Wednesday, November 9, 2011

ధర్మం’ కాదు... రాజ్యాంగ ‘హక్కు’!

ధర్మం’ కాదు... రాజ్యాంగ ‘హక్కు’!





‘‘న్యాయాన్ని ఎవరికీ అమ్మం
న్యాయాన్ని ఎవరికీ నిరాకరించం
న్యాయాన్ని ఎవరికీ ఆలస్యం చేయం
న్యాయం అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తాం’’

ఏడు శతాబ్దాల క్రితం ఇంగ్లండ్‌ రాజు కింగ్‌ జాన్‌ తన సామంతులకు న్యాయాన్ని వాగ్దానం చేస్తూ జారీ చేసిన ‘మాగ్నాకార్టా’ చార్టర్‌లోని ఈ వాక్యాలు నేటికీ చర్చనీయాంశాలు కావడం విశేషం. న్యాయసహాయం, న్యాయసేవ అన్న పదాలు ఆ వాక్యాల్లో లేకున్నా, అలాంటి అర్థం అందులో స్పష్టంగానే ఇమిడి ఉంది. న్యాయసహాయం అన్న భావన అలా అంకురించి, శతాబ్దాల కాలంలో ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పక తప్పదు. అందులో భాగమే, నేడు దేశంలో ప్రతి ఏడూ నవంబర్‌ 9న ‘న్యాయసేవా దినం’గా పాటించడం.

భారత రాజ్యాంగంలోని ప్రవేశిక దేశ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తానని అభయం ఇచ్చింది. ఆర్థికపరమైన ఇబ్బందులు, శారీరక వైకల్యాలతో బాధపడుతున్న వ్యక్తులకు సమాన న్యాయం అందించడానికి కృషి చేయాలన్న భావన రాజ్యాంగంలోని 14, 16 అధికరణల్లో మిళితమై ఉంది. రాజ్యాంగం అమల్లోకొచ్చిన తొలిరోజుల్లో న్యాయసహాయం పట్ల అంత స్పష్టత లేకున్నప్పటికీ, 1951లో ‘జనార్ధన్‌రెడ్డి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ కేసులో సుప్రీంకోర్టు పరిమితంగానే అయినప్పటికీ ‘న్యాయసహాయం’ ఆవశ్యకతను వివరిస్తూ ‘న్యాయవాదిని నియమించుకోవడం ముద్దాయి హక్కు. అది అతను సొంతంగా లేదా బంధువుల ద్వారా గానీ నియమించుకోవచ్చు. ఆ అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత సంబంధిత మేజిస్ట్రేట్‌పై ఉంటుంది’ అని వ్యాఖ్యానించింది. న్యాయవాదిని నియమించాల్సిన బాధ్యత న్యాయస్థానం మీద మోపకున్నా, అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరణశిక్ష విధించే కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయాన్ని వ్య క్తం చేస్తూ, న్యాయవాదిని నియమించుకోనంత మాత్రాన కోర్టులు కేసును కొట్టివేయడం కుదరదని అభిప్రాయపడింది. కాలక్రమంలో అలాంటి ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడమే కాక ‘న్యాయసహాయం, న్యాయసేవలు’ అన్నవి ప్రతి పౌరుడి హక్కుగా రూపొంది ఎనలేని ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.

1978లో ‘సునీల్‌ భట్రా వర్సెస్‌ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్‌’ కేసులో జైలు నిర్బంధాన్ని అనుభవిస్తున్న వ్యక్తులకు న్యాయ సహాయం జీవించే హక్కులో భాగంగా ఉంటుం దని సుప్రీంకోర్టు గుర్తించింది. జైలు అధికారుల దగ్గర న్యాయం పొందడానికి, జైలు అధికారుల నిర్ణయాలను సవాలు చేయడానికి న్యాయసహాయా న్ని అందించాలని కోర్టు అభిప్రాయపడింది. ఇందులో న్యాయపరమైన, పాల నాపరమైన అంశాలు ఇమిడి ఉండటం తో, 1980లో ‘హుస్సేనియార ఖాటూన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ బీహార్‌’ కేసులో ‘జైలు నుంచి విముక్తి పొందడానికి అవసరమైన న్యాయసహాయం అందించాల్సిన బాధ్యత రాజ్యాంగంపై ఉంది’ అని సుప్రీంకోర్టు అదే విషయాన్ని మరోమారు స్పష్టం చేసింది.

ఉచిత న్యాయసహాయాన్ని పొందడమనేది రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం జీవించే హక్కులో భాగమని అత్యున్నత న్యాయస్థానం ప్రకటిం చినా, దేశంలోని అనేక రాష్ట్రాలు ఆ ఆదేశాన్ని సరిగా పాటించలేదనే చెప్పాలి. అందుకే, న్యాయసహాయం అందరికీ సమానంగా అందేలా కృషి జరగాలని నిర్దేశించిన భారత రాజ్యాంగంలోని 39-ఏ అధికరణం ప్రకారం, ఆ అంశంపై సమగ్ర అధయయనం కోసం భారత ప్రభుత్వం 1980లో ‘సిలాస్‌’ కమిటీని నియమించింది. దేశవ్యాప్తంగా న్యాయసహాయం అందరికీ ఒకేలా అందుబాటులోకి తేవడానికి ఆ కమిటీ విస్తృతస్థాయిలో చర్చించి నివేదికను సమర్పించింది. 1986లో మరో సందర్భంలో ‘న్యాయసహాయం కావాలని ముద్దాయి కోర్టుని అభ్యర్థించాల్సిన అవసరం లేదు. న్యాయసహాయం అందించడం కోర్టు బాధ్యత’ అని చెప్పడమే కాక, ‘న్యాయసహాయాన్ని అందించకపోవడం న్యాయాన్ని అవహేళన చేయడమే’నని వ్యాఖ్యానిస్తూ, ముద్దాయి రిమాండ్‌ దగ్గర నుంచి అప్పీలు వరకూ న్యాయసహాయాన్ని కల్పించాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో పార్లమెంటు ‘న్యాయసేవాధికార సంస్థల చట్టం - 1987’ను ఆమోదించింది. 1987 అక్టోబర్‌ 12న గజెట్‌లో ప్రచురితమైన ఆ చట్టం ఎంతో కాలయాపన అనంతరం, 1995 నవంబర్‌ 9న అమలుకు నోచుకుంది. ముద్దాయిలకు న్యాయసహాయం అందించకుండా ఏ కోర్టు, ట్రిబ్యునల్‌, అథారిటీ గానీ విచారణ జరపడానికి వీలు లేదు. న్యాయసహాయం అందించడమన్నది సంక్షేమ చర్య కాదు. ధర్మం అంతకన్నా కాదు. ప్రతి పౌరుడికి రాజ్యాంగం ప్రకారం దఖలుపడ్డ ‘హక్కు’. అంతేకాదు, యోగ్యత కలిగిన న్యాయవాదిని నియమించాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాలపైనే ఉంది. బ్రిటన్‌ వంటి దేశాల్లో న్యాయసహాయకులుగా వ్యవహరించడానికి సీనియర్‌ న్యాయవాదులు ముందుకు రావడం పరిపాటి. మన దేశంలో కూడా న్యాయసహాయాన్ని అందించడానికి పెద్ద మనసుతో విజ్ఞులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నది గుర్తించాలి.

-మంగారి రాజేందర్‌, 3వ అదనపు జిల్లా జడ్జి, వరంగల్‌
(నేడు ‘జాతీయ న్యాయసేవల దినం’)

Thursday, October 27, 2011

బెయిల్ కాదిక అంత సులువు!







