Friday, June 26, 2009


నేరబాధితులకు మేలు చేసే నిబంధనలు 27.6.09

‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సవరణల) బిల్లు 2008’ చట్ట రూపంగా మారింది. కానీ అది అమల్లోకి రాలేదు. అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించలేదు. దేశ వ్యాప్తంగా ఈ చట్టం గురించి క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థతో సంబంధం ఉన్న అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. ఆ ఒత్తిడి వల్ల ఆ చట్టం అమలుకు నోచుకోలేదు. ఏ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియని పరిస్థితి మనదేశంలో నెలకొన్నది. ఆ చట్టంలో అరెస్టు విషయం గురించి తెచ్చిన సవరణల పట్ల తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. అయితే బాధితుల గురించి గతంలో కొంత చర్చించడం జరిగింది. ఈ సరవణల గురించి న్యాయ వాదులకు అభ్యంతరాలు లేవు. కనీసం ఈ నిబంధనలనైనా ప్రభుత్వం అమల్లోకి తెచ్చే విధంగా ప్రకటన జారీ చేస్తే బాగుండేది. కానీ అది ఇంకా జరగలేదు. వీటి అమలు కోసం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే బాగుండేది. ఆ సవరణలను పరిశీలిద్దాం. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో ఎక్కడైనా నేరస్థుల ప్రస్తావన, ముద్దాయిల హక్కుల గురించిన నిబంధనలే కనిపిస్తాయి కానీ బాధితుల ప్రస్తావన కనిపించదు. ఒకటి రెండు నిబంధనల్లో వీరి ప్రస్తావన ఉంది. బాధితుల గురించిన నిర్వచనం కూడా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో లేదు. ఒక రకంగా చెప్పాలంటే, నేర న్యాయ వ్యవస్థ మరిచి పోయిన వ్యక్తి బాధితుడు/ బాధితురాలు.

ప్రతి చట్టంలో సాధారణంగా సె.2లో నిర్వచనాలు ఉంటాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కూడా సె.2లో చాలా పదాలను నిర్వచించారు. నేరస్థులని, బాధితులని నిర్వచించలేదు కానీ నేరస్థుల ప్రస్తావన చట్టం మొదటి నుంచి చివరి దాకా ఉంటుంది. కానీ బాధితుల గురించి రెండు, మూడు నిబంధనల్లో మినహ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. మానభంగానికి గురైన బాధితురాలికి వైద్య పరీక్ష జరిపించాలన్న నిబంధన కూడా కోడ్‌లో కనిపించదు. ఈ నేపథ్యంలో బాధితులను ఈ కొత్త చట్టంలో నిర్వచించినారు. 2(ఠ్చీ) ప్రకారం ‘బాధితులు’ అంటే నేరారోపణ ఎదుర్కొంటున్న ముద్దాయి చర్యల వల్ల, లేదా ఏదైనా చేయాల్సిన ఆ చర్య చేయకలేకపోవడం వల్ల బాధపడుతున్న వ్యక్తి. బాధితుల సంరక్షకులు, వారి చట్ట బద్ధ ప్రతినిధులు కూడా ఈ నిర్వచనంలోకి వస్తారు. వాళ్ళని కూడా బాధితులుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

బాధితులు తమకి తాముగా న్యాయవాదిని నియమించుకునే అవకాశం లేదు. సె.301(2) ప్రకారం ప్రైవేట్‌ వ్యక్తులు న్యాయవాదులను నియమించుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆదేశాలకు లోబడే పని చేయాల్సి ఉంటుంది. కోర్టు అనుమతితో రాతపూర్వకంగా వాదనలు సమర్పించే అవకాశం ఉంది. నేరాలన్నీ రాజ్యానికి వ్యతిరేకంగా చేసేవని చట్టం భావిస్తుంది. అందుకని బాధితుల తరపున ప్రభుత్వం నియమించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదిస్తాడు. కొన్ని సందర్బాలలో బాధితులు న్యాయవాదులని నియమించుకోవచ్చు. కానీ వాళ్ళు పై నిబంధన ప్రకారం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆజామాయిషీలోనే పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించి ఈ సవరణలు తీసుకొచ్చిన చట్టంలో సె.24(8) క్రింద ప్రొవిసోని ఏర్పరిచారు. ఆ ప్రకారం బాధితురాలు తనకు ఇష్టమైన న్యాయవాదిని నియమించుకోవడానికి కోర్టు అనుమతించవచ్చు.

