Wednesday, March 21, 2012

మధ్య వర్తిత్వమే మేలు!

మన దేశంలో మూడు రకాలైన కేసులు ఎక్కువగా దాఖలవుతున్నాయి. అవి- రోడ్డు ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, చెక్కులు చెల్లలేదన్న కేసులు, వివాహాలకు సంబంధించిన కేసులు. ఈ కేసుల సంఖ్య మిగతా కేసులతో పోలిస్తే చాలా ఎక్కువ. రోడ్డు ప్రమాదాలను పూర్తిగా జరగకుండా కాకపోయినా, కొంత వరకూ నియంత్రించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా! చెక్కుల్ని నిరాకరించినప్పుడు దాఖలయ్యే కేసులు ఎక్కువగా ఫైనాన్స్‌ సంస్థలు దాఖలు చేస్తున్న కేసులు. చెక్కు చెల్లనప్పుడు గతంలో సివిల్‌ కేసులు మాత్రమే దాఖలయ్యేవి. 1988లో నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ చట్టానికి మార్పులు తీసుకొచ్చి క్రిమినల్‌ చర్యలు తీసుకునే విధంగా మార్చారు. ఫలితంగా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది.

ఫైనాన్షియల్‌ సంస్థలు, బ్యాంకులు రుణాలు ఎంత సులువుగా ఇస్తున్నాయో వసూలు చేయడంలో అంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. వాయిదా వాయిదాకి చెల్లించాల్సిన డబ్బు గురించి ముందుగానే చెక్కులు తీసుకుంటున్నాయి. ఆ చెక్కులు చెల్లనప్పుడు క్రిమినల్‌ కేసులు దాఖలు చేస్తున్నాయి. ఈ విధంగా ఆ కేసుల సంఖ్య పెరిగిపోయాయి. ఫలితంగా ప్రత్యేక కోర్టుల్ని నగరాల్లో ఏర్పాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వీటిని కూడా ప్రభుత్వం కొంత నియంత్రించే అవకాశం ఉంది.
మూడవ రకమైన కేసులు వివాహ సంబంధ కేసులు. వీటి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోయి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సంఖ్యని నియంత్రించడం ప్రభుత్వం చేతుల్లో లేదు. ఆధునిక జీవితంలో వచ్చిన మార్పులు, సమాజంలో వచ్చిన మార్పులు, వ్యక్తుల ఆలోచనా ధోరణుల్లో వచ్చిన మార్పులు వీటికి కారణాలు. కారణాలు ఏమైనప్పటికీ వీటి సంఖ్య పెరగడం అందరినీ కలవర పెడుతున్న విషయం.

ఈ మూడు రకాలైన కేసులు పెరగడం వల్ల కేసుల పరిష్కారంలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. ఫలితంగా కోర్టుల మీద విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మూడు రకాలైన కేసుల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. కానీ ఆ పని అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఆ విధంగా పరిష్కారం చేసుకోకపోతే కేసులు సంఖ్య పెరిగి విచారణలో జాప్యం జరిగి కోర్టుల మీద విశ్వాసం, నమ్మకం పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
రోడ్డు ప్రమాదాల కేసుల విచారణల్లో జాప్యం కంటె, చెక్కుల కేసుల విచారణల్లో జాప్యం కంటె- వివాహాలకు సంబంధించిన కేసుల విచారణలో జాప్యం జరిగితే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. వయస్సు దాటిపోయిన తర్వాత విడాకులు మంజూరు చేసి ఫలితం ఉండదు. ఈ విషయాన్ని గమనించే శాసన కర్తలు హిందూ వివాహ చట్టంలో, ప్రత్యేక వివాహ చట్టంలో పార్టీల మధ్య సామరస్యం నెలకొల్పడానికి కోర్టులు చర్యలు తసుకోవడానికి సె.23, సె.34 వంటి నిబంధనల్ని ఈ రెండు చట్టాల్లో ఏర్పరచారు.

