Wednesday, September 2, 2009

సరిదిద్దడానికి వీల్లేని వివాహాల్లో విడాకులు

సరిదిద్దడానికి వీల్లేని వివాహాల్లో విడాకులు
కాలానుగుణంగా చట్టాలు మారాలి. అదే విధంగా చట్టాల గురించి వ్యాఖ్యానాలు మారాలి. మారాయి కూడా. సరిదిద్దడానికి వీల్లేని విధంగా వివాహాలు ఉన్నప్పుడు దాని ఆధారంగా విడా కులు మంజూరు చేయడం సమంజసమేనని గతంలో కోర్టులు తీర్పులు చెప్పాయి. హిందూ వివాహ చట్టంలో అది విడాకులు పొందడానికి ఒక ఆధారం కాదు. అయినా కేసులోని వాస్తవ పరిస్థితు లను బట్టి కోర్టులు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దాని ఆధారంగా విడాకులు మంజూరు చేసిన సంద ర్భాలు ఉన్నాయి. సరిదిద్దలేని విధంగా ఇద్దరు వ్యక్తుల వివాహం మారినప్పుడు ఆ వివాహాన్ని రద్దు చేసే విధంగా లేదా ఆ పరిస్థితుల్లో ఉన్న దంపతులు విడాకులు కోరే విధంగా హిందూ వివాహ చట్టం లో మార్పులు తీసుకొని రావాలని లా కమిషన్‌ కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పిం చిన నివేదికలో పేర్కొంది. సరిదిద్దడానికి వీల్లేని విధంగా దంపతుల జీవితాలు మారినప్పుడు ఆ ఆధారంగా విడాకులు మంజూరు చేయవచ్చని సుప్రీం కోర్టు గతంలో కొన్ని తీర్పులని ప్రకటించింది. అయితే ఆ తీర్పులకి భిన్నంగా మరో తీర్పుని సుప్రీంకోర్టు ఇటీవల ప్రకటించింది. అదే విష్ణుదత్త శర్మ వర్సెస్‌ మంజుశర్మ కేసు.

హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహ తప్పులు దంపతుల్లో ఎవరైనా చేస్తే మరొకరు దాని ఆధారంగా విడాకులు తీసుకునే అవకాశం ఉంది. ఇదే ‘తప్పిదం ఆధారంగా’ విడాకులు పొందే పద్ధతి. చట్టంలో ఇలాంటి ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలోనే విడాకులు మంజూరు చెయ్యాలా? లేక సరిదిద్దడానికి వీల్లేని విధంగా కోరే అవకాశం ఉందా? ఈ విషయం గురించి చర్చ కొనసాగుతూనే ఉంది. హిందూ వివాహ చట్ట ప్రకారం వివాహాలు పవిత్రమైనవి. ఈ చట్టప్రకారం భార్య భర్తలను తిరిగి కలపడానికే ప్రయత్నం చెయ్యాలి తప్ప వారిని విడదీయడానికి, వాళ్ళకి విడాకులు మంజూరు చేయ డానికి ప్రయత్నం చేయకూడదు. అందుకనే కోర్టు దంపతులిద్దరిని కలిపే ప్రయత్నం చేసి విఫల మైనప్పుడే కేసుని విచారిస్తుంది. ఆ తరువాతనే విడాకులని మంజూరు చేస్తాయి. అయితే సరిదిద్దడానికి వీల్లేని విధంగా వివాహాలు మారినప్పుడు, సుప్రీంకోర్టు దాని ఆధారంగా కూడా విడాకులని మంజూరు చేసింది. భార్య భర్తల మధ్య వివాహం అన్న భావన చనిపోయినప్పుడు తప్పు ఎవరిది ఉన్నప్పటికీ విడా కులు మంజూరు చేస్తుంది.

