Friday, January 30, 2009

>>సిగరెట్లు తాగే దృశ్యాలు, కోర్టు తీర్పు<

కథల్లో, నవలల్లో, సినిమాల్లో జీవితం ఉండాలి. జీవన విధానమూ ఉంటుంది. వాటిలో సిగరెట్‌ తాగడం ఉంటుంది. మద్యపానం ఉంటుంది, దొంగతనాలూ, దోపిడీలూ ఉంటాయి. అవేవీ లేకుండా సినిమా తీయడం సాధ్యం కాదు. సినిమాకానీ, కథకానీ, నవలకానీ ఏ విషయాన్ని చెబుతోంది, దాని సారాంశంఏమిటీ అన్నది ప్రధానమైన విషయం. అవి సమాజ హితం కోరుతున్నాయా లేదా అన్న విషయాన్ని చూడాల్సి ఉంటుంది.


సినిమాల్లో సిగరెట్‌ తాగే దృశ్యాలను ప్రభుత్వం నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడాన్ని నిషేధించిన ప్రభుత్వం సినిమాల్లో కూడా పొగ తాగకూడదని ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం ఈ విధంగా పొగతాగడాన్ని నిషేధించడం సరైందేనా? రాజ్యాంగం పౌరుల, ముఖ్యంగా సినిమాలు తీసే వ్యక్తు ల భావప్రకటనా స్వేచ్ఛని హరించిందా? ఇవీ ప్రశ్నలు.

ఈ సమాధానం తెలుసుకోవాలంటే రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 19 ఏమి చెబుతోందో చూడాలి. అది భావప్రకటన తదితర హక్కులకు రక్షణ కల్పిస్తుంది. ఈ హక్కులు భారతదేశ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. విదేశీయులకు వర్తించవు. ఈ అధికరణ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు భావ ప్రకటనా స్వాతంత్య్రం, ఆయుధాలు లేకుండా ప్రశాంతంగా గుమికూడే అవకాశం, సంఘాలను యూనియన్లను ఏర్పరచుకునే అవకాశం, భారత భూభాగంలో ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు, భారత భూభాగంలో ఎక్కడైనా స్థిరపడి నివసించే హక్కు, ఏ వృత్తినైనా లేక వ్యాపారానై్ననా, వాణిజ్యానై్ననా, ఏ జీవనికనైనా చేపట్టడానికి హక్కు కలిగి ఉంటాడు.

గతంలో ఆస్తి హక్కు కూడా ఈ అధికరణ కింద ఉండేది. 1978లో రాజ్యాంగానికి చేసిన 44వ సవరణలో ఆస్తి హక్కును ఈ అధ్యాయం నుంచి తొలగించారు. దాన్ని 300 (ఎ)లో పొందుపరిచారు. ఈ ఆర్టికల్‌ ప్రకారం ఎవరి ఆస్తి హక్కునైనా చట్టం ప్రకారం తప్ప హరించడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు అది ప్రాథమిƒ హక్కు కాదు. భావ ప్రకటనా స్వాతంత్య్రం మాత్రం ప్రాథమిక హక్కే. అధికరణ 19(1) ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛ ఉందికానీ దానికి పరిమితులు ఉన్నాయి. పౌరులకు ఉన్న ఈ హక్కును నియంత్రించడానికి అవసరమైన పరిమితుల్ని ఏర్పరిచే అధికారం రాజ్యానికి ఉంది. సినిమాల్లో వ్యక్తులు, హీరోలు సిగరెట్లు తాగడం అనేది ఒక రకంగా భావ ప్రకటనే. ఈ భావ ప్రకటనకు ప్రభుత్వం పరిమితులు విధించవచ్చా? దీనికి ఢిల్లీ హైకోర్టు మొన్న సమాధానం చెప్పింది.

సినిమాల్లో సిగరెట్లు తాగే దృశ్యాలను నిషేధిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు భావప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. పొగాకు వాడకం, సిగరెట్లు తాగడం ఆరోగ్యానికి హానికరమే. సిగరెట్లు తాగడం వల్ల అది తాగిన వ్యక్తులకే కాదు, ఆ తాగుతున్న వ్యక్తుల పరిసరాల్లో ఉన్న వ్యక్తులకు కూడా హాని కలిగిస్తుంది. అందుకని దీన్ని నిషేధించడం సరైందే. అయితే నిషేధించడంతోనే సరిపోదు, దానిని సక్రమంగా అమలు కూడా చెయ్యాలి. లేకపోతే అది కాగితపు పులిలాగా మారిపోతుంది. ఇప్పుడు ఈ నిషేధ పరిస్థితి మనదేశంలో అలాగే ఉంది. పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం సినిమాల్లో అలాంటి దృశ్యాలు ఉండకూడదని నిషేధం విధించింది. ఆ నిషేధం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.

థమ్‌‌స అప్‌, కోకా కోలా వంటి ప్రకటనలలోని దృశ్యాలను చూసి ఆ విధంగా ప్రవర్తించి గాయాల పాలైన యువకుల , బాలల గురించిన వార్తలు ఎన్నో పత్రికల్లో కనిపిస్తున్నాయి. సినిమాల్లో తమ అభిమాన హీరోలు సిగరెట్లు తాగడం చూసి నేటి అమాయక యువత ఆ చెడు అలవాట్లను అలవరచుకుంటోందని, దానిని నిరోధించాలని ప్రభుత్వ ఉద్దేశం. అది మంచి ఉద్దేశమే. కానీ సినిమా అనేది ఓ దృశ్యకావ్యం. అది ఒకరకమైన భావప్రకటన. కళాత్మక భావప్రకటన. ఒక వ్యక్తి నడవడికను అతని నేపథ్యాన్ని, జీవశైలిని వివరించాలంటే అతని అలవాట్లని కూడా చూపించాల్సి వస్తుంది.

అవేవీ చూపించకుండా అతని క్యారెక్టర్‌ని నిరూపించలేని పరిస్థితి ఉంటుంది. ఈ రకమైన నిషేధం సినీ నిర్మాతలకు ఇబ్బంది కలిగించే పరిణామం. ప్రభుత్వం విధించిన ఈ పరిమితి సినీ నిర్మాతల భావప్రకటనా స్వేచ్ఛకి విఘాతమని ఢిల్లీ హైకోర్టు త తీర్పులో పేర్కొంది. ఆ విధంగా పరిమితి విధించడం రాజ్యాంగ విరుద్ధమని కూడా కోర్టు అభిప్రాయపడింది. కథల్లో, నవలల్లో, సినిమాల్లో జీవితం ఉండాలి. జీవన విధానమూ ఉంటుంది. వాటిలో సిగరెట్‌ తాగడం ఉంటుంది, మద్యపానం ఉంటుంది, దొంగతనాలూ, దోపిడీలూ ఉంటాయి. అవేవీ లేకుండా సినిమా తీయడం సాధ్యం కాదు. సినిమా కానీ, కథకానీ, నవలకానీ ఏ విషయాన్ని చెబుతోంది, దాని సారాంశం ఏమిటీ అన్నది ప్రధానమైన విషయం. అవి సమాజ హితం కోరుతున్నాయా లేదా అన్న విషయాన్ని చూడాల్సి ఉంటుంది. అంతేకానీ సిగరెట్‌ తాగడం, మద్యపానం సినిమాల్లో ఉండకూడదనడం సరైంది కాదు. కాకపోతే వాటి ప్రచారాన్ని నిలుపుదల చేయవచ్చు. ప్రకటనలను నిషేధించవచ్చు.

ధూమపానం గురించి, మద్యపానం గురించి అవగాహనా సదస్సులు ఏర్పరచాలి. తరగతి గదుల్లో వాటి గురించి బోధించాలి. చెడు అలవాట్ల ప్రభావాన్ని విద్యార్థులకు హత్తుకునే విధంగా చెప్పాలి. మంచి ఆరోగ్యం గురించి, మంచి వాతావరణం గురించిన అవగాహన పిల్లలకి, ముఖ్యంగా యువతరానికి కలిగించాలి. పొగాకు వాడకాల ద్వారా మనదేశంలో సంవత్సరానికి ఒక మిలియన్‌ మంది ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ చర్యలను తప్పు పట్టలేం. కానీ బీడీ కట్టల మీద శవం బొమ్మలు ప్రచురించడం ద్వారా, సినిమాల్లో ధూమపాన దృశ్యాలను నిషేధించడం ద్వారా ఈ అలవాట్లని తగ్గించవచ్చని అనుకుంటే పొరపాటే అవుతుంది. ప్రభుత్వం చేయవలసినది చాలా ఉంది. పొగాకు ఉత్పత్తుల వాడకంవల్ల కలిగే అనర్ధాలను ఇవే దృశ్య కావ్యాల ద్వారా వివరించాలి. అది అవసరం కూడా.

రచయిత నిజామాబాద్‌జిల్లా
న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Friday, January 23, 2009

24-1-09

క్రిమినల్‌‌స తరపున వాదించకూడదా?