అయినా కూడా అనుకున్న పద్ధతిలో వేగంగా కేసుల పరిష్కారాలు జరగడం లేదని లా కమిషన్‌ తన 59వ నివేదికలో కొన్ని సూచనలు చేసింది. ఈ ఆర్డర్‌ ప్రకారం వివాహ వివాదాలను ప్రత్యేక పద్ధతిలో పరిష్కరించాలి. ఈ ఆర్డర్స్‌ని సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో ఏర్పాటు చేసినప్పటికీ వివాదాల పరిష్కారం మామూలు పద్ధతిలో కోర్టులు పరిష్కరించాయి. ఈ విషయాన్ని గమనించి ప్రత్యేక చట్టం ఆవశ్యకతను గుర్తించి శాసనకర్తలు కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని తీసుకువచ్చారు.
భార్యా భర్తల వివాదాలను సామరస్యకంగా మధ్యవర్తిత్వం నెరపి పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని ప్రభుత్వం తీసుకుని వచ్చింది. ఒక మిలియన్‌ జనాభా దాటిన నగరాల్లో విధిగా కుటుంబ న్యాయస్థానాలను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి ఉంటుంది.

కుటుంబ న్యాయస్థానాల చట్టంలోని సె.9 ప్రకారం కుటుంబ న్యాయస్థానం ముందుకు వచ్చిన కలహాలను సామరస్యకంగా పరిష్కరించడానికి విధిగా ప్రయత్నించాలి. పార్టీలు సదవగాహనకు రావడానికి కేసు పూర్వపరాలను దృష్టిలో పెట్టుకుని పార్టీలను ఒప్పించడానికి కుటుంబ న్యాయస్థానం కృషి చేయాలి. అంతే కాకుండా పార్టీల మధ్య సదవగాహన రావడానికి న్యాయస్థానం తోడ్పడాలి.
హిందూ వివాహ చట్టంలోని సె.23 (2) ప్రకారం, దాఖలయ్యే దరఖాస్తులను పరిష్కరించే ముందు ఆ దంపతుల మధ్య సామరస్యం నెలకొల్పడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. కుటుంబ న్యాయస్థానంలోని నిబంధన 9 అటువంటిదే. వివాహ వ్యవస్థను రక్షించాలన్న ఉద్దేశంతో ఈ నిబంధనను ఈ చట్టంలో పొందు పరచారు. భార్య భర్త మధ్య ఏర్పడిన వివాదాలను సామరస్యంగా మధ్యవర్తిత్వం జరిపి పరిష్కరించవలసిన ఆవశ్యకతను గుర్తించి ఈ చట్టాన్ని తయారు చేశారు.

అన్ని మతాలకు సంబంధించి ఒకే రకమైన పద్ధతిలో కేసుల విచారణ జరగాలని, అది కూడా లింగ వివక్ష లేకుండా విచారణలు జరగాలన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిబంధనను ఏర్పాటు చేశారు. కుటుంబ న్యాయస్థానాల్లో అన్ని వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన కేసులు వస్తాయి. కొన్ని చట్టాల్లో సామరస్యం, రాజీ కుదిర్చే నిబంధనలు లేవు. కానీ కుటుంబ న్యాయస్థానాల్లో ఏర్పడిన నిబంధన 9 ప్రకారం పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి కుటుంబ న్యాయస్థానం కృషి చేయాల్సి ఉంటుంది.

