Friday, January 30, 2009

>>సిగరెట్లు తాగే దృశ్యాలు, కోర్టు తీర్పు<

కథల్లో, నవలల్లో, సినిమాల్లో జీవితం ఉండాలి. జీవన విధానమూ ఉంటుంది. వాటిలో సిగరెట్‌ తాగడం ఉంటుంది. మద్యపానం ఉంటుంది, దొంగతనాలూ, దోపిడీలూ ఉంటాయి. అవేవీ లేకుండా సినిమా తీయడం సాధ్యం కాదు. సినిమాకానీ, కథకానీ, నవలకానీ ఏ విషయాన్ని చెబుతోంది, దాని సారాంశంఏమిటీ అన్నది ప్రధానమైన విషయం. అవి సమాజ హితం కోరుతున్నాయా లేదా అన్న విషయాన్ని చూడాల్సి ఉంటుంది.


సినిమాల్లో సిగరెట్‌ తాగే దృశ్యాలను ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించిన ప్రభుత్వం సినిమాల్లో కూడా పొగ తాగకూడదని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఈ విధంగా పొగతాగడాన్ని నిషేధించడం సరైందేనా? రాజ్యాంగం పౌరుల, ముఖ్యంగా సినిమాలు తీసే వ్యక్తు ల భావప్రకటనా స్వేచ్ఛని హరించిందా? ఇవీ ప్రశ్నలు.

ఈ సమాధానం తెలుసుకోవాలంటే రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 19 ఏమి చెబుతోందో చూడాలి. అది భావప్రకటన తదితర హక్కులకు రక్షణ కల్పిస్తుంది. ఈ హక్కులు భారతదేశ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకు వర్తించవు. ఈ అధికరణ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు భావ ప్రకటనా స్వాతంత్య్రం, ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా గుమికూడే అవకాశం, సంఘాలను యూనియన్లను ఏర్పరచుకునే అవకాశం, భారత భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు, భారత భూభాగంలో ఎక్కడైనా స్థిరపడి నివసించే హక్కు, ఏ వృత్తినైనా లేక వ్యాపారానై్ననా, వాణిజ్యానై్ననా, ఏ జీవనికనైనా చేపట్టడానికి హక్కు కలిగి ఉంటాడు.

గతంలో ఆస్తి హక్కు కూడా ఈ అధికరణ కింద ఉండేది. 1978లో రాజ్యాంగానికి చేసిన 44వ సవరణలో ఆస్తి హక్కును ఈ అధ్యాయం నుంచి తొలగించారు. దాన్ని 300 (ఎ)లో పొందుపరిచారు. ఈ ఆర్టికల్‌ ప్రకారం ఎవరి ఆస్తి హక్కునైనా చట్టం ప్రకారం తప్ప హరించడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు అది ప్రాథమిƒ హక్కు కాదు. భావ ప్రకటనా స్వాతంత్య్రం మాత్రం ప్రాథమిక హక్కే. అధికరణ 19(1) ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛ ఉందికానీ దానికి పరిమితులు ఉన్నాయి. పౌరులకు ఉన్న ఈ హక్కును నియంత్రించడానికి అవసరమైన పరిమితుల్ని ఏర్పరిచే అధికారం రాజ్యానికి ఉంది. సినిమాల్లో వ్యక్తులు, హీరోలు సిగరెట్లు తాగడం అనేది ఒక రకంగా భావ ప్రకటనే. ఈ భావ ప్రకటనకు ప్రభుత్వం పరిమితులు విధించవచ్చా? దీనికి ఢిల్లీ హైకోర్టు మొన్న సమాధానం చెప్పింది.

సినిమాల్లో సిగరెట్లు తాగే దృశ్యాలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. పొగాకు వాడకం, సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరమే. సిగరెట్లు తాగడం వల్ల అది తాగిన వ్యక్తులకే కాదు, ఆ తాగుతున్న వ్యక్తుల పరిసరాల్లో ఉన్న వ్యక్తులకు కూడా హాని కలిగిస్తుంది. అందుకని దీన్ని నిషేధించడం సరైందే. అయితే నిషేధించడంతోనే సరిపోదు, దానిని సక్రమంగా అమలు కూడా చెయ్యాలి. లేకపోతే అది కాగితపు పులిలాగా మారిపోతుంది. ఇప్పుడు ఈ నిషేధ పరిస్థితి మనదేశంలో అలాగే ఉంది. పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం సినిమాల్లో అలాంటి దృశ్యాలు ఉండకూడదని నిషేధం విధించింది. ఆ నిషేధం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.

థమ్‌‌స అప్‌, కోకా కోలా వంటి ప్రకటనలలోని దృశ్యాలను చూసి ఆ విధంగా ప్రవర్తించి గాయాల పాలైన యువకుల , బాలల గురించిన వార్తలు ఎన్నో పత్రికల్లో కనిపిస్తున్నాయి. సినిమాల్లో తమ అభిమాన హీరోలు సిగరెట్లు తాగడం చూసి నేటి అమాయక యువత ఆ చెడు అలవాట్లను అలవరచుకుంటోందని, దానిని నిరోధించాలని ప్రభుత్వ ఉద్దేశం. అది మంచి ఉద్దేశమే. కానీ సినిమా అనేది ఓ దృశ్యకావ్యం. అది ఒకరకమైన భావప్రకటన. కళాత్మక భావప్రకటన. ఒక వ్యక్తి నడవడికను అతని నేపథ్యాన్ని, జీవశైలిని వివరించాలంటే అతని అలవాట్లని కూడా చూపించాల్సి వస్తుంది.

అవేవీ చూపించకుండా అతని క్యారెక్టర్‌ని నిరూపించలేని పరిస్థితి ఉంటుంది. ఈ రకమైన నిషేధం సినీ నిర్మాతలకు ఇబ్బంది కలిగించే పరిణామం. ప్రభుత్వం విధించిన ఈ పరిమితి సినీ నిర్మాతల భావప్రకటనా స్వేచ్ఛకి విఘాతమని ఢిల్లీ హైకోర్టు త తీర్పులో పేర్కొంది. ఆ విధంగా పరిమితి విధించడం రాజ్యాంగ విరుద్ధమని కూడా కోర్టు అభిప్రాయపడింది. కథల్లో, నవలల్లో, సినిమాల్లో జీవితం ఉండాలి. జీవన విధానమూ ఉంటుంది. వాటిలో సిగరెట్‌ తాగడం ఉంటుంది, మద్యపానం ఉంటుంది, దొంగతనాలూ, దోపిడీలూ ఉంటాయి. అవేవీ లేకుండా సినిమా తీయడం సాధ్యం కాదు. సినిమా కానీ, కథకానీ, నవలకానీ ఏ విషయాన్ని చెబుతోంది, దాని సారాంశం ఏమిటీ అన్నది ప్రధానమైన విషయం. అవి సమాజ హితం కోరుతున్నాయా లేదా అన్న విషయాన్ని చూడాల్సి ఉంటుంది. అంతేకానీ సిగరెట్‌ తాగడం, మద్యపానం సినిమాల్లో ఉండకూడదనడం సరైంది కాదు. కాకపోతే వాటి ప్రచారాన్ని నిలుపుదల చేయవచ్చు. ప్రకటనలను నిషేధించవచ్చు.

ధూమపానం గురించి, మద్యపానం గురించి అవగాహనా సదస్సులు ఏర్పరచాలి. తరగతి గదుల్లో వాటి గురించి బోధించాలి. చెడు అలవాట్ల ప్రభావాన్ని విద్యార్థులకు హత్తుకునే విధంగా చెప్పాలి. మంచి ఆరోగ్యం గురించి, మంచి వాతావరణం గురించిన అవగాహన పిల్లలకి, ముఖ్యంగా యువతరానికి కలిగించాలి. పొగాకు వాడకాల ద్వారా మనదేశంలో సంవత్సరానికి ఒక మిలియన్‌ మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ చర్యలను తప్పు పట్టలేం. కానీ బీడీ కట్టల మీద శవం బొమ్మలు ప్రచురించడం ద్వారా, సినిమాల్లో ధూమపాన దృశ్యాలను నిషేధించడం ద్వారా ఈ అలవాట్లని తగ్గించవచ్చని అనుకుంటే పొరపాటే అవుతుంది. ప్రభుత్వం చేయవలసినది చాలా ఉంది. పొగాకు ఉత్పత్తుల వాడకంవల్ల కలిగే అనర్ధాలను ఇవే దృశ్య కావ్యాల ద్వారా వివరించాలి. అది అవసరం కూడా.

రచయిత నిజామాబాద్‌జిల్లా
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

1 comment:

  1. బాగా చెప్పారు. ఇంకా నయం రచనల్లో కూడా సిగిరెట్ అనే పదం వాడ కూడదు అని అనలేదు. అంత వరకు సంతోషం. పని పాటా లేని కొంత మందికి కొన్ని సార్లు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. వాటి ఫలితమే ఇటువంటి చట్టాలు.

    ReplyDelete

Followers