Wednesday, February 24, 2010

మహిళలకు ప్రత్యేక సదుపాయాలు సమంజసమా?

February 24th ,2010

స్ర్తిలని అరెస్టు చేసినప్పుడు గానీ వాళ్ళని సోదా జరపాల్సి వచ్చినప్పుడుగాని పోలీసులు కొన్ని పద్ధతులు పాటించాల్సి వుంటుంది. స్ర్తిల గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది. మానభంగానికి గురైన స్ర్తిలకు కూడా కొన్ని ప్రత్యేకమైన హక్కులు వున్నాయి. అయితే అవి పుస్తకాలవరకే పరిమితం అవుతున్నాయి. వాస్తవంలో వాటిని పట్టించుకునే నాథుడే లేడు. మహిళలకి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వడం సమంజసమేనా? చట్టంముందు అందరూ సమానులేకదానన్న అనుమానం మనకి వస్తుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం భారతదేశంలో నివశిస్తున్న వ్యక్తులందరూ చట్టం ముందు సమానులే. అందరికీ ఒకేరకమైన రక్షణని రాజ్యం ఇవ్వాల్సి వుంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(1) ప్రకారం- మతం, జాతి, జెండర్, జన్మించిన స్థలం కారణంగా భారతదేశ పౌరులపట్ల రాజ్యం ఎలాంటి వివక్షత చూపకూడదు. ఈ హక్కు భారతదేశ పౌరులకి మాత్రమే వర్తిస్తుంది. కానీ ఆర్టికల్ 15 (3) ప్రకారం స్ర్తిల గురించి పిల్లల గురించి ప్రత్యేకమైన నిబంధనల్ని రాజ్యం తయారుచేయవచ్చు. ఈ ఆర్టికల్సుని ఆధారం చేసుకొని స్ర్తిల ప్రయోజనాలు రక్షించడానికి సివిల్ క్రిమినల్ శాసనాల్లో కొన్ని ప్రత్యేక నిబంధనల్ని రూపొందించారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో కూడా మహిళల ప్రయోజనాలను ఉద్దేశించి కొన్ని నిబంధనల్ని పొందుపరిచారు. నేరాలు మగవాళ్ళు చేసినా ఆడవాళ్ళు చేసినా వాటి దర్యాప్తు విచారణ రెండూ ఒకేరకంగా వుంటాయి. కానీ స్ర్తిలని అరెస్టు చేయాల్సి వచ్చినపుడు వారిని సోదా చేయాల్సి వచ్చినపుడు వారి గౌరవాల్ని కాపాడటం కోసం కొన్ని కనీస ప్రమాణాలను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో నిర్దేశించారు. సె.51(2) సె.53, సె.100 (3) సె.157, సె.160, సె.163ఎ, సె.100(2)లలో కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు పొందుపరిచారు.

అరెస్టు చేసినప్పుడు..
------------------------
మహిళలని వారెంటు ద్వారా కానీ, వారెంటు లేకుండా గానీ పోలీసు అధికారి అరెస్టు చేసినపుడు, ఆ నేరాలను బట్టి బెయిల్ మంజూరు చేయాల్సి వుంటుంది. ఒకవేళ బెయిల్ మంజూరు చేయలేని పరిస్థితుల్లో వున్నట్లయితే వారిని సోదా చేసి దుస్తులను తప్ప అన్ని వస్తువులు వారి దగ్గరనుంచి తీసుకోవాల్సివుంది. అవి తీసుకున్నట్టుగా రసీదు కూడా ఇవ్వవలసి ఉంటుంది. అరెస్టు చేసిన వ్యక్తి మహిళ గనుక ఆమెను ఇతర మహిళలతో మాత్రమే సోదా జరిపించాలి. అంతేకాదు ఆమె గౌరవానికి భంగం కలగకుండా సోదా జరపాలి. (సెక్షన్ 51)

