Wednesday, June 30, 2010

మానభంగ యత్నం అంటే..!?
June 29th, 2010

హత్యాప్రయత్నం గురించి, ఆత్మహత్యా ప్రయత్నం గురించి, దోపిడీ యత్నం గురించి భారతీయ శిక్షాస్మృతిలో ప్రత్యేకమైన నిబంధనలు వున్నాయి. వాటికి శిక్షలు కూడా వున్నాయి. కానీ మానభంగ యత్నం గురించి ప్రత్యేకమైన నిబంధన ఏదీ లేదు. ఎవరైనా వ్యక్తి మానభంగయత్నం గురించి -ఉద్దేశపూర్వకంగా తయారై నేరం చేయడానికి ప్రయత్నం చేసినపుడు దాన్ని మానభంగ యత్నం అంటారు.
ప్రయత్నం అనేది కేసునిబట్టి, ఆ కేసులోని పరిస్థితిని బట్టి మారుతూ వుంటుంది. ప్రయత్నం (ఎట్టంప్ట్)కి, తయారుకి (ప్రెపరేషన్) బేధం వుంది. ఎప్పుడైతే తయారై అనేది అంతం అవుతుందో అక్కడ ప్రయత్నం మొదలవుతుంది.
నేరం చేయడంలో నాలుగు దశలు వుంటాయి. అవి
* ఉద్దేశం
* తయారు
* ప్రయత్నం
* సఫలం
నేరం చెయ్యాలన్న తలంపు రావడమే ఉద్దేశ్యం. ఆ నేరం చేయడానికి తయారు కావడమనేది రెండవ దశ. ఆ నేరం చేయడానికి ఉద్రిక్తమై ప్రయత్నం చేయడం మూడో దశ. ఆ ప్రయత్నం సఫలమైతే నేరం పూర్తవుతుంది.
రేప్ నేరంలో, మానభంగ యత్నం నేరంలో మహిళల గౌరవ మర్యాదలపై దాడి వుంటుంది. ఎవరైనా స్ర్తిని దౌర్జన్యంగా చేయిపట్టుకుని కౌగిలించుకోవడానికి లాగినప్పుడు, బలవంతంగా ముద్దు పెట్టుకున్నప్పుడు ఇంకా ఏవైనా అగౌరవ చర్యలకి పాల్పడినప్పుడు అది గౌరవ మర్యాదలకి భంగం కలిగించినట్టవుతుంది. స్ర్తి గౌరవం సెక్స్‌తో ముడిపడి వుంటుంది. ఇలాంటి చర్యలు భారతీయ శిక్షాస్మృతిలోని సె.354 ప్రకారం నేరకృతము.
ఒకవేళ మహిళ గుడ్డలు ఊడదీసి నేలమీద పడేసి ఆ వ్యక్తిపై పడుకుని శారీరక సంభోగానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు అతను మానభంగ యత్నం నేరం చేసినవాడవుతాడు. అతను భారతీయ శిక్షాస్మృతిలోని సె.376 రెడ్‌విత్ 511 ప్రకారం శిక్షార్హుడవుతాడు. రేప్ నేరానికి వున్న శిక్షే, మానభంగ యత్నానికి ఉంటుంది.
మదన్‌లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్తాన్ (1986 ఆర్.ఎల్.డబ్ల్యు 377) కేసులో ముద్దాయి -అమ్మాయి సల్వార్ కమీజు తీసివేసి తన పైజామా కూడా తీసివేసి కిందపడేసాడు. ఆ తరువాత ఆమె అరవకుండా ఆమె నోట్లో బట్టలు కుక్కాడు. శారీరక సంభోగం కోసం ఆమెపై పడుకున్నాడు. అటువైపు వచ్చిన కొంతమంది అతన్ని లాగివేసారు. వాళ్లు రానట్టయితే అతను ఆమెను మానభంగానికి గురిచేసేవాడే. ఇది మానభంగ యత్ననేరం.
కౌగలించుకోవాలని మహిళలని చేయిపట్టుకుని లాగితే అది సె.354 ప్రకారం నేరం. ఇంకా కాస్త ముందుకు వెళ్లి బట్టలు విప్పదీసి మానభంగం చేయడానికి ప్రయత్నించి విఫలమైతే అది సె.376 ఆర్/డబ్ల్యు 511 ప్రకారం నేరం. మానభంగం చేయడంలో సఫలం అయతే, అది మానభంగం. ఆ వ్యక్తి సె.376 ప్రకారం శిక్షార్హుడవుతాడు.
శారీరక సంభోగం జరపాలన్న దృఢ నిశ్చయం వుండి విఫలమైనప్పుడు అది మానభంగ యత్నం అవుతుంది. ఖచ్చితమైన దృఢ నిశ్చయం లేనప్పుడు గౌరవ మర్యాదలపై దాడి అవుతుంది.
చేయి పట్టుకోకుండా రోడ్డుమీదున్న మహిళను ఉద్దేశించి కారుకూతలు కూసినా, సైగలు చేసినా, పాటలు పాడినా అది స్ర్తిని అవమానించడమే అవుతుంది. అలాంటి వ్యక్తులు సె.509 ప్రకారం శిక్షార్హులవుతారు. ప్రేమ లేఖలు రాయడం కూడా సె.509 ఐపిసి ప్రకారం నేరమవుతుంది

1 comment:

  1. మంగారి రాజేందర్ గారు
    మీరు తెలుగులో చట్టాలను చాలా బాగా వివరించారు. మన చట్టాలను మన మాతృభాషలో చదువుకోవడం ప్రతివారికీ చాలా అవసరం మరియు ఇష్టం. సామాన్యులకే కాక 'లా ' విద్యార్థులకు కూడా ఉపయోగకరం.

    ధన్యవాదములు.

    దుర్గా ప్రసన్న

    ReplyDelete

Followers