Tuesday, April 17, 2012

Trafficking

మనుషుల క్రయ విక్రయాలు

వ్యభిచారం, మనుషుల క్రయ విక్రయాలు అన్న విషయాలు మరోసారి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అవినీతికర పనుల కోసం మహిళలను, చిన్న పిల్లలను అక్రమ రవాణా చేయడం అనేది అనాదిగా ఉంది. ఈ ఆధునిక కాలంలో అది వికృత రూపం దాలుస్తున్నది. అందుకు కారణాలు అనేకం. ఆర్ధిక పరమైన ఒత్తిడులు, సాంఘిక పరమైన ఒత్తిడులు, పేదరికం, నగరీకరణ, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం వంటి కారణాలు ఎన్నో. వ్యభిచారం అనేది మన సమాజంలో అనాదిగా ఉంది. అనాదిగా ఉన్న వ్యభిచారాన్ని రద్దు చేయలేం. కాని నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనుషుల క్రయ విక్రయాలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వ్యభిచారాన్ని రద్దు చేయలేం కానీ దాన్ని తగు నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని లా కమిషన్‌ తన 64వ నివేదికలో పేర్కొంది. నియంత్రణలో ఉంచాల్సిందని ప్రభుత్వానికి సూచించింది. ‘సీటా’ బిల్లును ప్రవేశపెట్టే ముందు హోమ్‌ మంత్రి లోక్‌సభలో ఈ విధంగా అన్నారు ‘వ్యభిచారాన్ని నియంత్రించలేమని కాదు, కానీ సులభంగా అందుబాటులో ఉంచకుండా ఉంచే ప్రయత్నమే ఈ బిల్లు’. సీటా చట్టం వ్యభిచారాన్ని రద్దు చేయలేదు. అది మానవ అక్రమ రవాణాను రద్దు చేస్తుంది. బహిరంగ స్థలాల్లో వ్యభిచారాన్ని రద్దు చేస్తుంది. నేరంగా గుర్తిస్తుంది.

సీటా చట్టం పరోక్షంగా మగవాళ్ళని సమర్ధించి, వ్యభిచారం చేస్తున్న ఆడవాళ్ళని సంఘ బహిష్కృతులుగా భావిస్తుంది. ఈ చట్టం ద్వంద్వ విలువలను ప్రతిపాదించింది. సీటా చట్టానికి 1986 మార్పులు తీసుకు వచ్చారు. వ్యభిచారం అన్న నిర్వచనం కూడా మారిపోయింది. చట్టం పేరు కూడా మారిపోయింది. అణిచివేత అన్న పదం చట్టం నుంచి తొలగిపోయింది. అది అవినీతి పనులకోసం మనుషుల క్రయ విక్రయాల (నిరోధక) చట్టంగా మారిపోయింది. అది ‘పీటా’ చట్టంగా మారింది. నిర్వచనాన్ని, చట్టాన్ని మార్చినప్పటికీ అది మహిళల క్రయ విక్రయాలను తగ్గించలేకపోయింది. భారతీయ శిక్షా స్మృతికి అనుబంధంగా మారింది తప్ప అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 23 ప్రకారం- శరీర క్రయ విక్రయాలను నిషేధించారు. ఆర్టికల్‌ 39 (ఇ) ప్రకారం మహిళల ఆరోగ్యాన్ని అదే విధంగా పిల్లలని వాళ్ళ ఆర్ధిక అవసరాలకు గాను దోపిడీకి గురి చేయకూడదు. పీటా చట్టమే కాకుండా భారతీయ శిక్షా స్మృతిలో కూడా వ్యభిచారాన్ని మనుష్యుల క్రయ విక్రయాలని అరికట్టడానికి కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఆ చట్టాలలోని సె. 366 ఎ, 366 బి, 373 ప్రకారం వ్యభిచారం కోసం ఆడపిల్లలను కొనడం, అమ్మడం హీనమైన నేరంగా పరిగణిస్తుంది. వాటికి కూడా కఠినమైన శిక్షలు ఉన్నాయి. చట్టాలు, నిబంధనలు ఉన్నప్పటికీ మనుష్యుల క్రయవిక్రయాలు నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో మనుషుల క్రయ విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఖండాంతరం వ్యాపించలేదు. ఈ క్రయ విక్రయాలు 90 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయి.