-విశ్లేషణ
మంగారి రాజేందర్‌అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి, వరంగల్

‘‘వ్యక్తి స్వేచ్ఛ, న్యాయం, ప్రజల రక్షణ, ప్రజాధనం మీద భారం వంటి అంశాలతో ముడిపడి ఉన్న అంశం బెయిల్.’’
- జస్టిస్ వి.ఆర్.క్రిష్ణయ్యర్,గుడికంటి నర్సింహులు కేసులో (1977)

‘‘బెయిల్ ఇవ్వడంలోనూ, నిరాకరించడంలోనూ సమాజ ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి నేరం సమాజానికి వ్యతి రేకంగా జరిగేదే. అందుకని బెయిల్ ఉత్తర్వు వ్యక్తి స్వేచ్ఛనూ, సమాజ హితాన్నీ సమతూకం చేసేదిగా ఉండాలి’’.
- జస్టిస్ దల్వీర్ భండారీ, ఎస్‌ఎస్ మెహ్రా కేసులో (2010)

అరెస్టు, బెయిల్ అనే పదాలు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో తరచూ కనిపిం చేవే. అందుకు కారణం ఎందరెందరో రాజకీయ ప్రముఖులు అరెస్టు కావడం, బెయిల్ రాక వారు జైళ్లలో ఉండటం. ఈ నేపథ్యంలో బెయిల్‌కు సంబంధించి న్యాయపరంగా నెలకొని ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్‌ఎస్ మెహ్రా కేసులో సుప్రీంకోర్టు ‘అరెస్టు-బెయిల్’ గురించి ఈ విధంగా అభిప్రాయపడింది.

‘‘జాతీయ పోలీస్ కమిషన్ నివేదిక ప్రకారం అరెస్టు చేసే అధికారం విపరీ తంగా దుర్వినియోగం అవుతున్నది. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 21 స్ఫూర్తికి విరుద్ధంగా పోలీసులు ఈ చర్యలు చేపడుతున్నారు. కోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. శిక్షలు పడే అవకాశం 10 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు అరెస్టు విషయంలో కూడా పోలీసులు సంయమనం పాటించాలి. నేరం రుజువయ్యే దాకా ముద్దాయి అమాయకమైన పౌరుడు అని చెప్పే క్రిమినల్ జురిస్‌ప్రుడ్సెన్‌ను, సమాజహితాన్ని, ముద్దాయి స్వేచ్ఛను దృష్టిలో పెట్టుకొని బెయిల్ పిటిషన్‌ను పరిశీలించాల్సి ఉంటుంది.’’

బెయిల్ పొందే హక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమై ఉంది. రాజ్యాం గంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం అరెస్టయిన వ్యక్తికి ఇష్టమైన న్యాయవాదితో సంప్రదించుకునే అవకాశాన్ని కల్పించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21, 22లలోని హక్కులని గమనించి క్రిమినల్ కోర్టులు వ్యవహరించాల్సి ఉంటుంది. ముద్దాయిని నిర్బంధంలో ఉంచేది... అతను విచారణను ఎదుర్కొని దోషి అని తేలితే కోర్టు అతనికి విధించే శిక్షను స్వీకరించడానికేనన్నది తెలిసిందే. విచారణ సమయంలో అతను హాజరవుతాడని, నిర్బంధం అవసరంలేదని కోర్టు భావిం చినప్పుడు అతని స్వేచ్ఛను హరించడం సరైంది కాదని న్యాయ శాస్త్రకోవిదులు అభిప్రాయపడ్డారు. అందుకని బెయిల్ మంజూరు చేయాలని, రాజ్యాంగం ఆర్టికల్ 21లో ప్రసాదించిన హక్కులకు రక్షణ కల్పించాలన్నది వారి భావన. ఈ భావన మన రాజ్యాంగంలోనే కాదు విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన (1948)లో కూడా పొందుపరచారు.

ఆ ప్రకటనలోని ఆర్టికల్ 9 ప్రకారం - ఏ వ్యక్తినీ సరైన కారణం లేకుండా అరెస్టు చేయడానికి, నిర్బంధించడానికి, లేక దేశం నుంచి బహిష్కరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 10 ప్రకారం - తన హక్కుల గురించి, బాధ్యతల గురించి, తన మీద వచ్చిన నేరారోపణల గురించి స్వతంత్రమైన, నిష్పాక్షికమైన న్యాయ స్థానాల ద్వారా బహిరంగ విచారణ జరపాలని కోరే హక్కు ప్రతి వ్యక్తీ కలిగి ఉంటాడు. ఆర్టికల్ 11(1) ప్రకారం - నేరం ఆరోపించబడిన వ్యక్తిని నేరారోపణ రుజువయ్యే వరకు నిరపరాధిగానే పరిగణించాలి. ఆ విచారణలో ఆ వ్యక్తి తనను తాను సమర్థించుకోవడానికి, రక్షణలు కల్పించుకోవడానికి అవసరమైన సదుపాయాన్ని అతనికి కల్పించాలి.

బెయిల్ ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనతోపాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 20, 21, 22లలో చెప్పారు. కానీ బెయిల్ అన్న పదాన్ని ఎక్కడా నిర్వచించలేదు. కోర్టుముందు, దర్యాప్తు చేసే అధికారి ముందు హాజరు కావడానికి ఇచ్చే సెక్యూరిటీ (జామీను)ని బెయిలని అంటున్నాం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో బెయిల్‌ని నిర్వచించలేదు కానీ సెక్షన్ 2 (ఎ)లో బెయిలబుల్ నేరాన్ని, నాన్ బెయిలబుల్ నేరాన్ని నిర్వచించారు.

బెయిల్ పొందే హక్కు ఉన్న నేరాల్లో కోర్టులు, పోలీసులు తప్పక బెయి ల్‌ను మంజూరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా జామీను ఇవ్వలేని పరిస్థితులలో ఉండి బెయిలబుల్ నేరాల్లో అరెస్టు అయిన తేదీ నుంచి వారం రోజులపాటు నిర్బంధంలో ఉంటే అతన్ని వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేయాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 436తో సవరణలు తీసుకొ చ్చారు. నాన్ బెయిలబుల్ నేరాల్లో కూడా జామీను మొత్తం ఏకపక్షంగా ఎక్కువ ఉండకూడదని, సహేతుకంగా ఉండాలని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో అభి ప్రాయపడింది. మోతీరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ (1978) కేసులో అవస రమైనప్పుడు నాన్ బెయిలబుల్ నేరాల్లో కూడా వ్యక్తిగత పూచీకత్తు మీద విడు దల చేయాలని, ఆ విధంగా చట్టంలో మార్పులు తీసుకొని రావాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

అన్ని రకాలైన కేసుల్లో బెయిల్ మంజూరుకు సంబంధించి కోర్టులు ఉదారంగా వ్యవహరించాలని గతంలో అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు, ఇటీవలి కాలంలో బెయిల్ మంజూరు విషయంలో విముఖతని ప్రదర్శిస్తున్నది.

1977, డిసెంబర్ 6న గుడికంటి నర్సింహులు కేసులో జస్టిస్ క్రిష్టయ్యర్ బెయిల్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు. ‘‘బెయిలా లేక జెయిలా?’’ అనే ప్రశ్నపై బెయిల్ ఇవ్వడం వైపు మొగ్గుచూపాలని అన్నారు. బెయిల్ మీద ఉంటే తన మీద ఉన్న ఆరోపణలని సమర్థంగా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుం ది. కస్టడీలో ఆ అవకాశం ఉండదు.

ప్రజలకి న్యాయం జరగాలంటే, యాం త్రికంగా నిర్బంధంలో ఉంచడాన్ని నిరుత్సాహపరచాలి. ఈ తీర్పు వెలువడిన రెండు సంవత్సరాల తరువాత బెయిలా లేక జైలా? అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేశారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసే విషయంలో గురుబక్ష్ సింగ్ సిబియా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1980, ఏప్రిల్ 9) కేసులో వ్యక్తి స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తూ - అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవీ చంద్రచూడ్ ఇలా అన్నారు. ‘‘అరెస్టు అయినప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ పోతుంది. అరెస్టయ్యే క్రమంలో అతను బెయిల్ కోరితే అతని స్వేచ్ఛను కాపాడే విధంగా బెయిల్ మంజూరు చేయాలి. ఎందుకంటే నేరం రుజువయ్యే వరకూ అతన్ని నిరపరాధిగా పరిగణించాల్సి ఉంటుంది.’’