నేరం జరిగిన సమాచారం అందగానే పోలీసు అధికారి కేసు నమోదు చేసి నేరస్థలానికి వెళ్ళాలి. నేరానికి సంబంధించిన సాక్ష్యాలు అక్కడ ఉన్నాయా లేదా పరిశీలించాలి. అదే విధంగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మానభంగానికి గురైన వ్యక్తులని కూడా కొన్ని సందర్భాలలో నేరస్థలంలోనే విచారించాల్సి రావచ్చు. అది వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించి కోడ్‌లోని సె.157 క్రింద ప్రొవిసోని ఏర్పాటు చేశారు. మానభంగానికి గురైన బాధితురాలి వాంగ్మూలాన్ని ఆమె ఇంటి దగ్గర గానీ లేదా ఆమె ఎంపిక చేసుకున్న స్థలంలో గానీ నమోదు చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆమె వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి ఆ బాధితురాలి సంరక్షకుల సమక్షంలో లేదా తల్లిదండ్రుల సమక్షంలో లేదా బందువుల సమక్షంలో లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన సాంఘిక సేవా కార్యకర్త సమక్షంలో నమోదు చేయాల్సి ఉంటుంది.

పిల్లలపైన జరిగిన లైంగిక దాడుల కేసులు, మానభంగానికి సంబంధించిన కేసుల దర్యాప్తు నిర్దేశించిన కాల పరిమితిలోగా జరగాలి. ఈ విధంగా సె. 173 (ఐఎ) నిబంధనను ఏర్పరిచారు. ఈ నిబంధన ప్రకారం ఆ నేర సమాచారం నమోదు చేసిన తేదీ నుంచి 3 నెలల్లోగా ఈ దర్యాప్తులను పోలీసు అధికారులు తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ నేరాల విచారణను సాధ్యమైనంతవరకు మహిళా న్యాయమూర్తులు, మహిళా మేజిస్ట్రేట్‌లు జరపాలి. అంతే కాదు, ఈ నేరాల విచారణ గోప్యంగా జరపాల్సి ఉంటుంది. ఈ నేరాలకి సంబంధించిన సమాచారాన్ని పత్రికల్లో ప్రచురించవచ్చు కానీ బాధితురాలి చిరునామా వివరాలు రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది.

బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో సె.357 నిబంధన ఉంది. ఈ నిబంధన బాధితుల అవసరాలని పూర్తిగా తీర్చడం లేదు. ఈ విషయాన్ని గమనించి చట్టంలో సె.357(డి) అన్న కొత్త నిబంధనను చేర్చారు. సె.357 ప్రకారం ముద్దాయిల నుంచి మాత్రమే నష్టపరిహారాలను కోర్టులు మంజూరు చేసేవి. ముద్దాయిల ఆర్థిక స్తోమత బాగులేకపోతే బాధితులకు కోర్టు మంజూరు చేసిన నష్టపరిహారం లభించక పొయేది. ఈ కొత్త నిబంధన ఆ పరిస్థితిని అధిగమిస్తుంది.

అదే విధంగా ముద్దాయికి శిక్ష పడినప్పుడు మాత్రమే కోర్టులు నష్టపరిహారం చెల్లించమని ముద్దాయిని ఆదేశించే పరిస్థితి ఉంది. సె.357(ఎ) ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ఓ స్కీమును తయారు చెయ్యాలి. నేర బాధితుల, వారిపై ఆధారపడ్డ వ్యక్తులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి, వారికి పునరావాసం కల్పించే విధంగా ఈ స్కీముని తయారు చెయ్యాలి. కోర్టులో నేర విచారణ పూర్తి అయిన తరువాత నేర బాధితుల పునరావాసానికి అవసరమైన నష్టపరిహారాన్ని కోర్టు సె.357 ప్రకారం చెల్లించమని ఆదేశించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ విధంగా ఆదేశించిన మొత్తం బాధితుల పునరావాసానికి సరిపోదని కోర్టు భావించినప్పుడు వాళ్ళకి తగిన నష్టపరిహారం చెల్లించమని సిఫారసు చేసే అవకాశం ఉంది.

