Friday, December 26, 2008

27-12-2008 surya daily
ఫిరాయింపులు, చట్టం

శాసనసభ్యులపై ఫిరాయింపుల నిరోధక నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడింది. ఆరుగురు శాసనసభ్యులు ఈ నిర్ణయం నుంచి తప్పించుకొన్నారు. శాసనసభ్యులకు ఫిరాయింపు చట్టాన్ని వర్తింప చేయడం రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ జరుగనిది. ఇది చారిత్రాత్మక నిర్ణయమని కొందరు, అన్యాయమైన నిర్ణయమని మరికొందరు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆలస్యంగా జరిగిన న్యాయం అన్యాయంతో సమానమని మరికొందరి వాదన. ఏమైనప్పటికీ ఈ తీర్పులో ఫిరాయింపు చట్టం మరోసారి చర్చలోకి వచ్చింది. ఫిరాయింపు నిరోధక చట్టం అంటే ఏమిటి? ఈ చట్టప్రకారం ఏ సందర్భాలలో సభ్యులు అనర్హతకి లోనవుతారు? ఈ చట్టంలో ఉన్న లొసుగులేమిటి? ఈ చట్టంలో మార్పులు తీసుకొని రావలసిన అవసరం ఉందా? ఇవీ ప్రశ్నలు.రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలులో ఫిరాయింపు నిరోధక నిబంధనలను ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తాము ఎన్నికైన పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళడాన్ని నిరోధిస్తూ చట్టం తీసుకొని రావలసిన అవసరం ఉందని 1985లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం భావించి, రాజ్యాంగంలో సవరణలను తీసుకువచ్చింది. చట్టం 52/85 ద్వారా ఈ నిబంధనలను రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులో ఏర్పరిచారు. అప్పుడు లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 401 మంది. ఈ చట్టప్రకారం ఎవరైనా సభ్యుడు తాను ఎన్నికైన పార్టీ నుంచి స్వచ్ఛందంగా వేరే పార్టీలో సభ్వత్వం తీసుకున్నప్పుడు, అదేవిధంగా తాను ఎన్నికైన పార్టీ ఆదేశాలకు భిన్నంగా, ఎలాంటి పూర్వానుమతి లేకుండా సభలో హాజరు కానప్పుడు అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ ఆదేశాలకు భిన్నంగా సభలో తమ ఓటును వినియోగించినా కూడా అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అయితే ఎన్నికైన సభ్యులలో మూడవవంతు (1/3) సభ్యులు పార్టీ నుండి విడిపోయి వేరేపార్టీలో కలిసినపుడు అది ఫిరాయింపు కిందికి రాదు. ఇలాంటి సంఘటనల ఆధారంగా ఈ చట్టప్రకారం చర్య తీసుకునే అవకాశం లేదు. ఈ మినహాయింపును పదవ షెడ్యూలు నుంచి తొలగించాలని ఎన్నికల సంస్కరణలపై నియమించిన దినేష్‌ గోస్వామి కమిటీ, రాజ్యాంగ పనితీరుపై సమీక్ష కమిషన్‌ సిఫారసు చేశాయి. చివరికి రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం దీనికి మార్పు తీసుకు వచ్చారు. ఎన్నికైన సభ్యులలో కనీసం 2/3 మంది సభ్యులు చీలి వేరే పార్టీలో కలిస్తే అది ఈ చట్టప్రకారం ఫిరాయింపు కాదు. అదేవిధంగా మొత్తం పార్టీ వేరే పార్టీలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు అది కూడా ఫిరాయింపు కిందికి రాదు. అదేవిధంగా ఎన్నికైన పార్టీ వేరే పార్టీతో కలవడం నచ్చక వేరుగా ఉండాలని అనుకుంటున్న సభ్యులు కూడా ఈ ఫిరాయింపు చట్టం పరిధిలోకి రారు. ఆయారామ్‌, గయారామ్‌ల సంస్కృతిని నివారించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ సంస్కృతి మన రాషా్టన్న్రే కాదు, దేశాన్నే పట్టి పీడిస్తున్నది. ఫిరాయింపుల వల్ల ప్రభుత్వ సుస్థిరతకు ప్రమాదం ఏర్పడి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి హానికరంగా పరిణమిస్తోంది. సుప్రీంకోర్టు కిహాటా „హ్లుహాన్‌ వర్సెస్‌ జాచిత్యా మరి ఇతరులు (ఏ.