Friday, January 28, 2011

గుట్టుచప్పుడు కాకుండా తెరపైకి వచ్చిన ‘అరెస్టు’ చట్టం

బెయిలు లేదిక అంతా బయలే!
గుట్టుచప్పుడు కాకుండా తెరపైకి వచ్చిన ‘అరెస్టు’ చట్టం
విశ్లేషణ...29-1-2011 saakshi

ఈ చట్టంతో అక్రమ అరెస్టులను నిరోధించగలిగినప్పటికీ, డబ్బున్న వ్యక్తులు అరెస్టు పరిధి నుంచి తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మోసం, నమ్మకద్రోహం, దొంగతనాలు లాంటి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు, ఈ నిబంధన లను ఆసరా చేసుకుని జైలుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిబంధన వల్ల సమాజానికి మేలు ఎంతో కీడూ అంతే.

వ్యక్తి స్వేచ్ఛతో ముడిపడ్డ ‘అరెస్టు’కి సంబంధించిన ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సవరణల) చట్టం-2010’ గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ తెరపైకి రావడం వివాదంగా మారుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కొన్ని సవరణలను ప్రతిపాదిస్తూ ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సవరణల) చట్టం-2008’ని రూపొందించింది. అయితే, దేశ వ్యాప్తంగా న్యాయవాదులు, మేధావుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు ప్రధానంగా 5, 6 (అరెస్టుకి సంబంధించినవి), 21 (బి) తప్ప మిగిలినవి అమల్లోకి వచ్చేవిధంగా ప్రకటన జారీ చేసింది. అరెస్టు నిబంధనలు మినహా ఆ చట్టం 2009 డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చింది. ఆ తరువాత వివిధ వర్గాలతో చర్చలు జరిపి అరెస్టుకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-2010’ రూపంలో ఆ సవరణలను చట్టంగా తీసుకొచ్చింది. ఈ సవరణలతో కూడిన కొత్త చట్టం 2010 నవంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2010 నవంబర్ 1న ఎస్.ఓ.నెం.2689(ఇ)ను జారీ చేస్తూ, భారత గెజిట్‌లో ప్రచురించింది. ఎంతో వివాదాస్పదమైన అరెస్టుకు సంబంధించిన ఈ సవరణలు అమల్లోకి వచ్చాయి కానీ, వాటి గురించి ప్రజలకి తెలియజేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిం చలేదు. ఎలాంటి అలికిడీ లేకుండా ఇవి అమల్లోకొచ్చాయి. గతంలో అన్ని వర్గాల వారు వ్యతిరేకించిన సవరణలు, నేడు ప్రజలకి, న్యాయవ్యవస్థకి ఏ మేరకు మేలు చేస్తాయన్న విషయాన్ని చర్చించవలసిన అవసరం ఉంది.

న్యాయశాస్త్ర పరిభాషలో ప్రతి నిర్బంధం అరెస్టు కాదు. వ్యక్తి స్వేచ్ఛ పూర్తిగా కోల్పోయే విధంగా చేయడం అరెస్టు అవుతుంది. కాగ్నిజబుల్ నేరం చేసిన వ్యక్తులను పోలీసులు ఎలాంటి వారంట్ లేకుండా అరెస్టు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నేరానికి సంబంధించి ఎవరిపైనైనా సహేతుకమైన ఫిర్యాదు అందినప్పుడు లేదా విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు పోలీసులు అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. అనుమానంపై కూడా పోలీసులు అరెస్టు చేయవచ్చు. అయితే అరెస్టుకు దారితీసే సందర్భాలను చట్టం స్పష్టంగానే నిర్దేశించింది. కేసు విచారణ సమయంలో ముద్దాయి హాజరు కాడన్న అనుమానం ఉన్నప్పుడు; హత్య, రేప్, బందిపోటు దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులతో సమాజంలో భయాందోళనలు నెలకొన్నప్పుడు అరెస్టు అవసరం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో నేరస్తుని ప్రాణాలు రక్షించడానికి కూడా అరెస్టు తప్పదు. నిందితుడు సాక్ష్యాధారాలను నాశనం చేయకుండా, సహ ముద్దాయిలకు వార్నింగ్ ఇవ్వకుండా, మళ్లీ అలాంటి నేరాలకు పాల్పడకుండా అరెస్టు అవసరమవుతుంది.

