Friday, February 27, 2009

28-2-09 surya daily

పోలీసు వ్యవస్థ సంస్కరణలే శరణ్యం!

పోలీసుల ప్రస్తావన, మానవహక్కుల ప్రస్తావన లేని రోజు ఉండదు. పోలీసులను, సిబీఐని కోర్టులు తరచూ తప్పు పడుతున్నాయి. ఇలా ప్రతిసారీ జరగడానికి కారణం ఏమిటి? మానవ హక్కులు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1948లో వాడినప్పటికీ దాని భావన ఇటీవలి కాలంలో ఎక్కువగా పరివ్యాప్తి లోకి వచ్చింది. పర్యవసానంగా మానవ… హక్కుల పరిరక్షణ చట్టం 1993లో అమలు లోకి వచ్చింది. ఆ చట్టం ప్రకారం మానవ హక్కులంటే భారత రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కులలో పొందు పరచిన, అభయం ఇచ్చిన వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం ఇంకా అంతర్జాతీయ ఒప్పందాలలో పొందు పరచిన హక్కులు అని భారతీయ కోర్టుల ద్వారా అమలు పరిచే అవకాశం ఉన్న హక్కులై ఉండాలి.

ప్రాధమిక హక్కులన్నీ మానవ హక్కులే. ప్రాధమిక హక్కుల ఉల్లంఘనలన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలే. గౌరవం అన్న పదం ప్రాధమిక హక్కులలో పేర్కొన్నప్పటికీ జీవించే హక్కులో అది మిళితమై ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనలు ప్రతి క్షణమూ జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు మాత్రమే కాదు, సమాజంలోని చాలామంది వ్యక్తులు మానవ హక్కుల ఉల్లంఘనలను చేస్తూనే ఉన్నారు. పోలీసులు ఎక్కువగా చేస్తూ ఉండవచ్చు. ఇందుకు కారణం ఏమిటి? జవాబు తెలుసుకోవాలంటే ముందుగా పోలీసు వ్యవస్థ మన దేశంలో ఏ విధంగం ఉందో తెలుసుకోవాలి.

పోలీసు వ్యవస్థ మనకు బ్రిటిష్‌వారినుంచి సంక్రమించింది. వ్యక్తి స్వేచ్ఛకు మూలాధారం తమ మాగ్నాకార్టా (1215) అని బ్రిటిష్‌ పాలకులు భావించినప్పటికీ హబియస్‌ కార్పస్‌ హక్కుల చట్టం 1684, ఫ్రెంచ్‌ డిక్లరేషన్‌ 1789 కంటె పూర్వమే అమలులోకి తెచ్చినప్పటికీ ఈ హక్కులను వాళ్ళు ఆ హక్కులను వారి పరిపాలనలో మనకు ఇవ్వలేదు.

స్వేచ్ఛాపూరితమైన ఎన్నికలు, భావ స్వేచ్ఛ, బెయిల్‌ వంటి భావనలు బ్రిటిష్‌వారికి తెలిసినప్పటికీ అవి భారత దేశ ప్రజలకు ఇవ్వని వాళ్ళు సరైన ప్రయత్నాలు చేయలేదు. పోలీసు వ్యవస్థను సేవాసంస్థగా కాకుండా ఒక ఫోర్‌‌సగా మాత్రమే వాళ్ళు మన దేశంలో రూపొందించారు. మన దేశ ప్రజలను వారి స్వేచ్ఛను అణగదొక్కడానికి మాత్రమే ఈ వ్యవస్థను వాళ్ళు ఉపయోగించారు. వ్యక్తుల స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత పోలీసులపై ఉందని మన పోలీసులకు తెలియనివ్వలేదు. నేషనల్‌ కాంగ్రెస్‌ వంటి సంస్థలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆ సంస్థలను అణచివేయడానికే పోలీసు వ్యవస్థను బ్రిటిష్‌ పాలకులు ఉపయోగించుకొన్నారు. అప్పటి పోరాటాలను అణగదొక్కడానికే ఈ వ్యవస్థ వాళ్ళకి ఉపయోగపడింది. పోలీసు ఉద్యోగాలకు శారీరక దారుఢ్యం లాంటి విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. క్రమశిక్షణ అన్నది పరేడ్‌ గ్రౌండ్‌నుంచి మాత్రమే వస్తుందన్న భ్రమ కలిగించారు. తమకి ఎదురుగా వచ్చిన వ్యక్తి తమ శత్రువే అన్న భావనను వాళ్ళకి కల్పించారు. సాయుధ దళాల మాదిరిగా వాళ్ళకి ఖాకీ డ్రస్‌ను ఇచ్చారు.