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఈ సిఫారసులను పరిశీలించి అవసరమైన నష్టపరిహార మొత్తాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ నిర్ధారించిన మొత్తాన్ని ఈ స్కీమ్‌ ద్వారా ఏర్పరిచిన మొత్తం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. నేర విచారణ జరగనప్పుడు కూడా బాధితులు ఈ స్కీము ద్వారా నష్టపరిహారాలని కోరే అవకాశం ఉంది.సె.372కి కూడా ఒక ప్రొవిసోని ఏర్పరిచారు. ఈ ప్రొవిసో ప్రకారం బాధితులు అప్పీలు చేసే అవకాశం ఉంది. ముద్దాయిని విడుదలచేసినప్పుడు, తక్కువ శిక్ష పడినప్పుడు ఈ ప్రొవిసో ఉపయోగపడుతుంది. సవరణలు తీసుకొచ్చిన చట్టం అమల్లోకి రాకపోవడం వల్ల ఈ నిబంధనలు కూడా అమల్లోకి రాకుండా పోతున్నాయి. ఫలితంగా నేర బాధితులు నష్టపోతున్నారు. కనీసం ఈ నిబంధనల అమలు గురించి ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుండేది.

Monday, June 22, 2009

mba-online-program.com
Counter provided by mba-online-program.com .

బ్లాగ్‌లు - లీగల్‌ సమస్యలు


బ్లాగ్‌లు - లీగల్‌ సమస్యలు



ఒక విషయాన్ని తెలియచెప్పడం అనేది ఒక కళ. ఒకే విషయాన్ని కొంతమంది చాలా అందంగా, ఆకర్షించేట్టు చెబుతారు. మరి కొందరు ఆ విధంగా చెప్పలేకపోతారు. సాంకేతికంగా అభివృద్ధి చెందిన తరువాత కమ్యూనికేషన్‌ చాలా వృద్ధి చెందింది. అచ్చు యంత్రం వచ్చిన తరువాత ఇది అభివృద్ధిలోకి వచ్చింది. ఇంటర్‌నెట్‌ యుగంలో కమ్యూనికేషన్‌ ప్రాధాన్యతని సంతరించుకుంది.

ఈ ఇంటర్‌నెట్‌ యుగంలో ‘బ్లాగులు’ వచ్చేశాయి. కొంత బ్లా గుల్లో రాసుకున్న సమాచారాన్ని పుస్తకాలుగా వెలువరిస్తున్నారు. ఓ యువతి తన బ్లాగ్‌లో రాసిన నవల ఇంగ్లీషులో వచ్చి చాలా ప్రాచుర్యాన్ని పొందింది. కొన్ని బ్లాగ్‌లు సమాచారాన్ని ఇస్తున్నార ుు. మరికొన్ని బ్లాగ్‌లు చర్చావేదికలుగా ఉంటున్నాయి. చాలా మంది ప్రముఖులు కూడా బ్లాగులని నిర్వహిస్తున్నారు. కొన్ని బ్లా గులని చాలా మంది చదువుతున్నారు. కొన్ని బ్లాగ్‌ల చర్చా వేదికల్లో కొందరు పాల్గొని తమ అభిప్రాయాలని వ్యక్తపరుస్తున్నారు. ఈ బ్లాగ్‌ల్లో అభ్యంతరకరమైన విషయాలు ఉంటే ఎవరిపైన చర్య తీసుకోవాల్సి ఉంటుం ది. వారి పైన పరువు నష్టం కలిగించినారని సివిల్‌, క్రిమినల్‌ కేసులు దాఖలు చేయడానికి అవకాశం ఉందా? డి.అజిత్‌ అనే వ్యక్తిపైన శివసేన కార్యకర్తలు ముంబైలో క్రిమినల్‌ కేసుని దాఖలు చేశారు. తన పై దాఖలైన ప్రథమ సమాచార నివేదికను రద్దు చేయాలని అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళి విఫలమైనాడు. ఈ నేపథ్యంలో బ్లాగుల గురించి, చట్టపరమైన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టపరమైన విషయాలు తెలుసుకునే ముందు బ్లాగ్‌ అనే పదబందం ఎట్లా అమల్లోకి వచ్చిందో చూద్దాం. వెబ్‌(ఠ్ఛీఛ), లాగ్‌(జూౌ) అన్న రెండు పదాల నుంచి బ్లాగ్‌ అన్న పదబందం వాడుకలోకి వచ్చింది.