ఇన్ని జాగ్రత్తలతో కూడిన నిబంధనలు ఉన్నప్పటికీ, అరెస్టుల విషయంలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న అపవాదు తప్పలేదు. జాతీయ పోలీస్ కమిషన్ మూడవ నివేదికలో అక్రమ అరెస్టుల గురించి ఆందోళనను వెలిబుచ్చడం గమనార్హం. పోలీసులు చేస్తున్న అరెస్టుల్లో 60 శాతం అనవసరమైనవి, న్యాయబద్ధత లేనివని, వీటివల్ల జైళ్ల నిర్వహణా ఖర్చు పెరుగుతోందని కమిషన్ అభిప్రాయపడింది. లా కమిషన్, మలిమత్ కమిటీ నివేదికలు కూడా అనవసర అరెస్టుల గురించి ప్రస్తావించాయి. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు అరెస్టులు, కస్టోడియల్ హింసపై ఆందోళన వెలిబుచ్చింది.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.41కి సవరణలు తీసుకొస్తూ 2008లో చట్టాన్ని రూపొందించింది. అయితే ఆ సవరణలపై తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో, అవి అమల్లోకి రాలేదు. దేశవ్యాప్తంగా న్యాయవాదులు అరెస్టు సవరణలను వ్యతిరేకించారు. ఈ సవరణలను అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కొందరు సుప్రీంకోర్టు ముందు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం, 2008 చట్టం ద్వారా తీసుకొచ్చిన సవరణలను తప్పుగా అర్థం చేసుకుంటున్నార ంటూ హితవు పలికి, వాటిని స్వాగతించింది. దేశపౌరుల కష్టాలను, వేదనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలని వ్యతిరేకించకూడదని కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులకు సూచించింది. ఈ సవరణల మంచి చెడ్డలను చర్చిండానికి భారత ప్రభుత్వం 2009 ఆగస్టులో ఒక సమావేశాన్ని నిర్వహించి, కొన్ని నిబంధనలపై ఏకాభిప్రాయాన్ని సాధించింది. ఆ తరువాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సవరణల) చట్టం-2010ని తీసుకొచ్చింది. ఈ సవరణలు నవంబర్ 2, 2010 నుంచి అమలులోకి వచ్చాయి.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.41 సబ్‌సెక్షన్ (1)లో ఉన్న ఎ, బి సబ్ క్లాజ్‌లను తొలగించి, ఈ సవరణల ద్వారా వాటికి ప్రత్యామ్నాయాలను ఏర్పరచారు. అదేవిధంగా (బి, ఎ) అన్న క్లాజ్‌ని 41ఎ, 41బి, 41సిలుగా ఏర్పరచారు. ముందుగా తొలగించిన క్లాజ్‌ల వివరాలను పరిశీలిస్తే, సె.41 ప్రకారం వారంట్ లేకుండా పోలీసు అధికారి ఏ వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు.

ఆ సందర్భాలు-
ఎ) కాగ్నిజబుల్ నేరంతో సంబంధం ఉన్న వ్యక్తిని, లేదా ఏ వ్యక్తికి వ్యతిరేకంగానైతే సముచితమైన ఫిర్యాదు వచ్చిందో ఆ వ్యక్తిని లేదా విశ్వసనీయ సమాచారం లేదా సముచితమైన అనుమానం ఉన్నప్పుడు (వారికి కాగ్నిజబుల్ నేరంతో సంబంధం ఉందని అన్పించినప్పుడు);
బి) ఇళ్లకు కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు ఎవరైనా కలిగి ఉన్నప్పుడు (అవి కలిగి ఉండటానికి శాసన సమ్మతమైన కారణం ఉన్నదని రుజువు పరచుకునే బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుంది).

సవరణకు ముందు ఈ రెండు క్లాజుల ద్వారా పోలీసులకు ఎవరినైనా అరెస్టు చేయడానికి విశేషమైన అధికారాలు ఉండేవి. దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాస్తూ కేంద్ర హోంమంత్రి చిదంబరం- ‘ఈ నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయన్న విమర్శలు చాలా ఉన్నాయి. వాస్తవంలో అవి దుర్వినియోగం అవుతున్నాయి కూడా. ఈ రెండు క్లాజ్‌ల గురించి లా కమిషన్ 177వ నివేదికలో చర్చించింది’ అని వ్యాఖ్యానించారు.