మహిళలను వైద్య పరీక్ష చేసేటప్పుడు..
---------------------------------------------
ముద్దాయిలని వైద్య పరీక్ష చేయించినట్టయితే ఆ నేరం చేసారనడానికి సాక్ష్యం లభించే అవకాశం వుందని పోలీసు అధికారి భావించినపుడు, ఆ ముద్దాయిలను వైద్య పరీక్షలకు పంపించడం జరుగుతుంది. అలాంటి అభ్యర్థన అందుకున్నప్పుడు వైద్యాధికారి ఆ ముద్దాయిలకు వైద్య పరీక్ష చేయాల్సి వుంటుంది. ముద్దాయి మహిళ అయితే లేడీ డాక్టర్లు వైద్య పరీక్షలు చేయవలసి వుంటుంది. కనీసం ఒక లేడీ డాక్టర్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరగాల్సి వుంటుంది (సె.53)
సాక్ష్యం ఇవ్వడానికి పోలీసు అధికారిని పిలవవచ్చా!
-----------------------------------------------------------
నేరం గురించిన సమాచారం తెలిసిన వ్యక్తులని స్టేషన్‌కి పిలిపించి వారిని విచారించడానికి పోలీసు అధికారికి అధికారం వుంది. ఆ విధంగా రాతపూర్వకంగా ఉత్తర్వులు అందుకున్నట్టయితే ఆ వ్యక్తులు ఆ పోలీసు అధికారుల ముందు హాజరుకావాల్సి వుంటుంది. కానీ మహిళల్ని కానీ పదిహేను సంవత్సరాల లోపల వున్న పిల్లల్నిగానీ పోలీసు అధికారులు స్టేషనుకు పిలవడానికి అధికారం లేదు. వాళ్ళని విచారించడానికి పోలీసు అధికారే ఆ వ్యక్తులు వున్న ప్రదేశాలకు వెళ్ళాల్సి వుంటుంది (సెక్షన్ 160).

అరెస్టు చేయడానికి వచ్చినపుడు..
----------------------------------------
ముద్దాయిలను అరెస్టు చేయడానికి, ఆ ముద్దాయిలు ఏ ఇంట్లోనైనా వున్నట్టు అనుమానం వస్తే ఆ ఇంటిని కూడా సోదా చేయడానికి పోలీసులకి అధికారం వుంది. పోలీసులు సోదా చేయడానికి వచ్చినపుడు వారికి సహకరించాల్సిన బాధ్యత ఆ ఇంటి యజమానిపై వుంటుంది. ఒకవేళ సహకరించనట్టయితే పోలీసులు బలప్రయోగం చేసే అవకాశం వుంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడానికి అధికారం వుంది. అయితే ఆ ఇంట్లో ఘోషాలో వున్న స్ర్తిలు ఉన్నట్లయితే వాళ్ళు అక్కడినుండి వైదొలగడానికి పోలీసులు అవకాశం కల్పించాలి (సె.47).
ఏదైనా వస్తువు కోసం సోదా చేసినప్పుడు...
------------------------------------------------
ఏదైనా వస్తువు పరిశోధన నిమిత్తం అవసరం అయినపుడు పోలీసులు ఏ ప్రదేశాన్నైనా సోదా చేయవచ్చు. ఒకవేళ ఆ వస్తువు అక్కడ వున్న వ్యక్తుల దగ్గర వున్నట్టుగా భావించినపుడు పోలీసు అధికారి ఆ వ్యక్తులని సోదా చేయవచ్చు. అయితే ఆ వ్యక్తులు మహిళలైనప్పుడు వేరే మహిళతో సోదా చేయించాల్సి వుంటుంది. ఆ సోదా కూడా వారి గౌరవానికి భంగం కలగకుండా జరపాల్సి వుంటుంది.

మానభంగానికి గురైనప్పుడు..
---------------------------------
మానభంగానికి గురైన మహిళలను వైద్య పరీక్షలకు పంస్తారు. ఆవిధంగా పంపించే ముందు ఆమె సమ్మతి తీసుకునే పంపించాలి. ఆమె సమ్మతి ఇవ్వలేనప్పుడు ఆమె తరఫున సమ్మతి ఇచ్చే యోగ్యత గల వ్యక్తులనుంచి సమ్మతి తీసుకొని పంపించాల్సి వుంటుంది. డాక్టర్ కూడా ఆమె సమ్మతిగానీ, ఆమె తరఫున ఆమె సంబంధీకుల సమ్మతిగానీ పొందాలి. ఆ విషయాన్ని నివేదికలో ప్రత్యేకంగా పేర్కొనవలసి వుంటుంది (సె.164ఎ).

Wednesday, February 17, 2010

వారెంట్ లేకుండా సోదాలు చేయవచ్చా?

February 16th,2010

వారంట్ లేకుండా పోలీసు స్టేషను ఇంచార్జి అధికారి లేదా కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారి అత్యవసర పరిస్థితుల్లో దర్యాప్తులో భాగంగా సోదా జరుపవచ్చు.