తరువాతి కాలంలో బెయిల్ మంజూరు విషయంలో ఉదారంగా వ్యవహ రించాలని న్యాయస్థానాలు పలుమార్లు ఘోషించాయి. భగీరత్‌సింగ్ జడేజా, కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.ఎ.దేశాయ్ నవంబర్ 21, 1983న ఇలా వ్యాఖ్యానించారు. బెయిల్ ఇవ్వడం వైపే కోర్టులు ఇటీవలి కాలంలో మొగ్గు చూపుతున్నాయి. బెయిల్ మంజూరు చేసేటప్పుడు కోర్టు పరిశీలిం చాల్సిన అంశం ఆ వ్యక్తి విచారణ సమయంలో అందుబాటులో ఉంటాడా... లేదా? సాక్ష్యాలను తారుమారు చేయడానికి స్వేచ్ఛను దుర్వినియోగపరు స్తాడా?’’ ఈ విషయాలను కోర్టు పరిశీలించాల్సి ఉంటుంది. ఉదారంగా బెయిల్ మంజూరు చేసే ధోరణి కొంత కాలం కొనసాగినా తరువాత పరిస్థితి మారుతూ వచ్చింది. 1990 దశకంలో రెండు సంవత్సరాలు జైల్లో ఉన్న తరువాత చంద్రస్వామికి బెయిల్ మంజూరయ్యింది. అప్పటికి 16 సంవత్సరాల క్రితం జరిగిన నేరానికి అతను జైల్లో ఉండాల్సి వచ్చింది. 1996లో అతనికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వర్మ, కిర్వాల్ ఈ విధంగా అన్నారు. ‘‘ఇలాంటి వ్యక్తులను విడుదల చేయడం ద్వారా ప్రాసిక్యూషన్ కేసును ఇరుకునపెట్టే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు’’.

నాన్ బెయిలబుల్ నేరానికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో మూడు ప్రధానమైన నిబంధనలు ఉన్నాయి. అవి సెక్షన్ 437, 438, 439. ముం దస్తు బెయిల్ గురించిన నిబంధన 438 కాగా, మిగతా రెండు అరెస్టు అయిన తరువాత బెయిల్ మంజూరు చేసే నిబంధనలు. హైకోర్టు, సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసే నిబంధన సెక్షన్ 439. మేజిస్ట్రేట్లు, కొన్ని సందర్భాల్లో పోలీసులు బెయిల్ మంజూరు చేయడానికి ఉన్న నిబంధన సెక్షన్ 437. మహి ళలకు, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు, దుర్భలంగా ఉన్న వ్యక్తులకు ఉదారంగా బెయిల్ మంజూరు చేయాలని సెక్షన్ 437 చెబుతుంది. కానీ ఇటీవలి కాలంలో కోర్టుల ధోరణి ఇందుకు భిన్నంగా ఉంది. నేరాల తీవ్రత ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ఈ కొత్త ధోరణికి కారణమైన కేసులు చాలా ఉన్నప్పటికీ అందులో ప్రధానమైన కేసు ‘సత్యం కంప్యూటర్స్’ ప్రమోటర్ రామలింగరాజు బెయిల్ రద్దు కేసు.

2010, అక్టోబర్ 26న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దల్వీర్ భండారి, దీపక్ శర్మలు బెయిల్ రద్దు కోసం సీబీఐ దాఖలు చేసిన అప్పీళ్లని ఆమోదిస్తూ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారం ముద్దా యిలు చాలా ఘనమైన కార్పొరేట్ స్కామ్‌లో భాగస్వాములు. దాని వల్ల మన దేశంలో, ప్రపంచంలో కూడా ఆర్థిక తుపాను సంభవించింది. లక్షల మంది షేర్ హోల్డర్స్ మోసపోయారు. దేశ పరువు ప్రతిష్టలు మంటగలిశాయి. కేసు విచా రణలో ఉండగా మేం ఎలాంటి పరిశీలన చేయడం భావ్యం కాదు. దాని వల్ల విచారణ కోర్టు పక్షపాతానికి లోనుకాకూడదు. హైకోర్టు మంజూరు చేసిన బెయి ల్‌ను రద్దు చేసే విషయంలో సాధారణంగా ఈ కోర్టు (సుప్రీంకోర్టు) స్థిమితంగా వ్యవహరిస్తుంది. కానీ ఈ కేసులో ఉన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ని రద్దు చేస్తున్నాం’’.

అయితే 2010 డిసెంబర్‌లో మళ్లీ సిద్దారామ్ మెత్రే వర్సెస్ స్టేట్ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దల్బీర్ భండారీ, కె.పి.రాధాక్రిష్ణన్ హత్యకేసు లోని ముద్దాయి సిద్దారామ్ మెత్రే ముందస్తు బెయిల్‌ని ఆమోదిస్తూ ఈ విధంగా పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అతి విలువైన ప్రాథమిక హక్కు.

అసా ధారణమైన పరిస్థితులు కేసులో ఉన్నప్పుడు మాత్రమే స్వేచ్ఛని నియంత్రిం చాలి’’. సమాజ హితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను సమతూకంగా చూడటం అంత సులువు కాదు. బెయిల్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. చివరగా రెండు సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెల్లడి చేసిన అభిప్రాయాలను ఇక్కడ మననం చేసుకుందాం. గురుబక్ష్‌సింగ్ కేసు (1980, ఏప్రిల్ 9)లో న్యాయమూర్తి చంద్రచూడ్ ఈ విధంగా అన్నారు.

‘‘బెయిల్ వంటి విచక్షణా ధికారం ఉండే అంశాల్లో కచ్చితమైన సూత్రాలను ఏర్పరచడం సాధ్యం కాదు’’. అదేవిధంగా మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1978) కేసులో న్యాయమూర్తులు భగవతి, కోషల్ ఇలా అన్నారు. ‘‘ప్రజల పట్ల బాధ్యత వహించి అధికసంఖ్యలో కోర్టులను నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వా లపై ఉంది’’. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 21 సత్వర విచారణ, సత్వర దర్యాప్తులకు కట్టుబడి ఉంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొంటే తప్ప అందరికీ న్యాయం జరగదు.

Wednesday, September 14, 2011

హకుల పరిరక్షణ కోర్టుల బాద్యత

కోర్టుల్లో పనిభారం ఎక్కువ. విచారణ జాప్యం. కేసుల్లో శిక్షలు పడకపోవడం. ముద్దాయిలు శిక్షల నుంచి తప్పించుకుపోవడం. వీటిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది న్యాయవ్యవస్థను నిందించడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. ఆ విమర్శలో ఎలాంటి సహేతుకతలేదు. కోర్టుల్లో కేసులు రుజువు కాకపోవడానికి, తక్కువ కేసుల్లో శిక్షలు పడటానికి, కేసుల విచారణల్లో జాప్యం జరగడానికి కారణాలు ఎన్నో. కేసుల దర్యాప్తులోని లోపాలు, ప్రాసిక్యూషన్ కేసుని సరిగ్గా నిర్వహించకపోవడం, సాక్షులు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పకపోవడం లాంటి కారణాలు ఎన్నో కోర్టుల్లో కేసులు విఫ లం కావడానికి కారణమతున్నాయి.తమ పరిధిలో ఉన్న అంశాల మీద న్యాయమూర్తుల నిర్వహణని బేరీజు వేసుకొని విమర్శలు చేస్తే దాన్ని సద్విమర్శ అనుకోవచ్చు. ఆ విధంగా గాకుండా కోర్టు నియంవూతణలోలేని అంశాలను ఆధారం చేసుకొని న్యాయమూర్తులని, న్యాయవ్యవస్థని విమర్శించడం సరైంది కాదు. దేశ న్యాయవ్యవస్థలో భాగస్వాములైన యంత్రాంగాల సమష్టి నిర్వహణే కేసుల్లో వచ్చే చిక్కులు. అవి శిక్షలు పడ డం కావచ్చు. శిక్షలు పడకపోవడం కావచ్చు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తుల పరిధిలో మాత్రమే ఉన్న విధులు ఏమిటి? అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కొన్ని విధులను న్యాయమూర్తులు మాత్రమే నిర్వహిస్తారు. అవి న్యాయమూర్తుల పరిధిలో మాత్రమే వుంటాయి. అందులో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లోని ఇతర భాగస్వాముల ప్రమే యం ఉండదు. అందులో ముఖ్యమైనది హక్కుల పరిరక్షణ. అవి రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులు కావ చ్చు. ఇతర శాసనాల ద్వారా నిర్వహించిన హక్కులు కావచ్చు.

రాజుల కాలంలో రాజు చెప్పిందే వేదం. అరెస్టులు, నేరారోపణలు, శిక్షలు అన్నీ రాజే చేసేవాడు. అప్పు డు ఎలాంటి అవరోధాలు లేవు. వాళ్లకు తోచింది చేసే అవకాశం ఉండేది. అనుమానం మీద నేరారోపణల మీద శిక్షలు విధించే అవకాశం ఏర్పడింది. దాని ఫలితంగా స్వేచ్ఛ లేకుండాపోయింది. నిరంకుశత్వం పెరిగింది. కొన్ని శతాబ్దాలుగా ఈ పరిస్థితులు కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో 1215 సంవత్సరంలో ‘మాగ్నాకార్టా’ వచ్చింది. అందులోని ముఖ్యాంశం ‘ఎలాంటి బలపరిచే సాక్ష్యాలు లేకుండా తన వాంగ్మూలం ఆధారంగా, విశ్వసనీయ సాక్షులు లేకుండా ఏ అధికారి కూడా ఏ వ్యక్తిని భవిష్యత్తులో విచారణకు నిలబెట్టకూడదు. ఎవరి స్వేచ్ఛనైనా హరించాలంటే దానికి న్యాయబద్ధమైన తీర్పు ఉండాలి.’
మాగ్నాకార్టాలో పొందుపరిచిన విషయాలకు మన రాజ్యాంగ కర్తలు కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆ విషయాలను పొందుపరుస్తూ అధికరణలను ఏర్పాటు చేశారు.

అవి అధికరణం 20, 21, 22. అధికర ణం 20 ప్రకారం అమలులో ఉన్న శాసనాల ప్రకారం ఏదైనా చర్య నేరమైనప్పుడు మాత్రమే ఆ నేరానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలి. అంతే అది నేరం కానప్పుడు శిక్షించడానికి వీల్లేదు. ఆ నేరం చేసినప్పుడు, ఆ వ్యక్తికి అమల్లో ఉన్న శాసనాల ప్రకారం ఎంత శిక్ష అయితే విధించడానికి అవకా శం ఉందో అంతే శిక్షను విధించాలి. అంతకన్నా ఎక్కువ శిక్షను విధించడానికి వీల్లేదు. ఎవరైనా వ్యక్తిపై అభియోగం మోపబడి శిక్ష పడిన తర్వాత మళ్లీ అదే నేరానికి రెండవసారి అభియోగం దాఖలు చేయడానికి వీళ్లేదు. ఆర్టికల్ 21 శాసనం ప్రకారం నిర్ణయించిన పద్ధతుల్లో తప్ప, ఏ వ్యక్తి జీవితాన్ని గానీ, వ్యక్తిగత స్వేచ్ఛను గానీ హరించడానికి వీల్లేదు. ఆర్టికల్ 22 ప్రకారం-ఎవరైనా వ్యక్తి ఈ భూభాగంలోని సాధారణ శాసనాల ప్రకారం అరెస్టు అయినప్పుడు అరెస్టు చేసిన వెంటనే ఏ కారణాల ప్రకారం అరెస్టు చేశారో ఆ విషయం అతనికి తెలియజెయ్యాలి. అతనికి ఇష్టమైన న్యాయవాదిని సంప్రదించుకునే అవకాశం కల్పించాలి.

అరెస్టు చేసిన 24 గంటల్లో దగ్గర్లో ఉన్న మెజివూస్టేట్ ముందు హాజరు పరచాలి. అరెస్టు అయిన స్థలం నుంచి మేజివూస్టే ట్ కోర్టు వరకు తీసుకురావడానికి అవసరమైన సమయాన్ని మినహాయించి 24 గంటలని అర్థం చేసుకోవాలి. మేజివూస్టేట్ ఉత్తర్వులు లేకుండా అరెసై్టన వ్యక్తి 24 గంటలకు మించి నిర్బంధంలో ఉంచడానికి వీల్లేదు.
దేశంలో ఆమాటకొస్తే ప్రపంచంలోని చాలా దేశాల్లో స్వతంవూతమైన న్యాయవ్యవస్థ ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థకు సంబంధం లేకుండా న్యాయవ్యవస్థ వుంది. ఈ వ్యవస్థ దేశ పౌరులకు, ముద్దాయిలకు, అనుమానితులకు, బాధితుల కు, సాక్షులకు రాజ్యాంగం ద్వారా వివిధ శాసనాల ద్వారా వచ్చిన హక్కులను రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజల హక్కులకు సంరక్షకునిగా న్యాయవ్యవస్థ వ్యవహరించాలి. సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. అందుకే ఈ వ్యవస్థ మీద అంతో ఇంతో నమ్మకం ఇంకా ఉంది. భారతీయ సాక్ష్యాధారాల చట్టం ఈ విషయాన్నే స్పష్టం చేస్తుంది. హక్కులను కాపాడటం కోర్టుల మీద ఉన్న ప్రాథమిక బాధ్యత. హక్కులను, బాధ్యతలను కోర్టులు భారతీయ సాక్ష్యాధారాలు చట్టం ప్రకారం నిర్ధారించాలి. రాజ్యాంగం ద్వారా, శాసనాల ద్వారా వచ్చిన హక్కులను రాజ్యాంగానికి అనుగుణంగా తయారు చేసిన శాసనం ద్వారానే నియంవూతించాల్సి ఉంటుంది. తొలగించాల్సి ఉంటుంది. ఇదే వ్యక్తుల మౌలికమైన హక్కు. స్వతంవూతమైన న్యాయవ్యవస్థ నిర్వహించాల్సిన విధి ఇదే.

వ్యక్తుల హక్కులను కాపాడటం, శాసనం నిర్దేశించిన పద్ధతిలో శిక్షలు విధించడం ద్వారా ప్రజల హక్కులను కాపాడటం న్యాయవ్యవస్థ చేయాల్సిన ప్రాథమికమైన విధి. ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో రాత పూర్వకమైన రాజ్యాంగం ఉన్న మన దేశంలో నేరస్తులను శిక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. నేరం చేసిన వ్యక్తులని శిక్షించడం కార్యనిర్వాహక వ్యవస్థ బాధ్యత కాదు. పోలీసులది అంత కంటే కాదు. రాజ్యాంగం రాక ముందు కొన్ని శతాబ్దాలుగా కార్యనిర్వాహక వ్యవస్థ ఈ పని చేసింది. ఇప్పుడు చేయకూడదు. చేసే అవకాశం లేదు. చేయకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తిపై ఉంది. ముద్దాయిలను అరెస్టు చేసి మేజివూస్టేట్ మందు హాజరు పరుస్తారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్ష న్ 57 ప్రకారం 24 గంటలు పూర య్యే వరకు ముద్దాయిలను తమ కస్టడీలో ఉంచుకోవడానికి అవకా శం లేదు. కేసు దర్యాప్తుకు ఎంత కాలం అవసరం ఉందో అంత కాలం మాత్రమే తమ కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉంది. అది కనిష్ఠ కాలపరిమితి.

24 గంటలు అనేది గరిష్ఠ కాలపరిమితి. అదే చట్టంలోని సెక్షన్ 50 ఎ ప్రకారం అరెస్టు చేసిన సమయాన్ని అరెసై్టయిన వ్యక్తి స్నేహితులకు, బంధువులకు తెలియజేయాలి. ఏడేళ్లకు తక్కువ శిక్ష విధించే అవకాశం కేసుల్లో, అదే విధంగా ఏడేళ్లవరకు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసుల్లో సెక్షన్ 41లో చేర్చిన కొత్త నిబంధనల ప్రకారం అరెస్టు చేయకూడదు. అరె స్టు చేస్తే వాటి చట్టంలో చెప్పిన కారణాలు వున్నాయో లేదో చూడా లి. పోలీసు కస్టడీలో ఎవరైనా మరణిస్తే, అదృశ్యం అయితే దానికి గురించి సెక్షన్ 176 ప్రకారం మేజివూస్టేట్ విచారణ జరగా లి. అక్రమ నిర్బంధం ఉన్నప్పుడు సెక్షన్ 97 ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రథమ సమాచార నివేదిక నుంచి చార్జిషీట్ దాఖలు అయ్యే వరకు మేజివూస్టేట్ పర్యవేక్షణ ఉంటుంది. జోక్యం ఉండదు.