బ్లాగ్‌ అంటే ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉన్న ‘అంతర్జాల డైరి’. ప్రజల అభిప్రాయాలని అంతర్జాల పేజీలలో తెలియచేసే అవకాశం ఉన్న స్థలం. తమ వ్యక్తిగత అభిప్రాయాలని బ్లాగ్‌ల్లో వ్యక్తపరచవచ్చు. లేదా సమకాలీన సమస్యల మీద సంఘటనల మీద తమ అభిప్రాయాలని బ్లాగ్‌ల్లో వ్యక్త పరచవచ్చు. ఆ క్షణంలో జరుగుతున్న సంఘటనల మీద కూడా అప్పటికప్పుడు తమ అభిప్రాయాలని వ్యక్తపరచడానికి అవకాశం ఉన్న స్థలం, సాధనం బ్లాగ్‌. బ్లాగ్‌ను సంపాదించడం చాలా సులువు. బ్లాగ్‌ను ఏ విధంగా తయారుచేసుకోవచ్చోనన్న విషయం అంతర్జాలంతో ఏ మాత్రం సంబంధం ఉన్న వ్యక్తి అయినా సులువుగా తెలుసుకోవచ్చు. తమ వ్యక్తిగత సమాచారాన్ని కొంతమేరకే తెలియపరిచి బ్లాగ్‌లను సృష్టించుకునే అవకాశం ఉంది. ఈ బ్లాగ్‌లకి అవసరమైన స్థలాన్ని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ వాడుకందార్లకి ఉచితంగా అందచేస్తున్నాయి. ఈ స్థలానికి వాళ్ళు ఎలాంటి డబ్బులని కూడా తీసుకోవడం లేదు.

ఇంత సులువుగా, ఎలాంటి ఖర్చు లేకుండా సంపాదించుకునే ఈ స్థలానికి ప్రచురణ కర్త ఎవరు? బ్లాగ్‌లలో పరువునష్టం కలిగించే రాతలని, మీద విద్వేషాలని కలిగించే రాతలని, అసభ్యకరమైన బొమ్మలని ప్రచురిస్తే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుంది? దీని బాధ్యత ఆ బ్లాగ్‌ని నిర్వహిస్తున్న వ్యక్తిపై ఉంటుం దా? ఆ స్థలాన్ని సమకూర్చిన ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌పై ఉంటుందా? ఆ సమాచారాన్ని అందులో ఉంచిన వ్యక్తిపై ఉంటుందా? ఈ ముగ్గురిపై ఉంటుందా? ఇవీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి మన దేశంలో సరైన సమాధానం లేదు. దానికి కారణం- వీటిని నియంత్రించడానికి అవసరమైన శాసనం ఇంకా మన దేశంలో లేదు.

బ్లాగ్‌లో కన్పించే అసభ్యకరమైన పదాలని బొమ్మలని తొలగించడానికి వడబోత యంత్రాంగం ఉంది. కానీ ఆ వడబోత ‘స్పామ్‌’ (టఞ్చఝ)లు అన్నింటిని తీసివేయలేవు. పరువు నష్టానికి సంబం ధించిన విషయాలు సందర్భాన్ని బట్టి మాత్రమే అర్థమవుతాయి. ఇది ఒక రకంగా ఉంటే కొన్ని బ్లాగుల్లోని పరిస్థితులు మరోరకం గా ఉంటాయి. కొన్ని బ్లాగ్‌లు చర్చలని, అభిప్రాయాలని చదువరు ల నుంచి తీసుకుంటాయి.వాటిల్లో ఏవైనా అభ్యంతరకరమైన విషయాలు ఉంటే బ్లాగ్‌ యజమాని దానికి బాధ్యత వహించాల్సి ఉం టుందా? అజిత్‌ విషయంలో అదే జరిగింది.

