Tuesday, March 30, 2010

తల్లి సహజ వారసురాలు కాదా?

తల్లి సహజ వారసురాలు కాదా?
March 23rd, 2010

తండ్రి తరువాత తల్లి వారసురాలు అవుతుందా? లేదా తండ్రి వుండగానే తల్లి సహజ వారసురాలిగా వుండటానికి అవకాశం వుందా? ఈ విషయం ‘గీతా హరిహరన్’ మరి ఒక్కరు వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ 1999 (2) ఎస్.సి.సి.228 కేసులో తలెత్తింది. ఈ కేసులో తల్లి కూడా సహజ సంరక్షకురాలని కోర్టు తీర్పుని ప్రకటించింది. కేసులోని విషయాలకు వస్తే మొదటి వాది రెండవ వాది భార్య గీతా హరిహరన్ రచయిత్రి. చాలా పుస్తకాలని ప్రచురించింది. ఆమె భర్త జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో మెడికల్ సైంటిస్ట్. వాళ్ళిద్దరూ సంయుక్తంగా 10-12-1984 రోజున రిలీఫ్ బాండ్‌లు తమ కొడుకు పేరు మీద ఇవ్వమని దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరూ కలిసి మొదటి వాది గీతా హరిహరన్ కొడుకుని సంరక్షకురాలిగా వ్యవహరిస్తుందని తమ దరఖాస్తులో పేర్కొన్నారు. కొడుకు పేరు మీద డబ్బుని పెట్టుబడి పెడుతున్నామని అది కొడుకు కోసమని కూడా దరఖాస్తులో పేర్కొన్నారు. గీతా హరిహరన్ సంరక్షకురాలిగా నిర్ణీత ఫారమ్‌లో సంతకం చేసింది.
ఆమెను సంరక్షకురాలిగా రిజర్వ్‌బ్యాంక్ ఆమోదించలేదా. తండ్రిని సంరక్షురాలిగా పెట్టమని లేదా యోగ్యతగల కోర్టునుంచి సంరక్షకురాలిగా నియమించినట్టు ఉత్తర్వులు తీసుకొని రావాలని రిజర్వు బ్యాంక్ వాళ్ళకి జవాబుని ఇచ్చింది. దీనిపై వాళ్ళు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ని దాఖలు చేసి హిందూ మైనారిటీ గార్డియన్ యాక్ట్ 1956లోని సె 6 (ఎ) అదేవిధంగా గార్డియన్ అండ్ వార్డ్ చట్టంలోని సె.19(బి)లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 150కు విరుద్ధంగా వున్నాయని, వాటిని తొలగించాలని రిట్ పిటిషన్ని దాఖలుచేశారు. అదేవిధంగా మొదటి ప్రతివాది డబ్బుని స్వీకరించేట్టు గీతా హరిహరన్‌ని సంరక్షకురాలిగా ఆమోదించేట్టు రిట్ ఆఫ్ మాండమస్ ఉత్తర్వులు జారీచేయాలని కోర్టుని కోరినారు.
హిందూ మైనారిటీ గార్డియన్ చట్టంలోని 1956 సె. 6 (ఎ) ప్రకారం తల్లి సహజ వారసురాలు కాదని, అందుకని వాళ్ళ దరఖాస్తును రిజర్వుబ్యాంక్ ఆమోదించకపోవడం సరైందేనని తమ జవాబులో రిజర్వుబ్యాంక్ పేర్కొంది. ఇలాంటి మరో కేసు (తీ.ఔ(ష)10/6/1991) కేసు కూడా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఆ కేసులో వాది భార్య మొదటి ప్రతివాది ఆమె భర్త వాది ప్రకారం- ప్రతివాది తరచూ స్కూల్‌కి, తనకి ఉత్తరాలు రాసి తాను సహజ సంరక్షకుడనని రాస్తున్నాడని అందుకని ఆ రెండు నిబంధనల్ని కొట్టివేయాలని రిట్‌పిటిషన్ని దాఖలుచేసింది. ఈ రెండింటిలో తలెత్తిన అంశం ఒక్కటే కాబట్టి, ఈ రెండింటిని కలిపి సుప్రీంకోర్టు విచారించి తీర్పుని ప్రకటించింది.తండ్రి తరువాత తల్లిని సహజ వారసురాలిగా ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని వారి న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టు ముందు వాదించింది.

తీర్పులోని సారాంశం
-----------------------
‘తండ్రి ఆ తరువాత తల్లి’ అన్న అభివ్యక్తి ప్రకారం తండ్రి జీవిత కాలం తరువాత తల్లి సహజ సంరక్షకురాలు అన్న అభిప్రాయం కలుగుతుంది. మైనర్ సంక్షేమం అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైన విషయమని దాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టులు ఎవరు సహజ సంరక్షకులో నిర్థారించాల్సి వుంటుంది. అవసరమైనప్పుడు తండ్రి జీవితకాలంలో అతని స్థానంలో తల్లిని సంరక్షకురాలిగా నియమించవచ్చు. ఇంకా ఎవరినైనా కోర్టు నియమించవచ్చు.
‘తరువాత’ అన్న పదాన్ని తప్పనిసరిగా తండ్రి జీవితం తరువాత అన్న అర్ధంలో తీసుకోవద్దని దాన్ని తండ్రి పరోక్షంలో అని భావించాలి. పిల్లవాడిని అతని ఆస్తిని తండ్రి సంరక్షించలేనప్పుడు, ఇతర కారణాలు వున్నప్పుడు అతను అవాస్తకంగా వున్నప్పుడు, అతను తల్లితో నివశిస్తున్నప్పటికీ అతని స్థానంలో తల్లి సంరక్షకురాలిగా ఉండవచ్చు. అదేవిధంగా తల్లీ తండ్రి ఇద్దరు పరస్పర ఆమోదంతో వున్నప్పుడు తల్లిని సంరక్షకురాలిగా చూడవచ్చు. తండ్రి సంరక్షకురాలిగా వుండలేని అనారోగ్యంతో వున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులలో తల్లి సహజ సంరక్షకురాలిగా భావించవచ్చు. సె.4, 6లని సంయుక్తంగా చదివినపుడు అర్థమవుతున్నది అదే.ఇలాంటి పరిస్థితులలో తల్లిని సహజ సంరక్షకురాలిగా చూడాలి. అదేవిధంగా శారీరక లేక మానసిక అశక్తతవల్ల అతను సంరక్షకునిగా వ్యవహరించలేని పరిస్థితులు వుండవచ్చు. అపుడు తల్లి సహజ సంరక్షకురాలిగా వ్యవహరించవచ్చు. తండ్రి బతికి వున్నప్పటికి ఆమె చర్యలు చట్టబద్ధమైనవే. అలాంటప్పుడు ఆమె చర్యలు అతని పరోక్షంలో అని భావించాల్సి వుంటుంది. సె.6(ఎ) ప్రకారం సరైనదని భావించాల్సి వుంటుంది.’’ ఈ పరిశీలనకు నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ గీతా హరిహరన్ దరఖాస్తు పరిష్కరించాలని ఆదేశించింది.

*
*
*

*

No comments:

Post a Comment

Followers