రకారం స్వచ్ఛందంగా పరస్పర ఆమోదంతో విడాకులకి అంగీకారం తెలిపినప్పటికీ కోర్టు డిక్రీ మంజూరు చేయకముందు ఎప్పుడైనా దంపతుల్లోని ఎవరైనా విడాకుల కోసం ఇచ్చిన అంగీకారాన్ని ఉపసంహరించుకోవచ్చు. దరఖాస్తులోని విషయాల గురించి కోర్టు సంతృప్తి చెందేముందు అంగీకారం విషయంలో పునరాలోచించుకోవడానికి కోర్టు దంపతులకి ఒక అవకాశం ఇవ్వమని, దంపతులు అంగీకారాన్ని డిక్రీ జారీ చేయకముందు ఉపసంహరించుకోవచ్చని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు కె.జె.షెట్టీ, జస్టిస్ ఎస్.సి.అగర్వాల్‌లు అభిప్రాయపడినారు.

కేసు విషయంలోకి వస్తే- సురేష్టాదేవి వివాహం ఓంప్రకాశ్‌తో నవంబర్ 1968లో జరిగింది. ఆరేడు నెలల వరకి వాళ్ళు కలిసి జీవించారు. తరువాత వాళ్ళిద్దరూ కలిసి జీవించలేదు. డిసెంబరు 1984 నుంచి జనవరి 1985 మధ్య కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇద్దరూ కలిసి జీవించారు. కానీ భార్యాభర్తల మాదిరిగా వాళ్ళు జీవించలేదు. ఆ తరువాత జనవరి 8, 1985న ఇద్దరూ కలిసి హమీద్‌పూర్ వెళ్ళారు. కొద్దిసేపు న్యాయవాదితో చర్చించి సె.13 (బి) ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తుని కోర్టులో దాఖలు చేశారు. వాళ్ళిద్దరి స్టేట్‌మెంట్లని కోర్టు నమోదు చేసింది. ఇది జనవరి 8, 1985న జరిగింది. తరువాత జనవరి 15, 1985న తన ఆమోదాన్ని ఉపసంహరించుకుంటూ ఆమె కోర్టులో దరఖాస్తుని దాఖలు చేసింది. తన మీద ఒత్తిడి తెచ్చి, బలవంతం చేసి తన ఆమోదాన్ని పొందినారని ఆమె కోర్టు ముందు దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొంది. జిల్లా కోర్టు ఆ దరఖాస్తుని కొట్టివేసింది.
దీనిపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో అప్పీలుని దాఖలు చేశారు. హైకోర్టు జిల్లా కోర్టు ఉత్తర్వుని కొట్టివేస్తూ విడాకులని మంజూరు చేసింది. ఒకసారి ఆమోదాన్ని తెలిపి ఏకపక్షంగా ఆమోదాన్ని ఉపంహరించుకోవడానికి వీల్లేదని, ఆ విధంగా ఉపసంహరించకున్నా కోర్టు అధికార పరిధి పోదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. స్వచ్ఛందంగా ఆమోదం తెలిపినారా లేదానన్నది మాత్రమే కోర్టు చూడాల్సిన అంశం. ఈ కేసులో భార్య తన ఆమోదాన్ని ఎలాంటి ఒత్తిడి, బెదిరింపులు లేకుండా ఇచ్చింది. అందుకని ఆ ఆమోదానికి ఆమె బద్ధురాలై వుండాలని కోర్టు అభిప్రాయపడింది. విడాకుల డిక్రీని మంజూరు చేసింది.
ఈ విడాకుల డిక్రీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలును దాఖలు చేశారు. సె.13 బి ప్రకారం దరఖాస్తు దాఖలు కాగానే కోర్టు విడాకులని మంజూరు చేయాలని ఈ నిబంధన ఉద్దేశ్యం కాదు. దరఖాస్తు దాఖలు చేసిన తరువాత 6 నెలల నుంచి 18 నెలల వరకి వేచి వుండే వ్యవధిని ఏర్పరిచారు. దీని ఉద్దేశ్యం విడాకుల గురించి దంపతులు పునరాలోచించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడం. బంధువులు, స్నేహితుల సలహాలవల్ల అభిప్రాయాలని మార్చుకోవడానికి ఈ వ్యవధి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ సంధికాలంలో విడాకుల గురించి రెండవసారి ఆలోచించుకోవడానికి అవకాశం కల్పించడం ఈ నిబంధన ఉద్దేశ్యం. ఆ తరువాత నిర్ణయం తీసుకుని కేసు గురించి ముందుకు వెళ్ళడమా? వద్దా? అన్న నిర్ణయం తీసుకోవడానికి ఉద్దేశించి ఏర్పరచిన నిబంధన. అందుకని సె.13బి (2) ప్రకారం దంపతుల్లో ఎవరైనా పార్టీ కానప్పుడు విడాకులు మంజూరు చేయడానికి అవకాశం లేదు.

