Wednesday, April 25, 2012

Impartiality in courts

కోర్టుల్లో నిష్పక్ష పాతం న్యాయ వ్యవస్థ ప్రజల విశ్వాసం చూరగొనాలంటే న్యాయ నిర్ణయ ప్రక్రియలో నిష్పక్షపాతం ఉండాలి. ఆర్‌ వర్సెస్‌ సుసెక్స్‌ (1924) కేసులో ప్రధాన న్యాయమూర్తి లాడ్డ్‌ హేవర్ట్‌ ‘న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్టుగా కనిపించాలి. కేసుల విచారణ ఎలాంటి పక్షపాతం లేకుండా జరగాలి’ అన్నారు. పక్షపాతం అనేది ఆరు రకాలుగా ఉంటుందని వర్గీకరించారు. అవి వ్యక్తిగత పక్షపాతం, ఆర్ధిక పరమైన పక్షపాతం, కేసులోని విషయంమీద పక్షపాతం, శాఖాపరమైన పక్షపాతం, ముందుగా ఏర్పరచుకున్న అభిప్రాయాల వల్ల పక్షపాతం, మొండితనం- మూర్ఖత్వం వల్ల ఏర్పడిన పక్షపాతం. కోర్టు విచారణల్లో ఎలాంటి పక్షపాతం ఉండకూడదు. అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కోర్టు ఏదైనా విషయంలో పక్షపాతంలో ఉందన్న అభిప్రాయం కోర్టుకు వచ్చిన వ్యక్తులకు ఏర్పడకూడదు. ఆ విధంగా కోర్టు వాతావరణం ఉండాలి. కోర్టుకు అంటే న్యాయమూర్తికి పూర్వభావనలు, ప్రతికూలాభిప్రాయాలు ఉండవని కాదు. అలాంటి భావనలు ఉండకూడదు. అలాంటి అభిప్రాయాలు కొన్నిసార్లు పైకి కనుపించేఉ విధంగా ఉంటాయి. మరికొన్నిసార్లు పైకి కనుపించకుండా ఉంటాయి. వర్గం, మతం, కులం, లింగం, భాష, ప్రాంతం అనే విషయాలు న్యాయమూర్తులను ప్రభావితం చేస్తుంటాయి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అవి ప్రభావితం చేయకుండా న్యాయమూర్తి వ్యవహరించాలి. కిరాయిదారుడుగా ఉన్న న్యాయమూర్తి యజమానితో ఇబ్బందులపాలైతే అతనికి యజమానుల పట్ల కొన్ని పూర్వ భావనలు ఉంటాయి. అదే విధంగా అతను యజమాని అయి ఉండి కిరాయిదారునితో ఇబ్బందులు పడినప్పుడు అతనికి కిరాయిదారుల పట్ల కొన్ని పూర్వభావనలు ఉంటాయి. అదే విధంగా పోలీసులతో ఇబ్బందులు పడ్డ న్యాయమూర్తికి వాళ్ళ పట్ల పూర్వభావనలు ఉండే అవకాశం ఉంది. ఈ భావనలను గుర్తించి వాటినుంచి బయట పడాల్సింది. గుర్తించినప్పుడు ఈ పూర్వభావనలు తీర్పుల్లో ప్రతిబింబించే అవకాశం ఏర్పడుతుంది. ఈ పూర్వభావనలు, పక్షపాత దృష్టి బయటపడడం సులువుకాదు గానీ దుస్సాధ్యం మాత్రం కాదు. కోర్టులు అందరి హక్కులను కాపాడాలి. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, సాక్షులు కావచ్చు, బాధితులు కావచ్చు. కోర్టుకు వచ్చే వ్యక్తులందరి హక్కులు కాపాడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. వారి సాధక బాధకాలను సానుభూతితో అనే బదులు చట్టపరంగా చూడాల్సిన బాధ్యత కోర్టులపై ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడే కోర్టులు నిష్పక్షపాతంగా ఉన్నట్టు అనిపిస్తుంది.సుప్రీకోర్టు- స్టేట్‌ ఆఫ్‌ యుపి వర్సెస్‌ శంభూనాథ్‌ సింగ్‌ మరి ఇతరులు (ఏఐఆర్‌ 2001 సుప్రీంకోర్టు 403) కేసులో అభిప్రాయపడినట్టు ‘కోర్టు నుంచి సమన్లు రాగానే సాక్షులు వణికిపోతారు. కోర్టుల్లో జరిగే విచారణకు వాళ్ళ కాళ్ళు వణికిపోవడం లేదు, కోర్టు చుట్టూ ఎన్నిరోజులు తిరగాల్సి ఉంటుందోనని వాళ్ళు వణికి పోతారు. ఎందుకంటే వాళ్ళు తమ పనులను వదిలివేసి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్క సారితో అయిపోదు. మన దేశంలోని ప్రతి కోర్టులో కనుపించే దృశ్యమే ఇది. కోర్టులు ఓ నిర్ణయానికి రావడానికి వచ్చిన అతిథులని విచారించే కోర్టులు భావించాల్సిన సమయం ఆసన్నమైంది..’