* తన అధికార పరిధిలోని ఏదైనా స్థలంలో దర్యాప్తుకి అవసరమైన వస్తువులు / పత్రాలు వున్నాయని సహేతుకంగా నమ్మినపుడు వారంట్ తీసుకోవడం వల్ల జాప్యం జరుగుతుందని భావించినప్పుడు వారంట్ లేకుండా సోదా జరుపవచ్చు.
* అయితే తగు కారణాలను రాతపూర్వకంగా రాసి సోదా జరపాల్సి ఉంటుంది.
* ఆ పోలీసు అధికారి ఈ సోదాని స్వయంగా నిర్వర్తించాల్సి వుంటుంది. తన క్రింది అధికారులని కూడా సోదా జరుపమని రాత పూర్వకంగా ఆదేశించవచ్చు.
* సంబంధించిన రికార్డుని వెంటనే మేజిస్ట్రేట్‌కి పంపించాలి. ఆ రికార్డు ప్రతిని ఉచితంగా ఆ స్థల (ఇంటి) యజమానికి ఇవ్వాల్సి వుంటుంది (సె.165 క్రి.ప్రొ.కో.).

అధికార పరిధి వెలుపల కూడా సోదా జరుపవచ్చా?

------------------------------------------------------------
పోలీసు అధికారులు తమ అధికార పరిధి వెలుపల (అదే జిల్లాలో కావొచ్చు, వేరే జిల్లాలో కావొచ్చు) కూడా వారంట్ సె.165 క్రి.పొ.కో.లో చెప్పినట్టు సోదా జరుపవచ్చు.
అయితే ఈ సోదాని పోలీసు స్టేషన్ ఇంచార్జి అధికారికి తగ్గని అధికారి గానీ లేక సబ్ ఇన్స్‌పెక్టర్ స్థాయికి తగ్గని అధికారిగానీ ఈ సోదా జరుపవచ్చు. జాప్యంవల్ల ఏ వస్తువు కోసం అయితే వెతుకుతున్నామో అది దాచి వుంచే అవకాశం వుందని భావించినపుడు సోదా జరుపవచ్చు. అప్పుడు తయారు చేసిన లిస్టు ప్రతిని సంబంధిత పోలీసు స్టేషన్‌కి పంపించాలి. అదేవిధంగా నేరాన్ని గుర్తించే మేజిస్ట్రేట్‌కి పంపించాలి. ఆ పోలీసు అధికారి తాను కాకుండా ఏ ప్రాంతంలోనైతే సోదా చేస్తున్నారో ఆ ప్రాంత పోలీసు స్టేషన్ ఇంచార్జి అధికారిని కూడా కోరే అవకాశం ఉంది. అప్పుడు ఆ అధికారికి కేసు దర్యాప్తు చేస్తున్న అధికారికి వుండే అధికారాలు లభిస్తాయి. ఈ సోదాలకి సె.100 క్రి.ప్రొ.కో. నిబంధనలు వర్తిస్తాయి.
సోదా ఎలా జరపాలి?
------------------------
దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారి తన అధికార ప్రాంతంలో ఏ ప్రాంతాన్నైనా నమ్మదగిన సమాచారం అందినపుడు సోదా చేయవచ్చు.
సాధారణంగా ఏదైనా ఇంటిని బలమైన కారణం వున్నపుడు పోలీసులు సోదా చేస్తారు. ఆ ఇంటిలో నిందితులకు ఆశ్రయం ఇచ్చినపుడు, ఏదైనా ప్రేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులకి నమ్మదగిన సమాచారం ఉన్నపుడు పోలీసులు సోదా చేయవచ్చు. సోదా చేయడానికి వారంట్ వుండాలి. కొన్ని పరిస్థితుల్లో వారంట్ లేకుండా సోదాలు చేయవచ్చు.
సోదా ఎలా జరుపాలన్న పద్ధతిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.100లో వివరించారు.
పోలీసు అధికారి గానీ లేదా వారంట్ అమలుచేస్తున్న ఇతర అధికారులకి ఆ స్థలం యజమానులు సోదా చేయడానికి అవసరమైన సౌకర్యాలని కల్పించాలి. ఆ విధంగా కల్పించినపుడు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లే అధికారం వాళ్లకు ఉంటుంది.
ఈ సోదా చేసేముందు, ఆ ప్రాంతంలోని ఇద్దరు గౌరవప్రదమైన వ్యక్తులనుగానీ అంతకుమించిగానీ పిలిచి వాళ్ళ సమక్షంలో సోదా జరపాల్సి వుంటుంది. ఒకవేళ ఆ సమయంలో అలాంటి వ్యక్తులెవరూ లేనపుడు, ఉన్నా సహకరించనప్పుడు పోలీసులే నేరుగా సోదా చేయవచ్చు. అయితే స్వతంత్ర వ్యక్తులని పిలవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా సోదా చేస్తే అది అక్రమమవుతుంది. ఒకవేళ ఆ ప్రాంతంలోని సాక్షులు సహకరించనప్పుడు వేరే ప్రాంతాలలోని స్వతంత్ర వ్యక్తులను సాక్షులుగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా లేనపుడు కోర్టులు ఆ సోదాని విశ్వసించవు.
సోదా సమయంలో వీటిని పాటించాల్సి ఉంటుంది.
----------------------------------------------------------
* సాక్షుల సమక్షంలో సోదా జరపాలి.
* స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు, అవి ప్రదేశాలలో లభించాయో వాటి వివరాల జాబితాను తయారుచేయాలి.
* స్వాధీనం చేస్తున్న వస్తువుల వివరాల ప్రతిని ఎవరి ఇంటినుంచైతే స్వాధీనం చేసుకున్నారో అతనికి ఇవ్వాల్సి వుంటుంది.
* సోదాని చూసిన వ్యక్తులు విధిగా కోర్టులో విచారించాల్సిన అవసరం లేదు.
* ఆ ఇంటి యజమానిని లేదా ఆ ఇంటిలో నివశిస్తున్న వ్యక్తిని సోదా చూడటానికి అనుమతించాలి. అంటే వారి సమక్షంలోనే సోదా జరపాల్సి వుంటుంది.
* వ్యక్తులని సోదా చేసి ఏవైనా స్వాధీనం చేసుకున్నపుడు దాని వివరాలు రాసి అతనికి ఇవ్వాల్సి వుంటుంది.
సాక్షిగా పిలిచినపుడు ఎవరైనా నిరాకరించినా, నిర్లక్ష్యం చేసినా వారు భారతీయ శిక్షాస్మృతిలోని సె.187 ప్రకారం శిక్షార్హులవుతారు.