దంపతుల మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీలు కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఆర్టికల్‌32 ఎ, కుటుంబ న్యాయస్థానంలోని సె.9, హిందూ వివాహ చట్టంలోని సె. 23, ప్రత్యేక వివాహ చట్టంలోని సె.34 చెబుతున్నది ఇదే విషయం. హిందూ వివాహ చట్టంలోని సె.23, సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని ఆర్టికల్‌ 32ఎ నిబంధనలను సుప్రీంకోర్టు వ్యాఖ్యానించాల్సిన పరిస్థితి జిగ్‌రాజ్‌ సింగ్‌ వర్సెస్‌ బీర్‌పాల్‌ కౌర్‌ (జె.టి. 2007 (3) సుప్రీంకోర్టు 389) ఏర్పడింది. ఈ కేసులో సుప్రీంకోర్టు- ‘ఈ రెండు నిబంధనల ప్రకారం పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి మొదటి దశలో కోర్టులు ప్రయత్నం చేయాలి. ఈ ఉద్దేశంతోనే పార్టీలు కోర్టుముందు వ్యక్తిగతంగా హాజరు కావలసి ఉంటుంది. ఆ విధంగా ఎవరైనా పార్టీలు హాజరు కాకపోతే వారి ‘ఏకపక్షం’ చేయాలన్న వాదన ఆమోదించలేము. ఆ విధంగా ఆమోదిస్తే ఈ ఉపయుక్తమైన నిబంధన ఎందుకూ పనికిరానిదిగా మారిపోతుంది.


ఫలితంగా పార్టీల మధ్య సయోధ్య కుదర్చాలన్న ఉద్దేశమే దెబ్బతింటుంది’. అందుకని ప్రతివాది హాజరుకోసం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను హైకోర్టు జారీ చేయడం సమంజసమని, చట్టం ఉద్దేశం నెరవేర్చడానికి అది ఉద్దేశించినదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.హిందూ వివాహ చట్టంలోని సె.13 ప్రకారం విడాకులు పొందడానికి చాలా ఆధారాలున్నాయి. దంపతుల్లో ఎవరైనా మతం మారినప్పుడు, వక్రమైన మానసిక అస్వస్థతకు గురైనప్పుడు, సుఖ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, కుష్టు వ్యాధితో బాధపడుతున్నప్పుడు- మరొకరు విడాకులు పొందవచ్చు. ఈ ఆధారాలతో విడాకులు కోరినప్పుడు వారి మధ్య సయోధ్య కుదర్చాల్సిన బాధ్యత, రాజీ కుదర్చాల్సిన బాధ్యత కోర్టులమీద లేదు.

ఈ విషయం గురించి కేరళ హైకోర్టు బివి వర్సెస్‌ కేవి. సుందరన్‌ కేసులో చర్చించి ఆ పరిస్థితుల్లో కూడా కోర్టు మధ్యవర్తిత్వం నెరపాలని వ్యాఖ్యానించింది. కోర్టు మాటల్లో- ‘మతం మార్పిడి జరిగినంత మాత్రాన పార్టీలు సుఖప్రదమైన వైవాహిక జీవితాన్ని గడపలేరని అనుకోవడానికి అవకాశం లేదు. సయోధ్య నెరపడానికి హిందూ వివాహ చట్టం కొన్ని ఆధారాలకు మినహాయింపులను ఇచ్చింది. కానీ కుటుంబ న్యాయస్థానం అలాంటి మినహాయింపులను ఇవ్వలేదు. కుటుంబ న్యాయస్థానాల చట్టం ప్రకారం అన్ని వివాహ సంబంధమైన కేసుల్లో మధ్యవర్తిత్వం నెరపి పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి కోర్టు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.

ఇది తప్పక చేయాల్సిన చర్య. ఈచట్టం ద్వారా వచ్చిన మార్పు ఇదే’!
ఈ తీర్పుల ద్వారా, చట్టాల ద్వారా అర్ధం అవుతున్న విషయం ఒక్కటే. వివాహ సంబంధ విషయాల్లో పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి, రాజీ కుదర్చడానికి కోర్టు ప్రయత్నం చేయాలి. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను సత్వరం పరిష్కరించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల సమయం, డబ్బు, ఖర్చులు మిగులుతాయి. ఇది మన దేశానికి కొత్తదేమీ కాదు, ఎప్పటినుంచో ఉన్నదే.

రూల్‌ఆఫ్‌లా మంగారి రాజేందర్‌

No comments:

Post a Comment

Followers