Saturday, May 23, 2009

నార్కో పరీక్షల్లో విశ్వపనీయత?

నార్కో అనాలిసిస్‌ పరీక్షలు, పాలియోగ్రాఫ్‌, బ్రెయిన్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌ పరీక్షలు మళ్ళీ చర్చలోకి వచ్చాయి. ఇందుకు కారణం భారత లా కమిషన్‌ ఈ పరీక్షలను తక్షణం నిలిపిచేయాలని భారత ప్రభుత్వానికి సూచించడమే. నిజాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఉపయోగించే ఈ పద్ధతులు మౌలికమైన మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నాయని లా కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. కమిషన్‌ ఇక్కడితో ఊరుకోలేదు. ఈ పరీక్షలు ఒత్తిడితో చేస్తున్న చర్యలని తన నివేదికలో పేర్కొంది. ఎక్కడ ఏ నేరం జరిగినా, అది ప్రజల దృష్టిని ఆకర్షించినప్పుడు ప్రజల నుంచి ఈ పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్‌ వస్తున్నది. అనుమానితుల పైన, ముద్దాయి పైననే కాదు సాక్షుల పైన కూడా ఈ పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్‌ చాలా ఎక్కువ సార్లు వస్తోంది. ఈ పరీక్షల విలువ, వాటి పరిణామాలు ప్రజలకి తెలియవు. ఈ పరీక్షలు నిర్వహిస్తే ముద్దాయిలు దొరికిపోతారన్న భ్రమలో ప్రజలు ఉన్నారు. అందుకని ఆ డిమాండ్‌ ఎక్కువగా చేస్తున్నారు. ఈ అభిప్రాయంలో నిజం ఉందా?దేశ వ్యాప్తంగా ఈ పరీక్షల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ పరీక్షలు నిర్వహించడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. కోర్టులు కూడా ఈ పరీక్షలకు అనుమతి ఇస్తున్నాయి. పోలీసులు కూడా ఈ పరీక్షల కోసం అత్యంత ఉత్సా హం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను తక్ష ణం నిలిపివెయ్యాలని లా కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించడం ఓ శుభపరిణామం. లా కమి షన్‌ ఈ సిపారసు చేయడానికి కారణం- ఫోరెన్సిస్‌ సైన్స్‌ సోసైటీ ఆఫ్‌ ఇండియా ఈ పరీక్షల వినియోగం పై తీవ్ర ఆందోళన వ్యక్త పరుస్తూ లా కమిషన్‌కి మహజరును సమర్పించింది. ఈ మహజరుకు స్పందించి లా కమిషన్‌ నేరన్యాయ వ్యవస్థలోని అన్ని విభాగాల నుంచి ప్రతిస్పందనలను కోరింది. ఫోరెన్సిస్‌ సొసైటీ ఈ పరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచంలోని నాగరిక దేశాలు ఐదు దశాబ్దాల క్రితమే వదిలి వేసిన ఈ పరీక్షలను మన దేశంలో నిర్వహించడం సరైంది కాదని తగు సాక్ష్యాధారాలతో కమిషన్‌ ముందు వాదించింది. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని లా కమిషన్‌ ఈ పరీక్షలు తక్షణం మాని వేయాలని ప్రభుత్వానికి సూచించింది. పోలీసులు క్రమశిక్షణ గలిగిన దళమని, అది రాజ్యాంగానికి ఇతర శాసనాలకి లోబడి తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో అభిప్రాయపడింది. తమ సైంటిఫిక్‌ పద్ధతుల ద్వారా సైంటిస్టులు పోలీసులను ఉత్తేజపరచాలి తప్ప, మానవ హక్కుల ఉల్లంఘనలో పోలీసులకు తమ సహాయాన్ని అందించకూడదు. ప్రపంచం ఈ పరీక్షలని వదిలి పెట్టడానికి ప్రధాన కారణాలు రెండు- ఈ పరీక్షల్లో విశ్వసనీయత లేదని పోలీసులకు తెలుసు. అది మొదటి కారణం. ఇక, రెండవ కారణం మానసిక శాస్తవ్రేత్తలు నీతిగా ప్రవర్తించి, పోలీసులు కోరిన విధంగా సహకరించకపోవడం. ఈ రెండు కారణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ పరీక్షలను దర్యాప్తు సంస్థలు వదిలి వేశాయి. కమిషన్‌ ఈ విషయాన్ని తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. మందుల ప్రభావం వల్ల అనుమానితులు చెప్పే విషయాల్లో విశ్వసనీయత తక్కువ. అంతే కాదు ఈ మందుల ప్రభావం ఉన్న మామూలు వ్యక్తి కూడా తనకు తెలిసి ఉన్న విషయాలని మరుగుపరిచే అవకాశం ఉంది. ఈ పరీక్షల విధానాన్ని చాలా దేశాలు అధ్యయనం చేశాయి. ఈ పరీక్షల ద్వారా నిజాలను దాచడం కష్టమే కానీ దాచి ఉంచే అవకాశం మాత్రం ఉంది. అదే విధంగా చెయ్యని నేరాలని అంగీకరించే ప్రమాదం కూడా ఉంది. పరీక్షలు నిర్వహిస్తున్న వ్యక్తిపై పరీక్షలు నిర్వహించే వ్యక్తులు తమ అభిప్రాయాలను రుద్దే అవకాశం ఏర్పడుతుంది. ఈ కారణాల వల్ల ఈ పరీక్షల విశ్వసనీయత సందేహాస్పదమే. లా కమిషన్‌ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. బెంగళూర్‌లోని పరిశోధన సంస్థలో నిర్వహించిన పరీక్షలు కూడా కమిషన్‌ దృష్టిలోకి వచ్చాయి. పోలీసులు కోరిన విధంగా స్టేట్‌మెంట్‌ రావడం కోసం ఒకే వ్యక్తి మీద ఎన్నో సార్లు ఈ పరీక్షలను అక్కడ నిర్వహించారు. ఈ పరీక్షల్లో విశ్వసనీయత లేదని అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. ఫాలిగ్రాఫ్‌ పరీక్షలు లేదా లైడిటెక్టర్‌ పరీక్షల్లో విశ్వసనీయత లేదని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ పరీక్షల్లో రెండు రకాల ప్రశ్నలు అడుగుతారు. వంచించే ప్రశ్నలు, మోసపుచ్చే ప్రశ్నలు వాటిలో ఉంటాయి. అందుకని ఈ పరీక్షలు శాస్ర్తీయమైనవని అనలేమని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. అదే విధంగా బ్రెయిన్‌ ఫింగర్‌ ప్రింటింట్‌ పరీక్షలు కూడా.మందులు మనిషిని ఉత్సాహపరచాలి. అంతే కానీ ఆందోళన పరచకూడదు. ఈ నార్కో పరీక్షలను మందులు ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఈ మందుల ప్రభావం వల్ల మనిషికి అపాయం సంభవించే అవకాశం ఉంది. అలాంటి పరీక్షలు ఇంకా కొనసాగడం సరైందేనా? ప్రపంచం వద్దనుకున్నా ఈ పరీక్షలను మనం ఇంకా కొనసాగించడం సమంజసమేనా? భారత లా కమిషన్‌ నివేదికను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశించాలి.