గడువు అనేది ఇరువురు పార్టీలు సమష్టిగా తిరిగి ఆలోచించుకోవడానికే కాదు ఇద్దరిలో ఎవరికైనా తిరిగి ఆలోచించుకోవడానికి అవకాశం కల్పించడం. ఎవరైనా మనస్సు మార్చుకొని ఆమోదాన్ని ఉపసంహరించుకునే అవకాశం కల్పించడం నిబంధన ఉద్దేశ్యం. మరోవిధంగా చెప్పాలంటే ఇద్దరిలో ఎవరైనా ఆమోదాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇద్దరూ కలిసి ఉపసంహరించుకోవడం అరుదైన విషయం. తొందరపాటులో విడాకులకి ఆమోదం తెలిపే వాళ్ళు తిరిగి ఆలోచించుకునే అవకాశం నిబంధన కల్పిస్తుంది. ఆమోదాన్ని ఉపసంహరించుకోవడం ఎవరైనా ఒక్కరు చేయవచ్చు. దంపతులు ఇద్దరూ కలిసి చేయవచ్చు. ఇదే ఓంప్రకాశ్ తీర్పులోని సారాంశం.

Friday, April 16, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు

పరస్పర ఆమోదంతో విడాకులు
April 13th, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందవచ్చు. సె.13 (బి) హిందూ వివాహ చట్టం ప్రకారం ఈ విడాకులు హిందువులు పొందే అవకాశం ఉంది. ఈ నిబంధన ప్రకారం విడాకులు మంజూరు చేయాలంటే కింది అంశాల గురించి కోర్టు సంతృప్తి చెందాల్సి వుంటుంది.

1. ఒక ఏడాది నుంచి, అంతకుమించిగానీ దంపతులు వేరుగా నివసిస్తుండాలి.
2. వాళ్ళిద్దరూ కలిసి నివసించలేని పరిస్థితులు వుండాలి.
3. వివాహం రద్దుకావాలని ఇద్దరూ పరస్పర ఆమోదంతో కోరుకొని ఉండాలి.

ఈ అంశాలు వున్నపుడు సె.13 (బి) ప్రకారం విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దంపతులు ఏవైనా తొందరపాటు వల్ల పిటిషన్ దాఖలు చేశారన్న విషయం తెలుసుకోవడానికి ఆరు మాసాల కాలవ్యవధిని ఏర్పాటు చేశారు. ఈ దరఖాస్తు దాఖలు చేసిన ఆరు మాసాల వరకు విడాకులు మంజూరు చేయడానికి వీల్లేదు. ఆరు నెలల కాలంలో పిటిషన్ ఉపసంహరించుకోవచ్చు. దరఖాస్తు దాఖలైన 6 నెలల తరువాత, 18 నెలల లోపు పిటిషన్ ఉపసంహరణ కానప్పుడు కోర్టు వివాహాన్ని రద్దుచేసి విడాకులు మంజూరు చేయవచ్చు. మంజూరు చేసేముందు పిటిషన్‌లోని విషయాలను గురించి అవసరమైన విచారణ జరిపి దంపతుల వాదనలు విన్న తరువాత వారి వివాహం జరిగిందన్న విషయం ఇంకా పిటిషన్‌లోని ఇతర విషయాలు నిజమైనవని కోర్టు సంతృప్తి చెందాల్సి వుంటుంది.

ఒకసారి ఆమోదం తెలిపి
తరువాత తిరస్కరించవచ్చా?