భార్య పట్ల భర్త క్రూరంగా వ్యవహరించి ఆమెను హింసించి దాని ఆధారంగా విడాకులు కోరడానికి అవకాశం లేదు. కానీ అలాంటి సందర్భంలో భార్య విడాకులు కోరవచ్చు. వివాహ తప్పు చేసిన వ్యక్తులకి వ్యతిరేకంగా దంపతుల్లోని మరొకరు విడాకులు కోరే అవకాశం ఉంది. భర్తలు వైవాహికేతర సంబంధాలు పెట్టుకున్నప్పుడు సాధారణంగా భార్యలు భర్తలకి దూరంగా ఉంటారు. కానీ విడాకులని కాంక్షించరు. ఇలా సంవత్సరాలు గడిచినప్పుడు వారిద్దరి మధ్య సరిదిద్దడానికి వీల్లేని విధంగా వారి వివా హం మారి పోతుంది. ఇలాంటి సందర్భాలను గమనించి సుప్రీంకోర్టు విష్ణుశర్మ కేసులో ఈ విషయాన్ని పునఃపరిశీలన చేసింది. దీని ఆధారంగా విడాకులు మంజూరు చేయడం వల్ల ఎక్కువగా స్ర్తీలే నష్టపోయే అవకాశం ఏర్పడుతుందని సుప్రీంకోర్టు భావించింది.

విష్ణుశర్మకి మంజుకి 26 పిబ్రవరి 1993లో వివాహం జరిగింది. డిసెంబర్‌ 1993లో ఓ కూతురుకి జన్మనిచ్చింది. ఆ తరువాత కొంత కాలానికి విష్ణుదత్త శర్మ విడాకుల కోసం దరఖాస్తుని దాఖలు చేశాడు. వివాహమైన కొద్ది రోజులకే ఆమె తన ఇంటి నుంచి తల్లి గారింటికి వెళ్లిపోయిందని, ఆమె తండ్రి సబ్‌ ఇన స్పెక్టర్‌ కాబట్టి తనను తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. మంజు తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. సెప్టెంబర్‌ 14, 1994 రోజున తనని భర్త, అత ని కుటుంబ సభ్యులు విపరీతంగా కొట్టినారని తన జవాబులో పేర్కొంది. తనని కొట్టి సజీవంగా దహనం చేయడానికి ప్రయత్నించారని కూడా పేర్కొంది. ఈ దరఖాస్తును విచారించిన కోర్టు భర్త, అతని బంధు వులు మంజు పట్ల క్రూరంగా వ్యవహరించినారని తన తీర్పులో పేర్కొంది. అతని విడాకుల దరఖాస్తుని కొట్టి వేసింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలుని ధాఖలు చేశాడు.

హైకోర్టు కూడా అతని అప్పీలుని కొట్టి వేసింది. భర్త వివాహ తప్పిదాలు చేసి తమ మధ్య వివాహం సరిదిద్దలేని విధంగా మారి పోయిందని విడాకులు కోరినా ఆ విధంగా ఇవ్వడం సరైంది కాదని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. తమ మధ్య సరిదిద్దలేని విధంగా వివా హం అయ్యిందని అందుకని విడాకులు మంజూరు చేయాలని వాదనలు చేశాడు. సుప్రీంకోర్టు ఈ వాద నలతో ఏకీభవించలేదు. హిందూ వివాహచట్టంలోని సె.13 ప్రకారం విడాకులు పొందడానికి ఎన్నో ఆధా రాలు ఉన్నాయి. కానీ సరిదిద్దడానికి వీల్లేని విధంగా వివాహం మారిందన్న కార ణంగా విడాకులు కోరే ఆధారం లేదని, అలాంటి ఆధారాన్ని కోర్టు చట్టంలో చేర్చజాలదని, అలా చేయడం అంటే చట్టాన్ని సవరిం చడమేనని అది శాసనకర్తలు చేయాల్సిన పని అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం వివాహ తప్పిదం చేసిన వ్యక్తి విడాకులు పొందడానికి అవకాశం లేదు. సరిదిద్దడానికి వీల్లేని విధంగా తమ వివాహం మారిందన్న కారణంగా కూడా విడాకులు పొందే అవకాశం లేదు. ఆ ఆధారం చట్టంలో లేదు. కానీ గతంలో ఈ ఆధారంగా కోర్టు విడాకులు మంజూరు చేసిన సందర్భాలున్నాయి. ఇది భిన్నమైన తీర్పు. తీర్పులు ఒక విషయంలో నిలకడగా లేనప్పుడు గందరగోళం తలెత్తే అవకాశం ఉంది. దీనిపై శాసనకర్తలే ఆలోచించాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment

Followers