హక్కుల పరిరక్షణ బాధ్యత ఆ తరువాత మిగతా కోర్టుల మీద ఉంటుంది. హక్కులు వ్యాఖ్యానించేటప్పుడు కూడా క్రియాశీలంగా వ్యవహరించి వ్యాఖ్యానించాలి. అంతే కానీ సాంకేతికంగా కాదు. క్రిమినల్ న్యాయ పరిపాలనలో రాజ్యాంగం విలువల్ని పరిరక్షిస్తూ వ్యక్తుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. ఈ బాధ్యతను నిర్వహించనప్పుడు కోర్టులపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది. ఆ హక్కులు ముద్దాయిలవి కావొచ్చు, అనుమానితులవి కావొచ్చు, సాక్షులవి కావొచ్చు, బాధితులవి కావొచ్చు.

-మంగారి రాజేందర్

Thursday, August 4, 2011

అరుదైన నేరాలపై ‘సుప్రీం’ కొరడా!

అరుదైన నేరాలపై ‘సుప్రీం’ కొరడా!
-విశ్లేషణ
మంగారి రాజేందర్, మూడవ అదనపు మరియు జిల్లా సెషన్స్ జడ్జి, వరంగల్

న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ద్విగుణీకృతం చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్య కాలంలో రెండు ప్రధానమైన కేసుల్లో మరణశిక్షలు విధించడాన్ని ఖరారు చేసింది. అందులో మొదటిది ‘పరువు’ హత్యలకు చెందినది కాగా, రెండవది ఎన్‌కౌంటర్ హత్యలకు సంబంధించినది. ఈ రెండు రకాల ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ తీర్పులు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి . పరువు హత్యలకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని కేంద్రం ప్రతిపాదిస్తున్న నేపథ్యం కూడా ఒక సందర్భం. ఎన్‌కౌంటర్ హత్యలను నేరాలుగా నమోదుచేసి దర్యాప్తు చేయాలన్న వాదన గత 30 సంవత్సరాలుగా కొనసాగుతోంది. వాటిని హత్యా నేరాలుగా నమోదు చేయాలని చట్టాలు నిర్దేశిస్తున్నప్పటికీ దర్యాప్తు ఆ వెలుగులో జరగడం లేదన్నది ప్రధాన విమర్శ.

‘భారత శిక్షాసృ్మతి’ ప్రకారం ఆరు రకాలైన నేరాల్లో న్యాయస్థానాలు మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అవి- ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారన్న నేరారోపణలో (సెక్షన్ 121), సిపాయిలను రాజ్యంపై తిరగబడేలా ప్రేరేపించినపుడు (సె.132), మరణశిక్ష పడేలా తప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు (సె.194), హత్యానేరం ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు (సె.302), 18 సంవత్సరాలు నిండని వారినీ, మానసిక రుగ్మతలున్న వారినీ ఆత్మహత్యకు ప్రేరేపించినపుడు (సె.305), దోపిడీకి పాల్పడుతూ హత్యగావించినప్పుడు (సె.396). కొన్ని సందర్భాల్లో ఎవరినైనా చంపడానికి ప్రయత్నించినపుడు సెక్షన్ 307 ప్రకారం కూడా మరణ శిక్ష విధించే అవకాశం ఉంది. అలాగే, ప్రత్యేక చట్టాల్లో కూడా అలాంటి శిక్ష విధించే అవకాశం ఉంది.

అయితే ఈ నేరాలన్నింటిలో కూడా నేరం రుజుైవె నప్పటికీ మరణశిక్ష విధించాలన్న నియమం లేదు. కేసులోని తీవ్రతనుబట్టి జీవితఖైదు గానీ, మరణశిక్ష గానీ కోర్టులు విధిస్తాయి. కానీ జీవితఖైదు అనుభవిస్తున్న ఖైదీలు ఎవరినైనా చంపితే, సెక్షన్ 303 ప్రకారం విచారించి నేరం రుజువైతే వారికి కోర్టులు విధిగా మరణశిక్షను విధించాల్సి ఉంటుంది.

ఇలాంటి నేరాల్లో మరణశిక్ష విధించడం సహేతుకం కాదని అనడానికి ఎలాంటి కారణం కనిపించడంలేదనీ, ప్రజాహితం కోసం ఈ శిక్ష ఉండాల్సిందేననీ, ఇది రాజ్యాంగంలోని జీవించే హక్కుకు వ్యతిరేకం కాదనీ గతంలో సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో గుర్తుచేయడం గమనార్హం. బచన్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో దీన్ని మరింత స్పష్టంగా ప్రకటించింది . క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 354 ప్రకారం హత్యానేరం రుజువైన వ్యక్తులకి జీవిత ఖైదు శిక్ష విధించడమనేది నియమంకాగా, మరణశిక్ష కూడా విధించవచ్చన్నది మినహాయింపు. అయితే సెక్షన్ 354(3) ప్రకారం మరణశిక్ష విధించడానికి గల ప్రత్యేకమైన కారణాలను తీర్పులో పేర్కొనాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన కొలబద్దల్ని కూడా సుప్రీంకోర్టు బచన్‌సింగ్ కేసులో స్పష్టపరుస్తూ, మార్గదర్శకాలను నిర్దేశించింది (ఏఐఆర్ 1983 సుప్రీంకోర్టు 957).

అవి ప్రధానంగా- హత్య జరిగిన తీరు, నేరం జరగడానికి కారణం, సాంఘికంగా తిరస్కరించే విధంగా ఉన్న నేరాలు, నేర తీవ్రత, హత్యకు సంబంధించిన బాధితుల వ్యక్తిత్వం. అలాగే దుర్మార్గంగా, అస్వాభావికంగా, పైశాచికంగా, పిరికితనంగా లేక మోసపూరితంగా చంపినప్పుడు మరణశిక్ష విధించవచ్చు. ఉదాహరణకు- బాధితుడు నిప్పులో కాలి చనిపోవాలన్న ఉద్దేశంతో అతని ఇంటికి నిప్పు పెట్టి చంపినప్పుడు, బాధితులు చనిపోవాలని అతన్ని చిత్రహింసల పాల్జేయడం, అమానవీయంగా ప్రవర్తించడం, బాధితుల శరీరాన్ని ముక్కలు ముక్కలు చేయడం లేక ఛిన్నాభిన్నం చేసి పైశాచికంగా ప్రవర్తించడం.

ఎన్‌కౌంటర్ మరణాల్లో, పరువు హత్యల్లో ఈ అంశాలు లేకపోవచ్చు. కానీ, ఈ నేరాలను కూడా సుప్రీంకోర్టు అరుదైన వాటిల్లో అరుదైనవిగా పరిగణించి మరణశిక్షలను ఖరారు చేసింది. ఎన్‌కౌంటర్ మరణాల పేరుతో అమాయకులను చంపే అధికారులకు ఒక హెచ్చరికగానూ, వెనుకంజవేసే విధంగానూ ఈ తీర్పులు తోడ్పడతాయనడంలో సందేహం లేదు. అదేవిధంగా పరువు, ప్రతిష్టల పేరుతో నేడు జరుగుతున్న హత్యలని నిరోధించడానికి కూడా ఈ తీర్పులు దోహదపడతాయని భావించవచ్చు.

ప్రకాశ్ కదమ్ మరి ఇతరులు వర్సెస్ రాంప్రసాద్ విశ్వనాథ్ గుప్తా మరి ఇతరులు (క్రిమినల్ అప్పీలు నంబరు 1174-1178 / 2011) కేసులో సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్ హత్యలను అరుదైన కేసులో అరుదైనవిగా అభివర్ణించింది. ముంబైలో ప్రకాశ్ కదమ్ అనే పోలీసు అధికారి నేతృత్వంలో ఒక రియల్‌ఎస్టేట్ వ్యాపారి కోసం అతని మిత్రుణ్ణి ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. ఈ కేసులో అక్కడి సెషన్స్ కోర్టు పోలీసు అధికారులకు బెయిల్ మంజూరు చేయగా, హైకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. దీనిపై పోలీసు అధికారులు సుప్రీంకోర్టుకు అప్పీలు చేశారు. అప్పీలు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఎన్‌కౌంటర్ హత్యలను అరుదైన కేసుల్లో అరుదైనవిగా అభివర్ణించింది. ఆ నేర తీవ్రతను సుప్రీంకోర్టు మాటల్లో చెప్పాలంటే-

‘‘ఎన్‌కౌంటర్ల పేరుతో అమాయకులని చంపడం అతి హేయమైన నేరం.