`ఆ న్యాయవాది చాలా మంచి వాడని పేరే. కానీ అతను వాదిస్తున్నది క్రిమినల్‌‌స గురించే కదా' ఇది ఒక మిత్రుడు సంభాషణలో అడిగిన ప్రశ్న. ఇలాంటి ప్రశ్నలను చాలా మంది అడుగుతూ ఉంటారు. వారి ప్రశ్నలను పూర్తిగా ఖండించలేం. కానీ క్రిమినల్‌‌స అని ఆరోపించిన వ్యక్తుల కేసులను వాదించకూడదా? అది తప్పా?ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించిన కేసుల్లోని నేరస్థులతరఫున ఎవరైనా న్యాయవాది వాదిస్తున్నప్పుడు ఇలాం టి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ నగరాల్లో ఉన్న న్యాయవాదుల సంఘాలు ఆ సంఘటనల్లో ఆరోపణలు ఎదుర్కొంటు న్న ముద్దాయి తరఫున తామెవ్వరమూ వాదించమని తీర్మానాలు చేస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని కూడా పూర్తిగా తప్పు పట్టలేం. కానీ ఆ విధంగా తీర్మానాలు తీసుకోవడం సరైందేనా? ఇది మరో ప్రశ్న. ఆ తీర్మానాలకు భిన్నంగా ఎవరైనా న్యాయవాది ఆ సంఘటనల్లో ముద్దాయికి అనుకూలంగా వాదించడానికి నిర్ణయం తీసుకుంటే అతనిపై కూడాదాడి చేస్తున్నారు. ఈ పరిస్థితి మన రాష్ట్రంలోనే తక్కువగా ఉందని చెప్పవచ్చు. మనరాష్ట్రంలో అలాంటి నిందితుల కేసులను చేస్తున్నందుకు విమర్శిస్తున్నారు కానీ దాడులకు పాల్పడటం లేదు. నేరాల్లో ఉన్న తీవ్రతని గమనిస్తే మనస్సు బాధపడుతుం ది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. సంయమనం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది.నిథారీ సంఘటనలో అదే జరిగింది. 19 మంది అమ్మాయిలను మానభంగానికి గురిచేసి ఆ తరువాత వాళ్ళని హత్యలు చేశారు. ముద్దాయిలు మణీందర్‌ సింగ్‌ పందార్‌, అతని సహాయకుడు సురేంద్ర కోలి. వీరి కేసులను వాదించకూడదని ఘజియాబాద్‌ న్యా యవాదుల సంఘం నిర్ణయం తీసుకుంది. కొంత మంది న్యాయవాదులు ముద్దాయి పందార్‌ను కోర్టు ఆవరణలోనే కొట్టడం జరిగింది. గుజరాత్‌ హైకోర్టు న్యాయవాదుల సంఘం కూడా ఒక వర్గానికి చెందిన ముద్దాయిల కేసులను వాదించకూడదని తీర్మానం చేసింది. ఇట్లా ఎన్నో న్యాయవాదుల సంఘాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రెండు దశాబ్దాల క్రితం ఇందిరా గాంధీ హత్యకేసులో ముద్దాయి తరఫున వాదించడానికి రాంజత్మలానీ నిర్ణ యం తీసుకున్నప్పుడు దేశమంతా ఆయన మీద దుమ్మెత్తిపోసిం ది. కానీ అప్పుడు పరిస్థితి హింసాత్మకంగా పరిణమించలేదు. జత్మలానీ జాతి వ్యతిరేకుడని మాత్రమే అన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నారు. ఉగ్రవాదుల కేసులను ఎవరైనా చేపడితే వాళ్ళమీద దాడులు జరిగే పరిస్థితు లు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి మధ్యప్రదేశ్‌లో జరిగింది. నూర్‌ మహామ్మద్‌ అనే సీనియర్‌ న్యాయవాది ఉగ్రవాదుల తరఫున వాదించడానికి ముందుకు వస్తే అతనిపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. టివిల్లో కూడా ఆ దృశ్యం కన్పించింది. ఉగ్రవాదుల, ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన కేసుల్లోని ముద్దాయిల తరఫున వాదించకూడదా? ఎలాంటి న్యాయవాది లేకుండానే వాళ్ళ కేసులు పురోగతి చెందే అవకాశం ఉందా? మనరాజ్యాంగంలోని ఆర్టికల్‌ 22 ప్రకారం తన కిష్టమైన న్యాయవాదిని సంప్రదించే అవకాశం ముద్దాయికి ఉంది. అతడు భారతదేశ పౌరుడే కావలసిన అవసరం లేదు. విదేశీయుడికి కూడా ఈ హక్కు ఉంది. అదే విధంగా ఒక వ్యక్తి ఉగ్రవాది అన్న కారణంగా, కరడుకట్టిన నేరస్థుడన్న కారణంగా, కోట్ల రూపాయలను స్వాహా చేసినాడన్న కారణంగా అతని కేసును స్వీకరించకూడదని న్యాయవాది నిర్ణయం తీసుకోకూడదు. ఒకవేళ ఎవరైనా అలాంటి నిర్ణయం తీసుకుంటే అది న్యాయవాదుల చట్టం 1961 ప్రకారం చెడునడవడికే అవుతుంది. తాను చాలా పనిలో ఉన్నానని కేసును న్యాయవాదులు