Tuesday, June 22, 2010

కామోద్రేకం కారణంగా చూపి శిక్ష తగ్గించవచ్చా?

కామోద్రేకం కారణంగా చూపి
శిక్ష తగ్గించవచ్చా?
June 22nd, 2010

బాధితురాలు హోస్కోట్‌లోని ఓ క్లినిక్‌లో నర్స్‌గా పనిచేస్తోంది. బెంగళూరు నుంచి హాసన్ వెళ్తున్నప్పుడు ఇద్దరు ప్రయాణీకులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ ప్రయాణంలో పరిచయం స్నేహంగా మారింది. ఆమె వెళ్లాల్సిన ఊరుకి సరైన సమయంలో వెళ్లడానికి సహకరిస్తామని వాళ్లు ఆమెకు చెప్పారు. వాళ్లు ఆమెను భోజనానికని రెస్టారెంట్‌కి, తరువాత బి.జి.కె లాడ్జికి తీసుకొని వెళ్ళారు. వాళ్లు ముగ్గురూ లాడ్జిలో ఉన్నారు. లాడ్జీ ప్రక్కన రూంలో డ్యూటీకి వచ్చిన గోశాల అనే కానిస్టేబుల్ ఉన్నాడు. బాధితురాలు మంచం మీద పడుకుంది. ఇద్దరు (ముద్దాయిలు) క్రింద పడుకున్నారు. కొంతసమయం గడిచాక రూంలోని లైట్లు ఆరిపోయాయి. క్రిష్ణ (ముద్దాయి నెం.2) వచ్చి ఆమె ప్రక్కన పడుకున్నాడు. క్రింద దోమలు కుడుతున్నాయని చెప్పాడు. ఆమె అభ్యంతరాన్ని తెలియచేసింది. కొద్దిగా అరిచింది. రాజు (ముద్దాయి 1) లేచి కర్చీప్‌తో ఆమె నోటిని మూసివేశాడు. అరవొద్దని బెదిరించాడు. తరువాత క్రిష్ణని బయటకు పంపించి రూం గొళ్ళెం పెట్టాడు. ఆమె వ్యతిరేకతని లెక్కచేయకుండా శారీరక సంభోగం కావాలని కోరాడు. వివాహం చేసుకుంటే తప్ప అలాంటి అవకాశం లేదని ఆమె చెప్పింది. అప్పుడే తలుపుని రెండవ ముద్దాయి తట్టాడు. తలుపు తీసిన తరువాత అతను లోనికి వచ్చాడు. మొదటి ముద్దాయి బయటకు వెళ్లిపోయాడు. రెండవ ముద్దాయి కత్తితో ఆమెను బెదిరించి ఆమె నోరు మూసి ఆమెను మానభంగం చేశాడు. కాసేపటికి ఆమె నోరు పెగిలించుకొని అరిచింది. రూం బాయ్, ఇంకా కొంతమంది అరుపులు విని తలుపుని తట్టారు. బట్టలు వేసుకొని మొదటి ముద్దాయి తలుపు తీశాడు. జరిగిన విషయం లోనికి వచ్చిన వ్యక్తులకి, కానిస్టేబుల్ గోపాల్‌కి ఆమె చెప్పింది. హాసన్ పోలీసుస్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షలకి పంపించారు. ఆమెపై శారీరక సంభోగం జరిగిందని, కనె్నపొర ఇటీవలనే చెదిరిందని ఆమె రహస్య అవయవాల మీద గాయాలు వున్నాయని వైద్య పరీక్షల్లో తేలింది.
కేసుని విచారించిన సెషన్స్ జడ్జి రేప్ నేరం మొదటి ముద్దాయి చేశాడని నిర్దారించాడు. రెండవ ముద్దాయి నేరం చేశాడని ఎలాంటి అనుమానానికి తావు లేకుండా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని, రెండవ ముద్దాయిపై కేసుని కొట్టివేశాడు. ముద్దాయి యుక్తవయస్సుని దృష్టిలో పెట్టుకొని, బాధితురాలు ఆ రూంలో స్వచ్ఛందంగా వచ్చి వుందని, రేప్ కూడా క్షణికమైన కామోద్రేకంలో జరిగిందన్న కారణాలవల్ల మొదటి ముద్దాయికి కూడా సెషన్స్ జడ్జి అతి తక్కువ శిక్ష అంటే కోర్టు అయిపోయేంతవరకు శిక్ష మరియు రూ.500ల జరిమానాని విధించారు.