శివసేన అజిత్‌పైన క్రిమినల్‌ కేసుని దాఖలు చేసింది. మతపరమైన భావాలని భంగ పరుస్తున్నాడని, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడని ముంబైలోని పోలీస్‌ స్టేషన్లో అతనిపై ఫిర్యాదుని నమోదు చేసింది. తనపై దాఖలైన ప్రథమ సమాచార నివేదికను రద్దు చేయమని అతను సుప్రీంకోర్టులో రిట్‌ పిటీషన్ని దాఖలు చే శాడు. సుప్రీంకోర్టు అజిత్‌పైన దాఖలైన కేసుని కొట్టివేయలేదు. అంతర్జాలంలోని తన బ్లాగ్‌లో ఉన్న సమాచారం ప్రపంచ వ్యాప్తం గా ఎంతోమందికి చేరుతుంది. అందుకని అందులో ఏవైనా అ భ్యంతర విషయాలు ఉంటే దాని పరిణామాలని అతను ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. అంటే బ్లాగ్‌కి కూడా పరిమితులు ఉన్నాయి. రాజ్యాంగం ప్రసాదిం చిన భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. కానీ దానికి పరిమితులు ఉన్నా యి. ఆ పరిమితులకి లోబడే బ్లాగ్‌లో విషయాలు ఉండాలి. వార్తాపత్రికలకి, ఎలక్ట్రానిక్‌ మీడియాకి ఉండే పరిమితులు బ్లాగ్‌కి కూడా ఉన్నాయి.

అజిత్‌పైన కేసు 2008 ఆగస్టులో దాఖలైంది. అంటే ఐ.టి.చట్టానికి సవరణలు తీసుకొని రాకముందు ఈ కేసు దాఖలైంది. సవరణలు తీసుకొచ్చిన ఐ.టి. చట్టప్రకారం- బ్లాగ్‌ని నిర్వహిస్తు న్న వ్యక్తి ఆ బ్లాగ్లో ఇతరులు రాసిన వ్యాఖ్యలకి, వాఖ్యానాలకి బాధ్య త వహించడు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయని ఎవరైనా చెప్పినప్పుడు ఆ వ్యాఖ్యాలని అందులో నుంచి తొలగించనప్పుడు మా త్రమే అతను బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదే విధంగా ఆ వ్యాఖ్యాలు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవి కాదని అనుకున్నప్పుడు కూడా బ్లాగ్‌ యజమాని ఆ వ్యాఖ్యాలకి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అజిత్‌ బ్లాగ్‌లో వ్యక్త పరిచిన అభ్యంతరకర విషయాలు అతనివి కాదు. ఇతరులు వ్యక్త పరిచినవి. అయితే అతను ఆ బ్లాగ్‌కి కర్త. ఐ.టి. చట్టానికి సవరణలు రాకముందు జరిగిన సంఘటన అది. బాజి.కామ్‌ కేసు ఫలితంగా ఐ.టి. చట్టానికి సవరణలని తీసుకొచ్చింది ప్రభుత్వం. అంటే ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా చట్టాల్లో సవరణలు వస్తున్నాయని భావించడానికి ఇది ఒక ఉదాహరణ.
ఈ సవరణలు కూడా అజిత్‌ రక్షణకి వస్తాయని ఆశించవచ్చు.