నిరాకరించవచ్చు. అలాంటి కేసుల్లో ఎక్కువ ఫీజు డిమాండ్‌ చేయవచ్చు. అంతే కానీ ఆ వ్యక్తి నేరస్థుడు, తప్పు చేసిన వ్యక్తిగా ముందే నిర్ధారించి కేసును స్వీకరించడానికి నిరాకరించకూడదు. ఒకవేళ ఎవరైనా న్యాయవాది ఈ కారణాలు చెబుతూ కేసు ను నిరాకరిస్తే బార్‌ కౌన్సిల్‌ అతనిపై చర్య తీసుకునే అవకా శం ఉంది. కొన్ని కేసులను స్వీకరించడం వల్ల న్యాయవాదులు ప్రజాదరణ కోల్పోవచ్చు. తాను ప్రజాదరణ కోల్పోతున్న కారణంగా కేసులను నిరాకరించే అవకాశం లేదు. అయినప్పటికీ కొన్ని న్యాయవాదుల సంఘాలు ఉగ్రవాదుల కేసులను, తీవ్రమైన నేరం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొం టున్న వ్యక్తుల కేసులను తమ సంఘ సభ్యులు ఎవరూ స్వీకరించరాదన్న చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుం టున్నాయి. ప్రతి నేరస్థుడు తనకిష్టమైన న్యాయవాదిని నియమించుకోవచ్చు. న్యాయవాదిని నియమించుకునే స్తోమత, ఆర్థిక వనరులు అతనికి లేకుంటే `రాజ్యమే' అతనికి న్యాయవాదిని నియమించాల్సి ఉంటుంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం అతనికి ఉన్న హక్కు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.304 కూడా ఈ విషయాన్నే స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 39.ఎ ప్రకారం ప్రతి వ్యక్తికి న్యా య సహాయాన్ని అందజేయాల్సిన బాధ్యత రాజ్యంపై ఉంది. హుస్సే నియిరా ఖాటూన్‌ కేసుల్‌ (ఏ.ఐ.ఆర్‌ 1979 సుప్రీంకోర్టు 1369), అదేవిధంగా సుఖ్‌దాస్‌ మరి ఇతరులు (1986 క్రిమినల్‌ లా జర్నల్‌1084) కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది.`ఆర్థిక స్థోమత లేకపోవడంవల్ల ఎవరైనా ముద్దాయి న్యాయవాదిని నియమించుకోనప్పుడు, కోర్టు అతనికి న్యాయవాదిని ప్రభుత్వ ఖర్చులమీద నియమించాలి. అతను న్యాయసహాయం కోరకున్నా కోర్టే అతనికి ఈ విషయం వివరించి న్యాయసహాయాన్ని అందించాలి. ఒకవేళ ఎలాంటి న్యాయ సహాయం (న్యాయవాది లేకుండా) అందకుండా అతనికి శిక్ష విధిస్తే ఆ శిక్షకి ఎలాంటి విలువా లేదు'.నేర„స్థుణ్ణి కోర్టు ముందు రిమాండ్‌కోసం ప్రవేశపెట్టిన దశ నుంచి అప్పీలు దశ వరకు అతనికి న్యాయసహాయం అందించాలి. న్యాయవాదిని నియమించుకొని అతను ము ద్దాయికి కోర్టు ముందు ప్రాతినిధ్యం వహించక, ఆ ముద్దాయికి శిక్షపడితే ఆ శిక్ష చెల్లదని ముంబాయి హైకోర్టు (క్రిమినల్‌ అప్పీలు నెం.487/2008) రాంచంద్ర నివృత్తి కేసులో ఈ మధ్యనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయవాద సంఘాల నిర్ణయాలు అసంబద్ధంగా కన్పిస్తాయి. ముద్దాయి కి శిక్షపడాంటే కూడా న్యాయవాది అవసరమే. న్యాయవాది లేకుండా విచారణ జరిగే అవకాశం లేదు. జరిగినా ఆ తీర్పుకు విలువ లేదు. ఎవరైనా వ్యక్తి నేరం చేశాడా లేదా అన్న విషయం రుజువు కావాలి. అలా కాకుండా ఒక వ్యక్తి `ఉగ్రవాది' అనో లేదా తీవ్రమైన ఆరోపణలు ఉన్న కేసులో ముద్దాయి అనో చెప్పితే సరిపోతుందా? అతను అమాయకుడు కూడా అయిఉండే అవకాశం ఉంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఆరుషి హత్యకేసులో తండ్రిని అరెస్టు చేశారు. ఆ తరువాత అతనికి నేరంతో సంబంధం లేదని సి.బి.ఐ పేర్కొంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం న్యాయవాదులకు ఎంతోఉంది. ఇలాంటి అభిప్రాయాలు బలపడటానికి మీడియా కూడా కారణం. లం డన్‌ దాడుల్లో ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం న్యాయ సహాయం అందించింది. అదే విధంగా అమెరికా! మనరాజ్యాంగంకూడా అదే విషయాన్ని చెబుతోంది. న్యాయవాదు ల వృత్తి ముద్దాయిని రక్షించడం మాత్రమే కాదు, న్యాయం లభించేట్టు చూడడం. అందుకోసం కోర్టుకు సహకరిం చడం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం లేదు.

నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Friday, January 16, 2009



surya daily, 17-01-09
mangari rajender
కొత్త నిబంధనలు-కొత్త సమస్యలు

డిసెంబర్‌ 23 నాడు ఎలాంటి చర్చలేకుండా లోక్‌సభ 8 బిల్లులను 17 నిమిషాల్లో ఆమోదించింది. వాటి లో అత్యంత ముఖ్యమైన బిల్లు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సవరణల) బిల్లు 2008. అరెస్టు విషయంలో పోలీసుకి ఉన్న అధికారాలను కత్తిరించే అవకాశం ఉన్న బిల్లు అది. అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఈ బిల్లును ఎలాంటి చర్చలేకుండా లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును రాజ్యసభ డిసెంబర్‌ 18నాడు ఆమోదించింది. రాష్టప్రతి ఆమోదముద్ర పొందితే ఇది చట్టంగా మారిపోతుంది. కానీ అమల్లోకి రాదు. అమలు తేదీల గురించి ప్రభుత్వం మళ్ళీ ఒక ప్రకటనను జారీ చేయాల్సి ఉంటుంది. కొన్ని చట్టాలకు సవరణలు తీసుకొచ్చి, ఆ చట్టంలోని కొన్నిసవరణలకు మాత్రమే. ప్రభుత్వం తన ప్రకటనల ద్వారా ప్రాణపోస్తుంది. ఏ సవరణలు అమల్లోకి వచ్చాయి, ఏవి రాలేదు అన్న విషయంలో అందరికీ సందేహాలు. ఎలాంటి చర్చ లేకుండా చట్టాలను తయారు చేయడం, వాటిని అమల్లోకి తీసుకురాకపోవడం- ఇదీ ప్రభుత్వం చేస్తున్న పని! అంటే ఆ సవరణల్లోని కొన్ని నిబంధనలకు ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వాధినేతలకు తెలుసు. ఇప్పుడు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌కు అరెస్టు విషయంలో తెచ్చిన సవరణలు కూడా అలాంటివే. ఇవి అమల్లోకి వస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఇప్పటికే ఈ సవరణలకు వ్యతిరేకంగా దేశంలోని న్యాయవాదుల సంఘాలు సమ్మెలు మొదలు పెట్టాయి. ఈ నిబంధనలను పోలీసులు దుర్వినియోగం చేస్తారని వాళ్ళ వాదన. అంతేకాని ఈ సవరణల వల్ల ప్రజలు మరింత మోసపోయే అవకాశం ఉందని వాళ్ళు ప్రకటించడం లేదు.అరెస్టు విషయంలో పోలీసులకు అమితమైన అధికారా లున్నాయి. కాగ్నిజబుల్‌ నేరాల్లో పోలీసులకు ఎవరినైనా అరె స్టు చేసే అధికారం ఉంది. ఈ అధికారాలకు చట్టంకొన్ని పరి మితులను విధించింది. ఎందుకంటే, వ్యక్తి స్వేచ్ఛకు అరెస్టు విఘాతం కలిగిస్తుంది. వ్యక్తి ఆత్మగౌరవాన్ని, పరువు ప్రతిష్ఠల్ని దెబ్బతీస్తుంది. నేర సమాచారం అందిన వెంటనే చాలా కేసుల్లో నిందుతులను అరెస్టుచేయాల్సిన అవసరం ఉండ దు. నేరసమాచారం రాగానే, అది కాగ్నిజబుల్‌ నేర సమాచారం అయినప్పుడు ప్రథమ సమాచార నివేదికను విడుదలచేసి పోలీసుఅధికారి నేరస్థలానికి పోవాలి. అవసరమైన సాక్ష్యాలను సేకరించాలి. అవి మౌఖికమైనవి కావచ్చు, నిజమైనవి కావచ్చు. ఆ తరువాత అవసరమని భావిస్తే నిందితుణ్ణి అరెస్టు చేయాలి. ఎవరినైనా అరెస్టు చెయ్యాలంటే అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఉండాలి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె.157 ఉద్దేశ…ం ఇదే. కానీ చాలా కేసుల్లో నేరం జరిగిందన్న సమాచారం రాగానే అరెస్టులు జరుగుతాయి. నేరసమాచారం సరైనదా కాదా తేల్చుకున్న మీదట, నింది తుడు నేరం చేశాడని ప్రాథమికంగా నిర్ధారించుకొన్న తరువాత అవసరం అనుకున్నప్పుడే అరెస్టు చేయాలి. ఈ విధం గా అరెస్టుల విషయంలో పోలీసుల అధికార దుర్వినియోగం అవుతుందని సుప్రీంకోర్టు భావించి జోగిందర్‌ కుమార్‌ వర్సె స్‌ స్టేట్‌ ఎ.ఐ.ఆర్‌-1994 సుప్రీంకోర్టు 1354 కేసులో `చట్టబద్ధమన్న కారణంగా పోలీసు అధికారి అరెస్టులు చేయడానికి వీల్లేదు. అరెస్టుచేసే అధికారం ఉండటం ఒక ఎత్తు. ఆ అధికారాన్ని వినియోగించడానికి న్యాయబద్ధత ఉందని చూపించడం మరొక ఎత్తు. అధికారం ఉందని అరెస్టు చేయ డం కాదు. దాన్ని సమర్ధించుకునేందుకు న్యాయబద్ధత కూ డా ఉండాలి' అని అభిప్రాయపడింది.ఈ తీర్పు తర్వాత డి.