Tuesday, February 9, 2010

పోలీసులు సోదాలు ఎప్పుడు జరపాలి?

February 10th,2010

పోలీసులు సోదాలు ఎప్పుడు జరపాలి?పోలీసులు సోదాలు ఎప్పుడు జరపాలి?

ఎవరినైనా, ఏదైనా ఇంటినైనా సోదా చేసే అధికారం పోలీసులకి వుంది. ఏ మాత్రం అనుమానం లేకపోయినా కూడా పోలీసులు సోదా చేస్తుంటారు. దొంగ సొత్తులున్నాయని అనుమానంతోగానీ, నేరం చేసిన వాళ్ళు వున్నారని అనుమానంతో పోలీసులు ఏ ఇంటినైనా, ప్రాంతాన్నైనా సోదా చేయవచ్చు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సోదాచేస్తారు.
సోదాలని చిట్టచివరి చర్యగా చేపట్టాలి. ఎందుకంటే సోదా వల్ల వ్యక్తుల స్వేచ్చకి పరుపు ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. అంతేకాక వాళ్ళూ అనవసరమైన అసౌకర్యానికి గురికాకుండా వుండటానికి కాని సోదాని చిట్టచివరి చర్యగా పోలీసులు చేపట్టాలి. సోదా చేయడానికి అవసరమైన పరిస్థితులు లేకున్నప్పుడు కూడా సోదా చేసినా పోలీసులు కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది.

పరిస్థితుల్లో పోలీసులు సోదా చేస్తారు?