ఇవి మన దేశంలో జరుగుతున్న సరియైన చర్యలని ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తీసుకోలేక పోతోంది. ఈ క్రయ విక్రయాలు వ్యభిచారం కోసమే కాదు, పనుల కోసం బానిసలుగా ఉపయోగించుకోవడానికి కూడా నిర్వహిస్తున్నారు. నేరస్థులకు ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య ఉన్న సయోధ్య వల్ల ఈ క్రయ విక్రయాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. నేరస్థుల మధ్య, ప్రభుత్వ యంత్రాంగం మధ్య లాలూచీ ఎంత ఉందో తెలపడానికి ఒక పదిహేను రోజుల క్రితం జరిగిన మధ్యప్రదేశ్‌ ఉదంతం చాలు. 2012 ఫిబ్రవరి 10 తేదీన ఇమ్రాబీ కుమార్తెను ఓ గూండా రేప్‌ చేశాడు. భోపాల్‌ నగరానికి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీటల్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాణీ యాదవ్‌ అనే యువతి సహాయంతో 15 సంవత్సరాల బాలికను రాజేశ్‌ హీరోలే తన సైకిల్‌ మోటారు మీద కిడ్నాప్‌ చేసి ఆమె పై రేప్‌ చేశాడు.

ఆమెను అతను అపహరించుకొని పోతున్నప్పుడు దాదాపు 1200 మంది చూశారు. కానీ ఎవరూ దానిని ప్రతిఘటించలేదు. ఆ ప్రాంతంలో రాజేశ్‌ హీరోలేకి తిరుగు లేదు. అతను భూ ఆక్రమణ దారుడు, వడ్డీ వ్యాపారి. అతన్ని ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. అయినా ఇమ్రాబీ బాయి అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఎందుకంటే 2006 సంవత్సరంలో ఆమె మరో కుమార్తె కనుపించకుండా పోయింది. రాణీ యాదవ్‌ ఆమెని వైష్ణవీ దేవి గుడికి అని తీసుకు వెళ్ళి వ్యభిచార గృహంలో అమ్మేశారు. మూడు సంవత్సరాల తర్వాత ఈ విషయం ఇమ్రాబీ బాయికి తెలిసింది. ఆ కుమార్తె పారిపోయి రావడం వల్ల ఈ సంగతి ఇమ్రాబీ బాయికి తెల్సింది.

రెండవ కుమార్తెకు కూడా అలాంటి పరిస్థితి రావద్దని ఆమె రాజేశ్‌ హీరోలేకి ఎదురు తిరగాలని అనుకొని రాజేశ్‌ హీరోలేపైన ఫిర్యాదు చేసింది. పోలీసులు భారతీయ శిక్షా స్మృతిలోని సె. 376, 342 ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో ఆమె నోరు మూయించడానికి రాజేశ్‌ హీరోలే తన గ్యాంగ్‌తో ఆమె దగ్గరకు వచ్చాడు. అతని గ్యాంగ్‌ లోని మంటూ యాదవ్‌ అనే వ్యక్తి ఆమె కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపాడు. రేప్‌ కేసు నమోదైన తరువాత రాజేశ్‌ హీరోలే ఇమ్రాబీ బాయి దగ్గరకొచ్చి కేసును వదిలించుకోవడానికి ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. ఫలితం లేకపోవడంతో ఆమెను బెదిరించాడు. ఆ తరువాత కాల్చి చంపారు. అతను ఒత్తిడి చేయడం మొదలు పెట్టిన తరువాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కానీ పోలీసులనుంచి సరైన స్పందన రాలేదు. ఆమెను రక్షించడానికి పోలీసులు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఫలితంగా ఆమె హత్యకు గురైంది. షెడ్యూల్డు తెగకు చెందిన ఇమ్రాబీ బాయి హత్య మన 60 సంవత్సరాల స్వాతంత్య్రాన్ని ప్రశ్నిస్తున్నది. మన చట్టాన్ని ప్రశ్నిస్తున్నది. కఠినమైన శిక్షలను ఏర్పరచినంత మాత్రాన చట్టం సమర్ధవంతంగా అమలు జరగదు. చట్టాన్ని అమలు చేయడంలో శ్రద్ధ వహిస్తేనే ఏ చట్టానికైనా పరమార్ధం.

No comments:

Post a Comment

Followers