Thursday, March 8, 2012

బాలల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తే...

బాలల పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తే...

ఓచిన్న దొంగతనం చేశాడని ఓ కుర్రవాడిని నెల రోజులు బంధించారన్న వార్త కనిపించింది. అది జరిగిన నాలుగు రోజులకి కరీంనగర్‌ జిల్లాలోని జగిత్యాలలో మరో సంఘటన జరిగింది. మొదటి పని చేసింది ఆ ఊరి గ్రామస్థులు. రెండవ సంఘటనలో పాల్గొన్న వ్యక్తి పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌. ఇది అమానుష చర్య. వచ్చిన వార్తల ప్రకారం ఆ పిల్లవాడు చేసిన నేరం మోటారు వాహనాల్లో పెట్రోల్‌ దొంగతనం. ఆ నేరానికి ఇన్స్‌పెక్టర్‌, కానిస్టేబుల్‌ అతన్ని రోడ్డుమీద చితకబాదారు. అది రివాల్వార్‌ చూపిం చడం దాకా వెళ్ళింది. మీడియా చాలా క్రియాశీలంగా ఉందన్న విషయం తెలిసి కూడా పోలీసులు ఎలాంటి మొహమాటం పోలేదు.

ఈ విషయమై ఓ చానల్‌ యాంకర్‌ ఆ ఇన్స్‌పెక్టర్‌ను ప్రశ్నించింది. అతను సరైన సమాధానాలు చెప్పలేదు, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని ఖండించనూ లేదు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మదన్‌ బి. లోకూర్‌ మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జువెనైల్‌ జస్టిస్‌ గురించి వర్క్‌ షాపుల్ని జ్యుడిషియల్‌ అకాడమీ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ సంఘటన జరిగింది.జువెనైల్‌ జస్టిస్‌ చట్టాన్ని మన దేశం 1986లో తీసుకొని వచ్చింది. ఆ చట్ట ప్రకారం 16 సంవత్సరాల లోపున్న పిల్లవాడిని, 18 సంవత్సరాల లోబడి ఉన్న ఆడపిల్లను ఈ చట్టం జువెనైల్‌గా పరిగణించింది. మగ పిల్లల వయస్సును కూడా 18 సంవత్సరాలకు పెంచాలని పిల్లల గురించి పనిచేస్తున్న వ్యక్తులు కోరుతున్నారు.

భారత దేశం 1992 డిసెంబర్‌ 11న పిల్లల హక్కుల ఒప్పందంపై సంతకం చేసింది. 2000లో ఈ చట్టాన్ని ఆ ఒప్పందానికి అనుగుణంగా మార్చింది. మగ పిల్లలకి కూడా 18 సంవత్సరాల వయస్సును నిర్ధారించారు. ఆర్టికల్‌ 1 సిఆర్‌సి ప్రకారం 18 సంవత్సరాలకు లోబడిన వ్యక్తులందరూ పిల్లలే. 2006లో ఈ చట్టానికి మళ్ళీ మార్పులు తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం రెండు రకాల పిల్లలున్నారు. వాళ్ళు చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లలు- రక్షణ, పోషణ లేని పిల్లలు. నేరం చేసిన పిల్లలని చట్టంతో వైరుధ్యం ఉన్న పిల్లలని, ఆలనా పాలన లేని ప్లిలలను రక్షణ, పోషణ లేని పిల్లలని అంటారు. అలాగే రెండు రకాలైన నేరాలనూ చట్టం గుర్తించింది.

అవి బాలలు చేసే నేరాలు- బాలలపై జరిగే కొన్ని ప్రత్యేక నేరాలు.
పైన పేర్కొన్న ఇన్స్‌పెక్టర్‌ చేసిన నేరం బాలలపై జరిగిన ప్రత్యేకమైన నేరం. ఈ నేరాలను జువెనైల్‌ జస్టిస్‌ చట్టంలోని సె.23 నుంచి 26 వరకు పేర్కొన్నారు. సె.27 ప్రకారం ఈ నేరాలు కాగ్నిజబుల్‌ నేరాలు. అంటే మేజిస్ట్రీట్‌ అనుమతి లేకుండా పోలీసులు దర్యాప్తు చేయడానికి అవకాశం ఉన్న నేరాలు. సె. 23 ప్రకారం బాలల పట్ల క్రూరంగా వ్యవహరించడం నేరం. బెదిరించడం, వదిలిపెట్టడం, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం లేదా బెదిరించే ప్రయత్నం చేయడం, వదిలి పెట్టడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలకి శారీరకంగా, మానసికంగా బాధ కలగచేయడం. ఎవరైనా సరే, పిల్లల పట్ల క్రూరంగా వ్యవహరించకూడదు. అలా వ్యవహరిస్తే వారికి 6 మాసాల వరకు జైలు శిక్ష, లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