ఈ తీర్పుకి వ్యతిరేకంగా ‘స్టేట్’ అప్పీలుని వేసింది. అప్పీలుని విచారించిన హైకోర్టు రేప్ నేరం ఇద్దరు ముద్దాయిలు చేశారని రుజువైందని, మొదటి ముద్దాయికి శిక్షను హెచ్చించింది. రెండవ ముద్దాయికి శిక్షను విధించింది. ఇద్దరికీ ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షని హైకోర్టు విధించింది.
ముద్దాయి సుప్రీంకోర్టులో అప్పీలు వేశారు. సుప్రీంకోర్టు రేప్ నేరాన్ని ముద్దాయిలు ఇద్దరూ చేశారని నిర్ధారించింది. కానీ శిక్ష విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించింది. బాధితురాలు ఆమె ఊరు చేరడానికి సహాయం చేయాలన్న ఉద్దేశ్యమే ముద్దాయిలిద్దరికీ మొదట వుందని, తరువాత ఒకే రూంలో వుండంవల్ల వాళ్ళు కామోద్రేకానికి గురై నేరం చేశారని సుప్రీంకోర్ట వ్యాఖ్యానించింది. ఈ కారణాలవల్ల సుప్రీంకోర్టు శిక్షను ముద్దాయిలకు తగ్గిస్తున్నామని చెప్పింది.
* ముద్దాయిలు చాలా చిన్న వయస్సులో వున్నారని
* ఒకే రూంలో వుండటంవల్ల కామోద్రేకం నుంచి బయటపడలేక, డీసెన్సీనీ, నైతిక విలువల్ని కోల్పోయి, రేప్ నేరం చేశారని
* రేప్ నేరం చాలా రోజుల క్రితం జరిగిందని ఈ కాలంలో ముద్దాయిలు తీవ్రమైన మానసిక వేధనకి గురైనారని, వాళ్ళ ప్రతిష్టకు కూడా భంగం కలిగిందని
ఈ కారణాలవల్ల తక్కువ శిక్ష విధించడం వల్ల న్యాయం చేకూరుతుందని భావిస్తూ సుప్రీంకోర్టు ముద్దాయిలకి మూడు సంవత్సరాల శిక్షని విధించింది. (రాజు, క్రిష్ణ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఏ.ఐ.ఆర్. 1994 సుప్రీంకోర్టు 222=1994 క్రిమినల్ లా జనరల్ 248)
ఈ శిక్షని తగ్గించడం విషయంలో మహిళా సంఘాలు తీవ్రమైన అభ్యంతరాలని లేవనెత్తి ఆందోళనలు చేశాయి. వాళ్ళు లేవనెత్తిన అభ్యంతరాలు -
* నేరం జరిగేటప్పుడు ముద్దాయిల వయస్సు 24 మరియు 21 సంవత్సరాలు. అంటే వాళ్లు చేస్తున్న చర్య ఫలితాలు వాళ్లకి తెలుసు. అందుకని వాళ్లకి జువెనైల్ జస్టిస్ చట్టం వర్తించదు. అదే విధంగా ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్ చట్టం కూడా వర్తించదు.
* ఒకే రూంలో వుండటంవల్ల కామోద్రేకం నుంచి బయటపడ లేకపోయ్యారనడానికి గల కారణాలు వివరించలేదు.
* రేప్ నేరం చాలా సంవత్సరాల క్రితం జరిగిందని, ఈ కాలంలో ముద్దాయి తీవ్రమైన మానసిక వేదనకి గురైనారని వాళ్ల ప్రతిష్టకి భంగం కలిగిందని సుప్రీంకోర్టు శిక్షను తగ్గించింది కానీ ఈ జాప్యానికి కారణం బాధితురాలు కాదు. అదేవిధంగా ఈ పదిహేను సంవత్సరాల్లో బాధితురాలు ఎంతటి మనోవేదనకి మానసిక సంఘర్షణకి గురైందో సుప్రీంకోర్టు శిక్ష తగ్గించేప్పుడు పరిగణనలోకి తీసుకోలేదు.
శిక్షను తగ్గించడానికి సరైన ప్రత్యేకమైన కారణాలు వుండాలి. వాటిని చట్టం నిర్వచించలేదు. *

No comments:

Post a Comment

Followers