Sunday, May 10, 2009

పోలీసులు, శాంతి భద్రతలు

పోలీసులు, శాంతి భద్రతలు

శాంతి భద్రతలు క్షీణించినప్పుడల్లా పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించరు. ఇందుకు కారణం ఏమిటి? పోలీసులు, నేరన్యాయ వ్యవస్థని ఆర్థం చేసుకోవాలంటే ముందుగా పోలీసుల గురించి తెలియాలి. పోలీసు వ్యవస్థ మన దేశంలోకి ఎలా వచ్చిందో, అది ఏ విధంగా పని చేస్తోందో కూడా తెలుసుకోవాలి. మన దేశం 32, 87, 782 చదరపు కిలోమీటర్ల దూరంలో విస్తరించింది. మన దేశ జనాభా దాదాపు 1.02 బిలియన్లు. రాజ్యాంగంలోని అధికరణ 246 ప్రకారం శాసన అధికారాలు నిర్దేశితమయ్యాయి. రాజ్యాంగంలోని 7వ షెడ్యూలులో వీటిని ఉదహరించారు. ఈ షెడ్యూలులో మూడు జాబితాలు ఉన్నాయి. మొదటి జాబితాలో పార్లమెంటు తయారు చేసే శాసనాల విషయాలను పేర్కొన్నారు. ఆ విషయాల మీద చట్టాలు తయారు చేసే అధికారం పార్లమెంట్‌కి ఉంటుంది. దీనినే కేంద్ర జాబితా అంటాం. రెండవ జాబితాలో పేర్కొన్న విషయాల మీద రాష్ట్ర శాసనసభలు శాసనాలను తయారు చేస్తా యి. దీనినే రాష్టల్ర జాబితా అంటాం. మూడవ జాబితాలో విషయాల మీద పార్లమెంట్‌, రాష్ట్ర శాసన సభలు రెండూ శాసనాలు చేసే అధికారం కలిగి ఉంటాయి. అధికరణ 246 ప్రకారం- శాంతి భద్రతలు, కోర్టులు, కారాగారాలు, బోస్టన్స్‌ స్కూళ్లు వగైరా రాష్ట్ర జాబితాలో ఉంటాయి. అందుకని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉంటారు. అదే విధంగా శాంతి భద్రతలకు రాష్టమ్రే బాధ్యత వహించాల్సి ఉంటుంది.పోలీసు వ్యవస్థ మనకు బ్రిటిష్‌ వారినుంచి సంక్రమించింది. వ్యక్తి స్వేచ్ఛకు మూలాధారం మాగ్నాకార్టా (1215) అని బ్రిటిష్‌ పాలకులు అనుకున్నప్పటికీ, హెబియస్‌ కార్పస్‌ హక్కుల చట్టం 1684, ప్రెంచ్‌ డిక్లరేషన్‌ 1789 కంటే పూర్వమే దాన్ని అమల్లోకి తెచ్చినప్పటికీ ఆ హక్కులను బ్రిటిష్‌ వాళ్ళ పాలనలో మనకు ఇవ్వలేదు.స్వేచ్ఛా పూరితమైన ఎన్నికలు, భావస్వేచ్ఛ, బెయిల్‌ వంటి భావనలు బ్రిటిష్‌ వారి కి తెలిసినప్పటికీ వాటిని భారత దేశ ప్రజలకు ఇవ్వలేదు. పోలీసు వ్యవస్థను సేవా సంస్థగా కాకుండా, ఒక శక్తిగా మాత్రమే వారు మన దేశంలో రూపొందించారు. మన దేశ ప్రజలను, వారి హక్కులను అణగదొక్కడానికి మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించారు. వ్యక్తుల స్వేచ్ఛను, హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని వాళ్ళు పోలీసులకు తెలియనివ్వలేదు. స్వాతంత్య్ర ఉద్యమాలలో పాల్గొ న్న సంస్థలను, వ్యక్తులను అణిచివేయడానికే బ్రిటి్‌ష్‌ పాలకులు పోలీసు వ్యవస్థను ఉపయోగించుకున్నారు. శారీరక దారుఢ్యం వంటి విషయాలకే ప్రాధాన్యత ఇచ్చేలా పోలీసువ్యవస్థ నిబంధనలను రూపొందించారు, క్రమశిక్షణ పరేడ్‌ గ్రౌండ్‌నుంచి మాత్రమే వస్తుందన్న భ్రమ కలిగించారు. తమకి ఎదురుగాఉన్న వ్యక్తి తమ శత్రు వు అనీ, తాము కూడా ‘శక్తి’ అనేభావనలను బ్రిటి్‌ష్‌వారు పోలీసులకి కలిగించారు. పోలీసులకు- స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజ్యాంగం గురించి, ప్రాధమిక హక్కుల గురించి మానవ హక్కుల గురించి శిక్షణ ఇస్తున్నారు. కానీ వారిలోబ్రిటిష్‌ కాలం నాటి పాత శాసనాలు పోలేదు.