కె. బసు తీర్పులో 11 మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీచేసింది. అయినా చిన్న చిన్న కేసుల్లో కూడా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. అరెస్టు, డిటెన్షన్‌, విచారణ వంటి పోలీసుఅధికారాల గురించి సర్‌ సిరిల్‌ ఫిలిప్‌‌స కమిటీ ఇంగ్లాండ్‌లో అధ్యయనం చేసి నివేదిక సమర్పించింది. `ఆవశ్యకమైన సూత్రం' ప్రకారం అరెస్టుచెయ్యడానికి కొన్ని నియంత్రణల్ని రాయల్‌ కమిషన్‌ సూచిం చింది. వాటిలో ముఖ్యమైనది- అరెస్టులను తగ్గించడానికి `హాజరు నోటీసు' ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభు త్వం క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సవరణల) బిల్లు-2008ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌ ఉభయ సభలు దాన్ని ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించాయి. ఈ సవరణల ద్వారా పోలీసుల అధికారాలు తగ్గి ప్రజలకు మేలు కలుగుతుందని కొంతమంది, మానవహక్కులకు రక్షణ లభిస్తుందని చాలామంది అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. మీడియాకూడా అలాం టి అభిప్రాయాన్నే వ్యక్తపరుస్తోంది. ఇందుకు భిన్నంగా న్యాయవాదులు ఈ సవరణలను వ్యతిరేకిస్తున్నారు. ఈ సవరణలు మానవత్వానికి, సమాజానికి వ్యతిరేకమని న్యాయవాదవర్గాలు భావిస్తున్నాయి. కానీ సరైన కారణాలతో సంతృ ప్తి కలిగేలా వాళ్ళు ప్రకటనలు ఇవ్వడం లేదు. ఈ సవరణలు నిజంగానే ప్రజలకు మేలుచేస్తాయా? లేక నేరస్తులను ప్రోత్సహిస్తాయా? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.బిల్లులోని కొత్తసవరణలు అరెస్టువిషయంలో చాలా ఉదారంగా ఉన్నాయి. కొత్త నిబంధన సె.41ఎ(1) ప్రకారం ఏడు సంవత్సరాలవరకు శిక్ష విధించే అవకాశంఉన్న నేరాల్లో ముద్దాయిలను అరెస్టుచేసేబదులు `హాజరు నోటీసు'ను పోలీసులు జారీచెయ్యాలి. సె.41ఎ(3) ప్రకారం-అతను ఆ నోటీ సును పాటించనప్పుడు, తగు కారణాలు రాసి మాత్రమే అతన్ని అరెస్టు చెయ్యాలి. సె.41ఎ(4) ప్రకారం నోటీసును నిందితుడు గౌరవించకపోయినా, నోటీసు ప్రకారం తన బాధ్యతను నిర్వర్తించలేకపోయినా పోలీసు అధికారి ఆ నిందితుణ్ణి అరెస్టుచెయ్యడం న్యాయబద్ధమే. ఈ నిబంధనల ప్రకా రం చాలా కేసుల్లో ముద్దాయిలను అరెస్టు చెయ్యడానికి అవకాశం ఉండదు. గతంలో నాన్‌ బెయిలబుల్‌ నేరాలైనప్పటికీ ఆ నేరాల్లోని నిందితులను అరెస్టు చేసే వీలుండదు. ఈ సవరణలవల్ల లాభాలకన్నా నష్టాలేఎక్కువ. కిడ్నాపింగ్‌ (సె. 363) నేరానికి గతంలో మాదిరిగా నేరుగా అరెస్టు చెయ్యడానికి అవకాశం లేదు. ఆ నేరానికి ఏడు సంవత్సరాల వరకే శిక్ష విధించడానికి అవకాశం ఉంది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తన ఆధీనంలో పనిచేస్తున్న ఉద్యోగినిని మరులు గొల్పి ఆమెతో శారీరక సంభోగానికి పాల్పడితేకూడా ఆ వ్యక్తిని అరెస్టుచేసే అవకాశంలేదు. ఈ కొత్త నిబంధన ప్రకా రం 7 సంవత్సరాలకు మించి శిక్ష విధించే అవకాశంఉన్న నేరాల్లోనే పోలీసులు అరెస్టుచేసే అవకాశం ఉంది. కొన్నివేల జీవితాలతో చెలగాటం ఆడి, ఆ తరువాత కొన్ని వేల కోట్ల రూపాయల నష్టంకలుగజేసిన నిందితులనుకూడా ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అరెస్టు చేసే అవకాశం లేదు. ఆ వ్యక్తులు తాము మోసం, ఫోర్జరీ, తప్పుడు లెక్కలు, నమ్మకద్రోహం లాంటి నేరాలుచేశామని ఒప్పుకున్నా కూడా వాళ్ళను అరెస్టుచేసే అవకాశం ఉండదు. ఆ నేరాల వల్ల ఏడువేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉండవచ్చు. అయినా ఆ నిందితుల్ని అరెస్టు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ నేరాలకు 7 సంవత్సరాల కంటె ఎక్కువ శిను చట్టం నిర్దేశించలేదు. అంటే ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించి, కొన్ని వేలమంది జీవితాలతో ఆడుకున్న వ్యక్తులను కూడా అరెస్టుచేసే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే ప్రజలకు నేర న్యాయవ్యవస్థల పై విశ్వాసం పూర్తిగా సడలిపోయే అవకాశం ఏర్పడదా? ఆ నిందితులు అందుబాటులోఉన్న సాక్ష్యాలను తారుమారుచేసే అవకాశం ఉండ దా? సంఘంలో పేరున్న వాళ్ళను, డబ్బున్న వ్యక్తులను, పలుకుబడిఉన్న వ్యక్తులను ఈ నిబంధనలను కారణంగా చూపి పోలీసులు అరెస్టు చెయ్యరు. ఇలాంటి నేరాలు మామూలు వ్యక్తులుచేస్తే `హాజరు నోటీసు'ను సక్రమంగా పాటించలేదని చెప్పి అరెస్టుచేసే అవకాశంఉంది. అంతేకాదు, అరెస్టు చెయ్యడానికి కారణాలు రాసే పనిభారంలో పోలీసులు పడే అవకాశంకూడా ఉంది. ఈ కొత్తనిబంధనల ద్వారా మామూ లు వ్యక్తి లాభపడే అవకాశం ఉందా? మామూలు నేరస్తుడు లబ్ధిపొందే అవకాశం ఉందా? `హాజరు నోటీసు' పేరుతో పోలీసులు కోర్టులాగా షరతులు విధించే అవకాశం కూడా ఉంది. ఈ కోణంలో ఈ నిబంధనలను చూడాల్సిన…, ఆలోచించవలసిన అవసరం మరెంతో ఉంది.
- రచయిత నిన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిజామాబాద్‌జిల్లా

