Wednesday, June 9, 2010

సె.498ఎ’లో రాజీపడవచ్చా?

సె.498ఎ’లో రాజీపడవచ్చా?
- మంగారి రాజేందర్
June 8th, 2010

భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తిన తరువాత భార్యలు పెట్టే కేసు 498ఎ. భారతీయ శిక్షాస్మృతిలోని సె.498ఎ ప్రకారం ఈ కేసులని దాఖలు చేస్తుంటారు. భార్యని భర్తగాని అతని బంధువులు గానీ శారీరకంగా, మానసికంగా హింసిస్తే ఈ నిబంధన ప్రకారం కేసు పెట్టే అవకాశం వుంది.కొన్ని సందర్భాలలో స్ర్తిలు అనుమానాస్పద పరిస్థితులలో మరణిస్తారు. ఆ స్ర్తిలు వివాహితులై ఏడు సంవత్సరాలలో మరణించి, మరణానికి ముందు వరకట్నం కోసం వేధింపులు వుంటే అది సె.304 బి ప్రకారం నేరమవుతుంది. అదేవిధంగా వివాహిత ఆత్మహత్య చేసుకునే విధంగా భర్తగానీ అతని బంధువులు ప్రవర్తిస్తే వాళ్ళపై భారతీయ శిక్షాస్మతిలోని సె.306 ప్రకారం కేసు పెట్టే అవకాశం వుంది. అదేవిధంగా కొట్టినప్పుడు కూడా భారతీయ శిక్షాస్మృతిలోని సె.324 ప్రకారం కేసులు పెట్టే అవకాశం వుంది. కొన్ని సందర్భాలలో కేసు విచారణలో వుండగా భార్యాభర్తలు రాజీపడాలని అనుకుంటారు. ఇలాంటి సందర్భాలలో భారతీయ శిక్షాస్మృతిలోని సె.498ఎ ప్రకారం దాఖలు చేసిన కేసుని రాజీపడటానికి అవకాశం వుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ వుంటే ఏ దశలో రాజీ చేసుకోవచ్చు. రాజీపడటం అంటే ఏమిటి? రాజీపడదగ్గ నేరాలు అంటే ఏమిటి?
కేసులో మూడు రకాలు-
* కాగ్నిజబుల్ - నాన్ కాగ్నిజబుల్
* బెయిలబుల్ -నాన్ బెయిలబుల్
* రాజీపడే నేరాలు - రాజీపడటానికి అవకాశం వున్న నేరాలు
రాజీ పడే నేరాలు
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.320లో ఓ పట్టికను ఇచ్చి అందులో కోర్టు అనుమతితో, కోర్టు అనుమతి లేకుండా రాజీపడే నేరాలని వర్గీకరించారు. ఈ పట్టికలో సూచించిన నేరాలు మాత్రమే రాజీపడటానికి వీలున్న నేరాలు. భారతీయ శిక్షాస్మృతిలోని నేరాలుని మాత్రమే ఈ పట్టికల్లో పొందుపరిచారు. భారతీయ శిక్షాస్మృతి అనేది ప్రభావ శాసనంగా తయారుచేశారు కాబట్టి అందులోని నేరాలు మాత్రమే ఇందులో వుండేవి. అయితే ఆ తరువాత చాలా చట్టాలు వచ్చాయి. వాటిని ఈ పట్టికలో పొందుపరచటం సాధ్యంకాదు. అందుకని వాటి గురించి వేరుగా ఆయా చట్టాల్లోనే అవి రాజీపడటానికి వీలున్న నేరాలా? కాదా అన్న విషయాలని పేర్కొంటారు. భారతీయ శిక్షాస్మృతిలో చేర్చిన నిబంధన సె.498ఎ. ఈ నిబంధన రాజీపడటానికి వీల్లేని నేరం. అయితే ఈ విధంగా వుంచడంవల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కలిసి జీవించాలని అనుకునే భార్యాభర్తలకి ఆటంకాలు ఏర్పడుతున్నాయని శాసనకర్తలు భావించి మన రాష్ట్రంలో దీన్ని రాజీపడటానికి వీలున్న నేరంగా సె.320కి మార్పులు చేసుకొని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ చట్టం 11/2003 ద్వారా ఈ మార్పులు తీసుకొని వచ్చారు. 1.8.2003 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. అయితే ఒక షరతుని విధించారు. రాజీ దరఖాస్తు చేసుకున్న తేదీనే ఈ నేరాన్ని రాజీపడటానికి అవకాశం వుండదు. రాజీపడటానికి దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి మూడు నెలలు దాటిన తరువాతనే ఈ నేరాన్ని రాజీ చేసుకోవచ్చు. అయితే ఈమధ్యకాలంలో రాజీచేసుకునే పార్టీలలో ఎవరూ కూడా దరఖాస్తుని ఉపసంహరించుకోకుండా వుండాలి.
రాజీ ఏ విధంగా చేసుకుంటారు?
* రాజీ కోసం ప్రయత్నాలు కోర్టు వెలుపల జరుగవచ్చు, కోర్టులో జరుగవచ్చు.
* కోర్టు అనుమతితో రాజీ చేసుకునే నేరాలని వెంటనే రాజీచేసుకోవడానికి అవకాశం వుండదు. కోర్టు అనుమతి తీసుకున్న తరువాతనే రాజీ చేసుకోవచ్చు. మిగతావి వెంటనే రాజీ చేసుకోవచ్చు.
* రాజీ చేసుకున్నారా? అన్న విషయాన్ని కోర్టు పరిశీలించి కేసుని రాజీ చేస్తుంది. కోర్టు అనుమతి ఇవ్వాల్సిన నేరాలకి సంబంధించి కోర్టు తన విచక్షణాధికారాలని ఉపయోగిస్తుంది. ఆ తరువాతనే అనుమతి ఇస్తుంది.
* పార్టీలు రాజీచేసుకున్న ముద్దాయి కేసు నుంచి విడుదల అవుతాడు.
* చిన్న పిల్లల (మైనర్) విషయంలో పెద్దవాళ్ళు రాజీపడటానికి అవకాశం వుంది.
* అప్పీలు దశలో కూడా కేసులని రాజీ చేసుకునే అవకాశం వుంది.
* బాధితులు మాత్రమే రాజీ చేసుకునే అవకాశం వుంది.
సె.498.ఎ నేరం కోర్టు అనుమతితో రాజీ చేసుకునే వీలున్న నేరం. అనుమతి ఇచ్చిన తరువాత మూడు మాసాల తరువాత రాజీపడాల్సి వుంటుంది. పార్టీలు. పార్టీలు ఈ మూడు మాసాల కాలంలో పునరాలోచించుకోవటానికి అవకాశం వుంటుంది.

No comments:

Post a Comment

Followers