Thursday, November 5, 2009

విద్యాహక్కు అమలవుతుందా ?

మంచి పౌరుడుగా ఉండడానికి, దేశం అభివృద్ధి చెందడానికి విద్య అవసరం. చదువురాని వాళ్ళలో గొప్పవాళ్ళు ఉండవచ్చు. కానీ చదువు ఉంటే గొప్పదనం ఇంకా ప్రకాశిస్తుంది. విద్యాహక్కుఅనేది మానవ హక్కు. ఈ ఆధునిక సమయంలో మనిషి మనిషిగా బతకాలంటే విద్య అవసరం. ననిషి మనిషిగా బతకడానికి అవసరమైన హక్కులన్నీ మానవహక్కులే. విద్యాహక్కు అనేది మానవ హక్కే కాదు, మౌలికమైన హక్కు. మానవ హక్కుల గురించిన యూరోపియన్‌ ఒప్పందంలోని ఆర్టికల్‌ 2లో ఈ హక్కును గుర్తించారు. మన దేశం ఆ ఒప్పందంపై సంతకం చేసింది.

మన రాజ్యాంగాన్ని తయారు చేసిన రోజుల్లో విద్యాహక్కు ప్రాధాన్యతను గుర్తించారు. అయితే దానిని ప్రాథమిక హక్కు ల్లో చేర్చలేదు. ఆదేశిక సూత్రాల్లో చేర్చారు. రాజ్యాంగంలోని అధికరణ 45 ప్రకారం- ఆరు సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యేవరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణ, విద్యా వసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. బాల బాలికలకు నిర్బంధ విద్యను రాజ్యం అందించాలి. ఒక దశాబ్ద కాలం లో ఈ లక్ష్యాన్ని రాజ్యం సాధించాలి. ఈ ఒక్క అధికరణకే కాలపరిమితిని నిర్దేశించారు. మిగతా అధికరణాలకు ఇలాంటి కాలపరిమితి లేదు. అంటే మన రాజ్యాంగ నిర్మాతలు, ఆ తరువాత పార్లమెంటు విద్య అందించే విషయంలో అత్యంత ప్రాముఖ్యాన్ని ఇచ్చాయి. 46వ అధికరణ ప్రకారం విద్యావకాశాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. కానీ ఆ విధంగా జరగలేదు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉచిత నిర్బంధ విద్య అందే పరిస్థితి ఏర్పడలేదు.

రాజ్యాంగం అభయం ఇచ్చిన జీవించే హక్కును చట్టపరమైన పద్ధతుల ప్రకారం తప్ప వేరే రకంగా ఆశించే అవకాశం లేదు. జీవించే హక్కు అంటే గౌరవంగా జీవించే హక్కు అని సుప్రీంకోర్టు మేనకా గాంధి కేసులో ప్రకటించింది. గౌరవంగా జీవించాలంటే విద్య ఉండాలి. అందుకని విద్యాహక్కు అనేది జీవించే హక్కులో మిళితమై ఉందని సుప్రీంకోర్టు మోహిని గిరి కేసులో ప్రకటించింది. ఒక వ్యక్తి గౌరవంగా జీవించాలంటే ఆ వ్యక్తికి విద్య అత్యంత అవసరం. ఆర్టికల్‌ 21కి మోహిని జైన్‌ కేసులో ఇచ్చిన నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ఉన్ని క్రిష్ణన్‌ కేసులో మరింత విస్తృత పరచింది. విద్యాహక్కు అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించాలని, ఆ హక్కును అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలని కూడా సూచించింది.

2002 సంవత్సరంలో ప్రభుత్వం ఉన్ని క్రిష్ణన్‌ కేసు తీర్పుపై స్పందించింది. ఆ ఫలితమే రాజ్యాంగానికి వచ్చిన 86వ సవరణ. మొట్టమొదటి సారిగా రాజ్యాంగంలో కొత్త అధికరణ ప్రవేశించింది. అదే ఆర్టికల్‌ 21.ఎ. ఈ అధికరణం ప్రకారం- 6 సంవత్సరాలనుంచి 14 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న బాలలకు రాజ్యం విధిగా ఉచిత నిర్బంధ విద్యను ప్రసాదించాలి.

సుప్రీంకోర్టు ఉన్ని క్రిష్టన్‌ తీర్పు ప్రకటించిన తొమ్మిది సంవత్సరాల తరువాత ఆర్టికల్‌ 21.ఎ వచ్చింది. ఆ తరువాత ‘విద్యాచట్టం- 2008’ అమలులోకి వచ్చింది. ఈ కొత్తచట్టం ద్వారా నిర్బంధ ప్రాథమిక విద్యను అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై, స్థానిక ప్రభుత్వాలపై ఉంది. ఉచితంగా విద్యను అందించే బాధ్యత రెండు పైభుత్వాలపై సె.8, సె.9 ప్రకారం ఉంది. అందువల్ల చట్టం ఉద్దేశ్యం, ఆర్టికల్‌ 21.ఎ లక్ష్యం దెబ్బతింటాయనిపిస్తుంది. ఏదైనా ప్రాంతంలో ఏ ప్రభుత్వమైనా నిర్బంధ ఉచిత వ్యిను అందించనప్పుడు ఎవరిని బాధ్యులను చేయాలో తెలియని పరిస్థితి. స్థానిక ప్రభుత్వాలకు నిధుల కొరత ఉంటుంది.అటువంటప్పుడు అవి ఈ బాధ్యతను నిర్వర్తించే పరిస్థితి ఉంటుందా?

ఈ చట్టంలో ఒక ముఖ్యమైన నిబంధనను ఏర్పరచారు. అదే సె.13. ఈ నిబంధన ప్రకారం ఏ స్కూలు కూడా పిల్లలకు అడ్మిషన్‌ ఇస్తున్నపుడు కాపిటీషన్‌ ఫీజును వసూలు చేయకూడదు. అదే విధంగా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఎటువంటి స్క్రీనింగ్‌ టెస్టులను నిర్వహిచకూడదు. ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా కాపిటేషన్‌ ఫీజును వసూలు చేస్తే వారికి జరిమానా విధించే అవకాశం ఉంది. వాళ్ళు వసూలు చేసిన కాపిటేషన్‌ ఫీజుకు పది రెట్లు జరిమానా విధించే అవకాశాన్ని ఈ నిబంధన కల్పిస్తుంది. ఈ నిబంధనకు విరుద్ధంగా ఏవైనా విద్యాసంస్థలు స్క్రీనింగ్‌ టెస్టులను నిర్వహిస్తే మొదటిసారి రూ.25,000 వరకూ, రెండవ సందర్భంలో రూ. 50,000 వరకూ జరిమానా విధించే అవకాశం ఉంది.

విద్య, వైద్యం రెండూ ప్రభుత్వ పరిధినుంచి దాటిపోయాయి. ఇప్పుడు అవి కార్పొరేట్‌ రంగంలో వర్ధిల్లుతున్నాయి. ప్రతి పౌరుడికి అవసరమైన ఈ రెండు వ్యవస్థలూ ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో లేవు. ఇటువంటి పరిస్థితులలో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను ప్రభుత్వాలు అందించడం సాధ్య మేనా? కాపిటేషన్‌ ఫీజు వసూలు చేయడం అనేది ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల్లో ఉంది. కార్పొరేట్‌ స్కూళ్ళలో అది మరో రకంగా ఉంది. బిల్డింగ్‌ ఫండ్‌, క్యాంపస్‌ అభివృద్ధి అం టూ రకరకాలుగా అవి వసూళ్ళు చేస్తాయి.

ఈ పరిస్థితులలో ఆ విద్యాసంస్థలు తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లల ను చేర్చుకునే అవకాశం ఉందా? ప్రభుత్వాలు పిల్లలను ఈ స్కూళ్ళలో చేర్పించి ఫీజులు చెల్లిస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చట్టంలో లేవు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని మూడవ పార్టులో రాసి ఉన్నంత మాత్రాన సరిపోదు. వాటిని ప్రజలు అనుభవించే విధంగా ఉండాలి. విద్యాచట్టం తెచ్చామని సంతోషపడడం కాదు. అది అమలు అయ్యే విధంగా నిబంధనలు రూపొందించాలి. అలా లేనప్పుడు ఆ చట్టానికి ఎంత మాత్రం విలువ ఉంటుంది?

Followers