Saturday, June 13, 2009

సార్వ భౌమ మినహాయింపు ఎప్పుడు వర్తించదు?
ఈప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు భంగం వాటిల్లిందని చెప్పడంతో కోర్టు బాధ్యత తీరిపోదు. నష్ట పరిహారాన్ని బాధితులకు చెల్లించాలి. అయితే, ఈ నష్ట పరిహారం కూడా సివిల్‌ చర్యల్లో భాగం కాకుండా, వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినందుకు గాను పబ్లిక్‌ లా ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. జరిగిన తప్పుకు- జరిగిన గాయానికి శాసన ప్రకారం నష్ట పరిహారం ఇవ్వడమే కోర్టులు ఇచ్చే క్లేశ నివారణ చర్య. ఇలాంటి విషయాల్లో ‘సార్వభౌమ మినహాయింపు’ వర్తిం చదు. మోటారు వాహన ప్రమాదాలు రిగినప్పుడు కూడా ప్రభుత్వాలకు సార్వభౌమ మినహాయింపు వర్తించదు. సుప్రీం కోర్టు ఈ విషయాన్ని చాలా కేసుల్లో స్పష్టం చేసినప్పటికీ చాలా ప్రభుత్వాలు ఈ మినహాయింపును కోరుతుంటాయి. కస్తూరీ లాల్‌ కేసులో ‘సార్వభౌమ మినహాయింపు’ గురించి చర్చ జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న సార్వభౌమ మిన హాయింపు అనేది రాజ్యం సేవకులు చేసిన సివిల్‌ నేరాలకు మాత్ర మే వర్తిస్తుంది. అది ఏమీ రక్షణ కూడా కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు 32, 226 ప్రకారం నష్టపరిహారం ఇమ్మని కోర్టులు ఆదేశించవచ్చు. ఈ రెండింటికి మధ్య ఉన్న భేదం అదే. కస్తూరీ లాల్‌ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు అతని వస్తువులు జప్తు చేసి తమ తప్పు వల్ల తిరిగి ఇవ్వలేదు. అది సివిల్‌ తప్పిదానికి కోరిన నష్టపరిహారం. అంతే కానీ ప్రాధమిక హక్కులకు భంగం వాటిల్లినందుకు కోరిన నష్ట పరిహారం కాదు. అందుకని కస్తూరీలాల్‌ కేసులోని తీర్పు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వర్తించదు.తమ సేవకుల వల్ల వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినట్లైతే రాజ్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాజ్యాంగం అభయం ఇచ్చిన వ్యక్తి జీవితం, స్వేచ్ఛలను రాజ్యాంగ వ్యతిరేకం గా కాలరాచినప్పుడు, పబ్లిక్‌ లా ప్రకారం నష్టపరిహారాన్ని కోరవచ్చు. ప్రైవేట్‌ లా ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల తప్పిదాలకు కోరే నష్ట పరిహారానికి అదనంగా ఈ నష్టపరిహారాన్ని కోరవచ్చు. ప్రైవేట్‌ లా ప్రొసీడింగ్స్‌కు భిన్నంగా పబ్లిక్‌ లా ప్రొసీడింగ్స్‌ను నిర్దేశించారు. రాజ్యాంగం అభయం ఇచ్చిన ఆర్టికల్‌ 21 లోని అజేయమైన హక్కులకు భంగం వాటిల్లినప్పుడు పబ్లిక్‌ లా ప్రకారం నష్టపరిహారాన్ని కోరవచ్చు. అందువల్ల దేశ పౌరులకు తమ హక్కులను, ప్రయోజనాలను రక్షించే న్యాయ వ్యవస్థ ఉందన్న విశ్వాసం కలుగుతుంది. ప్రాథమిక హక్కులకి రక్షణ కల్పించడంలో విఫలమైన రాజ్యాన్ని బాధ్యత వహించేలా చేసి కోర్టులు ఆర్టికల్‌ 32 లేక 226 ప్రకారం నష్టపరిహారాన్ని మంజూరు చేస్తున్నాయి. సివిల్‌ లా పరిధిలో ఉపశమనాల్ని ఇచ్చే పాత పద్ధతి వల్ల, కోర్టుల పరిధిని తగ్గించడమే అవుతుంది. ప్రజల సాంఘిక ఆకాంక్షల్ని కోర్టులు, చట్టాలు సంతృప్తి పరచాల్సిన బాధ్యత వాటిపై ఉంది. ఈ వాస్తవాలకు దూరంగా కోర్టులు ఉండటానికి వీల్లేదు. ముద్దాయిని శిక్షించడం వల్ల కావలసినంత ఊరడింపు బాధితుల కుటుంబాలకు దొరకదు.