Friday, February 6, 2009

అమానుష వైఖరి ఇంకా ఎన్నాళ్ళు?

ఫిర్యాదు వస్తే చాలు పోలీసులు తమ నైపుణ్యాలకి పదనుపెడతారు. అందుకే ఓ కవి మిత్రుడు ఇట్లా అంటాడు

`అక్కడ చిత్రహింసలమీద పరిశోధనలు జరుగుతాయి/
క్రొత్త క్రొత్త పద్ధతులు పనిముట్లూ కనుక్కోబడతాయి/
కాసేపు వాళ్ళు సైంటిస్టులవుతారు/
డాక్టరేట్లు మాత్రమే తక్కువ/
మనిషిని నిర్వీర్యం ఎలా చెయ్యాలో/
వాళ్ళకి తెల్సినంత డాక్టర్లకి కూడా తెలియదు'.


ఫిబ్రవరి 3వ తేదీన సుప్రీం కోర్టు హింస గురించి తీవ్రమైన ఆందోళనను వ్యక్తపరిచింది. కస్టడీలో జరుగుతున్న హింసలను నియంత్రించకపోతే అవి అరాచకం వైపు దారి తీస్తాయని, ఆటవిక రాజ్యం ఏర్పడుతుందనీ, అందువల్ల ప్రజలకు నేర న్యాయ వ్యవస్థ పై నమ్మకం సడలిపోతుందని సుప్రీం కోర్టుపేర్కొంది. అందుకని ఈ సంఘటనల నివారణకు తీవ్రమైన చర్యలు అవసరమని కూడా అభిప్రాయపడింది.

కఠినమైన చర్యలు తీసుకోకపోతే కంచె చేనును మేసినట్టు అవుతుందని, అందువల్ల క్రిమినల్‌ జస్టిస్‌ పునాదులు లేకుండా పోయే ప్రమాదం ఉందని కోర్టు తన ఆందోళనను వ్యక్తపరిచింది.ఉత్తరప్రదేశ్‌లో నోయిడా పోలీస్‌ స్టేషన్లో తన 17 సంవత్సరాల కొడుకు చనిపోయినాడని ఆరోపిస్తూ దల్బీర్‌ సింగ్‌ అనే వ్యక్తి నష్టపరిహారం కోసం సుప్రీం కోర్టులో దరఖాస్తును దాఖలు చేశాడు. ఆ కేసును విచారిస్తూ అరిజత్‌ పసాయత్‌, అశోక్‌ గంగూలీలతో కూడిన డివిజన్‌ బెంచి ఈ ఆందోళనను వ్యక్తపరిచింది. పోలీసులు తమ ఆధీనంలో ఉన్న వ్యక్తుల పట్ల మితిమీరి ప్రవర్తించడాన్ని నిరోధించకపోతే నాగరిక సమాజం ప్రతిష్ట మంటగలిసిపోతుందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.కోర్టు ఈ తీర్పు వెలువరించిన రోజే అదే ఉత్తరప్రదేశ్‌రాష్ట్రంలో మరో దారుణమైన సంఘటన జరిగింది. అది యాదృచ్ఛికమే అయినా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన. అక్కడ ఓ దళిత మహిళ ముఖ్యమంత్రిగా పనిచేస్తోంది. అయినా కూడా దళితుల మీద దాడులు కొనసాగడం దారుణమైన విషయం. పోలీసులందరిలో ప్రవహిస్తున్న రక్తం ఒక్కటేనని ఓ కవి మిత్రుడు తన కవిత్వంలో చెప్పాడు. అది నిజమే అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో కన్పిస్తాయి.

