Friday, January 23, 2009

24-1-09

క్రిమినల్‌‌స తరపున వాదించకూడదా?


`ఆ న్యాయవాది చాలా మంచి వాడని పేరే. కానీ అతను వాదిస్తున్నది క్రిమినల్‌‌స గురించే కదా' ఇది ఒక మిత్రుడు సంభాషణలో అడిగిన ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలను చాలా మంది అడుగుతూ ఉంటారు. వారి ప్రశ్నలను పూర్తిగా ఖండించలేం. కానీ క్రిమినల్‌‌స అని ఆరోపించిన వ్యక్తుల కేసులను వాదించకూడదా? అది తప్పా?ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించిన కేసుల్లోని నేరస్థులతరఫున ఎవరైనా న్యాయవాది వాదిస్తున్నప్పుడు ఇలాం టి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ నగరాల్లో ఉన్న న్యాయవాదుల సంఘాలు ఆ సంఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటు న్న ముద్దాయి తరఫున తామెవ్వరమూ వాదించమని తీర్మానాలు చేస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని కూడా పూర్తిగా తప్పు పట్టలేం. కానీ ఆ విధంగా తీర్మానాలు తీసుకోవడం సరైందేనా? ఇది మరో ప్రశ్న. ఆ తీర్మానాలకు భిన్నంగా ఎవరైనా న్యాయవాది ఆ సంఘటనల్లో ముద్దాయికి అనుకూలంగా వాదించడానికి నిర్ణయం తీసుకుంటే అతనిపై కూడాదాడి చేస్తున్నారు. ఈ పరిస్థితి మన రాష్ట్రంలోనే తక్కువగా ఉందని చెప్పవచ్చు. మనరాష్ట్రంలో అలాంటి నిందితుల కేసులను చేస్తున్నందుకు విమర్శిస్తున్నారు కానీ దాడులకు పాల్పడటం లేదు. నేరాల్లో ఉన్న తీవ్రతని గమనిస్తే మనస్సు బాధపడుతుం ది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. సంయమనం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.నిథారీ సంఘటనలో అదే జరిగింది. 19 మంది అమ్మాయిలను మానభంగానికి గురిచేసి ఆ తరువాత వాళ్ళని హత్యలు చేశారు. ముద్దాయిలు మణీందర్‌ సింగ్‌ పందార్‌, అతని సహాయకుడు సురేంద్ర కోలి. వీరి కేసులను వాదించకూడదని ఘజియాబాద్‌ న్యా యవాదుల సంఘం నిర్ణయం తీసుకుంది. కొంత మంది న్యాయవాదులు ముద్దాయి పందార్‌ను కోర్టు ఆవరణలోనే కొట్టడం జరిగింది. గుజరాత్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం కూడా ఒక వర్గానికి చెందిన ముద్దాయిల కేసులను వాదించకూడదని తీర్మానం చేసింది. ఇట్లా ఎన్నో న్యాయవాదుల సంఘాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఇందిరా గాంధీ హత్యకేసులో ముద్దాయి తరఫున వాదించడానికి రాంజత్మలానీ నిర్ణ యం తీసుకున్నప్పుడు దేశమంతా ఆయన మీద దుమ్మెత్తిపోసిం ది. కానీ అప్పుడు పరిస్థితి హింసాత్మకంగా పరిణమించలేదు. జత్మలానీ జాతి వ్యతిరేకుడని మాత్రమే అన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నారు. ఉగ్రవాదుల కేసులను ఎవరైనా చేపడితే వాళ్ళమీద దాడులు జరిగే పరిస్థితు లు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది. నూర్‌ మహామ్మద్‌ అనే సీనియర్‌ న్యాయవాది ఉగ్రవాదుల తరఫున వాదించడానికి ముందుకు వస్తే అతనిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. టివిల్లో కూడా ఆ దృశ్యం కన్పించింది. ఉగ్రవాదుల, ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన కేసుల్లోని ముద్దాయిల తరఫున వాదించకూడదా? ఎలాంటి న్యాయవాది లేకుండానే వాళ్ళ కేసులు పురోగతి చెందే అవకాశం ఉందా? మనరాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22 ప్రకారం తన కిష్టమైన న్యాయవాదిని సంప్రదించే అవకాశం ముద్దాయికి ఉంది. అతడు భారతదేశ పౌరుడే కావలసిన అవసరం లేదు. విదేశీయుడికి కూడా ఈ హక్కు ఉంది. అదే విధంగా ఒక వ్యక్తి ఉగ్రవాది అన్న కారణంగా, కరడుకట్టిన నేరస్థుడన్న కారణంగా, కోట్ల రూపాయలను స్వాహా చేసినాడన్న కారణంగా అతని కేసును స్వీకరించకూడదని న్యాయవాది నిర్ణయం తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అలాంటి నిర్ణయం తీసుకుంటే అది న్యాయవాదుల చట్టం 1961 ప్రకారం చెడునడవడికే