సివిల్‌ చర్యల వల్ల నష్టపరిహారం పొందడం కష్టమైన పని. డబ్బు రూపేణా నష్టపరిహారం ఇవ్వడం వల్ల కొంతవరకైనా బాధితులకు, వారి కుటుంబాలకు ఉపయోగం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే, వాళ్ళ గాయాలని మాన్పే బలమైన ఉపశమనం ఇదే. నీలాబతి బెహవా కేసులో సుప్రీంకోర్టు సేవకుల తప్పిదాలకు రాజ్యం బాధ్యత వహించే విషయంలో తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెలిబుచ్చింది-ప్రభుత్వ ఉద్యోగుల తప్పిదాల వల్ల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వాళ్ళు సివిల్‌ కోర్టుల్లో కేసులు దాఖలు చేసుకోవచ్చు. అయితే సివిల్‌ కోర్టులకే వెళ్ళాలని హైకోర్టులు రిట్‌ పిటీషన్లలో అనడానికి వీల్లేదు. ఆ విధంగా ఉపశమనం పొందే అవకాశం ఉన్నప్పుటికీ పబ్లిక్‌ లా ప్రకారం ఎలాంటి నష్టపరిహారం రాదు అని కోర్టులు అనడం సరైంది కాదు.ఇది ఇలా ఉంటే, సివిల్‌ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసుల్లో కూడా చాలా ప్రభుత్వాలు ‘సార్వభౌమ మినహాయింపు’ను కోరుతుంటాయి. ఈ సిద్ధాంతానికి సుప్రీంకోర్టు ఎన్నడో తెర దించేసింది. అయినప్పటికీ చాలా ప్రభుత్వాలు ఈ మినహాయింపును కోరుతున్నా యి. మోటారు వాహన ప్రమాదాల కేసుల్లో కూడా చాలా ప్రభుత్వాలు ఈ మినహాయింపును కోరుతున్నాయి. ఈ మినహాయింపు వర్తించదని సుప్రీంకోర్టు పుష్పా టాకూర్‌ కేసులో స్పష్టం చేసింది.పుష్పా టాకూర్‌ కేసులోని విషయాలకు వస్తే- మిలిటరీ ట్రక్కు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల ఓ మోటారు వాహన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి రెండు కాళ్లు విరిగిపోయినాయి. కుడి కాలిని తీసివేయాల్సి వచ్చింది. బాధితుడు మోటారు వాహన చట్ట ప్రకారం నష్టపరిహారం కోరాడు. ట్రిబ్యునల్‌ అతని క్లయిమ్‌ను విచారించింది. ప్రమాదానికి కారణం ఆ వాహన డ్రైవరేనన్న నిర్ణయానికి వచ్చింది. కానీ ఆ ట్రక్కు కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిఫెన్స్‌ బలగాలకు సంబంధించినది కాబట్టి సార్యభౌమ మినహాయింపు అనేది ఉంటుందన్న కారణంగా నష్టపరిహారాన్ని మంజూ రు చేయలేదు.బాధితుడు హైకోర్టుకి అప్పీలు చేశాడు. హైకోర్టు కూడా ట్రిబ్యునల్‌ అభిప్రాయాన్నే బలపరిచింది. అందుకని అతను సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు.తన సేవకులు చేసిన పనులకి రాజ్యం బాధ్య వహించదన్న సూ త్రం పాతబడిపోయిందని, సార్వభౌమ మినహాయింపు వర్తించదని హైకోర్టు తప్పు తీర్పు ప్రకటించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం విషయంలో ఎలాంటి వివాదం లేదు. అందుకని ప్రభుత్వం అతని తప్పుకి బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. క్ష రూపాయలను నష్టపరిహార మొత్తంగా సుప్రీంకోర్టు నిర్ధారించి హైకోర్టు తీర్పుని కొట్టివేసింది.తన సేవకులు చేసిన తప్పిదం వల్ల వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే రాజ్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో సివిల్‌ కేసుల ద్వారా కాకుండా రిట్‌ల ద్వారా కూడా కోర్టులు నష్ట పరిహారాలను మంజూరు చేయవచ్చు.

Followers