Thursday, April 8, 2010

దత్తత - సంరక్షణ - సంరక్షకుని అధికారాలు


April 6th, 2010

మైనర్ పిల్లవాడిని దత్తత ఇచ్చిన వెంటనే వారి తల్లిదండ్రులు సహజ సంరక్షకత్వాన్ని పోగొట్టుకుంటారు. అదేవిధంగా దత్తత తండ్రికి ఆ తరువాత దత్తత తల్లికి సహజ సంరక్షకత్వం లభిస్తుంది. సె.6 ప్రకారం వున్న నిబంధనలే వీళ్ళకి వర్తిస్తాయి. దత్తత తల్లిదండ్రులు చనిపోయిన సందర్భాలలో సహజ తల్లిదండ్రులకి సహజ సంరక్షణ హోదా లభించదు. గార్డియన్ అండ్ వార్డ్స్ చట్ట ప్రకారం సంరక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఈ నిబంధన దత్తత తీసుకున్న మైనర్ బాలికల విషయాలలో వౌనంగా ఉంది. మైనర్ బాలిక విషయంలో సహజ సంరక్షకులు ఎవరన్న విషయంలో సందేహం వస్తుంది. హిందూ మైనారిటీ గార్డియన్ షిప్ చట్టం, 1956కి రాష్టప్రతి ఆమోదముద్ర 25 ఆగస్టు 1956 రోజున లభించింది. ఆ తరువాత 21 డిసెంబర్ 1956 రోజున హిందూ దత్తత మనోవర్తి చట్టానికి రాష్టప్రతి ఆమోదముద్ర లభించింది. హిందూ మైనారిటీ గార్డియన్ షిప్ చట్టం ముందుగా అమల్లోకి వచ్చింది కాబట్టి మైనర్ బాలికల విషయంలో సైలెంట్‌గా ఉందని అనుకోవచ్చు.
అయితే ఆ తరువాత కూడా సవరణ ఎందుకు తీసుకుని రాలేదన్నది అర్ధంకాని విషయం.
హిందూ దత్తత మనోవర్తి చట్టంలోని సె.12 ప్రకారం దత్తత తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులనే అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఈ చట్టంలోని సె.6 ప్రకారం ‘తండ్రి, తల్లి’ అంటే దత్తత తండ్రి, దత్తత తల్లి అని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
సహజ సంరక్షకుడు, మైనరుకు ఆస్తికి లాభం చేకూరే పనులే చేయాలి. అందుకు సంబంధించిన అన్ని వ్యవహారాలు సంరక్షకుడు చేయవచ్చును.
మైనరు ఆస్తిని అమ్మడానికి, తనఖా పెట్టడానికి, దానమీయడానికి కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలం కౌళ్ళకి ఆస్తిని ఇవ్వడానికి వీల్లేదు. మైనరుకు లాభం చేకూరుతుందని కోర్టు భావించినపుడే కోర్టు అనుమతిని ఇవ్వాల్సి ఉంటుంది.
సహజ సంరక్షకుని అధికారాలు
--------------------------------
సహజ సంరక్షకునికి వుండే అధికారాలకి ఈ చట్టం ద్వారా గుర్తింపు వచ్చింది. అయితే చట్టం ఈ అధికారాలకి రెండు పరిమితులని విధించింది.
అవి-
--
* తన వ్యక్తిగత ఒప్పందాలకి మైనర్‌ని బాధ్యున్ని చేయడానికి వీల్లేదు.
* అదేవిధంగా కోర్టు అనుమతి లేకుండా మైనర్ ఆస్తిని బదిలీ చేయడానికి వీల్లేదు. కౌలుని కూడా మైనర్‌కి మెజారిటీ వచ్చిన సంవత్సరం కాలపరిమితికి మించడానికి వీల్లేదు.
అయితే ఈ పరిమితులు మైనర్ ఆస్తి వేరుగా ఉన్నపుడే వర్తిస్తాయి. ఉమ్మడి ఆస్తి అయినపుడు ఇవి వర్తించవు.
పద్ధతి
----
కోర్టు అనుమతి తీసుకోవడానికి గార్డియన్ అండ్ వార్డ్స్ చట్టంలోని సె.31(2) నుంచి 31(4) వరకు వున్న నిబంధనలు వర్తిస్తాయి.
పాత హిందూ లాకి సంబంధించి రెండు ప్రధానమైన మార్పులు కన్పిస్తాయి. అవి-
1.కొన్ని పరిస్థితులలో తల్లి కూడా వీలునామా ద్వారా సంరక్షులని నియమించే అధికారం
2.వీలునామా ద్వారా తండ్రి నియమించిన సంరక్షకుడికి అతను అతని భార్య కన్నా ముందే చనిపోతే ఎలాంటి విలువ లేకుండా పోవడం ఇవి రెండూ కాకుండా మరో ముఖ్యమైన అంశం కూడా ఈ చట్టంలో చోటుచేసుకుంది. అక్రమ మైనర్ సంతానం విషయంలో వీలునామా ద్వారా సంరక్షకుడిని నియమించే అధికారం తండ్రికి లేకపోవడం, తల్లికి తన అక్రమ సంతానానికి వీలునామా ద్వారా సంరక్షకుకుడిని నియామకం చేసే అధికారం సె.4 ద్వారా ఏర్పరచడం. అంటే తల్లికి రెండు సందర్భాలలో వీలునామా ద్వారా సంరక్షకులని నియమాకం చేసే అధికారం వుండటం; తల్లి సక్రమ సంతానం విషయంలో సె.9(3) 9(4)లలో పేర్కొన్నట్టు సంరక్షకుడిని ఏర్పాటుచేసే అధికారం వుండటం.
మరణానికి ముందు
----------------------
ఈ నిబంధన ప్రకారం వీలునామా ద్వారా సంరక్షకుడిని తండ్రి నియమించాలంటే అతను సహజ సంరక్షకుడు అయి వుండాలి. సహజ సంరక్షకుడిగా వ్యవహరించే విధంగా తండ్రి వుండాలి. వీలునామా అనేది మరణం తరువాత అమల్లోకి వస్తుంది. అందుకని మరణానికి ముందు తండ్రి హిందువై వుండాలి. వేరే మతాన్ని స్వీకరించడం ద్వారా, సన్యాసం పుచ్చుకోవడం ద్వారా అతను సహజ సంరక్షకుడి హోదాని పొగొట్టుకోవద్దు.
తండ్రి మరణించిన తరువాత తల్లి బ్రతికి వుంటే
------------------------------------------------
తండ్రి వీలునామా ద్వారా తన మైనరు పిల్లలకి సంరక్షకుడిని నియమించినప్పటికీ తల్లి బతికి వుంటే దీనికి విలువ వుండదు. అప్పుడు తల్లి సహజ సంరక్షకురాలు అవుతుంది. ఆమె వీలునామా ద్వారా మైనర్ పిల్లలకి సంరక్షకులని నియమించవచ్చు. ఆ వ్యక్తి ఆమె మరణం తరువాత ఆ మైనర్ పిల్లలకి వాళ్ళ ఆస్తులకి సంరక్షకులు అవుతాడు. అయితే తల్లి కూడా మరణానికి ముందు సహజ సంరక్షకురాలుగా వుండి వుండాలి. అదేవిధంగా తల్లి ఎలాంటి సంరక్షకులని తన వీలునామా ద్వారా నియమించకుండా చనిపోయినపుడు తండ్రి వీలునామా ద్వారా నియమించిన సంరక్షకుడు ఆ మైనర్ పిల్లలకి సంరక్షకుడు అవుతాడు

No comments:

Post a Comment

Followers