కాగ్నిజబుల్ నేరం చేశాడన్న అనుమానం వచ్చినప్పుడు, ఆ నేరంతో సంబంధం ఉన్నప్పుడు, కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు కలిగి ఉన్నప్పుడు ఏ వ్యక్తినైనా పోలీసులు అరెస్టు చేయవచ్చు. అయితే, ఇళ్లకి కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు అంటే ఏమిటి? పనిముట్ల్లు కలిగివున్న వ్యక్తులనూ ఆ నెపం మోపి పోలీసులు అరెస్టు చేయవచ్చుకదా అన్న అనుమానం రాకతప్పదు. ఈ రెండు క్లాజ్‌ల ద్వారా పోలీసులకు అపరిమితమైన ఆధికారాలు లభించాయన్నది ప్రధాన విమర్శ. అందుకని ఈ రెండు క్లాజ్‌లను తొలగించి, కొత్త నిబంధనలతో వాటి స్థానంలో 2010 సవరణల చట్టం తీసుకొచ్చారు.

దాని ప్రకారం-
41 (1)(ఎ) పోలీసుల సమక్షంలో కాగ్నిజబుల్ నేరం చేసినప్పుడు;
(1)(బి) 7 సంవత్సరాల వరకు లేదా 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్షపడే అవకాశం ఉన్న నేరం చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా సముచితమైన ఫిర్యాదు వచ్చినప్పుడు, నేరానికి సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందినప్పుడు లేదా సహేతుకమైన అనుమానం కలిగినప్పుడు, ఈ షరతుల పట్ల సంతృప్తి చెందినప్పుడు మాత్రమే అరెస్టులు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జాగ్రత్తలూ పాటించాలి. 1) ఆ వ్యక్తి ఆ నేరం చేశాడనటానికి గట్టి ఆధారం ఉండాలి. (2) ఆ అరెస్టు, కింద పొందుపరచిన కారణాల వల్ల అవసరమని పోలీసు అధికారి సంతృప్తి చెందాలి.

అవి-
- ఆ వ్యక్తి తిరిగి అలాంటి నేరం చేయకుండా నిరోధించడానికి;
- దర్యాప్తు నిరాటంకంగా కొనసాగడానికి;
- సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండటానికి;
- సాక్షుల విషయంలో జోక్యం చేసుకోకుండా చూడటానికి;
- ఆ వ్యక్తిని అరెస్టు చేస్తే తప్ప కోర్టు ముందు హాజరుపెట్టలేమని భావించినప్పుడు.

ఈ కొత్త నిబంధనల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే- 7 సంవత్సరాల వరకు శిక్ష విధించడానికి అవకాశం ఉన్న కాగ్నిజబుల్ నేరం చేసిన వ్యక్తులను, అదేవిధంగా 7 సంవత్సరాలకి తక్కువ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉన్న వ్యక్తులను మాత్రమే పోలీసులు అరెస్టు చేయాలి. అది కూడా తగు కారణాలను నమోదు చేసిన అనంతరమే అరెస్టు చేయాలి. దీంతో భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498-ఎ (వేధించడం), 379 (దొంగతనం) వంటి కేసుల్లో అరెస్టులకు అవకాశం ఉండదు. మోసం, నమ్మక ద్రోహం వంటి కేసుల్లో కూడా అతి కష్టంగా అరెస్టు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అరెస్టు చేసినప్పుడు, అదేవిధంగా అరెస్టు చేయనప్పుడు కూడా తగు కారణాలను పోలీసులు నమోదు చేయాలి. ఈ చట్టంతో అక్రమ అరెస్టులను నిరోధించగలిగినప్పటికీ, డబ్బున్న వ్యక్తులు అరెస్టు పరిధి నుంచి తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మోసం, నమ్మకద్రోహం, దొంగతనాలు లాంటి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు, ఈ నిబంధన లను ఆసరా చేసుకుని జైలుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిబంధన వల్ల సమాజానికి మేలు ఎంత ఉందో కీడూ అంతే ఉంది.

అరెస్టు చేయకుండా పోలీసులు దర్యాప్తు ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దీన్ని అధిగమించడానికి సె.41(ఎ)ని కూడా చట్టం లో పొందుపరిచారు. సె.41(1) ప్రకారం అరెస్టు చేయనప్పుడు, ముద్దాయిలు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులో చెప్పిన ప్రకారం నేరస్తులు పోలీసు అధికారి నిర్దేశించిన ప్రదేశంలో హాజరుకావాలి. దాని ప్రకారం హాజరైతే ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి వీల్లేదు. అయితే , ఆ వ్యక్తిని కూడా యోగ్యతగల కోర్టు అనుమతి తీసుకుని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.

ఈ కొత్త నిబంధనల ద్వారా పోలీసులకు గతంలో ఉన్న విశేష అధికారాలను తొలగించి, నోటీసు ఇచ్చే అధికారాన్ని ఇచ్చారు. కానీ దాన్ని పోలీసులు ఆయుధంగా వాడుకుని నేరస్తులను వేధించే అవకాశం ఉంది. దీని నియంత్రణకి చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. అయితే నోటీసుని ఉల్లంఘించిన వ్యక్తిని అరెస్టు చేయాలంటే యోగ్యతగల కోర్టు ఉత్తర్వుల ప్రకారమే చేయాల్సి ఉంటుంది. యోగ్యత గల కోర్టు ఏదీ అన్నది స్పష్టంగా చెప్పలేదు. అది సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, నోటీసును పాటిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయాలనుకున్నప్పుడు కోర్టు అనుమతి అవసరంలేదు. అందుకు గల కారణాలను నమోదు చేస్తే సరిపోతుంది. అరెస్టు స్ఫూర్తికి ఇది విరుద్ధం. నోటీసు పేరుతో ముద్దాయిలపై పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె. 157 ప్రకారం దర్యాప్తులో చివరి దశ అరెస్టు. మొదటి దశ ప్రథమ సమాచార నివేదిక విడుదల చేయడం. నేరస్థలాన్ని సందర్శించడం రెండవ దశ. కేసుకి సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం మూడవ దశ. చివరి దశ- ముద్దాయిని అరెస్టు చేయడం. అది కూడా అవసరమైతేనే. కానీ ముద్దాయిని అరెస్టు చేయడం మొదటి దశగా మారింది. సె. 41 ఆధారంగా అక్రమ అరెస్టులు, అనవసర అరెస్టులు కొనసాగేవి. ఈ సవరణల ద్వారా పోలీసులు ఏకపక్షంగా అరెస్టు చేసే అవకాశం తగ్గవచ్చు. ఈ కొత్త నిబంధనలు పోలీసు కమిషన్, లా కమిషన్‌ల నివేదిక, డీకే బసు కేసు తీర్పు ఆధారంగా రూపొందాయి. వీటివల్ల పోలీసుల అధికారాలు పూర్తిగా పోయాయనిగానీ, విశేష అధికారాలు వచ్చాయనిగానీ కాదు.

ఈ నిబంధనల పరిణామాలు ఇలా ఉంటాయని చెప్పవచ్చు:
***పోలీసులు వారెంట్ లేకుండా ఏ వ్యక్తినైనా సులభంగా అరెస్టు చేయడానికి అవకాశం లేదు.
***7 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో తగు కారణాలు ఉన్నప్పుడే, వాటిని నమోదు చేసి అరెస్టు చేయాలి. ఈ కారణాలను రిమాండ్ చేసే ముందు మేజిస్ట్రేట్ గమనంలోకి తీసుకోవాలి.
***కాగ్నిజబుల్ నేరాలు చేసిన వ్యక్తుల హాజరుపై పోలీసులు నోటీసు జారీ చేస్తారు. దానిని పాటించనప్పుడు, కోర్టు అనుమతితో మాత్రమే అరెస్టు చేయవచ్చు. నోటీసును పాటిస్తున్నప్పటికీ తగు కారణాలను చూపి అరెస్టు చేయవచ్చు. నోటీసు పేరుతో అరెస్టుకన్నా ఎక్కువ వేధించే అధికారం పోలీసులకు న్యాయబద్ధంగానే లభిస్తుంది.
***పోలీసులకి ఉన్న అరెస్టు అధికారాన్ని ఈ నిబంధనలు పూర్తిగా తీసివేయలేదు. కాకపోతే ఆ అధికారం మీద నిఘా ఉంటుంది.

వ్యక్తి స్వేచ్ఛతో ముడిపడ్డ అంశానికి చెందిన కీలకమైన సవరణలను గుట్టుచప్పుడు కాకుండా అమలుచేయడం అంత మంచి సంప్రదాయం కాదు. ఈ సవరణల ద్వారా పోలీసులకు, ప్రజలకు మధ్యన ఉన్న దూరం తగ్గుతుందా, పెరుగుతుందా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి!

మంగారి రాజేందర్
మూడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, వరంగల్

Followers