మన రాజ్యాంగం ప్రకారం పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించిన నియమ నిబంధనల ప్రకారం ఈ వ్యవస్థ పని చేయాలి. ప్రతి రాష్ట్రానికి, కేంద్రపాలిత ప్రాంతాలకు వేరు వేరుగా పోలీసులు ఉన్నారు. ఈ వ్యవస్థ పోలీసుచట్టం 1861 ప్రకారం ఏర్పడింది. 1857లో సిపాయి ల తిరుగుబాటు జరిగింది. ఆ తరువాత ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ విధంగా రూపు దిద్దుకున్న పోలీసులంటే అందరిలోనూ భయం నెలకొంది. కానీ కష్టకాలం లో పోలీసుల సహాయం కోరకుండా ఉండలేని పరిస్థితి. శాంతి భద్రతలను రక్షించడానికి, ప్రజలను రక్షించడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఎంపిక చేసిన వ్యక్తులే పోలీసులు. పోలీసుల విధులకు సంబంధించి చాలా చట్టాల్లో మరీ ముఖ్యంగా భారత రాజ్యాంగం, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌- భారతీయ శిక్ష్యాస్మృతిలో పేర్కొన్నప్పటికీ, వీరి విధులకు సంబంధించిన ప్రధాన చట్టం భారతీయ పోలీస్‌ చట్టం 1801.పోలీసులంటే శాంతి భద్రతలను చట్ట ప్రకారం రక్షించే వ్యక్తులు. వ్యవస్థ- చట్ట ప్రకారం నేరాలను నిరోధించే వ్యవస్థ. పోలీస్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం నమోదైన వ్యక్తులు. ప్రతి రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రత్యేకమైన బలగాలు ఉన్నాయి. అయితే నాలుగు కారణాలవల్ల అన్ని రాష్ట్రాలలో ఒకే రకమైన వ్య వస్థ ఉంది. ఆ కారణాలు -1. పోలీసు చట్టం 1861 ప్రకారం రాష్ట్ర పోలీసు యంత్రాంగం నియంత్రితమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీసు చట్టాలు ఉన్నప్పటికీ అవి దాదాపుగా పోలీసు చట్టం 1861ని పోలి ఉన్నాయి.2. ప్రధాన చట్టాలైన భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ భారతీయ సాక్ష్యాధారాల చట్టం లాంటివి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు వర్తిస్తాయి.3. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ అనేది భారత దేశానికంతటికీ వర్తించే సర్వీస్‌. ఈ సర్వీస్‌లకు కేంద్ర ప్రభుత్వం వ్యక్తులను ఎంపిక చేస్తుంది. వారికి శిక్షణ ఇస్తుంది.4. మన దేశంలో ఉన్న ఖ్వాసీ ఫెడరల్‌ ప్రకారం రాజ్యాంగంలో ఏర్పరిచిన నిబంధనల వల్ల కేంద్రానికి పోలీసుల విషయంలో సమన్వయం చేకూర్చే అవకాశం ఉంది.శాంతి భద్రతలను పరిరక్షించడం, నేరాలను నిరోధించడం, నేరాలని దర్యాప్తు చేయడం, అవసరమైనప్పుడు కాగ్నిజబుల్‌ నేరాలు చేసిన వ్యక్తులను అరెస్టు చెయ్యడం; వ్యక్తుల ప్రాణాలను, స్వేచ్ఛను, ఆస్తులను రక్షించడం; సరైన యంత్రాంగం చట్టబద్దంగా జారీచేసిన ఉత్తర్వులను, వారెంట్లను అమలు చెయ్యడం లాంటి విధులను పోలీసులు నిర్వర్తిస్తారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చట్టం పరిధిలోకి లోబడి ఈ విధులను నిర్వర్తిస్తారు. అందుకని శాంతి భద్రతలు క్షీణించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను నిందించడం జరుగుతోంది.

Followers