ఇద్దరూ కలిసి పరస్పర ఆమోదంతో విడాకుల కోసం సె.13 (బి) ప్రకారం దరఖాస్తు చేసుకొని తరువాత దంపతుల్లో ఎవరైనా ఏకపక్షంగా దరఖాస్తుని ఉపసంహరించుకోవచ్చా? అప్పుడు పరిస్థితి ఏమిటీ? ఈ విషయం గురించి భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఆ విధంగా ఉపసంహరించు కోవడానికి వీల్లేదని కొన్ని హైకోర్టులు, ఉపసంహరించు కోవచ్చని మరికొన్ని హైకోర్టులు తీర్పులని ప్రకటించాయి. చివరికి ఓంప్రకాష్ వర్సెస్ శ్రీమతి సురేష్టాదేవి (జె.టి.1991 (1) సుప్రీంకోర్టు 321 కేసులో ఈ సందేహాలకి తెరదించింది.
చంద్రకాంత వర్సెస్ హన్సకుమార్ (1988) 2 హెచ్‌ఎల్‌ఆర్ 173(్ఢల్లీ); ఎఐఆర్ 1989 ఢిల్లీ 73 కేసులో ఢిల్లీ హైకోర్టు ఒకసారి పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి ఆమోదం తెలిపి తరువాత ఏకపక్షంగా ఆమోదాన్ని ఉపసంహరించుకోవడానికి వీల్లేదని అభిప్రాయపడింది. ఒకవేళ ఆ ఆమోదాన్ని మోసంవల్ల ఒత్తిడివల్ల, అనుచిత ప్రభావం వల్ల పొందినప్పుడు, అది రుజువైనప్పుడు మాత్రమే ఆమోదాన్ని ఉపసంహరించుకోవచ్చని అభిప్రాయపడింది.
జయశ్రీ రమేష్ లొంగే వర్సెస్ రమేష్ చికాజీ లోంగే ఎ.ఐ.ఆర్ 1984 బొంబాయి 302, కేసులో దంపతులిద్దరూ పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి సె.13 (బి) ప్రకారం దరఖాస్తుని దాఖలు చేసుకున్నారు. తరువాత సబ్ సెక్షన్ 13 బి (12) ప్రకారం కోర్టు విచారిస్తున్నప్పుడు భర్త తన ఆమోదాన్ని ఉపసంహరించుకున్నాడు. కానీ భార్యనుంచి వేరుగా నివశిస్తున్నాడు. కానీ భార్య విడాకులు కావాలని కోరింది. ఈ పరిస్థితుల్లో విడాకులని మంజూరు చేయలేమని కోర్టు భావిస్తూ కేసుని కొట్టివేసింది. భార్య బొంబాయి హైకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది. విడాకుల కోసం సమ్మతి తెలిపే కీలకమైన సమయం దరఖాస్తుని దాఖలు చేసినప్పుడు మాత్రమే. అప్పుడు ఇచ్చిన సమ్మతి స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇస్తే దాన్ని తరువాత ఉపసంహరించుకోవడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవచ్చన్న ఉద్దేశానికే ఆటంకం కలుగుతుందని, అందుకని వివాహాన్ని రద్దుచేసి విడాకులని మంజూరు చేయాలని బాంబే హైకోర్టు తన తీర్పుని ప్రకటించింది.

ఈ తీర్పు ద్వారా రెండు ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

* సె.13 బి (2) ప్రకారం పూర్తి సమ్మతి చివరిదాకా వుండాలా? లేక
* దరఖాస్తు దాఖలుచేసే సమయానికి (సె.13 (బి) (1) సమ్మతి అంటే సగం వరకు ఉంటే సరిపోతుందా?
ఈ విషయంలో కోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది.

‘‘దరఖాస్తు దాఖలు చేసే సమయంలో ఇచ్చిన సమ్మతి కీలకమైనది. భర్త దరఖాస్తు దాఖలుచేసే సమయంలో అంటే సె.13 (బి) (1) ప్రకారం సమ్మతిని స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇచ్చాడు. అప్పుడు సరైన సమ్మతి లేకుంటే దరఖాస్తుని తిరస్కరించవచ్చు. కానీ ఆ తరువాత ఉపసంహరించుకోవడానికి వీల్లేదు. సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని ఆర్డర్ 23 (5) రూల్, ప్రకారం ఆ విధంగా లేదు.
ఇద్దరూ కలిసి ఉపసంహరించుకోవాలా?
సె.13 బి (2) ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకుల దరఖాస్తు దాఖలు చేసుకొని 6 నెలల కాలం నుంచి 18 నెలల కాలంలో దరఖాస్తుని ఉపసంహరించుకోవచ్చు. ఈ ఉపసంహరణ దంపతుల్లో ఎవరైనా చేసుకోవచ్చా? ఇద్దరూ కలిసి చేసుకోవాల్సి వుంటుందా?
నాచత్తార్ సింగ్ వర్సెస్ హరిచరన్ కౌర్ (ఏఐఆర్ 1986 పంజాబ్ అండ్ హర్యానా 201) కేసులో దంపతులిద్దరూ కలిసి సె.13 బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేసుకున్నారు. కానీ ఆ తరువాత భార్య విడాకులకి ఇష్టం చూపలేదు. కేసుని విచారించిన కోర్టు కేసుని కొట్టివేసింది. భర్త దీనిపై హైకోర్టుకి అప్పీలు చేసుకున్నాడు. హైకోర్టు అతని అప్పీలుని ఆమోదించి, ఈ విధంగా అభిప్రాయపడింది.