ఈ పరిస్థితులు వున్నప్పుడు పోలీసులు సాధారణంగా సోదా చేస్తారు. అవి-
* అరెస్టు చేయాల్సిన వ్యక్తి ఎక్కడైనా దాగి వున్నాడని అనుమానం కలిగినప్పుడు.
* నేరస్తుని దగ్గర, నేరానికి సంబంధించిన వస్తువుని జప్తు చేయడానికి లేదా నేరంలో అతను ఉపయోగించిన ఆయుధాన్ని జప్తు చేయడానికి.
* నేరానికి సంబంధించిన ఏదైనా వస్తువుని రాబట్టడానికి.
* ఎవరైనా వ్యక్తిని చట్టవ్యతిరేకంగా సోదా చేయడానికి.
* ఏదైనా సొత్తు కలిగి ఉండటం నేరం అయిన పరిస్థితుల్లో సొత్తు జప్తు చేయడానికి.
అలాగే పిస్తోలు, బాంబులు లాంటి మరణాయుధాలు ఏవైనా ఉన్నప్పుడు అవి స్వాధీనం చేసుకోవడానికి, నేరాలని నిరోధించడానికి.
* జాతీయ సమగ్రత, మత స్వేచ్ఛకి భంగం కలిగించే సాహిత్యాన్ని అశ్లీల సాహిత్యాన్ని జప్తు చేయడానికి.

పరిశీలనఅంటే ఏమిటి?

చాలా దగ్గరగా చూడటాన్ని ‘పరిశీలన’ అంటారు. అధికార పూర్వకంగా చూడడం.
‘సోదా’ అంటే ఏమిటి?
‘సోదా’ అంటే దాచివుంచిన దాన్ని పరిశీలనగా చూడటం మాత్రం కాదు.

జప్తుఅంటే ఏమిటి?
‘స్వాధీనం’ చేసుకోవడాన్ని ‘జప్తు’ అంటారు.

సోదాలు ఎన్ని రకాలు?
సోదాలు రెండు రకాలు.
1. వ్యక్తుల కోసం సోదా మరియు వ్యక్తుల సోదా 2. వస్తువులు లేదా పత్రాల కోసం.
వ్యక్తులకోసం సోదాని ఏ విధంగా మళ్ళీ వర్గీకరించవచ్చు (ఎ) అరెస్టు చేయాల్సిన వ్యక్తుల కోసం సోదా (47 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)
(బి) అక్రమంగా నిర్బంధించిన వ్యక్తుల కోసం సోదా (సె.97 క్రి.ప్రొ.కో)
(సి) అరెస్టు చేసిన వ్యక్తుల సోదా (సె.51 క్రి.ప్రొ.కో.)
వ్యక్తుల కోసం లేదా పత్రాలకోసం సోదాని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
(ఎ) వారంట్ ద్వారా సోదా (సె.93, 94, 95, 100 క్రి.ప్రొ.కో.)
(బి) అత్యవసర కేసుల్లో వారంట్ లేకుండా కేసులు (సె.165, 166 క్రి.ప్రొ.కో.)

సోదా లేకుండా జప్తు
1.అపాయకరమైన ఆయుధాలని జప్తుచేసే అధికారం (సె.52 క్రి.ప్రొ.కో.)
2. కొన్ని రకాలైన ఆస్తులని పోలీసు అధికారి జప్తు చేసుకునే అధికారం (సె.102)
3.తన సమక్షంలో సోదా చేయమని మేజిస్ట్రేట్ ఆదేశించే అధికారం (సె.103)

అరెస్టు చేయాల్సిన వ్యక్తుల కోసం
పోలీసులు సోదా చేయవచ్చా?
అరెస్టు చేయాల్సిన వ్యక్తులకోసం పోలీసులు సోదా జరుపవచ్చు. వారంట్‌తో, లేక వారంట్ లేకుండా ఈ సోదా చేయవచ్చు. ఇతర వ్యక్తులు వారంట్‌తో మాత్రమే సోదా చేయాల్సి వుంటుంది.
ఏ ఇంటినైతే సోదా చేస్తున్నారో ఆ ఇల్లు ఎవరి అధీనంలో వుందో అతను సోదాకి అవసరమైన సౌకర్యాలు కల్పించాలి.
అలాంటి అవకాశం కల్పించనప్పుడు పారిపొయ్యే అవకాశం వున్నప్పుడు తలుపులు బద్దలుకొట్టి అయినా లోపలికి ప్రవేశించే అధికారం వాళ్ళు కలిగి వుంటారు. అయితే ఆ ఇంటిలో మహిళలు వుంటే వాళ్ళు అక్కడినుండి వైదొలిగే అవకాశం ఇచ్చిన తరువాత తలుపులు బద్దలుకొట్టాలి. (సె.47 క్రి.ప్రొ.కో.) అయితే ఆ వ్యక్తులనే అరెస్టు చేయాల్సి వచ్చిన వైదొలగమని చెప్పాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా అవసరమైనప్పుడు తనకోసం తను అరెస్టు చేసిన వ్యక్తుల కోసం కూడా తలుపులు బద్దలు కొట్టవచ్చు.