తాము కూడా ఫోర్‌‌స అన్న భావననే వాళ్ళకి కల్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా పోలీసుల్లో అలాంటి భావనే కొనసాగుతున్నది. రాజ్యాంగం గురించి, ప్రాధమిక హక్కుల గురించి వారికి శిక్షణ ఇస్తున్నప్పటికీ, పోలీసుల్లో తాము చట్టానికి అతీతులమన్న భావన పోలేదు. అందుకు ప్రధాన కారణం జవాబుదారీతనం లేకపోవడమే.
మన రాజ్యాంగం ప్రకారం పోలీసు వ్యవస్థ రాషా్టల్రకు చెందిన విషయం. అంటే ఈ వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత వహిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించిన నియమ నిబంధనల ప్రకారం ఇవి పని చేయాల్సి ఉంటుంది. ప్రతి రాషా్టన్రికీ కేంద్ర పాలక ప్రాంతానికీ వేరుగా పోలీసులు ఉన్నారు.
పోలీసు చట్టం 1861 ద్వారా మన దేశంలో పోలీసు వ్యవస్థ అమల్లోకి వచ్చింది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. నేపథ్యంలో ఈ చట్టాన్ని బ్రిటిష్‌వాళ్ళు తీసుకొచ్చారు.

తిరుగుబాటు ఒక సంచలనమైతే దానిని అణచివేయడం మరో సంచలనం. ఈ విధంగా రూపు దిద్దుకొన్న పోలీసు లంటే అందరిలోనూ ఓ భయం నెలకొనిపోయింది. చాలా మంది ప్రజలు పోలీసులంటే భయపడతారు. అయినా కూడా కష్టకాలంలో, అవసరమైన పోలీసు సహాయం కోరకుండా ఉండలేని పరిస్థితి. పోలీసులను అవకాశం ఉన్నంత కాలం దూరం పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. పరిస్థితి లేనప్పుడు తప్పక వాళ్ళ సహాయాన్ని కోరతారు. ఇదీ పరిస్థితి.

పోలీసుల పట్ల ప్రజలకు విశ్వాసం ఉండాలి. ఆ విధంగా పోలీసులు ప్రవర్తించాలి. ప్రజలకు రక్షణ కల్పించవలసిన బాధ్యతను పోలీసులు గుర్తించాలి. ఇవి కావాలంటే పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి. చట్టానికి జవాబుదారీ వహించే విధంగా పోలీసు వ్యవస్థ ఉండాలి. పోలీసుల స్థితి గతులు మెరుగు పరచాలి. వారిలో నాయకత్వ లక్షణాలు పెంచాలి. ఏకపక్షంగా బదిలీలు, పోస్టింగులు ఉండకూడదు. ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత… ఉండాలి.

కాలానుగుణంగా ఐ.పి.ఎస్‌. అధికారులకు ఇచ్చే ప్రమోషన్లు అందరికీ వచ్చే విధంగా మార్పులు తీసుకొని రావాలి. అయితే, అవి నిజాయితీ సమర్ధత ఉన్న అధికారులకే ఇవ్వాలి. పోలీసు పనిలో స్వతంత్రత ఉండే విధంగా మార్పులు చేయాలి. ప్రజల కోసం పని చేస్తున్నామన్న భావన పోలీసులకు ఉండే విధంగా వారికి శిక్షణ ఉండాలి. ఒత్తిడులు లేకుండా పోలీసులు పనిచేసే విధంగా మార్పులు తీసుకురావాలి. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావాలని సుప్రీంకోర్టు దగ్గరనుంచి అందరూ కోరుకొంటున్నారు. ఎందుకంటే సంస్కరణలవల్ల ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది. ప్రజల సమస్యలను సున్నితంగా పోలీసులు అర్థం చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది. ధర్‌‌డ డిగ్రీలాంటి దగ్గరి దారినుండి ఎన్‌కౌంటర్‌ లాంటి అడ్డదారులకు పోలీసులు వెళ్ళకుండా ఉండే అవకాశం ఏర్పడుతుంది.

పోలీసు వ్యవస్థలో లెక్కకు మించి మానవ వనరులు ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకొంటే సమాజానికి మేలు జరుగుతుంది. ఆ బాధ్యత ప్రభుత్వం మీద, అందరిమీదా ఉంది.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

1 comment:

  1. పోలీసుల కు ఇచ్చే శిక్షణ పాఠ్యాంశాలలో మార్పు రావాలి. పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసే ప్రజలకు ఫిర్యాదు ముట్టినట్లుగా రసీదు ఇవ్వాలి. పొలీసులంటే ప్రజా సేవకులనే తలపు ప్రజలలో వచ్చే విధంగా పోలీసులు మారాలి.

    న్యాయవ్యవస్థలో పని చేస్తూ, మీరు తెలుగులో బ్లాగు రాయటం ప్రమోదం. అభినందనలు.

    ReplyDelete

Followers