‘‘ఒక పార్టీ ఆమోదాన్ని ఉపసంహరించుకునే అవకాశాన్ని చట్టం కల్పించలేదు. ఇద్దరూ కలసి ఉపసంహరిచుకుంటే దరఖాస్తుని కోర్టు కొట్టివేస్తుంది. ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా సె.13బి (1) ప్రకారం దాఖలుచేసి, ఆ నిబంధనలోని షరతులని సంతృప్తి పరిచినపుడు తరువాత ఒక పార్టీ ఉపసంహరించుకోడానికి వీల్లేదు
పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవడానికి సమ్మతి ఇచ్చే కీలక సమయం దరఖాస్తుని దాఖలుచేసే సమయం. ఆ తరువాత కాదని ఈ తీర్పుల సారాంశం. ఈ విషయంలో సుప్రీంక్టో ఓంప్రకాష్ కేసులో ఏం చెప్పిందో వచ్చేవారం చూద్దాం. *

*

Thursday, April 8, 2010

దత్తత - సంరక్షణ - సంరక్షకుని అధికారాలు


April 6th, 2010

మైనర్ పిల్లవాడిని దత్తత ఇచ్చిన వెంటనే వారి తల్లిదండ్రులు సహజ సంరక్షకత్వాన్ని పోగొట్టుకుంటారు. అదేవిధంగా దత్తత తండ్రికి ఆ తరువాత దత్తత తల్లికి సహజ సంరక్షకత్వం లభిస్తుంది. సె.6 ప్రకారం వున్న నిబంధనలే వీళ్ళకి వర్తిస్తాయి. దత్తత తల్లిదండ్రులు చనిపోయిన సందర్భాలలో సహజ తల్లిదండ్రులకి సహజ సంరక్షణ హోదా లభించదు. గార్డియన్ అండ్ వార్డ్స్ చట్ట ప్రకారం సంరక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నిబంధన దత్తత తీసుకున్న మైనర్ బాలికల విషయాలలో వౌనంగా ఉంది. మైనర్ బాలిక విషయంలో సహజ సంరక్షకులు ఎవరన్న విషయంలో సందేహం వస్తుంది. హిందూ మైనారిటీ గార్డియన్ షిప్ చట్టం, 1956కి రాష్టప్రతి ఆమోదముద్ర 25 ఆగస్టు 1956 రోజున లభించింది. ఆ తరువాత 21 డిసెంబర్ 1956 రోజున హిందూ దత్తత మనోవర్తి చట్టానికి రాష్టప్రతి ఆమోదముద్ర లభించింది. హిందూ మైనారిటీ గార్డియన్ షిప్ చట్టం ముందుగా అమల్లోకి వచ్చింది కాబట్టి మైనర్ బాలికల విషయంలో సైలెంట్‌గా ఉందని అనుకోవచ్చు.
అయితే ఆ తరువాత కూడా సవరణ ఎందుకు తీసుకుని రాలేదన్నది అర్ధంకాని విషయం.
హిందూ దత్తత మనోవర్తి చట్టంలోని సె.12 ప్రకారం దత్తత తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులనే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ చట్టంలోని సె.6 ప్రకారం ‘తండ్రి, తల్లి’ అంటే దత్తత తండ్రి, దత్తత తల్లి అని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
సహజ సంరక్షకుడు, మైనరుకు ఆస్తికి లాభం చేకూరే పనులే చేయాలి. అందుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు సంరక్షకుడు చేయవచ్చును.
మైనరు ఆస్తిని అమ్మడానికి, తనఖా పెట్టడానికి, దానమీయడానికి కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలం కౌళ్ళకి ఆస్తిని ఇవ్వడానికి వీల్లేదు. మైనరుకు లాభం చేకూరుతుందని కోర్టు భావించినపుడే కోర్టు అనుమతిని ఇవ్వాల్సి ఉంటుంది.
సహజ సంరక్షకుని అధికారాలు
--------------------------------