Saturday, January 10, 2009

జనాభాను బట్టి కోర్టులు

మహిళల మీద అత్యాచారా లు పెరిగిపోయాయి. మొ న్న విజయవాడ, నిన్న వరంగల్‌ నే డు కొత్తగూడెం! ఆయేషా వివాదం కొనసాగుతూనే ఉంది. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ ముగ్గురు యు వకులు ఎన్‌కౌంటర్లో మరణించారు. స్వప్నిక, ప్రణీతలకి సమా జం (మొత్తం కాదు) దృష్టిలో న్యాయం జరిగిపోయింది. పోలీసుల పనితనానికి యువత విజయధ్వానాలు చేసింది. ఆ ఎన్‌కౌంటర్‌కి ప్రజామోదం లభించిందని మీడియా ప్రచారం చేసిం ది, మరోవిధంగా ప్రభావితం చేసింది. కొంతమంది ప్రజల ఉద్వేగాలను, ఆవేశాలను మీడియా పనిగట్టుకొని ప్రచారం చేసింది. పరిణామం తెలిసినదే. కొంతమంది ప్రజల ఇష్టాలనే గౌరవించడం సరైనదేనా? కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం- ఇదేనా సమాజం కోరుకుంటున్నది? ఈ విధంగా జరిగితే సరిపోతుందా? ఇవీ ప్రశ్నలు. సామూహిక మానభంగానికి పాల్పడిన నిందితులను గురువారం కొత్తగూడెం పోలీసులు వినూ త్నపద్ధతిలో వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు శాపనార్థాలు పెడుతూ చెప్పులు విసిరేందుకు ప్రయత్నించారు. నిందితులందరినీ కోర్టు రిమాండ్‌ చేసింది. ఈ కేసులో తీర్పు ఎంత కాలానికి వస్తుందో! ఇది అందరినీ వేధిస్తున్న సమస్య. ఈ కారణంగా కూడా కొంత మంది వ్యక్తులు వరంగల్‌ లాంటి సత్వరన్యా యంకావాలని కోరుతున్నారు. కొత్తగూడెం సంఘటన కొన్ని రోజుల క్రితం జరిగింది. కాబట్టి మీడియా సత్వరన్యాయం కోరుకోలేదనిపిస్తుంది. ఆ దిశగా ప్రజల ఇంటర్యూ్వలను, అభిప్రాయాలను ప్రసారం చెయ్యలేదు. మహిళలపై జరిగే నేరాల విచారణ సత్వరంగా జరగాలి. ఆ విషయానికి వస్తే, క్రిమినల్‌ కేసుల విచారణ సత్వరం జరగాలి. మరీ ముఖ్యంగా ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన కేసుల పరిష్కారం, సెన్సేషన్‌ కేసుల పరిష్కారం సత్వరంజరగాలి. అలా జరుగనప్పుడు ఇలాంటి అభిప్రాయాలే వెలువడుతాయి. ఇలాంటి సంఘటనలు చాలా రాషా్టల్ల్రో జరుగుతున్నాయి. ఆయా రాషా్టల్రు ఏవిధంగా స్పందిస్తున్నాయి? ఇది మన రాజ్యాధినేతలు గమనించ డంలేదు.అలాంటిఒక సంఘటనను గుర్తుచేసుకోవలసి ఉంది.ఒక జర్మన్‌ టూరిస్టును జోద్‌పూర్‌లో ఇద్దరు వ్యక్తులు మానభంగానికి గురిచేశారు. వార్తా పత్రికల్లో చూసి రాజస్థాన్‌ హైకోర్టు తానుగా స్పందించింది. ఆమె విదేశీ వనిత కాబట్టి దర్యాప్తును, విచారణను సత్వరం పూర్తి చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆ జర్మన్‌ మహిళ కేసు విచారణ జరిగింది. నేరం జరిగిన 15 రోజుల్లో కోర్టు తీర్పు ప్రకటించింది. ముద్దాయిలిద్దరికీ జీవిత ఖైదును ట్రయల్‌ కోర్టు విధించింది. ఈ కేసు విషయంలో అన్ని వ్యవస్థలూ సున్నితంగా వ్యవహరించాయి. ఫోరెన్సిక్‌సైన్‌‌స లాబరేటరీ ఒక్క రోజులో తన నివేదికను అందచే సిం ది. రెండురోజుల్లో పోలీసులు అభియోగాన్ని కోర్టులో దాఖలుచేశారు. చివరి సాక్షిని విచారించిన మరుసటిరోజే కోర్టు తీర్పుప్రకటిం చింది. నేరంచేసినట్లు తేలడంవల్ల ముద్దాయిలకు యావజ్జీవ శిక్షను ఖరారు చేసింది. భారతదేశ న్యాయచరిత్రలోనే విచిత్రంగా కోర్టు 15 రోజుల్లోగా ఈ కేసు ను పరిష్కరించింది. రాజస్థాన్‌ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసేటప్పుడు కొన్ని సూచనలు చేసింది- రాష్ట్ర పరిధిలోని రేప్‌ కేసు ల దర్యాప్తులను పర్యవేక్షించడానికి ప్రత్యేకవిభాగాన్ని ఏర్పాటు చెయ్యాలి. రేప్‌కేసుల్లో వారంరోజుల్లోగా అభియోగం దాఖలయ్యేటట్టు చూడాలి. లైంగిక నేరానికి సంబంధించిన కేసు వివరాలను, పురోగతిని తెలియజేస్తూ జిల్లా ఎస్పీలు మూడు నెలలకొకసారి ఈ ప్రత్యేక విభాగానికి నివేదికను పంపించాలి. అన్ని జిల్లాల నివేదికలను సంఘటితంచేసి ఆ విభాగానికి నియమిం చిన ప్రత్యేక పోలీసు అధికారి తననివేదికను హైకోర్టురిజిస్ట్రార్‌కు పంపించాలి. హైకోర్టు ఆ నివేదికను పరిశీలించి సంబం ధిత కోర్టులకు ఆ కేసులను సత్వరం పరిష్కరించేలా ఉత్తర్వులు జారీచేస్తుంది. అంతేకాదు, ఆ కేసుల విచారణ 4మాసాల్లోగా పూర్తికావాలి. రేప్‌ బాధితులకు ఆర్థికంగా, వైద్యపరంగా ప్రభుత్వం సహా యం అందించాలి. వాళ్ళకి కౌన్సిలింగ్‌ సహాయం కూడా ప్రభుత్వం అందచెయ్యాలి. ఈ నేరాల్లో బాధితులు విదేశీ టూరిస్టులైతే వాళ్ళు మనదేశంనుంచి వెళ్ళిపోకముందే విచారించడం, వాళ్ళ స్టేట్‌మెంట్ల ను నమోదు చెయ్యడం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. విదేశీటూరిస్టులకు అవసరమైన రక్షణను ప్రభుత్వం కల్పిం చాలి. అందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రణాళికలను రెండునెలల్లోగా కోర్టుకి తెలియజేయాలి. ఇలాంటి నేరా ల విషయంలో సున్నితంగా స్పందించడానికి అవసరమైన శిక్షణను, వర్‌‌కషాప్‌లను హైకోర్టూ, ప్రభుత్వమూ చేపట్టాలి. కోర్టుల్లో జాప్యం ఉంటుందనేది జగమెరిగినసత్యం. అందుకు కారణాలు ఉండవచ్చు. కేసులకు, జనాభాకి తగినన్ని కోర్టు లు లేకపోవచ్చు. ఏమైనప్పటికీ జాప్యంవల్ల ప్రజలకు కోర్టుల మీద విశ్వాసం తగ్గే అవకాశం ఉంది. క్రిమినల్‌ కేసుల విచారణల్లో జాప్యంఉంటే న్యాయాధిక్యం ఉనికే దెబ్బతింటుంది. అదే పోలీసులు, అవే కోర్టులు, అవే వ్యవస్థలు- కానీ పై కేసులో బాధితులకు సత్వరన్యాయం లభించింది. ఇది విదేశీ బాధితులకే పరిమితం చెయ్యకుండా, అందరికీ ఇలాంటి న్యాయం దొరికేలా చూడాలి.ఈ కేసులో హైకోర్టు స్పందనను మనరాష్ట్రం గుర్తిస్తే మంచి జరిగే అవకాశంఉంది. కేసులను బట్టి కాక జనాభానుబట్టి కోర్టులు ఏర్పాటు చెయ్యాలి. లా కమిషన్‌ చెప్పింది కూడా అదే. అలాంటిపనిచేస్తే చట్టానికి అతీతంగా వ్యవహరించే అవకాశం ఉండదు. చట్టానికి అతీతంగా పోలీసులు పనిచెయ్యాలని పాలకులు అనుకుంటే, ప్రజలు కోరుకుంటున్నారని భావిస్తే- చట్టాలను ఆ విధంగా మార్చడం జరగాలి.

Saturday, January 3, 2009

surya daily 3-01-08
క్రిమినల్‌ చర్యలు తీసుకొన్నప్పుడే!
చిన్న చిన్న కేసుల్లో ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు కూడా కోర్టులు విపరీతంగా స్పందిస్తాయి. అది మంచిదే. కానీ తీవ్ర ఆరోపణలు ఉన్న కేసుల్లో కోర్టుల స్పందన కరువైనప్పుడు ప్రజలు నిరాశకు, నిస్పృహకు లోనవుతారు. కోర్టుల మీద ప్రజలకు విశ్వాసం ఉండేలా చూడాల్సిన బాధ్యత కోర్టుల మీదే కాదు, ప్రజల మీద కూడా ఉంది. బూటకపు ఎన్‌కౌంటర్లు అని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఊరుకుంటే సరిపోదు. వాటిని కోర్టుల దాకా తీసుకెళ్ళాలి. చిన్న దొంగతనం చేసిన పన్నెండు సంవత్సరాల బాలుడు అస్లాం చేతులకు సంకెళ్ళు వేసి ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వీధుల వెంట తిప్పారు. ఈ కేసులో అతని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని న్యాయవాది ఇందిరా జైసింగ్‌ నష్టపరిహారం కోసం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రంగనాథ్‌ మిశ్రా, కె. రామస్వామి విచారించి అస్లామ్‌కి రూ. 20,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో రాజ్యమే కాదు, రాజ్యానికి ప్రతినిధి అయిన కానిస్టేబుల్‌ కూడా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించడం ద్వారా, ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లచేసిన ప్రభుత్వోద్యోగులు కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఒక వార్నింగ్‌ ఇచ్చింది. ముద్దాయిలకు సంకెళ్ళు వేయడాన్ని సుప్రీంకోర్టు చాలా సార్లు నిరసించింది. ఈ కేసులో ముద్దాయి వయస్సు 12 సంవత్సరాలు. అతనికి సంకెళ్ళు వేయడం ద్వారా అతని ప్రాథమిక హక్కులకు ఖచ్చితంగా భంగం కలిగించినట్టే. అతని వయస్సు దృష్టా్య కూడా సంకెళ్ళు వేయకూడదు. దేశపౌరుల జీవనవిధానాన్ని కష్టపెట్టే విషయాల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు సమాజంలోకి ప్రవహించనందునకు, ముఖ్యంగా శాంతి భద్రతల గురించి పట్టించుకొనే ప్రభుత్వోద్యోగులకు తెలియక పోవడం మాకు అత్యంత బాధాకరంగా అనిపిస్తోంది.సంకెళ్ళు వేయడాన్ని వ్యతిరేకిస్తూ 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన తీర్పు ఇంకా ప్రభుత్వోద్యోగులకు తెలియకపోవడం, పోలీసుల పద్ధతుల్లో కనీస మార్పు కూడా రాకపోవడం చాలా దయనీయమైన పరిస్థితి. కానిస్టేబుల్‌ పాండే చేసిన పనిని కించపరుస్తూ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని ప్రతివాదులు, న్యాయవాది ఇచ్చిన హామిని పరిగణనలోకి తీసుకున్నాం. అయినప్పటికీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు భంగం కలిగిన అస్లామ్‌కి నష్టపరిహారం ఇచ్చే ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకని అతనికి రూ. 20 వేలు చెల్లించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. అందులో రూ. 19 వేలు ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వం, రూ.1000 పాండే చెల్లించాలని ఆదేశిస్తున్నాం. మొత్తం రూ.20 వేలు ప్రభుత్వం మూడువారాల్లోగా కోర్టులో జమచేయాలి. ప్రభుత్వం ఆ తరువాత రూ.1000 పాండే జీతం నుంచి మినహాయించాలి. ఆ విధంగా మినహాయించినట్టు ఉత్తరప్రదేశ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సర్టిఫికేట్‌ దాఖలు చేయాలి. ఆ వెయ్యి రూపాయలు ప్రభుత్వనిధి నుంచి చెల్లించకూడదు. ప్రభుత్వం ఈ డబ్బును రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జమచేసిన తరువాత, ఆ మొత్తాన్ని జిల్లా జడ్జి లక్నోకి బదిలీ చెయ్యాలి. ఆ విషయాన్ని అస్లాంకి తెలియజేసి, జాతీయ బ్యాంకులో ఆరు సంవత్సరాలకు డిపాజిట్‌ను అస్లాం పేర చేయాలి. అస్లాం సంక్షేమాన్ని పట్టించుకునే అతని బంధువులు ఆ డబ్బుపై వడ్డీ తీసుకునే అవకాశం కల్పించాలి. ఆ వడ్డీ డబ్బుతో అస్లాంకి పునరావాసం లభిస్తే సంతోషపడతాం. అస్లాంని జేబుదొంగతనాల వృత్తి మాన్పించి, చదువు నేర్చుకోవడానికి స్కూల్‌కి పంపించాలి. ఈ ఉత్తర్వుల ప్రకారం తీసుకున్న చర్యల్ని, ఇతర విషయాల్ని ఆరునెలలోగా జిల్లా జడ్జి ఈ కోర్టుకి తెలియజేయాలి' (మిస్‌ ఇందిరా జైసింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, ఇతరులు, రిట్‌ పిటిషన్‌ (క్రిమినల్‌)నెం.118/90, తీర్పు ప్రకటించిన తేదీ 23-03-1990). ఇదివరలో భీమ్‌సింగ్‌ (ఏఐఆర్‌ 1986 సుప్రీంకోర్టు 495) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అస్లాం కేసు తీర్పు విభిన్నమైంది. ఈ రెండు కేసుల ప్రాథమిక హక్కులకు (మానవ హక్కులకు) భంగం వాటిల్లింది పోలీసులవల్లే. భీమ్‌సింగ్‌ కేసులో పోలీసుల చర్యను సుప్రీంకోర్టు ఖండించి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది కాని బాధ్యులైన పోలీసులను కాదు. కానీ అస్లాం కేసులో పోలీసుల చర్యను ఖండించడమే కాదు, ప్రభుత్వంతోపాటు కానిస్టేబుల్‌ కూడా కొంత నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. `భీమ్‌సింగ్‌ను ఆరెస్టు చేసింది, రిమాండ్‌ని పొందింది అధికారస్థాయిలో దిగువలో ఉన్న అధికారులు, వాళ్ళ చర్యలకు బాధ్యత వహించాల్సిన వ్యక్తులపై అధికారస్థాయిలో ఉన్న జమ్మూ- కాశ్మీర్‌ రాష్ట్రప్రభుత్వ అధికారులు. కానీ ఖచ్చితంగా వారి బాధ్యతను గుర్తించడానికి సరైన అధారాలు మా దగ్గర లేవు' అని సుప్రీంకోర్టు భీమ్‌సింగ్‌ కేసులో అభిప్రాయపడింది. ఈ రెండు కేసులను గమనించినప్పుడు, రాజ్యం తరపున బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ప్రభుత్వోద్యోగులు కూడా మానవహక్కుల ఉల్లంఘనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది, నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. చట్టం పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వోద్యోగులు గుర్తించుకోవాలి. కోర్టులు క్రియాత్మకంగా వ్యవహరించాలి. కోర్టులు ఆ విధంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. ఈ ప్రయాణం ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది. అప్పుడే అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లు ఆగుతాయి. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, అందుకు కారణం ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని 80 వ దశాబ్దంలో కోర్టులు తీర్పులు చెప్పాయి. ఆ తరువాత 90 వ దశాబ్దంలో కోర్టులు ఇంకా కొంచెం ముందుకు ప్రయాణంచేసి రాజ్యమే కాదు, ప్రభుత్వోద్యోగులు కూడా నష్టపరిహారాలు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశాయి. ఆ తరువాత రాజ్యమే కాదు, ఆ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని తీర్పులు చెప్పాయి. ఈ పరిణామం కొనసాగాల్సిన అవసరం ఉంది. నష్టపరిహారాలు మంజూరు చెయ్యడంతోనే సరిపోదు, క్రిమినల్‌ చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి చర్యలకు ముగింపు లభిస్తుంది.
రచయిత నిజామాబాద్‌జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Followers