ఐ.ఆర్‌.1993 సుప్రీంకోర్టు 412) కేసులో ఫిరాయింపుల చట్టం గురించి ఈ విధంగా అభిప్రాయపడింది- `రాజకీయ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్రను పదవ షెడ్యూలు గుర్తించింది. ఎన్నికల ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రోగ్రామ్‌తో వెళ్తుంది. ఆ ప్రోగ్రామ్‌కి అనుగుణంగా అభ్యర్థులను ఎన్నికలలో నిలబెడుతుంది. ఆ రాజకీయ పార్టీ కార్యక్రమాల ఆధారంగా అభ్యర్థులు ఎన్నికవుతారు. ఆ అభ్యర్థి ఎన్నికైన పార్టీని వదిలి వేరే పార్టీకి చేయూతను ఇచ్చినప్పుడు రాజకీయ ఔచిత్యత దెబ్బతింటోంది. అందుకని ఆ వ్యక్తి తన పదవిని వదలి మళ్ళీ ఎన్నిక కావలసి ఉంటుంది'.ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా సభ్యుడు ఫిరాయింపు దారుగా పదవ షెడ్యూలు ప్రకారం నిర్ణయించే అధికారం ఆ సభాపతికి ఉంది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే సభాపతి ఆ సభ్యుణ్ణి అనర్హునిగా నిర్ధారించవచ్చు. సభాపతి కూడా ఆ సభలోని సభ్యుడే. అతడు కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికల్లో నిలబడి గెలిచినవాడే. అవసరమని భావించినప్పుడు మళ్ళీ ఎన్నికల్లో నిలబడతాడు. తన పదవికి రాజీనామా చేసి ఇతర పదవులను ఆయన పొందే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో వారు సభ్యులను అనర్హులుగా నిర్ణయించే ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలను అరికట్టేందుకు 1998లో అప్పటి బెంగాల్‌ సభాపతి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ `అనర్హత'ను నిర్ధారించడానికి ఎన్నికల కమిషన్‌ వలె, లా కమిషన్‌ వలె ఒక స్వతంత్ర ట్రిబ్యునల్‌గాని, కమిషన్‌గానీ ఉండాలని సూచించింది. కానీ ఈ విషయమై ఎలాంటి నిర్ణయం ఇప్పటి దాకా జరగలేదు. ఇది ఇలా ఉంటే, ఫిరాయింపుల చట్టం వల్ల ఆ సభ్యులు తమ స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతున్నారని, ఏదైనా బిల్లుమీద స్వతంత్రంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చలేకపోతున్నారని కొంతమంది వాదన. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పార్టీల బలా బలాల వరకు మాత్రమే ఉంచి మిగతా విషయాల్లో స్వేచ్ఛ ఇవ్వాలని వారి వాదన. ఈ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించలేము, అట్లా అని తిరస్కరించలేం. దీనిపై కొంత చర్చ జరగవలసిన అవసరం మాత్రం ఉంది. మనరాష్ట్రంలోని సంఘటనల నేపథ్యంలో, పదవ షెడ్యూలు ప్రకారం ఫిరాయింపుదారుడిగా ఎవరైనా సభ్యుణ్ణి నిర్ణయించడానికి ఎన్నికల సంఘం వలె, లా కమిషన్‌ వలె ఒక స్వతంత్ర సంస్థ అవసరమని అనిపిస్తుంది. ఒక్క కేసును పరిష్కరించడానికి 22 సిట్టింగులు, రెండు సంవత్సరాల కాలం పడితే- కోర్టులు కూడా ఇదే విధంగా పనిచేస్తే వాటి వద్ద విచారణలో ఉన్న కేసుల పరిష్కారానికి మరెంత కాలం పడుతుంది? అదృష్టం ఏమంటే, కోర్టులు త్వరితగతినే కేసులను పరిష్కరిస్తున్నాయి.