ఈ నేరాన్ని కూడా అరుదైన వాటిలో అరుదైన కేసుగా పరిగణించాల్సి ఉంటుంది. పోలీసు అధికారి నేరం చేశాడని రుజువైతే అతనికి మరణశిక్షను విధించాలి. మామూలు వ్యక్తి హత్య చేస్తే అది మామూలు హత్య. కానీ పోలీసు అధికారి చేస్తే, అది అతని విద్యుక్త ధర్మానికి వ్యతిరేకమైనది. సమాజంలో శాంతిభద్రలు కాపాడే విధంగా విధులను నిర్వర్తించాల్సిన వ్యక్తి వాటికి విఘాతం కలిగించినప్పుడు అతనికి మరణశిక్షే సరైన శిక్ష’’.తన పైఅధికారి చంపమని ఆదేశిస్తే ఎన్‌కౌంటర్ పేరుతో చంపకూడదు. దాన్ని తిరస్కరించాలి. ఆ విధంగా చేయనప్పుడు అతనికి మరణశిక్ష విధించాల్సిందేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంటూ న్యూరెంబర్గ్ విచారణలను ఉదహరించింది. ‘‘ఆ విచారణల్లో ‘ఉత్తర్వులు ఉత్తర్వులే’ అని అధికారులు డిఫెన్స్ తీసుకున్నప్పటికీ ‘నాజీ’ అధికారులకు మరణశిక్షని విధించారు’’.

బూటకపు ఎన్‌కౌంటర్లంటే దారుణమైన హత్యలనీ, చట్టాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తులే ఉల్లంఘనలకు పాల్పడటం తగదని అభిశంసించింది. సమాజాన్ని కాపాడాల్సిన వ్యక్తులే కిరాయి రౌడీలుగా మారి హతమార్చడం అత్యంత హేయమైన విషయమని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఒక వ్యక్తిని చంపుతున్న పోలీసులు, మరో వ్యక్తిని రక్షించడానికి సాక్షులను కూడా చంపరన్న గ్యారంటీ ఏమిటి? అని సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రశ్నించింది. తమని రక్షించుకోవడం కోసం తమ బంధువులని కూడా వాళ్లు చంపగలరని కోర్టు తీవ్రంగా స్పందించింది. సొహ్రాబుద్దీన్, ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసుల నేపథ్యంలో ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది.

ఇక పరువు హత్యలను కూడా అరుదైన కేసుల్లో అరుదైన వాటిగానే పరిగణించాలని సుప్రీంకోర్టు భగవాన్‌దాస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ, క్రిమినల్ అప్పీలు నంబరు 1117/11 కేసులో స్పష్టం చేసింది. ఈ కేసులోని విషయాలకు వస్తే, భగవాన్‌దాస్ తన సొంత కూతురినే చంపేశాడు. కూతురు భర్తను వదిలిపెట్టి వేరే వ్యక్తితో కలిసి జీవిస్తోందన్న కోపంతో, అతను కుటుంబం పరువు పోయిందని ఆమెని చంపేశాడు. పరువు హత్యలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్న వ్యక్తులు బిక్కుబిక్కుమంటూ పోలీసుల రక్షణలో బతుకుతున్నారు. ఏ కారణాలతో ఈ హత్యలు చేసినప్పటికీ, వీటిని అరుదైన కేసుల్లో అరుదైనవిగా బావించాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. అహంకారపూరితమైన, హీనమైన ఈ నేరాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోర్టు పేర్కొంది. మేజరైన వ్యక్తులు తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకునే అధికారం ఉంది. పరువు ప్రతిష్టల పేరుతో ఈ హత్యలకు పాల్పడే వ్యక్తులు తమకు ఉరితాళ్లు ఎదురు చూస్తున్నాయన్న విషయం గమనిస్తే మంచిదని సుప్రీంకోర్టు తీర్పులో హెచ్చరించింది.

బూటకపు ఎన్‌కౌంటర్‌లను, పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా భావించి మరణశిక్షని విధించాలని సుప్రీంకోర్టు ఈ రెండు తీర్పుల్లో నొక్కి చెప్పింది. బచన్‌సింగ్ కేసులో నిర్దేశించిన అంశాలకి మరో రెండు కొత్త అంశాలును జతచేయడం హర్షించదగిందే. పరువు హత్యల కన్నా, ఎన్‌కౌంటర్ హత్యల్లో కేసు నమోదు అవడం చాలా కష్టం. పొరపాటున నమోదైనా పోలీసు అధికారులను ప్రాసిక్యూట్ చెయ్యాలంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 132, 197 ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి కావాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడం కష్టం. ఈ అనుమతి లభించడానికే సంవత్సరాలు పట్టవచ్చు. అవినీతి కేసుల్లో అనుమతి రాక ఎన్నో కేసులు మూలన పడుతున్నాయి. వచ్చినా వాటి పరిష్కారానికి ఎంత కాలం పడుతుందో కళ్ల ముందు కనిపిస్తున్నదే. అలాగని నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదు. రాజ్యాంగలోని జీవించే హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులపై ఉంది. చట్టం నిత్యనూతనమైంది. కాలానుగుణంగా అది మార్పు చెందుతుంది. కోర్టుల వ్యాఖ్యానాలు కూడా దానికి దోహదపడతాయి. ఆ నేపథ్యంలో వచ్చినవే ఈ రెండు తీర్పులన్నది గుర్తించాలి.

బూటకపు ఎన్‌కౌంటర్లకి పాల్పడే వ్యక్తులు ఒక్క విషయం గమనంలో ఉం చుకోవాలి. ముంబైలో రాజ్‌బీర్‌సింగ్ అనే పోలీసు అధికారి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా ప్రతీతి పొందాడు. రాష్ట్రపతి గేలంటరీ అవార్డు కూడా వచ్చింది. అతనికి రియల్ ఎస్టేట్ వ్యక్తులతో తెరచాటు సంబంధాలు ఉన్నాయన్నది ఆరోపణ.

అతన్ని మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి కాల్చిచంపాడు. అతని శవాన్ని చూడటానికి ఒక్క సీనియర్ పోలీసు అధికారి కూడా రాలేదనీ, కనీసం ఒక్క పుష్పగుచ్ఛానికీ నోచుకోలేదనీ విన్నప్పుడు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఈ దేశంలో అది సాధ్యమా అని! సీనియర్లందరూ గతంలో అతన్ని అభినందించిన వారే. ఈ సంఘటనతోపాటు, సుప్రీంకోర్టు తీర్పుని కూడా దేశంలోని పోలీసులంతా ఒక బాధ్యతగా సంయమనంతో అధ్యయనం చేయగలిగితే భవిష్యత్ సమాజం వారికి నీరాజనాలు పడుతుందనడంలో సందేహం లేదు!

Friday, January 28, 2011

గుట్టుచప్పుడు కాకుండా తెరపైకి వచ్చిన ‘అరెస్టు’ చట్టం

బెయిలు లేదిక అంతా బయలే!
గుట్టుచప్పుడు కాకుండా తెరపైకి వచ్చిన ‘అరెస్టు’ చట్టం
విశ్లేషణ...29-1-2011 saakshi

ఈ చట్టంతో అక్రమ అరెస్టులను నిరోధించగలిగినప్పటికీ, డబ్బున్న వ్యక్తులు అరెస్టు పరిధి నుంచి తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మోసం, నమ్మకద్రోహం, దొంగతనాలు లాంటి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు, ఈ నిబంధన లను ఆసరా చేసుకుని జైలుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిబంధన వల్ల సమాజానికి మేలు ఎంతో కీడూ అంతే.

