Thursday, October 15, 2009

గృహిణుల చాకిరీకి వెల కట్టగలమా ?

గృహిణుల చాకిరీకి వెల కట్టగలమా ?

ఉద్యోగం చేయని మహిళల పనికి మన సమాజంలో గుర్తింపు లేదు. ఇంటినీ, సంసారాన్ని చక్కదిద్దే పనికి విలువ లేదు. దాన్ని వెలకట్టలేం కానీ వెలకట్టే ముందు కోర్టులు మగవాడి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మహిళ మృతి చెందితే ఆమె ఆదాయాన్ని తెలుసుకోవడం అవసరం. ఆమె ఆదాయాన్ని, ఆమె జీవన ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు ఆమె వారసులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని నిర్ధారిస్తాయి. ఆమెకు ఏమైనా బలమైన గాయాలు ఆయితే ఆమెకు ఇవ్వాల్సిన నష్టపరిహా రానికి కూడా ఆమె ఆదాయ వివరాలు అవసరం. ఆమె ఇంట్లో పనిచేస్తుంది కాబట్టి ఆమె జీతాన్ని, ఆదాయాన్ని అంచనా వేయలేం.

కోర్టులు నష్టపరిహారాలను చెల్లించే ముందు వివిధ అంశా లను పరిగణనలోకి తీసుకుంటాయి. భావ సారూప్యం కలిగిన అన్ని కేసుల్లోని నష్టపరిహార మొత్తాలన్నీ ఒకేలా ఉండాలని లేదు. అందుకని ఒక్కో కేసులోని పరిస్థితులను బట్టి ఒక్కో రకమైన అవార్డుని కోర్టులు నిర్ధారిస్తాయి. ఒకే విధంగా అనిపిస్తున్న ప్రతి కేసులో ఒకే రకమైన నష్టపరిహార మొత్తాన్ని నిర్ణయించాలని శాసనంలో ఎక్కడా పేర్కొనలేదు. ఒక్కో కేసు లోని వివిధ అంశాలను బట్టి నష్టపరిహార మొత్తాలను తమకు న్యాయబద్ధంగా తోచిన విధంగా కోర్టులు నిర్ణయిస్తాయి.

వ్యక్తిగత గాయాలకు నష్టపరిహారం నిర్ణయించడంలో కోర్టు లు ప్రధానంగా, ఆ వ్యక్తికి ఆ గాయాలు కానట్లైతే అతను ఎంతైతే సంపాదించేవాడో ఆ మొత్తాన్ని అతనికి చెందేటట్టుగా నిర్ణయిస్తాయి. అంతే కాకుండా ఆ గాయాల వల్ల బాధితునికి కలిగిన బాధను, వేదనను దృష్టిలో ఉంచుకొని నష్టపరిహార మొత్తాన్ని నిర్ణయిస్తాయి. బాధితునికి కలిగిన బాధనీ, వేదనని డబ్బుతో కొలవలేం. ఆ నష్టాన్ని కోర్టులు ఏ విధంగా పూరించ లేవు. కాబట్టి డబ్బు ద్వారా ఆ నష్టాన్ని పూరించడానికి ప్రయత్నిస్తాయి.
ఎవరైనా వ్యక్తి ప్రమాదంలో మరణించినప్పుడు, ఆ వ్యక్తి ఎంతకాలం వరకు జీవించేవాడో పరగణనలోకి తీసుకొని ఆ కాలపరిమితిలో అతని చట్టబద్ధ ప్రతినిధులకు ఎంత ఆదా యం లభించేదో ఆ మొత్తాన్ని నష్టపరిహార రూపకంగా ట్రిబ్యు నళ్ళు నిర్ధారిస్తాయి. అయితే గృహిణులకు ఎలాంటి ఆదాయం ఉండదు.మరి ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆదాయాన్ని ఎలా అంచనా వేస్తారు?ఈ పరిస్థితులను గమనించి మోటారు వాహన చట్టంలో రెండవ షెడ్యూలును ఏర్పాటు చేశారు. ఆ రెండవ షెడ్యూలు ప్రకారం దంపతుల్లో ఎవరికైనా ఎలాంటి సంపాదన లేనప్పుడు, అందులో రెండవ వారికి సంపాదన ఉన్నప్పుడు ఆ సంపాదిస్తున్న వ్యక్తి ఆదాయంలో మూడవ వంతుగా వారి ఆదాయాన్ని నిర్ణయించాలి.