అక్రమంగా నిర్బంధించిన వ్యక్తుల
కోసం సోదా చేయవచ్చా?
అక్రమంగా నిర్బంధించిన వ్యక్తులకోసం వారంట్ తీసుకొని సె.97 క్రి.ప్రొ.కో. ప్రకారం సోదా జరిపే అవకాశం వుంది.
ఈ వారంట్ ఇచ్చే అధికారం జిల్లాకి ముగ్గురికి వుంది. వారు-
* జిల్లా మేజిస్ట్రేట్
* సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్
* జ్యుడీయల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్.
ఎవరినైనా అక్రమంగా నిర్బంధించినారన్న సమాచారం గురించి సంతృప్తి చెందినప్పుడు ఈ వారంట్‌ను ఈ అధికారులు జారీ చేస్తారు.
ఏదైనా ప్రదేశాన్ని మాత్రమే సోదా చేయాలని వారంట్ ఇవ్వవచ్చు. అదేవిధంగా తిరిగి నిర్దేశించకుండా సాధారణ వారంట్‌ని కూడా జారీ చేయవచ్చు. ఈ వారంట్‌ని తన అధికార పరిధి వెలుపల కూడా అమలుచేయడానికి ఇవ్వవచ్చు.
వారంట్ ద్వారా సోదా చేసినపుడు ఆ వ్యక్తి కన్పిస్తే అతన్ని తక్షణం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి.
ఈ వారంట్ అమలుచేసే క్రమంలో ఎవరైనా ఆటంకాలు ఏర్పరిస్తే వాళ్ళను భారతీయ శిక్షాస్మృతిలోని సె.186 ప్రకారం శిక్షించొచ్చు.
అరెస్టుచేసిన వ్యక్తులని సోదా చేయవచ్చా?
అరెస్టు చేసిన వ్యక్తిని పోలీసులు వ్యక్తిగతంగా సోదా చేయవచ్చు. వేసుకున్న బట్టలు తప్ప మిగతావాటిని పోలీసులు జప్తు చేసుకోవచ్చు. ఆ విధంగా జప్తు చేసిన వస్తువుల జాబితాని తయారుచేసి రశీదుని ఇవ్వాల్సి వుంటుంది.
వారంట్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులని అరెస్టు చేసినపుడు అతన్ని పోలీసులకి అప్పగించాలి. ఆ విధంగా అప్పగించినప్పుడు కూడా పైవిధంగా పోలీసులు సోదా చేయాల్సి వుంటుంది (సె.51 క్రి.ప్రొ.కో.)
అరెస్టు చేసిన మహిళలని సోదా చేయాల్సి వచ్చినపుడు వాళ్ళ గౌరవానికి భంగం కలుగకుండా సోదా జరగాల్సి వుంటుంది

Tuesday, February 2, 2010

పోలీసులకు సహాయం పౌరుల బాధ్యత

February 3rd,2010

మేజిస్ట్రేట్‌కు లేదా పోలీసులకు కొన్ని సందర్భాలలో సహాయాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై వుంటుంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.37 ప్రకారం వారు సహేతుకంగా కోరినపుడు సహాయాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై వుంటుంది.

పరిస్థితులలో సహాయాన్ని
పోలీసులకు అందించాల్సి వుంటుంది?

పోలీసులు కానీ, మేజిస్ట్రేట్ గానీ ఎవరి సహాయాన్నైనా ఈ సందర్భాలలో కోరినపుడు వాళ్ళు తప్పక అందించాల్సిన బాధ్యత వుంటుంది. ఆ సందర్భాలు-

* తాము అరెస్టు చేయాల్సిన వ్యక్తి తప్పించుకున్నప్పుడు;
* శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా నివారించుటకు;
* ప్రభుత్వ ఆస్తులకుగానీ, రైల్వేలకుగానీ కాలువలకు, టెలిగ్రాఫిక్ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడినప్పుడు, ఆ నష్టం కలుగకుండా సహాయాన్ని కోరినప్పుడు.
ఈ సందర్భాలలో పోలీసులకు సహకరించడం ప్రతి వ్యక్తి విధి. సహేతుకంగా డిమాండ్ చేయడమనేది కేసు విషయాలను బట్టి వుంటుంది.

సహకరించకపోతే నేరం అవుతుందా?
-----------------------------------------
ఈ విధంగా సహకరించకపోతే అది భారతీయ శిక్షాస్మృతిలోని సె.187 ప్రకారం నేరమవుతుంది. ఈ నేరానికి ఒక నెల వరకు జైలు శిక్షగానీ లేక రూ.2000/-ల జరిమానా గానీ లేదా రెండింటిని గానీ విధించే అవకాశం వుంది.
ఏ విషయాల గురించి పోలీసు అధికారికి వ్యక్తులు సమాచారం అందించాల్సి ఉంటుంది?
ఈ క్రింది నేరాలు జరిగినపుడు లేదా ఈ నేరాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఎవరికైనా తెలిస్తే ఆ సమాచారాన్ని పోలీసులకు లేదా మేజిస్ట్రేట్‌కి అందించాల్సి వుంటుంది.

నేరాలు
------------
* ప్రభుత్వ వ్యతిరేక నేరాలు, దేశద్రోహం;
* ప్రజల శాంతి విఘాతం కలిగించే నేరాలు;
* అక్రమ సంపాదన లేక లంచం తీసుకోవడానికి సంబంధించిన నేరాలు;
* ఆహార పానీయాలు, మందుల కల్తీకి సంబంధించిన నేరాలు;
* ప్రాణహానికి సంబంధించిన నేరాలు;
* దోపిడీ, బందిపోటుతనానికి సంబంధించిన నేరాలు;
* నమ్మకద్రోహానికి సంబంధించిన నేరాలు ప్రభుత్వోద్యోగి చేసినపుడు;
* తుంటరి చర్యలకు పాల్పడి, ప్రజల ఆస్తికి నష్టం కలిగించినప్పుడు;
* గృహంలో అక్రమంగా చొరబడిన నేరాలకు సంబంధించి;
* రహస్యంగా ఇంటిలోకి చొరబడిన నేరాల గురించి;
* కరెన్సీ నోట్ల నేరాలకు సంబంధించి.
ఈ నేరాలకు సంబంధించి సమాచారం తెలిసి కూడా పోలీసులకు అందచేయనప్పుడు, ఆ విధంగా అందచేయక పోవడానికి సమంజసమైన కారణం వుందని ఆ వ్యక్తే రుజువుపరచుకోవాల్సి వుంటుంది.

వారంట్ అమలుపరిచేటప్పుడు
సహకరించాల్సి వుంటుందా?

పోలీసు అధికారి కాకుండా ఇతర వ్యక్తులు వారంట్‌ని అమలు పరుస్తున్నప్పుడు సహాయాన్ని కోరితే సహాయాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తిపై వుంటుంది.
అయితే రెండు విషయాలు వుండాలి.
అవి
----
* వారంట్ అమలుచేస్తున్న వ్యక్తి సమీపంలో ఆ వ్యక్తి వుండాలి.
* అది అమలు చేస్తున్న క్రమం అయి వుండాలి. (సె.38 క్రి.ప్రొ.కో.)
అందిన సమాచారాన్ని నమోదు చేయకపోతే నేరమవుతుందా?
--------------------------------------------------------------------------
నాన్ కాగ్నిజబుల్ నేర సమాచారం అందినప్పుడు ఆ సమాచారాన్ని జనరల్ డైరీలో నమోదు చేసి సమాచారం ఇచ్చిన వ్యక్తిని సంబంధిత మేజిస్ట్రేట్ దగ్గరకు పంపించాలి. కాగ్నిజబుల్ నేర సమాచారం అందినప్పుడు దాన్ని ప్రథమ సమాచార నివేదిక విడుదల చేయాలి.
ఆ సమాచారాన్ని తీసుకోవడానికి తిరస్కరించినా, ఇచ్చిన సమాచారం కాకుండా వేరే సమాచారాన్ని తప్పుగా నమోదు చేసినా ఆ పోలీసు అధికారి భారతీయ శిక్షాస్మృతిలోని సె.177 నేరం చేసినవారవుతారు. ఆ నేరానికి వారిని ప్రాసిక్యూట్ చేసే అవకాశం వుంది.
ఈ నేరానికి ఆరు నెలలవరకు జైలుశిక్ష లేదా 1000 రూపాయల వరకు జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం వుంది.

Followers