వ్యక్తి స్వేచ్ఛతో ముడిపడ్డ ‘అరెస్టు’కి సంబంధించిన ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సవరణల) చట్టం-2010’ గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ తెరపైకి రావడం వివాదంగా మారుతోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కొన్ని సవరణలను ప్రతిపాదిస్తూ ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సవరణల) చట్టం-2008’ని రూపొందించింది. అయితే, దేశ వ్యాప్తంగా న్యాయవాదులు, మేధావుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో, ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు ప్రధానంగా 5, 6 (అరెస్టుకి సంబంధించినవి), 21 (బి) తప్ప మిగిలినవి అమల్లోకి వచ్చేవిధంగా ప్రకటన జారీ చేసింది. అరెస్టు నిబంధనలు మినహా ఆ చట్టం 2009 డిసెంబర్ 31 నుంచి అమలులోకి వచ్చింది. ఆ తరువాత వివిధ వర్గాలతో చర్చలు జరిపి అరెస్టుకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-2010’ రూపంలో ఆ సవరణలను చట్టంగా తీసుకొచ్చింది. ఈ సవరణలతో కూడిన కొత్త చట్టం 2010 నవంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ 2010 నవంబర్ 1న ఎస్.ఓ.నెం.2689(ఇ)ను జారీ చేస్తూ, భారత గెజిట్‌లో ప్రచురించింది. ఎంతో వివాదాస్పదమైన అరెస్టుకు సంబంధించిన ఈ సవరణలు అమల్లోకి వచ్చాయి కానీ, వాటి గురించి ప్రజలకి తెలియజేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిం చలేదు. ఎలాంటి అలికిడీ లేకుండా ఇవి అమల్లోకొచ్చాయి. గతంలో అన్ని వర్గాల వారు వ్యతిరేకించిన సవరణలు, నేడు ప్రజలకి, న్యాయవ్యవస్థకి ఏ మేరకు మేలు చేస్తాయన్న విషయాన్ని చర్చించవలసిన అవసరం ఉంది.

న్యాయశాస్త్ర పరిభాషలో ప్రతి నిర్బంధం అరెస్టు కాదు. వ్యక్తి స్వేచ్ఛ పూర్తిగా కోల్పోయే విధంగా చేయడం అరెస్టు అవుతుంది. కాగ్నిజబుల్ నేరం చేసిన వ్యక్తులను పోలీసులు ఎలాంటి వారంట్ లేకుండా అరెస్టు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నేరానికి సంబంధించి ఎవరిపైనైనా సహేతుకమైన ఫిర్యాదు అందినప్పుడు లేదా విశ్వసనీయ సమాచారం ఉన్నప్పుడు పోలీసులు అరెస్టు చేయడానికి అవకాశం ఉంది. అనుమానంపై కూడా పోలీసులు అరెస్టు చేయవచ్చు. అయితే అరెస్టుకు దారితీసే సందర్భాలను చట్టం స్పష్టంగానే నిర్దేశించింది. కేసు విచారణ సమయంలో ముద్దాయి హాజరు కాడన్న అనుమానం ఉన్నప్పుడు; హత్య, రేప్, బందిపోటు దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడిన వ్యక్తులతో సమాజంలో భయాందోళనలు నెలకొన్నప్పుడు అరెస్టు అవసరం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో నేరస్తుని ప్రాణాలు రక్షించడానికి కూడా అరెస్టు తప్పదు. నిందితుడు సాక్ష్యాధారాలను నాశనం చేయకుండా, సహ ముద్దాయిలకు వార్నింగ్ ఇవ్వకుండా, మళ్లీ అలాంటి నేరాలకు పాల్పడకుండా అరెస్టు అవసరమవుతుంది.

ఇన్ని జాగ్రత్తలతో కూడిన నిబంధనలు ఉన్నప్పటికీ, అరెస్టుల విషయంలో పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న అపవాదు తప్పలేదు. జాతీయ పోలీస్ కమిషన్ మూడవ నివేదికలో అక్రమ అరెస్టుల గురించి ఆందోళనను వెలిబుచ్చడం గమనార్హం. పోలీసులు చేస్తున్న అరెస్టుల్లో 60 శాతం అనవసరమైనవి, న్యాయబద్ధత లేనివని, వీటివల్ల జైళ్ల నిర్వహణా ఖర్చు పెరుగుతోందని కమిషన్ అభిప్రాయపడింది. లా కమిషన్, మలిమత్ కమిటీ నివేదికలు కూడా అనవసర అరెస్టుల గురించి ప్రస్తావించాయి. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు అరెస్టులు, కస్టోడియల్ హింసపై ఆందోళన వెలిబుచ్చింది.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.41కి సవరణలు తీసుకొస్తూ 2008లో చట్టాన్ని రూపొందించింది. అయితే ఆ సవరణలపై తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో, అవి అమల్లోకి రాలేదు. దేశవ్యాప్తంగా న్యాయవాదులు అరెస్టు సవరణలను వ్యతిరేకించారు. ఈ సవరణలను అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కొందరు సుప్రీంకోర్టు ముందు రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్‌తో కూడిన ధర్మాసనం, 2008 చట్టం ద్వారా తీసుకొచ్చిన సవరణలను తప్పుగా అర్థం చేసుకుంటున్నార ంటూ హితవు పలికి, వాటిని స్వాగతించింది. దేశపౌరుల కష్టాలను, వేదనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలని వ్యతిరేకించకూడదని కూడా సుప్రీంకోర్టు న్యాయవాదులకు సూచించింది. ఈ సవరణల మంచి చెడ్డలను చర్చిండానికి భారత ప్రభుత్వం 2009 ఆగస్టులో ఒక సమావేశాన్ని నిర్వహించి, కొన్ని నిబంధనలపై ఏకాభిప్రాయాన్ని సాధించింది. ఆ తరువాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సవరణల) చట్టం-2010ని తీసుకొచ్చింది. ఈ సవరణలు నవంబర్ 2, 2010 నుంచి అమలులోకి వచ్చాయి.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.41 సబ్‌సెక్షన్ (1)లో ఉన్న ఎ, బి సబ్ క్లాజ్‌లను తొలగించి, ఈ సవరణల ద్వారా వాటికి ప్రత్యామ్నాయాలను ఏర్పరచారు. అదేవిధంగా (బి, ఎ) అన్న క్లాజ్‌ని 41ఎ, 41బి, 41సిలుగా ఏర్పరచారు. ముందుగా తొలగించిన క్లాజ్‌ల వివరాలను పరిశీలిస్తే, సె.41 ప్రకారం వారంట్ లేకుండా పోలీసు అధికారి ఏ వ్యక్తినైనా అరెస్టు చేయవచ్చు.

ఆ సందర్భాలు-
ఎ) కాగ్నిజబుల్ నేరంతో సంబంధం ఉన్న వ్యక్తిని, లేదా ఏ వ్యక్తికి వ్యతిరేకంగానైతే సముచితమైన ఫిర్యాదు వచ్చిందో ఆ వ్యక్తిని లేదా విశ్వసనీయ సమాచారం లేదా సముచితమైన అనుమానం ఉన్నప్పుడు (వారికి కాగ్నిజబుల్ నేరంతో సంబంధం ఉందని అన్పించినప్పుడు);
బి) ఇళ్లకు కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు ఎవరైనా కలిగి ఉన్నప్పుడు (అవి కలిగి ఉండటానికి శాసన సమ్మతమైన కారణం ఉన్నదని రుజువు పరచుకునే బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుంది).

సవరణకు ముందు ఈ రెండు క్లాజుల ద్వారా పోలీసులకు ఎవరినైనా అరెస్టు చేయడానికి విశేషమైన అధికారాలు ఉండేవి. దీనిపై రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాస్తూ కేంద్ర హోంమంత్రి చిదంబరం- ‘ఈ నిబంధనలు దుర్వినియోగం అవుతున్నాయన్న విమర్శలు చాలా ఉన్నాయి. వాస్తవంలో అవి దుర్వినియోగం అవుతున్నాయి కూడా. ఈ రెండు క్లాజ్‌ల గురించి లా కమిషన్ 177వ నివేదికలో చర్చించింది’ అని వ్యాఖ్యానించారు.

కాగ్నిజబుల్ నేరం చేశాడన్న అనుమానం వచ్చినప్పుడు, ఆ నేరంతో సంబంధం ఉన్నప్పుడు, కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు కలిగి ఉన్నప్పుడు ఏ వ్యక్తినైనా పోలీసులు అరెస్టు చేయవచ్చు. అయితే, ఇళ్లకి కన్నం వేయడానికి అవసరమైన వస్తువులు అంటే ఏమిటి? పనిముట్ల్లు కలిగివున్న వ్యక్తులనూ ఆ నెపం మోపి పోలీసులు అరెస్టు చేయవచ్చుకదా అన్న అనుమానం రాకతప్పదు. ఈ రెండు క్లాజ్‌ల ద్వారా పోలీసులకు అపరిమితమైన ఆధికారాలు లభించాయన్నది ప్రధాన విమర్శ. అందుకని ఈ రెండు క్లాజ్‌లను తొలగించి, కొత్త నిబంధనలతో వాటి స్థానంలో 2010 సవరణల చట్టం తీసుకొచ్చారు.