అంటే గృహిణుల ఆదాయాన్ని ఉద్యోగం చేస్తున్న భర్త ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని కోర్టులు నిర్ణయించి నష్టపరిహారాన్ని మంజూరు చెయ్యాలి. ఆ విధంగా గృహిణుల ఆదాయాన్ని పరిగణన లోకి తీసుకోవడం సరైందేనా? ఇలాంటి ప్రశ్నే మద్రాస్‌ హైకోర్టు ఓ కేసులో వేసుకుంది. నేషనల్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీ వర్సెస్‌ దీపికా కేసులో హైకోర్టు న్యాయమూర్తి ప్రభాశ్రీ దేవన్‌ ఇలాంటి ప్రశ్నే వేసి విషయం గురించి తిరిగి పునఃపరిశీలించాలని కోర్టు అభిప్రాయపడింది.

గృిహణులు ఇంట్లో చేస్తున్న చాకిరినీ, సేవలను మగవాడి జీతంతో కొలవడం సరైందేనా? ఒక వేళ కొలిచినా అతని ఆదా యంలో మూడవ వంతుగా స్వీకరించడం సమంజసమేనా? ఇవీ కోర్టు ఈ తీర్పులో లెవనెత్తిన ప్రశ్నలు 1995లో స్ర్తీల మీద అన్ని రకాల హింసల నుండి విముక్తి (ఇ్ఛఛ్చీఠీ) పత్రం మీద భారత దేశం కూడా సంతకం చేసింది. అంటే మహిళల అభివృద్ధి గురించి మన దేశం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.ఎలాంటి ప్రతి ఫలం లేకుండా మహిళలు చేసే ఇంటి చాిరీకీ ఈ ఒప్పంద పత్రం ప్రకారం కూడా సరైన విలువ కట్ట వలసిన బాధ్యత భారత దేశంపై ఉందని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. మహిళలు ఇంటి బాగు కోసం, అభివృద్ధి కోసం చేసే సేవల వల్ల ఆ ఇల్లు బాగుపడుతుంది. ఫలితంగా దేశం అభివృద్ధి చెందుతుంది. కోర్టు ఈ విధంగా అభిప్రా యపడింది.

హోమ్‌మేడమ్‌ను ఎవరూ విస్మరించరాదు. మర్చిపో కూడదు ఇంటి కార్యభారం తన తల మీద వేసుకొని మగవాడిని విముక్తి చేస్తుంది. అందువల్ల అతను తన పూర్తి సమయాన్ని, దృష్టిని తన సంపాదన మీద, తన ఉద్యోగం మీద పెట్టే అవకా శం కలుగుతుంది. మగవాడు ఆస్తి సంపాదించడానికి ఆమె ఉపకరిస్తుంది’.ఈ నేపథ్యంలో మోటారు వాహన చట్టంలోని రెండవ షెడ్యూలును శాసన కర్తలు తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు నష్టపరిహారం ఇవ్వడానికి కాదు, వైవాహిక ఆస్తిలో వాటా ఇచ్చే విషయంలో కూడా ఈ విషయాన్ని చూడాల్సి ఉంటుంది.

గృహిణుల ఇంటి చాకిరీ గురించి కొత్త కోణంలో ఆలో చించన తీర్పు ఇది. రోటీన్‌గా వచ్చే తీర్పులకి భిన్నమైనది. మగ వాడు ఆస్తిని సంపాదించడంలో గృహిణుల ప్రత్యక్ష సహాయం లేకపోవచ్చు. కానీ పరోక్ష సహాయం ఉంది. ఆర్థికంగా వాళ్ళు ఆస్తి కొనుగొలుతో సహాయం అందించకపోవచ్చు. కానీ వారి సేవల ఫలితమే మగవాడి నిర్వాకం.

ఈ తీర్పు ద్వారా మనకు రెండు విషయాలు స్పష్ట మవు తున్నాయి. మోటారు వాహన చట్టంలోని రెండవ షెడ్యూలు ప్రకారం ఇంటి సేవను, గృహిణుల ఆదాయాన్ని అంచనా వేయ డం సమంజసం కాదు. అదే విధంగా మగవాడు స్వయంగా వివాహం తరువాత సంపాదించిన ఆస్తుల్లో నిగూఢ వాటా ఆడ వాళ్ళది ఉంటుంది. భవిష్యత్తులో ఈ విధంగా చట్టాలు పరి ణామం చెందే అవకాశం ఉందని అనిపిస్తుంది.

1 comment:

  1. రాజేందర్ గారూ !
    నిజమే ! పెళ్ళి అనే బంధంతో సహజీవనం సాగిస్తున్న జంట వారి కుటుంబ ఉన్నతికి సమానంగా బాధ్యులే ! ఎవరి పాత్ర వారు సక్రమంగా పోషించినపుడే జీవితం పరిపూర్ణమవుతుంది. నాదే గొప్ప అనే అహం ఇద్దరికీ పనికిరాదు. కనీసం ఇప్పటికైనా గృహిణుల చాకిరీకి విలువ కట్టే ఆలోచన న్యాయవ్యవస్థలో వచ్చినందుకు సంతోషం. అది అందరి మగవాళ్ళలో కూడా వస్తే బాగుండును.

    ReplyDelete

Followers