Friday, April 16, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు

పరస్పర ఆమోదంతో విడాకులు
April 13th, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందవచ్చు. సె.13 (బి) హిందూ వివాహ చట్టం ప్రకారం ఈ విడాకులు హిందువులు పొందే అవకాశం ఉంది. ఈ నిబంధన ప్రకారం విడాకులు మంజూరు చేయాలంటే కింది అంశాల గురించి కోర్టు సంతృప్తి చెందాల్సి వుంటుంది.

1. ఒక ఏడాది నుంచి, అంతకుమించిగానీ దంపతులు వేరుగా నివసిస్తుండాలి.
2. వాళ్ళిద్దరూ కలిసి నివసించలేని పరిస్థితులు వుండాలి.
3. వివాహం రద్దుకావాలని ఇద్దరూ పరస్పర ఆమోదంతో కోరుకొని ఉండాలి.

ఈ అంశాలు వున్నపుడు సె.13 (బి) ప్రకారం విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దంపతులు ఏవైనా తొందరపాటు వల్ల పిటిషన్ దాఖలు చేశారన్న విషయం తెలుసుకోవడానికి ఆరు మాసాల కాలవ్యవధిని ఏర్పాటు చేశారు. ఈ దరఖాస్తు దాఖలు చేసిన ఆరు మాసాల వరకు విడాకులు మంజూరు చేయడానికి వీల్లేదు. ఆరు నెలల కాలంలో పిటిషన్ ఉపసంహరించుకోవచ్చు. దరఖాస్తు దాఖలైన 6 నెలల తరువాత, 18 నెలల లోపు పిటిషన్ ఉపసంహరణ కానప్పుడు కోర్టు వివాహాన్ని రద్దుచేసి విడాకులు మంజూరు చేయవచ్చు. మంజూరు చేసేముందు పిటిషన్‌లోని విషయాలను గురించి అవసరమైన విచారణ జరిపి దంపతుల వాదనలు విన్న తరువాత వారి వివాహం జరిగిందన్న విషయం ఇంకా పిటిషన్‌లోని ఇతర విషయాలు నిజమైనవని కోర్టు సంతృప్తి చెందాల్సి వుంటుంది.

ఒకసారి ఆమోదం తెలిపి
తరువాత తిరస్కరించవచ్చా?

ఇద్దరూ కలిసి పరస్పర ఆమోదంతో విడాకుల కోసం సె.13 (బి) ప్రకారం దరఖాస్తు చేసుకొని తరువాత దంపతుల్లో ఎవరైనా ఏకపక్షంగా దరఖాస్తుని ఉపసంహరించుకోవచ్చా? అప్పుడు పరిస్థితి ఏమిటీ? ఈ విషయం గురించి భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఆ విధంగా ఉపసంహరించు కోవడానికి వీల్లేదని కొన్ని హైకోర్టులు, ఉపసంహరించు కోవచ్చని మరికొన్ని హైకోర్టులు తీర్పులని ప్రకటించాయి. చివరికి ఓంప్రకాష్ వర్సెస్ శ్రీమతి సురేష్టాదేవి (జె.టి.1991 (1) సుప్రీంకోర్టు 321 కేసులో ఈ సందేహాలకి తెరదించింది.
చంద్రకాంత వర్సెస్ హన్సకుమార్ (1988) 2 హెచ్‌ఎల్‌ఆర్ 173(్ఢల్లీ); ఎఐఆర్ 1989 ఢిల్లీ 73 కేసులో ఢిల్లీ హైకోర్టు ఒకసారి పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి ఆమోదం తెలిపి తరువాత ఏకపక్షంగా ఆమోదాన్ని ఉపసంహరించుకోవడానికి వీల్లేదని అభిప్రాయపడింది. ఒకవేళ ఆ ఆమోదాన్ని మోసంవల్ల ఒత్తిడివల్ల, అనుచిత ప్రభావం వల్ల పొందినప్పుడు, అది రుజువైనప్పుడు మాత్రమే ఆమోదాన్ని ఉపసంహరించుకోవచ్చని అభిప్రాయపడింది.
జయశ్రీ రమేష్ లొంగే వర్సెస్ రమేష్ చికాజీ లోంగే ఎ.ఐ.ఆర్ 1984 బొంబాయి 302, కేసులో దంపతులిద్దరూ పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి సె.13 (బి) ప్రకారం దరఖాస్తుని దాఖలు చేసుకున్నారు. తరువాత సబ్ సెక్షన్ 13 బి (12) ప్రకారం కోర్టు విచారిస్తున్నప్పుడు భర్త తన ఆమోదాన్ని ఉపసంహరించుకున్నాడు. కానీ భార్యనుంచి వేరుగా నివశిస్తున్నాడు. కానీ భార్య విడాకులు కావాలని కోరింది. ఈ పరిస్థితుల్లో విడాకులని మంజూరు చేయలేమని కోర్టు భావిస్తూ కేసుని కొట్టివేసింది. భార్య బొంబాయి హైకోర్టులో అప్పీలుని దాఖలు చేసింది. విడాకుల కోసం సమ్మతి తెలిపే కీలకమైన సమయం దరఖాస్తుని దాఖలు చేసినప్పుడు మాత్రమే. అప్పుడు ఇచ్చిన సమ్మతి స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇస్తే దాన్ని తరువాత ఉపసంహరించుకోవడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవచ్చన్న ఉద్దేశానికే ఆటంకం కలుగుతుందని, అందుకని వివాహాన్ని రద్దుచేసి విడాకులని మంజూరు చేయాలని బాంబే హైకోర్టు తన తీర్పుని ప్రకటించింది.

ఈ తీర్పు ద్వారా రెండు ముఖ్యమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

* సె.13 బి (2) ప్రకారం పూర్తి సమ్మతి చివరిదాకా వుండాలా? లేక
* దరఖాస్తు దాఖలుచేసే సమయానికి (సె.13 (బి) (1) సమ్మతి అంటే సగం వరకు ఉంటే సరిపోతుందా?
ఈ విషయంలో కోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది.

‘‘దరఖాస్తు దాఖలు చేసే సమయంలో ఇచ్చిన సమ్మతి కీలకమైనది. భర్త దరఖాస్తు దాఖలుచేసే సమయంలో అంటే సె.13 (బి) (1) ప్రకారం సమ్మతిని స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇచ్చాడు. అప్పుడు సరైన సమ్మతి లేకుంటే దరఖాస్తుని తిరస్కరించవచ్చు. కానీ ఆ తరువాత ఉపసంహరించుకోవడానికి వీల్లేదు. సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని ఆర్డర్ 23 (5) రూల్, ప్రకారం ఆ విధంగా లేదు.
ఇద్దరూ కలిసి ఉపసంహరించుకోవాలా?
సె.13 బి (2) ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకుల దరఖాస్తు దాఖలు చేసుకొని 6 నెలల కాలం నుంచి 18 నెలల కాలంలో దరఖాస్తుని ఉపసంహరించుకోవచ్చు. ఈ ఉపసంహరణ దంపతుల్లో ఎవరైనా చేసుకోవచ్చా? ఇద్దరూ కలిసి చేసుకోవాల్సి వుంటుందా?
నాచత్తార్ సింగ్ వర్సెస్ హరిచరన్ కౌర్ (ఏఐఆర్ 1986 పంజాబ్ అండ్ హర్యానా 201) కేసులో దంపతులిద్దరూ కలిసి సె.13 బి ప్రకారం పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేసుకున్నారు. కానీ ఆ తరువాత భార్య విడాకులకి ఇష్టం చూపలేదు. కేసుని విచారించిన కోర్టు కేసుని కొట్టివేసింది. భర్త దీనిపై హైకోర్టుకి అప్పీలు చేసుకున్నాడు. హైకోర్టు అతని అప్పీలుని ఆమోదించి, ఈ విధంగా అభిప్రాయపడింది.

‘‘ఒక పార్టీ ఆమోదాన్ని ఉపసంహరించుకునే అవకాశాన్ని చట్టం కల్పించలేదు. ఇద్దరూ కలసి ఉపసంహరిచుకుంటే దరఖాస్తుని కోర్టు కొట్టివేస్తుంది. ఇద్దరూ కలిసి స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా సె.13బి (1) ప్రకారం దాఖలుచేసి, ఆ నిబంధనలోని షరతులని సంతృప్తి పరిచినపుడు తరువాత ఒక పార్టీ ఉపసంహరించుకోడానికి వీల్లేదు
పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవడానికి సమ్మతి ఇచ్చే కీలక సమయం దరఖాస్తుని దాఖలుచేసే సమయం. ఆ తరువాత కాదని ఈ తీర్పుల సారాంశం. ఈ విషయంలో సుప్రీంక్టో ఓంప్రకాష్ కేసులో ఏం చెప్పిందో వచ్చేవారం చూద్దాం. *

*

No comments:

Post a Comment

Followers