దాని ప్రకారం-
41 (1)(ఎ) పోలీసుల సమక్షంలో కాగ్నిజబుల్ నేరం చేసినప్పుడు;
(1)(బి) 7 సంవత్సరాల వరకు లేదా 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్షపడే అవకాశం ఉన్న నేరం చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా సముచితమైన ఫిర్యాదు వచ్చినప్పుడు, నేరానికి సంబంధించి విశ్వసనీయమైన సమాచారం అందినప్పుడు లేదా సహేతుకమైన అనుమానం కలిగినప్పుడు, ఈ షరతుల పట్ల సంతృప్తి చెందినప్పుడు మాత్రమే అరెస్టులు చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జాగ్రత్తలూ పాటించాలి. 1) ఆ వ్యక్తి ఆ నేరం చేశాడనటానికి గట్టి ఆధారం ఉండాలి. (2) ఆ అరెస్టు, కింద పొందుపరచిన కారణాల వల్ల అవసరమని పోలీసు అధికారి సంతృప్తి చెందాలి.

అవి-
- ఆ వ్యక్తి తిరిగి అలాంటి నేరం చేయకుండా నిరోధించడానికి;
- దర్యాప్తు నిరాటంకంగా కొనసాగడానికి;
- సాక్ష్యాలను నాశనం చేయకుండా ఉండటానికి;
- సాక్షుల విషయంలో జోక్యం చేసుకోకుండా చూడటానికి;
- ఆ వ్యక్తిని అరెస్టు చేస్తే తప్ప కోర్టు ముందు హాజరుపెట్టలేమని భావించినప్పుడు.

ఈ కొత్త నిబంధనల గురించి ఒక్కమాటలో చెప్పాలంటే- 7 సంవత్సరాల వరకు శిక్ష విధించడానికి అవకాశం ఉన్న కాగ్నిజబుల్ నేరం చేసిన వ్యక్తులను, అదేవిధంగా 7 సంవత్సరాలకి తక్కువ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉన్న వ్యక్తులను మాత్రమే పోలీసులు అరెస్టు చేయాలి. అది కూడా తగు కారణాలను నమోదు చేసిన అనంతరమే అరెస్టు చేయాలి. దీంతో భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 498-ఎ (వేధించడం), 379 (దొంగతనం) వంటి కేసుల్లో అరెస్టులకు అవకాశం ఉండదు. మోసం, నమ్మక ద్రోహం వంటి కేసుల్లో కూడా అతి కష్టంగా అరెస్టు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అరెస్టు చేసినప్పుడు, అదేవిధంగా అరెస్టు చేయనప్పుడు కూడా తగు కారణాలను పోలీసులు నమోదు చేయాలి. ఈ చట్టంతో అక్రమ అరెస్టులను నిరోధించగలిగినప్పటికీ, డబ్బున్న వ్యక్తులు అరెస్టు పరిధి నుంచి తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మోసం, నమ్మకద్రోహం, దొంగతనాలు లాంటి తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులు, ఈ నిబంధన లను ఆసరా చేసుకుని జైలుకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిబంధన వల్ల సమాజానికి మేలు ఎంత ఉందో కీడూ అంతే ఉంది.

అరెస్టు చేయకుండా పోలీసులు దర్యాప్తు ఎలా కొనసాగిస్తారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. దీన్ని అధిగమించడానికి సె.41(ఎ)ని కూడా చట్టం లో పొందుపరిచారు. సె.41(1) ప్రకారం అరెస్టు చేయనప్పుడు, ముద్దాయిలు తమ ముందు హాజరు కావాలని పోలీసులు నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. నోటీసులో చెప్పిన ప్రకారం నేరస్తులు పోలీసు అధికారి నిర్దేశించిన ప్రదేశంలో హాజరుకావాలి. దాని ప్రకారం హాజరైతే ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి వీల్లేదు. అయితే , ఆ వ్యక్తిని కూడా యోగ్యతగల కోర్టు అనుమతి తీసుకుని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది.

ఈ కొత్త నిబంధనల ద్వారా పోలీసులకు గతంలో ఉన్న విశేష అధికారాలను తొలగించి, నోటీసు ఇచ్చే అధికారాన్ని ఇచ్చారు. కానీ దాన్ని పోలీసులు ఆయుధంగా వాడుకుని నేరస్తులను వేధించే అవకాశం ఉంది. దీని నియంత్రణకి చట్టంలో ఎలాంటి నిబంధనలు లేవు. అయితే నోటీసుని ఉల్లంఘించిన వ్యక్తిని అరెస్టు చేయాలంటే యోగ్యతగల కోర్టు ఉత్తర్వుల ప్రకారమే చేయాల్సి ఉంటుంది. యోగ్యత గల కోర్టు ఏదీ అన్నది స్పష్టంగా చెప్పలేదు. అది సంబంధిత మేజిస్ట్రేట్ కోర్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, నోటీసును పాటిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయాలనుకున్నప్పుడు కోర్టు అనుమతి అవసరంలేదు. అందుకు గల కారణాలను నమోదు చేస్తే సరిపోతుంది. అరెస్టు స్ఫూర్తికి ఇది విరుద్ధం. నోటీసు పేరుతో ముద్దాయిలపై పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె. 157 ప్రకారం దర్యాప్తులో చివరి దశ అరెస్టు. మొదటి దశ ప్రథమ సమాచార నివేదిక విడుదల చేయడం. నేరస్థలాన్ని సందర్శించడం రెండవ దశ. కేసుకి సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం మూడవ దశ. చివరి దశ- ముద్దాయిని అరెస్టు చేయడం. అది కూడా అవసరమైతేనే. కానీ ముద్దాయిని అరెస్టు చేయడం మొదటి దశగా మారింది. సె. 41 ఆధారంగా అక్రమ అరెస్టులు, అనవసర అరెస్టులు కొనసాగేవి. ఈ సవరణల ద్వారా పోలీసులు ఏకపక్షంగా అరెస్టు చేసే అవకాశం తగ్గవచ్చు. ఈ కొత్త నిబంధనలు పోలీసు కమిషన్, లా కమిషన్‌ల నివేదిక, డీకే బసు కేసు తీర్పు ఆధారంగా రూపొందాయి. వీటివల్ల పోలీసుల అధికారాలు పూర్తిగా పోయాయనిగానీ, విశేష అధికారాలు వచ్చాయనిగానీ కాదు.

ఈ నిబంధనల పరిణామాలు ఇలా ఉంటాయని చెప్పవచ్చు:
***పోలీసులు వారెంట్ లేకుండా ఏ వ్యక్తినైనా సులభంగా అరెస్టు చేయడానికి అవకాశం లేదు.
***7 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో తగు కారణాలు ఉన్నప్పుడే, వాటిని నమోదు చేసి అరెస్టు చేయాలి. ఈ కారణాలను రిమాండ్ చేసే ముందు మేజిస్ట్రేట్ గమనంలోకి తీసుకోవాలి.
***కాగ్నిజబుల్ నేరాలు చేసిన వ్యక్తుల హాజరుపై పోలీసులు నోటీసు జారీ చేస్తారు. దానిని పాటించనప్పుడు, కోర్టు అనుమతితో మాత్రమే అరెస్టు చేయవచ్చు. నోటీసును పాటిస్తున్నప్పటికీ తగు కారణాలను చూపి అరెస్టు చేయవచ్చు. నోటీసు పేరుతో అరెస్టుకన్నా ఎక్కువ వేధించే అధికారం పోలీసులకు న్యాయబద్ధంగానే లభిస్తుంది.
***పోలీసులకి ఉన్న అరెస్టు అధికారాన్ని ఈ నిబంధనలు పూర్తిగా తీసివేయలేదు. కాకపోతే ఆ అధికారం మీద నిఘా ఉంటుంది.

వ్యక్తి స్వేచ్ఛతో ముడిపడ్డ అంశానికి చెందిన కీలకమైన సవరణలను గుట్టుచప్పుడు కాకుండా అమలుచేయడం అంత మంచి సంప్రదాయం కాదు. ఈ సవరణల ద్వారా పోలీసులకు, ప్రజలకు మధ్యన ఉన్న దూరం తగ్గుతుందా, పెరుగుతుందా అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి!

మంగారి రాజేందర్
మూడవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, వరంగల్

Followers