బాలల్ని బిచ్చం ఎత్తుకునే వృత్తిలో నియమించి వారి ఆదాయాన్ని వాడుకున్న వ్యక్తులను, ఆ విధంగా బిచ్చం ఎత్తుకునే వ్యక్తులకు సహకరించిన వక్తులకు సె.24 ప్రకారం జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. డాక్టర్లు నిర్దేశించినప్పుడు కాకుండా ఇతర సందర్భాలలో పిల్లలకి మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు ఇచ్చిన వ్యక్తులకు సె. 25 ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. బాలలను ఉద్యోగాలలో నియమించి దోపిడీకి గురి చేసినప్పుడు, అపాయకరమైన వృత్తిలో నియమించినప్పుడు, వారి ఆదాయాన్ని నిలిపివేసినప్పుడు సె. 26 ప్రకారం వారికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

నేరం చేసిన పిల్లలు మొదట తారసపడేది పోలీసుతోనే. మామూలు వ్యక్తులు వాళ్ళని పట్టుకున్నా వారిని పోలీసులకు అప్పగిస్తారు. వారు చేసిన నేరాలను విచారించే అధికారం పోలీసులకు ఉంది. అయితే నేరాలు చేసిన పెద్దవాళ్ళని ట్రీట్‌ చేసిన విధంగా పిల్లలను పోలీసులు ట్రీట్‌ చేయకూడదు. ఈ చట్టప్రకారం- పిల్లలు చేసిన నేరాలను విచారించే అధికారులుగా మానవ దృక్పథంతో ఉన్న వ్యక్తులను, సున్నితంగా ఆలోచించే వ్యక్తులను నియమించాలి. ఈ చట్ట ప్రకారం పిల్లల పట్ల సున్నితంగా నడుచుకోవాలి. అయితే ఈ మధ్య మీడియాలో కనుపించిన దృశ్యం ఆ విధంగా కనుపించదు. పిల్లలను నేరస్థుల కంటె అధ్యాన్నంగా పరిగణించడం జరిగింది. ఎందుకంటే హింసను ప్రదర్శించే, ఉపయోగించే అధికారం పోలీసులకు లేదు. కొన్ని ప్రత్యేకమైన సందర్బాలలోనే పోలీసులు బలప్రయోగాన్ని ఉపయోగించుకోవచ్చు.

బాలలు ఏదైనా నేరం చేసినప్పుడు ఆ దర్యాప్తును పోలీసులు సాధారణంగా త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది. బాలు చేసిన నేరాలు ఎంతో తీవ్రమైనవైనా వారికి బెయిలు మంజూరు చేసే అధికారం పోలీసులకు ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే బెయిల్‌ను పోలీసులు తిరస్కరించాల్సి ఉంటుంది. నేరం చేసిన వ్యక్తుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించకూడదు. వాళ్ళని చిత్రహింసలకు గురి చేయకూడదు. ఇక పిల్లల విషయానికి వస్తే వారు మరీ జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది బాలల చట్టంలోని సె. 23 ప్రకారం నేరమే కాక, ఆ నేరం రుజువైతే వారు తమ ఉద్యోగాన్ని కూడా కోల్పోవలసి ఉంటుంది. మామూలు వ్యక్తులకు, పిల్లలకు బేధం ఉంది.

మామూలు వ్యక్తులు సె. 23 ప్రకారం విచారణను మాత్రమే ఎదుర్కొంటారు. నేర నిరూపణ జరిగితే శిక్ష పడే అవకాశం ఉంది.. పోలీసుల విషయానికి వస్తే శిక్ష మాత్రమే కాక ఉద్యోగాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. నియమాలు ఏర్పరచడంతోనే సరిపోదు. అవి సక్రమంగా అమలు జరిగినప్పుడే అందరిలో, ముఖ్యంగా పోలీసుల్లో మార్పు వస్తుంది.

No comments:

Post a Comment

Followers