రచయిత నిజామాబాద్‌జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Friday, December 19, 2008

s
కస్టడీలో మరణాలు
భారత హోంశాఖ 1985 జులై 14న దేశంలోని పోలీసుల కోసం ప్రవర్తనా నియమావళిని రూపొందించింది. ఆ నియమావళిలోని మూడవ నియమం ప్రకారం `పోలీసులు తమ అధికారాలను, విధులను తప్పక గుర్తించాలి. న్యాయవ్యవస్థ విధులను అక్రమంగా స్వీకరించి (స్వీకరించినట్టు కూడా కనిపించకూడదు) తీర్పులు చెప్పడం తప్పు. అదే విధంగా తప్పుచేసిన వారిని పోలీసులు శిక్షించకూడదు'. చట్టం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. అయితే ఏదైనా నేరం జరిగినప్పుడు ప్రజల అంచనాలు, వాళ్ళు ఊహిస్తున్న విషయాలు మరోవిధంగా ఉంటాయి. ప్రజలు కోరుకుంటున్న ప్రకారం పోలీసులు ప్రవర్తించాలా, చట్టం నిర్దేశిం చిన ప్రకారం ప్రవర్తించాలా? ఇది ఇటీవల ఉత్పన్నమైన ప్రశ్న. కస్టడీలో నేరాలు జరగడం సాధారణ విషయంగా మారిపోయింది. నిజానికి అది మాములు విషయం కాదు. కస్టడీలో చిత్రహింసలు, మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి గురించి పట్టించుకునేవారే లేకుండాపోయారు. ఈ విషయాలను గమనించి సుప్రీంకోర్టు 1996లో అత్యంత ప్రముఖమైన తీర్పును ప్రకటిం చింది. అదే డి.కె. బసు కేసు. న్యాయ నియమం ద్వారా పరిపాలన జరుగుతున్న మన సమాజంలో కస్టడీ మరణం కన్నా అతి హీనమైననేరం మరొకటి ఉండదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కుల్‌ దీప్‌ సింగ్‌, ఎ.ఎస్‌. ఆనంద్‌ అభిప్రాయపడ్డారు. చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో కాకుండా వేరే రకంగా ఎవరి స్వేచ్ఛాజీవితానికి భంగం కలిగించడానికి వీల్లేదు. అందుకు రాజ్యాంగం అభయం ఇచ్చింది. రాజ్యాంగం, చట్టం అభయం ఇచ్చినప్పటికీ కస్టడీలో మరణాలు జరుగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు డి.కె. బసు కేసులో నిర్దేశిం చిన అవశ్యకతల అమలు పటిష్ఠంగా జరుగుతోందని అనిపించడం లేదు. కస్టడీలో మరణాలే కాకుండా కస్టడీలో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్‌లు కూడా జరుగుతున్నాయి. ఇది ఒక కొత్త పరిణామం. ఒక వ్యక్తిని అరెస్టు చేయగానే అతణ్ణి సోదాచేసి అతని దగ్గరఉన్న మారణాయుధాలను పోలీసులు జప్తు చేయాలి. ఏవైనా మారణాయుధాలు ఎక్కడైనా దాచిపెడితే, ముద్దాయి వెల్లడించిన తర్వాత వాటిని పోలీసులు జప్తుచేస్తారు. ముద్దాయిలవెంట తగిన సిబ్బంది ఉంటారు. అయినా ముద్దాయిలు తిరగబడుతున్నారని పోలీసులు అంటున్నారు. ఆ సందర్భంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరెస్టయిన వ్యక్తులు మరణించడం ఇటీవల జరిగిపోతోంది. ఒక వ్యక్తిని అరెస్టు చేయడం అనేది ఆ వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. ఆకారణ అరెస్టు నుంచి రక్షణతోబాటు అరెస్టు చేసే విధానం చట్టబద్ధంగా ఉండాలి. అరెస్టు చేయాల్సిన అవసరం ఉం డాలి. నేరం జరిగిందన్న సమాచారం అందినవెంటనే చాలా కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదు. క్రిమినల్‌ ప్రోసిజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 157 వెనుక ఉన్న ఉద్దేశం ఇదే. నేరం జరిగిందన్న సమాచారం సరైనదా, కాదా అనేది తేల్చుకున్న మీదట, నిందితుడు నేరంచేశాడని ప్రాథమికంగా నిర్ధారించుకొన్న తర్వాత, అవసరం అనుకొన్నప్పుడే అతణ్ణి అరెస్టు చేయాలి. అనుమానం మీద, కక్ష సాధింపునకు అనేక అబద్దపు ఫిర్యాదులు పోలీసు స్టేషన్‌లలో ఇస్తున్న సంగతి తెలిసినదే. అలాంటప్పు డుకూడా ఆరోపణల్లో ఆధారాలు ఉన్నాయోలేవో చూడకుండా పోలీసులు నిందితుణ్ణి అరెస్టుచేస్తున్నారు. బకాయిలు వసూలు చేసుకోవడం, పరస్పర ఒప్పందాల్లో ఏర్పడిన వివాదాల్ని పరిష్కరించుకోవడం తదితర సివిల్‌ వివాదాల్ని కూడా కొంతమంది పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళగా, వారు ఆ వివాదాల్ని దగావంటి నేరాల కిందచూపి కేసులు నమోదుచేసి బాకీ వసూలుచేసే ఏజెంట్లుగా తయారవుతున్నారు. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు పరచడానికి మానవహక్కులు అడ్డువస్తాయని చట్టాన్ని అమలుపరచాల్సిన అధికారులు చాలా మంది ఇవాల్టికీ భావిస్తున్నారు. అంతేకాక చట్టాన్ని అమలు పరచడంఅంటే నేరంతో యుద్ధంచేయడమేనని. ఈ యుద్ధాన్ని మానవ హక్కులపేరిట న్యాయవాదులు, ప్రభుత్వేతరసంస్థలకు చెందిన వారు ఆటంకపరుస్తున్నారనికూడా వారి అభిప్రాయం. ఈ ధోరణి ప్రమాదకరంగా పరిణమించి రహస్యంగా నిర్బంధించడం, నిందితుడ్ని ప్రశ్నించే పేరిట రికార్డుల్లో అరెస్టును చూపకుండా చాలా కాలం తమ ఆధీనంలో ఉంచుకోవడమూ, నిందితుణ్ణి భౌతికంగా హింసించడమూ వంటి చర్యలకు దారితీస్తుంది.ఇటీవల కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు తలెత్తడానికి కారణమేమిటి, వీటిని ఏ విధంగా ఎదుర్కోవలసి ఉంటుంది? డి.కె. బసు కేసులో భారత సుప్రీంకోర్టు-మీరాండా వర్సెస్‌ ఆరిజోనా కేసులో అమెరికా సుప్రీం కోర్టు ఎలా స్పందించిందో ఉదాహరించింది. `ఇంటరాగేషన్‌కి ప్రత్యేకమైన హక్కు ఇవ్వాలని, సమాజానికి అది అవసరమన్న వాదన తరచూ వస్తోంది. అది కోర్టుకి కొత్తకాదు. ప్రభుత్వ అధికారంతో మామూలు వ్యక్తి తలపడినప్పుడు ఆ వ్యక్తిని అతనికే వ్యతిరేకంగా సాక్షిగా ఉండాలని ఒత్తిడి చేయకూడదు. ఈ హక్కును తగ్గించడానికి కూడా వీల్లేదు'.రాజ్యం భద్రత గురించి వ్యక్తుల స్వేచ్ఛను బలిపెట్టడానికి వీల్లేదు. రాజ్యం భద్రత గురించి ప్రివెం టివ్‌ డిటెన్షన్‌ ఉపయోగించవచ్చు. డిటెన్యులను, దోషులను, ఆరెస్టయిన వ్యక్తులను దేశ ప్రయోజనాలకోసం ఇంటరాగేషన్‌ చేయవచ్చు. ఈ ఇంటరాగేషన్‌కు వ్యక్తిస్వేచ్ఛ కన్నా ఎక్కువ అధిక్యత ఉంది. లాటిన్‌ మాగ్జిమ్‌ షాలుస్‌ పాప్యుతి యెస్‌‌ట సుప్రీమా లెక్‌‌స (ప్రజల రక్షణ అత్యున్నతమైన శాసనం), షాలుస్‌ రిపబ్లికా మెస్‌ సుప్రియా లెక్‌‌స (రాజ్యరక్షణ అత్యున్నత శాసనం). ఇవి రెండూ ఒకదాని వెంట ఒకటి ఉండాలి. వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమం ఉంటుంది. రాజ్యం చర్యలు సరైనవిగా, న్యాయబద్ధమైనవిగా, ఉచితమైనవిగా ఉండాలి. ఎలాంటి