. కోర్టుల్లో సాక్షులు కూర్చోవడానికి సరైన స్థలం ఉండదు. తాగడానికి నీటి సౌకర్యం ఉండదు. మరుగుదొడ్లు కూడా ఉపయోగించడానికి వీలు లేకుండా ఉంటాయి. కోర్టు అటెండర్లు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వరు. భయానికి గురి చేస్తూఉంటారు. వారి పరిస్థితులను, సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకుని వారి రోజు వారి కూలి దెబ్బతినకుండా, వాళ్ళు ఎక్కువసార్లు కోర్టుకి తిరగకుండా తేదీలను వేస్తే అది కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టనిపిస్తుంది. కోర్టుకు హాజరైనప్పుడు వారికి ఇవ్వాల్సిన వేతనం ఇస్తే కూడా అది నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టు అనిపిస్తుంది. నిష్పక్షపాతంగా ఉండడం ఎంత అవసరమో కొన్ని సందర్భాల్లో పక్షపాతంగా ఉండడం కూడా నిష్పక్షపాతంగా ఉండడంగా భావించాల్సి ఉంటుంది. బీద వాళ్ళ పట్ల, పిల్లల పట్ల, మహిళలపట్ల పక్షపాతంగా ఉండాలి. రాజ్యాంగం పట్ల పక్షపాతంతో ఉండాలి. రాజ్యంగం వీరి హక్కులను గౌరవిస్తుంది. ప్రత్యేకమైన అధికరణలు కూడా రాజ్యాంగంలో ఉప్పాయి అదేవిధంగా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు సంబంధించిన వ్యక్తుల కోసం, మైనారిటీల కోసం కూడా రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలున్నాయి. వీరికి కోర్టు గురించి, అక్కడ జరిగే ప్రొసీడింగ్స్‌ గురించి ఏమీ తెలియదు. అందుకని వాళ్ళు సరైన న్యాయం పొందే విధంగా కోర్టు ప్రయత్నం చేయాలి. చర్యలు తీసుకోవాలి. కొన్ని చట్టాలు, కొన్ని నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంటుంది. అందులో కొంత వాస్తవం ఉందని అనుకున్నప్పటికీ ఏ చట్టం, ఏ నిబంధన దుర్వినియోగం కావడం లేదన్న ప్రశ్నకు చాలామంది దగ్గర సమాధానం ఉండదు. మరీ ముఖ్యంగా భారతీయ శిక్షాస్మృతి లోని సె.498 ఎ. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం దుర్వినియోగం అవుతున్నదన్న వాదనను చాలా మంది లేవనెత్తుతుంటారు. అది సరైనది కాదు. ఆ విధంగా ఉండడం అంటే పక్షపాతంతో ఉన్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రతి కేసుని ఆ కేసులోని విషయాలను బట్టి చూడాల్సి ఉంటుంది. అప్పుడే నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ కేసులను విచారించేటప్పుడు మిగతా కేసుల కంటె ఎక్కువ సున్నితంగా ఆలోచించాల్సి ఉంటుంది. కోర్టుకు వచ్చే వ్యక్తులకు కోర్టు పద్ధతులు తెలియవు. చట్టమూ తెలియదు. వాళ్ళ హక్కులు బాధ్యతలు తెలియవు. వాళ్ళు ముద్దాయిలు కావచ్చు, బాధితులు కావచ్చు, సాక్షులు కావచ్చు, ఎవరూనా కావచ్చు. అందుకని వాళ్ళ హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. నిబంధనల ప్రకారం బెయిలబుల్‌ నేరాలలో బెయిలు అనేది హక్కు. అది పోలీసులే ఇవ్వాలి. పోలీసులు ఇవ్వనప్పుడు మేజిస్ట్రేట్‌ బెయిలు మంజూరు చేయాల్సి ఉంటుంది. ముద్దాయి బెయిల్‌ కోరినా కోరకపోయినా బెయిలబుల్‌ నేరాల్లో బెయిలు మంజూరు చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. అదేవిధంగా అరెస్టు అయిన వారం రోజుల్లోగా అతను జామీను పెట్టుకోనప్పుడు అతన్ని నిరుపేదగా పరిగణించి వ్యక్తిగత పూచీకత్తు మీద వదిలి పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా చార్జిషీటును పోలీసులు 60, 90 రోజుల్లో దాఖలు చేయలేనప్పుడు కూడా వాళ్ళని బెయిలు పైన విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేయాలి. వాళ్ళు కోరినా కోరకపోయినా ఈ బెయిళ్ళను మంజూరు చేయాల్సి ఉంటుంది. కోర్టు పద్ధతులు, నియమాలు, నిబంధనలు చాలా మందికి తెలియవు. కోర్టు పద్ధతులను అందరూ పాటించాలి. అందరూ పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత కోర్టు మీద ఉంటుంది. కోర్టు అనేది పూర్తిగా ఆ కోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఉంటుంది. అందుకని అందరూ కోర్టు పద్ధతులను పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత ఆ కోర్టు న్యాయమూర్తిపై ఉంటుంది. ఇవన్నీ పాటించినప్పుడే ఆ విచారణ, ఆ కోర్టు నిష్పక్షపాతంగా ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. రూల్‌ఆఫ్‌లామంగారిరాజేందర

1 comment:

  1. good message in your blog
    https://goo.gl/Yqzsxr
    plz watch and subscribe our channel

    ReplyDelete

Followers