సహజ సంరక్షకునికి వుండే అధికారాలకి ఈ చట్టం ద్వారా గుర్తింపు వచ్చింది. అయితే చట్టం ఈ అధికారాలకి రెండు పరిమితులని విధించింది.
అవి-
--
* తన వ్యక్తిగత ఒప్పందాలకి మైనర్‌ని బాధ్యున్ని చేయడానికి వీల్లేదు.
* అదేవిధంగా కోర్టు అనుమతి లేకుండా మైనర్ ఆస్తిని బదిలీ చేయడానికి వీల్లేదు. కౌలుని కూడా మైనర్‌కి మెజారిటీ వచ్చిన సంవత్సరం కాలపరిమితికి మించడానికి వీల్లేదు.
అయితే ఈ పరిమితులు మైనర్ ఆస్తి వేరుగా ఉన్నపుడే వర్తిస్తాయి. ఉమ్మడి ఆస్తి అయినపుడు ఇవి వర్తించవు.
పద్ధతి
----
కోర్టు అనుమతి తీసుకోవడానికి గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టంలోని సె.31(2) నుంచి 31(4) వరకు వున్న నిబంధనలు వర్తిస్తాయి.
పాత హిందూ లాకి సంబంధించి రెండు ప్రధానమైన మార్పులు కన్పిస్తాయి. అవి-
1.కొన్ని పరిస్థితులలో తల్లి కూడా వీలునామా ద్వారా సంరక్షులని నియమించే అధికారం
2.వీలునామా ద్వారా తండ్రి నియమించిన సంరక్షకుడికి అతను అతని భార్య కన్నా ముందే చనిపోతే ఎలాంటి విలువ లేకుండా పోవడం ఇవి రెండూ కాకుండా మరో ముఖ్యమైన అంశం కూడా ఈ చట్టంలో చోటుచేసుకుంది. అక్రమ మైనర్ సంతానం విషయంలో వీలునామా ద్వారా సంరక్షకుడిని నియమించే అధికారం తండ్రికి లేకపోవడం, తల్లికి తన అక్రమ సంతానానికి వీలునామా ద్వారా సంరక్షకుకుడిని నియామకం చేసే అధికారం సె.4 ద్వారా ఏర్పరచడం. అంటే తల్లికి రెండు సందర్భాలలో వీలునామా ద్వారా సంరక్షకులని నియమాకం చేసే అధికారం వుండటం; తల్లి సక్రమ సంతానం విషయంలో సె.9(3) 9(4)లలో పేర్కొన్నట్టు సంరక్షకుడిని ఏర్పాటుచేసే అధికారం వుండటం.
మరణానికి ముందు
----------------------
ఈ నిబంధన ప్రకారం వీలునామా ద్వారా సంరక్షకుడిని తండ్రి నియమించాలంటే అతను సహజ సంరక్షకుడు అయి వుండాలి. సహజ సంరక్షకుడిగా వ్యవహరించే విధంగా తండ్రి వుండాలి. వీలునామా అనేది మరణం తరువాత అమల్లోకి వస్తుంది. అందుకని మరణానికి ముందు తండ్రి హిందువై వుండాలి. వేరే మతాన్ని స్వీకరించడం ద్వారా, సన్యాసం పుచ్చుకోవడం ద్వారా అతను సహజ సంరక్షకుడి హోదాని పొగొట్టుకోవద్దు.
తండ్రి మరణించిన తరువాత తల్లి బ్రతికి వుంటే
------------------------------------------------
తండ్రి వీలునామా ద్వారా తన మైనరు పిల్లలకి సంరక్షకుడిని నియమించినప్పటికీ తల్లి బతికి వుంటే దీనికి విలువ వుండదు. అప్పుడు తల్లి సహజ సంరక్షకురాలు అవుతుంది. ఆమె వీలునామా ద్వారా మైనర్ పిల్లలకి సంరక్షకులని నియమించవచ్చు. ఆ వ్యక్తి ఆమె మరణం తరువాత ఆ మైనర్ పిల్లలకి వాళ్ళ ఆస్తులకి సంరక్షకులు అవుతాడు. అయితే తల్లి కూడా మరణానికి ముందు సహజ సంరక్షకురాలుగా వుండి వుండాలి. అదేవిధంగా తల్లి ఎలాంటి సంరక్షకులని తన వీలునామా ద్వారా నియమించకుండా చనిపోయినపుడు తండ్రి వీలునామా ద్వారా నియమించిన సంరక్షకుడు ఆ మైనర్ పిల్లలకి సంరక్షకుడు అవుతాడు

Followers