సమాచారం రాబ ట్టడానికైనా వ్యక్తులను చిత్రహింసలపాలు చేయడం సరైనది, న్యాయబద్ధమైనది, ఉచితమైనది కాదు. ఇవి ఆర్టికల్‌ 21కి హానికలిగించేవి కాబట్టి ఆమోదయోగ్యం కావు. దోషులను శాస్త్రీయ పద్ధతు లో ఇంటరాగేషన్‌ చేయాలి. అది కూడా శాసనం ధృవీకరించిన నిబంధనలప్రకారం జరగాలి. సమాచారం రాబట్టడానికి నేరం ఒప్పుదల గురించి, సహనేరస్తుల, ఆయుధాల ఆచూకీ తెలుసుకోవడానికి వ్యక్తులను చిత్రహింసలపాలు చేయడానికి వీల్లేదు. శాసనం అనుమతించిన ప్రకారం తప్ప మరోకరంగా నేరస్తులకు రాజ్యాం గం ప్రసాదించిన హక్కులను తగ్గించడానికి వీల్లేదు. మామూలు నేరస్తులను, రకడుగట్టిన నేరస్తులను ఇంటరాగేషన్‌ చేసే పద్ధతులలో పరిమాణాత్మక బేధాలు ఉండవచ్చు. కానీ వారి హక్కులను తగ్గించడానికి వీల్లేదు. కొత్తరకమైన ఆలోచనలతో, దృక్పథాలతో టెరర్రిజం సవాలును ఎదుర్కోవాలి. టెరర్రిజంపై యుద్ధం చేయడానికి స్టేట్‌ టెరర్రిజం సమాధానం కాదు. టెరర్రిజానికి స్టేట్‌ టెరర్రిజం న్యాయబద్ధతను కలుగచేయదు.అది సమాజానికి, రాజ్యానికి, రూల్‌ ఆఫ్‌ లా కు మంచిది కాదు. అమాయక పౌరుల మానవహక్కులను టెరర్రిస్టులు ఉల్లంఘించినప్పుడు వాళ్ళు శాసనం ప్రకారం శిక్షార్హులవుతారు. కానీ వాళ్ళ మానవహక్కులను మరోరకంగా హరించడానికి వీల్లేదు. అందుకని దర్యాప్తుల్లో శాస్త్రీయ పద్ధతుల్ని వృద్ధి చేయాలి. సరైన పద్ధతుల్లో ఇంటరాగేషన్‌ చేయడానికి శిక్షణ ఇవ్వాలి. మహిళలపై నేరాలను, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కోవడానికి అవసరమైనవి ముందుజాగ్రత్త చర్యలు. సరైన నిఘా వ్యవస్థ ఉంటే ఉగ్రవాద దాడులను నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇది అధికారయంత్రాంగం గ్రహిస్తే సత్ఫలితాలు ఉంటాయి.
రచయిత నిజామాబాద్‌జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి

Friday, December 12, 2008

acid dadulu

మళ్ళీ యాసిడ్‌ దాడులు
``బాధితురాలి దుస్థితి చూసి ఆమెకు న్యాయం చెయ్యాలంటే ఆటవిక న్యాయం అవసరమని అనిపిస్తుంది. చాలా ఆలోచించి మేం అంటున్న మాట ఇది. ఆటవిక న్యాయ సూత్రమైన `కన్నుకి కన్ను, రక్తానికి రక్తం' మాత్రమే ఆమెకు న్యాయం ఇవ్వగలదు''``బాధితురాలి దుస్థితి చూసి ఆమెకు న్యాయం చెయ్యాలంటే ఆటవిక న్యాయం అవసరమని అనిపిస్తుంది. చాలా ఆలోచించి మేం అంటున్న మాట ఇది. ఆటవిక న్యాయ సూత్రమైన `కన్నుకి కన్ను, రక్తానికి రక్తం' మాత్రమే ఆమెకు న్యాయం ఇవ్వగలదు''. యాసిడ్‌ బాధితురాలి కేసులో కర్ణాటక హైకోర్టు డివిజన్‌ బెంచి తన తీర్పులో ఈ మాటలను పేర్కొంది. సంయమనం కోల్పోకుండా తీర్పులు చెప్పాల్సిన న్యాయమూర్తులకే అంత ఆగ్రహం, బాధ, ఆవేశం కలిగించిన కేసు అది. ఇక మామూలు వ్యక్తుల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ యాసిడ్‌ దాడులకు పాల్పడిన వ్యక్తులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వారి ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు, ఆలోచించవచ్చు. మీడియా కథనం ప్రకారం బుధవారం సాయంత్రం స్కూటీమీద ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ప్రణీత, స్వప్నికలపై యాసిడ్‌ దాడి జరిగింది.