అవుతుంది. తాను చాలా పనిలో ఉన్నానని కేసును న్యాయవాదులు నిరాకరించవచ్చు. అలాంటి కేసుల్లో ఎక్కువ ఫీజు డిమాండ్‌ చేయవచ్చు. అంతే కానీ ఆ వ్యక్తి నేరస్థుడు, తప్పు చేసిన వ్యక్తిగా ముందే నిర్ధారించి కేసును స్వీకరించడానికి నిరాకరించకూడదు. ఒకవేళ ఎవరైనా న్యాయవాది ఈ కారణాలు చెబుతూ కేసు ను నిరాకరిస్తే బార్‌ కౌన్సిల్‌ అతనిపై చర్య తీసుకునే అవకా శం ఉంది. కొన్ని కేసులను స్వీకరించడం వల్ల న్యాయవాదులు ప్రజాదరణ కోల్పోవచ్చు. తాను ప్రజాదరణ కోల్పోతున్న కారణంగా కేసులను నిరాకరించే అవకాశం లేదు. అయినప్పటికీ కొన్ని న్యాయవాదుల సంఘాలు ఉగ్రవాదుల కేసులను, తీవ్రమైన నేరం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొం టున్న వ్యక్తుల కేసులను తమ సంఘ సభ్యులు ఎవరూ స్వీకరించరాదన్న చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుం టున్నాయి. ప్రతి నేరస్థుడు తనకిష్టమైన న్యాయవాదిని నియమించుకోవచ్చు. న్యాయవాదిని నియమించుకునే స్తోమత, ఆర్థిక వనరులు అతనికి లేకుంటే `రాజ్యమే' అతనికి న్యాయవాదిని నియమించాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం అతనికి ఉన్న హక్కు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.304 కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39.ఎ ప్రకారం ప్రతి వ్యక్తికి న్యా య సహాయాన్ని అందజేయాల్సిన బాధ్యత రాజ్యంపై ఉంది. హుస్సే నియిరా ఖాటూన్‌ కేసుల్‌ (ఏ.ఐ.ఆర్‌ 1979 సుప్రీంకోర్టు 1369), అదేవిధంగా సుఖ్‌దాస్‌ మరి ఇతరులు (1986 క్రిమినల్‌ లా జర్నల్‌1084) కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది.`ఆర్థిక స్థోమత లేకపోవడంవల్ల ఎవరైనా ముద్దాయి న్యాయవాదిని నియమించుకోనప్పుడు, కోర్టు అతనికి న్యాయవాదిని ప్రభుత్వ ఖర్చులమీద నియమించాలి. అతను న్యాయసహాయం కోరకున్నా కోర్టే అతనికి ఈ విషయం వివరించి న్యాయసహాయాన్ని అందించాలి. ఒకవేళ ఎలాంటి న్యాయ సహాయం (న్యాయవాది లేకుండా) అందకుండా అతనికి శిక్ష విధిస్తే ఆ శిక్షకి ఎలాంటి విలువా లేదు'.నేర„స్థుణ్ణి కోర్టు ముందు రిమాండ్‌కోసం ప్రవేశపెట్టిన దశ నుంచి అప్పీలు దశ వరకు అతనికి న్యాయసహాయం అందించాలి. న్యాయవాదిని నియమించుకొని అతను ము ద్దాయికి కోర్టు ముందు ప్రాతినిధ్యం వహించక, ఆ ముద్దాయికి శిక్షపడితే ఆ శిక్ష చెల్లదని ముంబాయి హైకోర్టు (క్రిమినల్‌ అప్పీలు నెం.487/2008) రాంచంద్ర నివృత్తి కేసులో ఈ మధ్యనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయవాద సంఘాల నిర్ణయాలు అసంబద్ధంగా కన్పిస్తాయి. ముద్దాయి కి శిక్షపడాంటే కూడా న్యాయవాది అవసరమే. న్యాయవాది లేకుండా విచారణ జరిగే అవకాశం లేదు. జరిగినా ఆ తీర్పుకు విలువ లేదు. ఎవరైనా వ్యక్తి నేరం చేశాడా లేదా అన్న విషయం రుజువు కావాలి. అలా కాకుండా ఒక వ్యక్తి `ఉగ్రవాది' అనో లేదా తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసులో ముద్దాయి అనో చెప్పితే సరిపోతుందా? అతను అమాయకుడు కూడా అయిఉండే అవకాశం ఉంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఆరుషి హత్యకేసులో తండ్రిని అరెస్టు చేశారు. ఆ తరువాత అతనికి నేరంతో సంబంధం లేదని సి.బి.ఐ పేర్కొంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం న్యాయవాదులకు ఎంతోఉంది. ఇలాంటి అభిప్రాయాలు బలపడటానికి మీడియా కూడా కారణం. లం డన్‌ దాడుల్లో ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం న్యాయ సహాయం అందించింది. అదే విధంగా అమెరికా! మనరాజ్యాంగంకూడా అదే విషయాన్ని చెబుతోంది. న్యాయవాదు ల వృత్తి ముద్దాయిని రక్షించడం మాత్రమే కాదు, న్యాయం లభించేట్టు చూడడం. అందుకోసం కోర్టుకు సహకరిం చడం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదు.

నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers