Tuesday, April 20, 2010

విడాకులు కోరి, ఉపసంహరించుకోవచ్చా?

విడాకులు కోరి, ఉపసంహరించుకోవచ్చా?

మంగారి రాజేందర్, April 20th, 2010

భార్యాభర్తలు విడాకుల కోసం పరస్పర ఆమోదంతో దరఖాస్తు చేసుకొని తరువాత విడాకుల కోసం ఇచ్చిన ఆమోదం ఉపసంహరించుకోవచ్చా? అనే ప్రశ్నలకి సుప్రీంకోర్టు ఓం ప్రకాశ్ వర్సెస్ శ్రీమతి సురేష్టా దేవి (జె.టి.1991(1) సుప్రీంకోర్టు 321) తెరదించింది.

సె.13 (బి) (1) ప్రకారం స్వచ్ఛందంగా పరస్పర ఆమోదంతో విడాకులకి అంగీకారం తెలిపినప్పటికీ కోర్టు డిక్రీ మంజూరు చేయకముందు ఎప్పుడైనా దంపతుల్లోని ఎవరైనా విడాకుల కోసం ఇచ్చిన అంగీకారాన్ని ఉపసంహరించుకోవచ్చు. దరఖాస్తులోని విషయాల గురించి కోర్టు సంతృప్తి చెందేముందు అంగీకారం విషయంలో పునరాలోచించుకోవడానికి కోర్టు దంపతులకి ఒక అవకాశం ఇవ్వమని, దంపతులు అంగీకారాన్ని డిక్రీ జారీ చేయకముందు ఉపసంహరించుకోవచ్చని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు కె.జె.షెట్టీ, జస్టిస్ ఎస్.సి.అగర్వాల్‌లు అభిప్రాయపడినారు.

కేసు విషయంలోకి వస్తే- సురేష్టాదేవి వివాహం ఓంప్రకాశ్‌తో నవంబర్ 1968లో జరిగింది. ఆరేడు నెలల వరకి వాళ్ళు కలిసి జీవించారు. తరువాత వాళ్ళిద్దరూ కలిసి జీవించలేదు. డిసెంబరు 1984 నుంచి జనవరి 1985 మధ్య కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇద్దరూ కలిసి జీవించారు. కానీ భార్యాభర్తల మాదిరిగా వాళ్ళు జీవించలేదు. ఆ తరువాత జనవరి 8, 1985న ఇద్దరూ కలిసి హమీద్‌పూర్ వెళ్ళారు. కొద్దిసేపు న్యాయవాదితో చర్చించి సె.13 (బి) ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తుని కోర్టులో దాఖలు చేశారు. వాళ్ళిద్దరి స్టేట్‌మెంట్లని కోర్టు నమోదు చేసింది. ఇది జనవరి 8, 1985న జరిగింది. తరువాత జనవరి 15, 1985న తన ఆమోదాన్ని ఉపసంహరించుకుంటూ ఆమె కోర్టులో దరఖాస్తుని దాఖలు చేసింది. తన మీద ఒత్తిడి తెచ్చి, బలవంతం చేసి తన ఆమోదాన్ని పొందినారని ఆమె కోర్టు ముందు దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొంది. జిల్లా కోర్టు ఆ దరఖాస్తుని కొట్టివేసింది.
దీనిపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో అప్పీలుని దాఖలు చేశారు. హైకోర్టు జిల్లా కోర్టు ఉత్తర్వుని కొట్టివేస్తూ విడాకులని మంజూరు చేసింది. ఒకసారి ఆమోదాన్ని తెలిపి ఏకపక్షంగా ఆమోదాన్ని ఉపంహరించుకోవడానికి వీల్లేదని, ఆ విధంగా ఉపసంహరించకున్నా కోర్టు అధికార పరిధి పోదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. స్వచ్ఛందంగా ఆమోదం తెలిపినారా లేదానన్నది మాత్రమే కోర్టు చూడాల్సిన అంశం. ఈ కేసులో భార్య తన ఆమోదాన్ని ఎలాంటి ఒత్తిడి, బెదిరింపులు లేకుండా ఇచ్చింది. అందుకని ఆ ఆమోదానికి ఆమె బద్ధురాలై వుండాలని కోర్టు అభిప్రాయపడింది. విడాకుల డిక్రీని మంజూరు చేసింది.
ఈ విడాకుల డిక్రీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలును దాఖలు చేశారు. సె.13 బి ప్రకారం దరఖాస్తు దాఖలు కాగానే కోర్టు విడాకులని మంజూరు చేయాలని ఈ నిబంధన ఉద్దేశ్యం కాదు. దరఖాస్తు దాఖలు చేసిన తరువాత 6 నెలల నుంచి 18 నెలల వరకి వేచి వుండే వ్యవధిని ఏర్పరిచారు. దీని ఉద్దేశ్యం విడాకుల గురించి దంపతులు పునరాలోచించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వడం. బంధువులు, స్నేహితుల సలహాలవల్ల అభిప్రాయాలని మార్చుకోవడానికి ఈ వ్యవధి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ సంధికాలంలో విడాకుల గురించి రెండవసారి ఆలోచించుకోవడానికి అవకాశం కల్పించడం ఈ నిబంధన ఉద్దేశ్యం. ఆ తరువాత నిర్ణయం తీసుకుని కేసు గురించి ముందుకు వెళ్ళడమా? వద్దా? అన్న నిర్ణయం తీసుకోవడానికి ఉద్దేశించి ఏర్పరచిన నిబంధన. అందుకని సె.13బి (2) ప్రకారం దంపతుల్లో ఎవరైనా పార్టీ కానప్పుడు విడాకులు మంజూరు చేయడానికి అవకాశం లేదు.

గడువు అనేది ఇరువురు పార్టీలు సమష్టిగా తిరిగి ఆలోచించుకోవడానికే కాదు ఇద్దరిలో ఎవరికైనా తిరిగి ఆలోచించుకోవడానికి అవకాశం కల్పించడం. ఎవరైనా మనస్సు మార్చుకొని ఆమోదాన్ని ఉపసంహరించుకునే అవకాశం కల్పించడం నిబంధన ఉద్దేశ్యం. మరోవిధంగా చెప్పాలంటే ఇద్దరిలో ఎవరైనా ఆమోదాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇద్దరూ కలిసి ఉపసంహరించుకోవడం అరుదైన విషయం. తొందరపాటులో విడాకులకి ఆమోదం తెలిపే వాళ్ళు తిరిగి ఆలోచించుకునే అవకాశం నిబంధన కల్పిస్తుంది. ఆమోదాన్ని ఉపసంహరించుకోవడం ఎవరైనా ఒక్కరు చేయవచ్చు. దంపతులు ఇద్దరూ కలిసి చేయవచ్చు. ఇదే ఓంప్రకాశ్ తీర్పులోని సారాంశం.

No comments:

Post a Comment

Followers