వాళ్ళు రామారం ఎవిఎస్‌ కాలేజీ వద్దకు రాగానే వెనక నుంచి పల్సర్‌ వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు వారిపై యాసిడ్‌ పోసి పారిపోయారు. హెల్మెట్‌ ధరించి డ్రైవింగ్‌ చేస్తున్న ప్రణీతకు స్వల్పంగా గాయాలు కాగా వెనుక కూర్చున్న స్వప్నికకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో రాష్ట్రంలోని తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురవుతున్నారు. అందరూ ఆగ్రహావేశాలను వెళ్ళగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో యాసిడ్‌ దాడుల గురించి మరోసారి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచ మానవహక్కుల రోజున ఈ దాడి జరగడం యాదృచ్ఛికమే అయినా అత్యంత బాధాకరమైన విషయం. మహిళలపై దాడి చేయడానికి మగవాళ్ళు అందుకున్న కొత్త ఆయుధం యాసిడ్‌. ఈ ఆయుధాన్ని కర్ణాటకలో మరీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 1999 నుంచి యాసిడ్‌ దాడుల బారిన పడిన వాళ్ళ సంఖ్య 65 మంది. అందరూ మహిళలే.ఆ తరువాతి స్థానాలు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ముంబాయి. ఇప్పుడు కొత్తగా మరో రాష్ట్రం చేరబోతుంది. అదే అంధ్రప్రదేశ్‌. 97 శాతం మంది మహిళల పైనే ఈ దాడులు జరిగాయి. ఇందుకు కారణం ఏమిటి? మహిళలు స్వతంత్రంగా వ్యవహరించకుండా ఉండటానికి వాళ్ళను నియంత్రించడానికి ఇవి ఎక్కువగా జరుగుతున్నాయని కొంతమంది భావన. తమను ప్రేమించనందుకు జరుగుతున్నాయని మరి కొంత మంది భావన. ఇవి రెండూ కూడా కారణాలు కావచ్చు. మహిళలు స్వతంత్రంగా ఉద్యోగాలు చేస్తూ కార్లు, బైకులు నడిపిస్తూ, రాత్రిపూట ఉద్యోగాలు చేస్తూ తమకు ఇష్టమైన రీతిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇది చాలా మందికి రుచించకపోవచ్చు. ఒక వ్యక్తిని ప్రేమించడం, ప్రేమించకపోవడంలో స్వతంత్రంగా వ్యవహరించి ఎంపిక చేసుకునే హక్కును మహిళలు వినియోగించకుండా ఉండటానికి కూడా ఈ దాడులు జరుగుతూ ఉండవచ్చు. కర్ణాటక కేసు విషయానికి వస్తే హసీనా వయస్సు 19 సంవత్సరాలు. ఆమెపై దాడి చేసిన జోసెఫ్‌ రొడ్రిక్‌‌స వయస్సు 39 సంవత్సరాలు. అతనికి ఒక కంప్యూటర్‌ వ్యాపారం ఉంది. హసీనా అందులో ఉద్యోగం చేసేది. అది నష్టాల్లో ఉండటం వల్ల ఆ వ్యాపారాన్ని జోసెఫ్‌ ఆపేశాడు. కానీ హసీనాని తన ఇంటిదగ్గర పని చెయ్యమని డిమాండ్‌ చేశాడు. ఆమె ఒప్పుకోలేదు. వేరే చోట చేరింది. ఫలితంగా ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు జోసెఫ్‌. ఈ సంఘటన జరిగి ఏడు సంవత్సరాలు గడిచాయి. ఈ ఏడుసంవత్సరాలలో ఆమెకు 15 ఆపరేషన్లు జరిగాయి. కళ్ళు కోల్పోయింది. ఆమె పెదవులు, వెంట్రుకలు కాలిపోయాయి. వాటిని గ్రాప్టింగ్‌ ద్వారా ఏర్పాటు చేశారు. అయినా హసీనా ధైర్యాన్ని కోల్పోలేదు. ధైర్యంగా ఎదురొడ్డి నిలిచింది. ఫలితంగా జోసెఫ్‌కు జీవిత ఖైదు శిక్షపడింది. సెషన్‌‌స కోర్టు తక్కువ శిక్ష విధించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. యాసిడ్‌ దాడులకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ హసీనాకు సహకరించింది. కర్ణాటక హైకోర్టులోని డివిజన్‌ బెంచి తీర్పులో ఇంకా ఈ విధంగా అభిప్రాయ పడింది: `ఆమెకు అయిన గాయాలు జీవితాంతం ఆమెను వెంటాడుతాయి. చావుకన్నా ఆమె బతుకును ముద్దాయి దుర్భరం చేశాడు. అందుకని అతనికి విధించాల్సిన కనీస శిక్ష సె.307కి ఉన్న గరిష్ఠ శిక్ష. ముద్దాయి ప్రార్థన విన్నాం. అన్నీ పరిశీలించి అతనికి ఆ నేరానికి ఉన్న అత్యధిక శిక్ష జీవితఖైదును విధించాలని ఆదేశిస్తున్నాం. కింది కోర్టు విధించిన జరిమానాను మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నాం. బాధితురాలు ఆ డబ్బు తీసుకోవచ్చు' ఇదీ తీర్పులోని సారాంశం.యాసిడ్‌ దాడులను మహిళా కమిషన్‌, సుప్రీంకోర్టు కూడా పట్టించుకున్నాయి. ఈ దాడుల గురించి ఒక నివేదిక సమర్పించవలసినదిగా లా కమిషన్‌ను ఆదేశించింది. లా కమిషన్‌ ఆగస్టులో నివేదిక సమర్పించింది. భారతీయ శిక్షాస్మృతిలో సె.326.ఎ అన్న కొత్త నిబంధనను ఏర్పరచాలని, నేరం చేసిన వ్యక్తికి కనీస శిక్ష 10 సంవత్సరాలుగా జీవిత ఖైదు విధించేలా ఏర్పరచాలని సూచించింది. యాసిడ్‌ దాడులను నిరోధించడానికి చట్టం తీసుకు రావలసి ఉందని జాతీయ మహిళా కమిషన్‌ అభిప్రాయపడి ముసాయిదా బిల్లు తయారు చేసింది. లైంగికంగా వేధించడం, మానభంగానికి గురి చేయడం వంటి నేరాల కన్నా ఈ నేరం హీనమైనదని కమిషన్‌ భావించింది. బాధితులకు ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని బిల్లులో పేర్కొంది. బాధితులకు తక్షణ వైద్య సదుపాయం అందించని హాస్పిటళ్ళపై చర్య తీసుకునే నిబంధనను ఈ బిల్లులో ఏర్పరిచారు. యాసిడ్‌ అమ్మకాలను క్రమబద్ధీకరించే నిబంధనలనుకూడా కమిషన్‌ సూచించింది. కానీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చట్టాన్ని తీసుకరాలేదు. అవసరమైన సవరణలను భారతీయ శిక్షాస్మృతిలో చేయలేదు. కఠినమైన నిబంధనలు ఉంటే మాత్రమే సరిపోదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హసీనా కేసు పరిష్కారానికి 7 సంవత్సరాలు పట్టింది. ఈ విధంగా కాకుండా సత్వరం పరిష్కారం అయ్యేవిధంగా నిబంధనలను చట్టంలో ఏర్పాటు చెయ్యాలి. వాటి అమలు సక్రమంగా జరిగేలా చూడాలి. ఇలాంటి నేరాలకు పోలీసులు కోర్టులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే, ఈ దాడుల వల్ల మహిళలకు మానసిక మరణం సంభవిస్తుంది. అనుక్షణం ఇది వాళ్ళను వెంటాడుతుంది. అందరికీ ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ కొత్త చట్టం విషయంలో కేంద్రప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రప్రభుత్వమే స్పందించి లాకమిషన్‌, మహిళా కమిషన్‌ సూచించిన విధంగా చట్టం తీసుకురావలసిన అవసరం, దానిని పటిష్ఠంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
రచయిత నిజామాబాద్‌జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Followers