ఇత్వా జిల్లాలో మొన్న మంగళవారం పోలీసు లు 7 సంవత్సరాల దళిత బాలికను బహిరంగం గా, అందరూ చూస్తుండగా చిత్రహింసలకు గురిచేశారు. ప్రజలందరూ చూస్తున్నారన్న భయం లేదు. టివి కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించారో లేదో తెలియదు. కానీ ఏ మాత్రం జంకు లేకుండా ఆ దళిత బాలికను చిత్రహింసలకు గురి చేశారు. ఇంతకీ ఆమె చేసిన నేరం, ఆమెపై ఆరోపించబడిన నేరం అతి చిన్నది. 280 రూపాయలు ఉన్న మనీ పర్సు దొంగతనం చేసిందని, ఆ నేరాన్ని ఒప్పుకోవాలని పోలీసులు ఆమెను చిత్రహింసల పాల్జేసారు. ఆమెనే కాదు, గజ దొంగలను కూడా పోలీసులు చట్టప్రకారం చిత్ర హింసలకు గురి చెయ్యడానికి అవకాశం లేదు.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆ తప్పిదానికి పాల్పడిన పోలీసు అధికారిని ఉద్యోగంనుంచి తొలగిం చింది. ఆ సంఘటనకు కారణమైన ఇద్దరు పోలీ సు అధికారులను సస్పెండ్‌ చేసింది. అయితే ఈ సంఘటనను చూసి ఆనందించిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు. ఉద్యోగం తొలగించడం, సస్పెండ్‌ చేయ డం సరిపోతుందా? వీరిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోకూడదా? ఇది చాలా మంది అడుగుతున్న ప్రశ్న. ఇలాంటి సంఘటనలు ఒక్క ఉత్తరప్రదేశ్‌కే పరిమితంకాదు, దేశమంతటా జరుగుతున్నాయి. ఇలాంటి చర్యలు పునరావృతం కావడానికి కారణం ఏమిటి?
కస్టడీల్లో చిత్రహింసలకు, మరణాలకు ఎక్కువగా గురవుతున్న వ్యక్తులు బీదవాళ్ళు, బలహీన వర్గాల ప్రజలు. నేరస్తులను శిక్షించడమనేది అనాదిగా వస్తున్నది.

నేరస్తులను కఠినంగా శిక్షించడం గురించి `మను' శాస్త్రంలో చెప్పారు. రెవెన్యూ బకాయిలను వసూలు చేయడానికి కూ డా వ్యక్తులను మధ్యయుగాల్లో చిత్రహింసలకు గురి చేసేవారు. బ్రిటిష్‌వాళ్ళ కాలంలో కూడా ఈ పద్ధతులే అవలంబించారు. ఈ విషయం తెలుసుకోవడానికి ఇలియట్‌ అధ్యక్షతన బ్రిటిష్‌ ప్రభుత్వం 1984లో కమిటీని ఏర్పాటు చేసిం ది. భారతీయ శిక్షాస్మృతిలోని సె-330 లోని మూడు, నాలుగు ఉదాహరణలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. `ఎ' అనే ఉద్యోగి రెవెన్యూ బకాయిలను `జడ్‌' చెల్లించే విధంగా చిత్రహింసలకు గురిచేస్తే నేరం చేసినవాడవుతాడు. ఈ పని జమిందారు చేస్తే అతను నేరస్థుడవుతాడు. రెవెన్యూ బకాయిల గురించి ఇప్పుడు చిత్రహింసలు లేవు. కానీ కేసుల దర్యాప్తుల పేరు మీద వ్యక్తులను చిత్రహింసలకు గురి చెయ్యడం సర్వసాధారణమైపోయింది. ఈ చర్య లు `న్యాయాధిక్యం' ఉనికినీ దెబ్బ తీస్తున్నాయి.

డి.కె.బసు కేసు తీర్పు వెలువడిన తరువాత ఆ తీర్పుకి విస్తృతమైన ప్రచారం జరిగినా కూడా పోలీసుల ధోరణిలో మార్పు లేదు. తీర్పుల దారి తీర్పులదీ, పోలీసుల దారి పోలీసులదే. ఇందుకు కారణం పోలీసు శాఖలో ఈ ధోరణిని అరికట్టడానికి అవసరమైన యంత్రాంగంలేకపోవడం, చర్యలు తీసుకోవాలన్న సంకల్పం ప్రభుత్వ యంత్రాంగంలో లేకపోవడం. రాజకీయ నాయకుల ఉదాసీన వైఖరి. వీటన్నింటికి తోడు పోలీసుల దృక్పథాల్లో మార్పు రాకపోవడం. నేరస్థు డిని ఒప్పించి నేరాన్ని రుజువు చేస్తామనే ఆలోచన, దర్యాప్తులో అడ్డదారుల్లో ప్రయాణించడం! వీటిని నివారించడానికి కావలసింది సరైన శిక్షణ, జవాబుదారీతనం. ఇవి రెండూ ఉన్నప్పు డే ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కావు. పోలీసుల్లో అమానుష వైఖరి పోవాలంటే సమాజంలో ఉన్న ఉదాసీన వైఖరి పోవాలి.

రచయిత నిజామాబాద్‌ జిల్లా
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers