Friday, April 24, 2009

గృహహింస కేసులు రక్షణాధికారుల పాత్ర

రక్షణాధికారులు మేజిస్ట్రేట్‌ పర్యవేక్షణలో, నియంత్రణలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. అదే విధంగా ప్రభుత్వ నియంత్రణలో చట్టానికి లోబడి పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములను అమలు చేసే దిశగా దృష్టి సారించాలా, లేక కోర్టు ఉత్తర్వుల అమలు కోసం దృష్టి సారించాలా అన్న మీ మాంసకు రక్షణాధికారులు గురయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్లకు అర్థంకాని పరిస్థితి. చట్టం అమలులో ఏవైనా లోపాలుంటే కోర్టు ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. గృహహింస సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బాధితులకు సహాయం అందించడానికి ప్రభుత్వం రక్షణాధికారులను నియమించింది. బాధితులు రక్షణాధికారుల దగ్గరికే కాకుండా సేవా సంస్థల దగ్గరికి, పోలీసుల దగ్గరిి, మేజిస్ట్రేట్‌ దగ్గరికి కూడా వెళ్ళవచ్చు. అయితే రక్షణాధికారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. రక్షణాధికారి పాత్రను రెండు దశలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది.

వివాదానికి ముందు రక్షణాధికారి బాధితురాలికి సహాయం చేయాల్సి ఉంటుంది. వివాదం తర్వాత కోర్టు ఉత్తర్వులు అమలు అయ్యేటట్టు చూడాలి. అంటే ఈ దశలో రక్షణాధికారి బాధితురాలికి, కోర్టుకి తన సహాయాన్ని అందిస్తారన్న మాట. వివాదానికి ముందు రక్షణాధికారి నిర్వహించే పాత్రలో ఇవి ఉంటాయి. గృహహింస ఫిర్యాదులను స్వీకరించడం. గృహహింస నిరోధించే విధంగా చర్యలు తీసుకోవడం లేదా అత్యవసర చర్యలను చేపట్టడం. బాధితురాలికి న్యాయసేవలను, ఇతర సహాయక సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా రక్షణాధికారి చూడాలి.

వివాదం తర్వాత రక్షణాధికారి చాలా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి- నోటీసులను ప్రతివాదులకు అందించటం, అవసరమైన విచారణలను జరపడం, కోర్టు ఉత్తర్వులకు సహాయాన్ని అందించడం. గృహహింస చట్ట ప్రకారం మూడు విధాలుగా ఉపశమనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గృహహింస సంఘటన నివేదిక అనేది తొలి దశ. దీన్ని రక్షణాధికారి గాని లేదా సేవాసంస్థ గాని తయారు చేస్తారు. ఫారం నెం.1 ప్రకారం దీన్ని తయారు చేయాలి. ఇది పబ్లిక్‌ డాక్యుమెంట్‌. దీన్ని పూర్తి చేసినప్పుడు రక్షణాధికారి, సేవాసంస్థలను ప్రభుత్వ ఉద్యోగులుగా భావించవలసి ఉంటుంది. చట్ట పరమైన చర్యలు తీసుకొన్నా, తీసుకోకపోయినా గృహహింస సంఘటన నివేదికను సంబంధిత మేజిస్ట్రేట్‌కు పంపించాలి. ఉత్తర్వులు జారీ చేసే ముందు గృహహింస సంఘటన నివేదిక లేకుండా కూడా బాధితురాలు నేరుగా ఉపశమానాల కోసం మేజిస్ట్రేట్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.

గృహహింస చట్ట ప్రకారం బాధితురాలు పలు విధాలుగా రక్షణాధికారిని సంప్రదించే అవకాశం ఉంది. నేరుగా సంప్రదించవచ్చు. సేవా సంస్థలు పంపించడం ద్వారా సంప్రదించవచ్చు. పోలీసులు పంపించడం ద్వారా సంప్రదించ వచ్చు. కోర్టు పంపించడం ద్వారా సంప్రదించవచ్చు. చాలా కేసుల్లో బాధితులు నేరుగా రక్షణాధికారిని సంప్రదిస్తున్నారు. అందుకు కారణం గృహహింస చట్టం గురించి బాగా ప్రచారం జరగడం. బాధితురాలు నేరుగా గాని, ఎవరైనా పంపడం ద్వారా కాని రక్షణాధికారిని కలిసినప్పుడు ఆమె ఫిర్యాదు ప్రకారం చట్టం నిర్దేశించిన ప్రకారం గృహహింస సంఘటన నివేదికను తయారు చేయాలి. ఆమెను వైద్య పరీక్షలకు పంపించినప్పుడు ఆ నివేదికను కూడా దీనితో పాటు జతచేయాలి.

వివాదానికి ముందు రక్షణాధికారిని కౌన్సిలింగ్‌ చేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అయితే తన అధికార పరిధిలో ఉన్న కౌన్సిలర్ల వివరాలను సేకరించి పెట్టుకోవాల్సిన బాధ్యత రక్షణాధికారిపై ఉంటుంది. పార్టీల మధ్య కౌన్సిలింగ్‌ చేసే వ్యక్తులకు అనుభవం, నేర్పు ఉండాలి. వివాదం తర్వాత మాత్రమే పార్టీలని కౌన్సిలింగ్‌కు పంెపే విధానాన్ని చట్టంలో పొందుపరిచారు. కాని వివాదానికి ముందు కౌన్సిలింగ్‌ విషయంలో చట్టం మౌనంగా ఉంది. వివాదానికి ముందు రక్షణాధికారులు కౌన్సిలింగ్‌ చేయకూడదన్న నిషేధాన్ని కూడా చట్టంలో ఏర్పరచలేదు. ఈ కారణంగా రక్షణాధికారులు పార్టీలకు కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తున్నారు. అందువల్ల చిన్నచిన్న పొర పొచ్చాలు తొలగిపోయే అవకాశం ఉంది.

గృహహింస చట్టంలోని సె-9, నియమం-10 ప్రకారం దరఖాస్తు దాఖలైన తర్వాత రక్షణాధికారి తన బాధ్యతలను కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం కొన్ని సందర్భాలలో క్రిమినల్‌ ప్రొసిజర్‌ను మరికొన్ని సందర్భాలలో సివిల్‌ ప్రొసిజరను పాటించాల్సి ఉంటుంది. కోర్టులో అప్లికేషన్‌ దాఖలైన తర్వాత కోర్టు ప్రొసిడింగ్స్‌ ఈ విధంగా ఉంటాయి- ప్రతివాదిపై నోటీసును జారీ చేయ్యాలి. నోటీసు అందుకున్న తర్వాత ప్రతివాది కోర్టు ముందు హాజరై తన జవాబును ఇవ్వాలి. కొన్ని సందర్భాలలో కోర్టు డాక్యుమెంట్లు ఆధారంగా ఉన్నప్పుడు ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయవచ్చు. పార్టీల గృహాలని సందర్శించమని రక్షణాధికారిని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే ముందు ఆదేశించవచ్చు. కేసును విచారిస్తున్నప్పుడు కోర్టు సాధ్యమైనంత వరకు క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని సె-125 దరఖాస్తును పరిష్కరించే క్రమంలో అవలబించే పద్ధతులను ఇక్కడ కూడా అవలంబించాలని సె-28, నియమం-6(5) చెబుతోంది. సె-28(2) ప్రకారం అవసరమైనప్పుడు కోర్టు తనకు తోచిన పద్ధతిని కూడా అవలంబించే అవకాశం ఉంది.

కోర్టులో ప్రొసిజర్‌ మొదలైన తర్వాత ప్రతివాదికి కోర్టు నోటీసును జారీ చేస్తుంది. కోర్టు ముందు అతని హాజరు అవసరం. ఎందుకంటే అతను ఫిర్యాదులోని అంశాలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. సివిల్‌ కేసుల్లో కోర్టు సిబ్బంది నోటీసులను ప్రతివాదులకు అందచేస్తారు. క్రిమినల్‌ కేసుల్లో పోలీసులు అందచేస్తారు. గృహహింస చట్టం ప్రకారం నోటీసును ప్రతివాదికి అందించే బాధ్యత రక్షణాధికారిపై ఉంది. నియమం-12లో ఈ విషయాన్ని చెప్పారు. నోటీసును అందచేసిన విషయం గురించిన ప్రకటనను రక్షణాధికారి కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. సివిల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని అర్డర్‌-5లోని విషయాలు. క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని అధ్యాయం-6లోని విషయాలు కలిపి నియమం-12ను రూపొందించాయి. ఈ నియమం ప్రకారం ఈ విధంగా నోటీసును జారీచేయవచ్చు- ప్రతివాది ఎక్కడైతే నివసిస్తున్నాడో, లేదా ఎక్కడైతే పని చేస్తున్నాడో అక్కడ అతనికి నోటీసును జారీ చేయవచ్చు. నోటీసును స్వీకరించడానికి ప్రతివాది నిరాకరించినప్పుడు, లేదా ఎదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ నోటీసును ఆ పనిచేసే స్థలంలోని ఇన్‌చార్జికి అందచేయవచ్చు, లేదా ఆ స్థలంలో ప్రముఖమైన ప్రదేశంలో నోటీసును అతికించవచ్చు.

రక్షణాధికారే స్వయంగా నోటీసును అందచేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. నియమం-12(2) ప్రకారం నోటీసును అందచేసే బాధ్యతను ఇతరులకు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కోర్టు కూడా ఇతరుల ద్వారా నోటీసును జారీ చేయించ వచ్చు. రక్షణాధికారి స్వయంగా నోటీసు అందచేయవచ్చు. ఇతర ఏజెన్సీల ద్వారా నోటీసును రక్షణాధికారి అందేట్టు చేయవచ్చు. కోర్టుల్లో ఉన్న ప్రాసెస్‌ సర్వర్ల ద్వారా నోటీసును అందించవచ్చు. పోలీసుల ద్వారా నోటీసులను అందించవచ్చు. నోటీసు జారీ అయిన తర్వాత కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు రక్షణాధికారి కృషి చేయాల్సి ఉంటుంది. ఏక పక్ష మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి రక్షణాధికారి గృహాన్ని సందర్శించి నివేదికను అందించవచ్చు. ప్రతివాది ఆర్థిక హోదా గురించి అవసరమైన విచారణ జరిపి నివేదికను ఇవ్వవచ్చు. ఇవి కాకుండా మేజిస్ట్రేట్‌ అప్పగించిన ఇతర బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. గృహహింస చట్ట ప్రకారం విచారణ తేదీల్లో తప్పకుండా రక్షణాధికారి హాజరు ఉండాలన్న నియమం లేదు కాని ప్రొసిడింగ్స్‌ వివరాలను తెలుసుకొని కోర్టుకు తన సహాయాన్ని అందించడం అత్యంత అవసరం.

గృహహింస చట్టంలోని సె-23(2) ప్రకారం మధ్యంతర ఏకపక్ష ఉత్తర్వులను మేజిస్ట్రేట్‌ సె-18,19,20,21 లేదా 22లను అన్వయిస్తూ జారీ చేయవచ్చు. అయితే నియమం -10 (1)(ఎ) ప్రకారం గృహాన్ని సందర్శించి నివేదికను సమర్పించమని మేజిస్ట్రేట్‌ రక్షణాధికారిని కోరవచ్చు. ఈ ఒక్క సందర్భంలోనే గృహాన్ని సందర్శించే అధికారం రక్షణాధికారికి ఉంటుంది. మేజిస్ట్రేట్‌ కోరిన పద్ధతుల్లోనే ఈ విచారణని జరపాల్సి ఉంటుంది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత రక్షణాధికారిపై ఉంటుంది. ఇందుకు అవసరమైన సహాయాన్ని కోర్టుకు అందించాలి. అవసరమైనప్పుడు పోలీసుల సహాయాన్ని మేజిస్ట్రేట్‌ కల్పించవచ్చు.
సె-9(2) ప్రకారం రక్షణాధికారులు మేజిస్ట్రేట్‌ పర్యవేక్షణలో, నియంత్రణలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. అదే విధంగా ప్రభుత్వ నియంత్రణలో చట్టానికి లోబడి పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములను అమలు చేసే దిశగా దృష్టి సారించాలా, లేక కోర్టు ఉత్తర్వుల అమలు కోసం దృష్టి సారించాలా అన్న మీ మాంసకు రక్షణాధికారులు గురయ్యే అవకాశంఉంది. ఈ రెండిం టిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్లకు అర్థం కాని పరిస్థితి. చట్టం అమలులో ఏవైనా లోపాలుంటే కోర్టు ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. అదే విధం గా ప్రభుత్వ స్కీముల అమల్లో లోపాలుంటే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో రక్షణాధికారులు పని చేస్తున్నారు.

రచయిత నిజామాబాద్‌ జిల్లా
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

Friday, April 17, 2009

వైద్య ఖర్చులు మనోవర్తిలో భాగమే

భార్య వైద్యం కోసం అయిన ఖర్చు కూడా మనోవర్తిలో భాగమే. ఇది పురోగతి ఉన్న తీర్పు. వైద్య ఖర్చులను భార్య భర్త నుంచి పొందవచ్చు. వైద్యం ఖర్చులను కూడా భర్త చెల్లించవలసి ఉంటుందా?

మనోవర్తి అన్న నిర్వచనంలో వైద్యం ఖర్చులు కూడా ఉంటాయా? మనోవర్తి (మెయింటైనెన్స్‌), చేయూత (సపోర్ట్‌) అన్న పదాలలో వైద్యఖర్చులు కూడా ఉంటాయా? భార్య, ఆమె వైద్యానికి పెట్టుకొన్న ఖర్చులను భర్త తిరిగి చెల్లించవలసి ఉంటుందా? ఈ ప్రశ్నలు రాజేశ్‌ బర్మన్‌ వర్సెస్‌ మిధుల్‌ ఛటర్జీ 2008 (14) స్కేల్‌ 372 కేసులో సుప్రీం కోర్టు ముందు తలెత్తినాయి.

మనోవర్తి, చేయూత అన్న పదాల్లో జీవనం, ఆహారం, దుస్తులు, నివాసం, వినోదం, ఆరోగ్యం, సరైన రక్షణ, నర్సింగ్‌, ఆరోగ్యం బాగోలేనప్పుడు వైద్యసహాయం లాంటివన్నీ ఇమిడి ఉన్నాయని సుప్రీంకోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది. మనోవర్తిలో భాగంగా భార్య వైద్యం కోసం అయిన ఖర్చులను తిరిగి పొందే అవకాశం ఉందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. కేసులోని విషయాలకు వస్తే, రాజేశ్‌ బర్మన్‌కి మిధుల్‌ చటర్జీకి మధ్య వివాహం 2000 జనవరి 26న కొల్‌కతాలో జరిగింది. వివాహం తరువాత మిధుల్‌ ముంబాయికి వచ్చి భర్తతో నివసించడం మొదలు పెట్టింది. వివాహమైన సంవత్సరం తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. చివరికి పోలీసు స్టేషన్‌కు, కోర్టులకు వెళ్ళారు.

2001 జూన్‌ 16న ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి 9.20 గంటల వరకు ఉండిపోవాల్సి వచ్చిందని, సమయానికి ఇంటికి రానందుకు కోపగించుకొన్న భార్య ఆఫీసుకి వచ్చి గొడవ చేసి వెళ్ళిందని, రాత్రి 1.30 గంటల ప్రాంతంలో తాను ఇంటికి వెళ్ళానని, తన భార్య అందరి ముందు కోపంతో ఊగిపోయి తిట్ల పురాణం అందుకొందని, ఆమె కోపం చల్లారకపోవడంతో తాను బయటకు వెడుతుంటే తనని ఆపే ప్రయత్నంలో మెట్లమీంచి జారి పడిందని అందువల్ల ఆమెకు ఎడమ చెయ్యి విరిగిందని రాజేశ్‌ తన జవాబులో పేర్కొన్నాడు.

తనని బెదిరించి హింసించినారని, తనను కొట్టడం వల్ల తన చెయ్యి విరిగిందని చటర్జీ వాదన. ఈ సంఘటన జరిగిన తర్వాత పది రోజులకు 2001 జూన్‌ 26వ తేదీన చటర్జీ పోలీసుకు ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సె.498 ఎ, సె.325, 406, 506 ప్రకారం కేసు నమోదు చేసి రాజేశ్‌ని, అతని తల్లిని అరెస్టు చేశారు. ఈ క్రిమినల్‌ కేసును రద్దు చేయాలని రాజేశ్‌ హై కోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకొన్నాడు.

ఇది ఇలా ఉండగా, మిధుల్‌ చటర్జీకి 2001 జూన్‌ 19 నాడు, 2002 మే2వ తేదీన రెండు సార్లు ఆపరేషన్లు జరిగాయి. ఆమె పశ్చిమ బెంగాల్‌లోని ఆలీపూర్‌ జిల్లా కోర్టులో వివాహం రద్దు గురించి 2001 జూలై 1వ తేదీన దావాను దాఖలు చేసింది. తన భర్త ఆధీనంలోని వస్తువులను తనకు తిరిగి ఇప్పించాలని, భరణం కూడా ఇప్పించాలని ఆమె దరఖాస్తులో కోరింది. తన వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు రూ.382,262.75లను తన భర్తనుంచి తనకు తిరిగి ఇప్పించాలని కూడా మరో దరఖాస్తును ఆ కేసులో దాఖలు చేసింది.

వైద్యం ఖర్చులు చెల్లించాలని చట్టంలో ఎక్కడా లేదని, తన భార్య కూడా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నదని, ఇన్స్యూరెన్స్‌ కంపెనీ నుంచి కూడా డబ్బును వైద్య ఖర్చుల కింద పొందిందని రాజేశ్‌ జిల్లా కోర్టులో వాదించాడు. ఆ వాదనలను జిల్లా జడ్జి అంగీకరించలేదు. కానీ, ఇన్స్యూరెన్స్‌ కంపెనీ నుంచి ఆమెకు లభించిన రూ.76181ని తగ్గించి మిగతా మొత్తం రూ.306,181ను భార్యకి చెల్లించాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా రాజేశ్‌ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. విమాన ఖర్చులు రూ.21,668లను అదే విధంగా రూ.62,155లను తగ్గించి మిగతా డబ్బు చెల్లించాలని రాజేశ్‌ను హైకోర్టు ఆదేశించింది.

చివరికి రాజేశ్‌ సుప్రీం కోర్టుకు వచ్చాడు. ప్రమాదం వల్ల ఆమె చెయ్యి విరిగిందని, దానికి తన పాత్ర లేదని, అందుకని కింది కోర్టుల ఉత్తర్వులు సరి కాదని కోర్టు ముందు వాదనలు చేశాడు. చట్టం, 1954 ప్రకారం వైద్యఖర్చులను చెల్లించాల్సిన అవసరం లేదని కూడా వాదించాడు. తాను ఉద్యోగం చేస్తున్నదన్న విషయాన్ని, ఇన్స్యూరెన్స్‌ కంపెనీ నుంచి డబ్బులు వచ్చిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మరుగు పరిచిందని, ఈ కేసులు తనను వేధించడానికి మాత్రమే దాఖలు చేసిందని కూడా వాదనలు చేశాడు. తనని భర్త తోసివేయడం వల్లనే గాయాలైనాయని, తాను అదృష్టవశాత్తు బతికి బట్ట కట్టానని, విమాన ఖర్చులను హైకోర్టు తొలగించింది కానీ వైద్యఖర్చులను పొందడానికి అర్హత లేదని అనలేదని, మనోవర్తి, చేయూత అన్న పదాల్లో వైద్యఖర్చులు కూడా ఇమిడి ఉన్నాయని కోర్టు ముందు మిధుల్‌ చటర్జీ వాదనలు చేసింది.

ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం భార్య కేసును దాఖలు చేసింది. ఈ చట్టంలోని సె.36 ప్రకారం, ప్రొసీడింగ్స్‌ విచారణలో ఉన్నప్పుడు తాత్కాలిక మనోవర్తిని ఇప్పించే అధికారం జిల్లా కోర్టుకు ఉంటుంది. అదే విధంగా సె.37 ప్రకారం శాశ్వత మనోవర్తిని నెలవారీగా గానీ, క్రమానుగతంగా గానీ, ఏకమొత్తంగా కానీ భార్యకి చెల్లించాల్సి ఉంటుంది. మనోవర్తి, చేయూత అన్న పదాలకు విస్తృత అర్ధం ఉందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ రెండింటిలో వైద్యం ఖర్చులు కూడా వస్తాయని స్పష్టం చేసింది. మనోవర్తి, చేయూత అన్న పదాలలో జీవనం, ఆహారం, దుస్తులు, నివాసం, వినోదం, రక్షణ, నర్సింగ్‌, వైద్య సదుపాయాలు ఉంటాయని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. ఈ కారణాలను పేర్కొంటూ భర్త అప్పీలు ను తోసిపుచ్చింది. వైద్యంకోసం అయిన ఖర్చు కూ డా మనోవర్తిలో భాగమే. ఇది పురోగతిఉన్న తీర్పు. వైద్యఖర్చులను భార్య భర్తనుంచి పొందవచ్చు.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Friday, April 10, 2009

soodalu avasarame kaani...surya daily 11-4-09

సోదాలు అవసరమే, కానీ...

సోదా అనేది మామూలు విషయం కాదు. వ్యక్తుల గుప్తత హక్కులలోకి జోరబడటమే. సమాజ శ్రేయస్సు రీత్యా సోదాలు అవసరమే. అయితే సోదాలు చట్టం నిర్దేశించిన పద్దతుల్లో జరగాలి. సమాజ శ్రేయస్సుకి తగినట్టుగా చట్టం లేకపోతే తగు మార్పులు చట్టంలో తీసుకొని రావాలి.ఈ పరిస్థితుల్లో సోదాలని ఆమోదించలేం. అట్లా అని వద్దని కూడా అనలేని పరిస్థితి.

కారులో వెళ్తున్న వ్యక్తులని ఆపి కారుని సోదా చేస్తున్నారు. ఆ కారులో ఏమైనా డబ్బులు ఉంటే వాటిని పోలీసులు జప్తు చేసుకుంటున్నారు. వివాహం ఉందని, నగలు కొనడానికి డబ్బులు తీసుకెళ్తున్నామని చెబుతున్నా జప్తు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులు తమ బంథువుల కోసం డబ్బు పంపిస్తూ ఉంటారు. ఆ మనీటాన్స్‌ఫర్‌ ఏజంట్లు డబ్బు తీసుకొని వెళ్ళి అందించలేని పరిస్థితి ఏర్పడింది. బీడీి కార్మికులకి జీతం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికి కార ణం ఎన్నికలు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి పోలీసులు సోదా చేసి డబ్బుని జప్తు చేస్తున్నారు. ఇది మంచి పనే, కానీ ఇందు వల్ల కొంత మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తుతుంది. పోలీసులకి ఈ విధంగా సోదా చేసే అధికారం ఉందా?ఈ అధికారం లేకపోతే తలెత్తె పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అధికారం పోలీసులకి లేకపోతే అక్రమ డబ్బు రవాణాను నియంత్రించే అవకాశం ఉండదు. ఉగ్రవాదులు పారిపోతున్నప్పుడు వాళ్ళని పట్టుకునే అవకాశం ఉండదు. ఆర్‌డిఎక్స్‌ లాంటి ప్రేలుడు పదార్థాలను, ఆయుధాలను తరలించడాన్ని అపే పరిస్థితి ఉండదు. అందువల్ల పోలీసులు చేసే సోదాలకి అంద రూ సహకరించాలి. అయితే ఈ విధంగా సోదా చేసే అధికారం పోలీసులకి ఉందా? లేకపోతే చట్టంలో తీసుకరావల్సిన మార్పు లేమిటి? సోదాలు చేయడం గురించి, దర్యాప్తు గురించి వివరించే పద్ధతులు ఉన్న చట్టం ‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’. ప్రత్యేకమైన చట్టాల్లో ప్రత్యేకమైన దర్యాప్తు పద్ధతులు ఉంటాయి. వాటి విషయం ప్రక్కన పెట్టి, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం పోలీసులకి ఉన్న అధికారాలు ఏమిటి? ఓ కారుని సోదా చేసే అధికారం పోలీసులకి చట్ట ప్రకారం ఉందా?పరిశీలించడం, సోదా, జప్తు అన్న మూడు పద బంధాల అర్థాలను తెలుసుకోవాలి. ‘పరిశీలించడం’ అంటే దగ్గరగా చూడడం లేదా అధికారికంగా పరిశీలించడం. ‘సోదా’ అంటే మామూలుగా చూడటం మాత్రమే కాదు, ఏదైనా వస్తువును మరుగు పరిచినారా లేదా దాచి ఉంచినారా అన్నది కనుక్కోవడం. ఇక ‘జప్తు’ అంటే ఏదైనా వస్తువుని ఆధీనంలోకి తీసుకోవడం.సోదాలు రెండు రకాలు. అవి- వ్యక్తుల కోసం వెతకడం, వ్యక్తులని వెతకడం. పత్రాల కోసం, వస్తువుల కోసం వెతకడమంటే సోదా జరపడం. వ్యక్తుల కోసం వెతికే పద్ధ్దతిని మరి రండు రకాలుగా విభజించే అవకాశం ఉంది. ఆరెస్టు చేయాల్సిన వ్యక్తుల కోసం సోదా (సె.44 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, అక్రమంగా నిర్బంధించిన వ్యక్తుల కోసం వెతకడం (సె.97 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌). అరెస్టైన వ్యక్తులను సోదా చెయ్యడం (సె. 51 క్రి.ప్రొ.కో).పత్రాల కోసం, వస్తువుల కోసం జరిపే సోదాలని రెండు రకాలుగా వర్గీకరించే అవకాశం ఉంది. వారంట్‌ ద్వారా సోదా జరపడం (సె. 93,94,95,100 ్రక్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌), అత్యవసరమైన పరిస్థితుల్లో వారంట్‌ లేకుండా సోదా జరపడం (సె.165,166 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌).సోదా జరుపకుండా జప్తు కూడా చేసే అవకాశం ఉంది. నేరం చేసే ఆయుధాలు ఉన్నప్పుడు వాటిని జప్తు చేసే అవకాశం ఉంది (సె. 52 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌). కొన్ని రకాలైన ఆస్తులను పోలీసులు జప్తు చేసే అధికారం (సె. 102 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌). తన సమక్షంలో సోదా చెయ్యమని మేజిస్ట్రేట్‌ ఆదేశించే అధికారం (సెజ 103 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌). ఈ నిబంధనల ప్రకారం పోలీసులకి ఏ అధికారాలు ఉన్నా యో, వాళ్ళ అధికార పరిధి ఏమిటో పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.వ్యక్తుల కోసం సోదాను రెండు నిబంధనల ప్రకారం జరపడానికి అవకాశం ఉంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సె. 47,97 ప్రకారం, అలాగే అరెస్టు చేయాల్సిన వ్యక్తుల కోసం సె. 47 ప్రకారం సోదా జరుపవచ్చు. ఈ అధికారం పోలీసులకు ఉంది, ఇతర వ్యక్తులకూ ఉంది. ఈ సోదా పోలీసులు వారంట్‌ అమలు చేయడం ద్వారా చేయవచ్చు. వారంట్‌ లేకుండా కూడా సోదా జరుపవచ్చు. ఇతర వ్యక్తులు మాత్రం వారంట్‌ లేకుండా సోదా చేసే అవకాశం లేదు. ఏ ప్రాంతంలో ఈ సోదాను చేస్తున్నారో, ఆ ప్రాంతం (ఇల్లు) ఎవరి ఆధీనంలో ఉందో, ఆ వ్యక్తి పోలీసులకు సహకరించాలి. అవసరమైన సౌకర్యాలను కల్పించాలి. ఎవరి కోసమైతే సోదా చేస్తున్నారో ఆ వ్యక్తి పారిపోయడని భావించినప్పుడు, ఆ ఇంటి యజమాని సహకరించనప్పుడు పోలీసులకి తలుపులని బద్దలు కొట్టే అధికారం ఉంటుంది. సోదా పూర్తి ఆయన తరువాత ఎవరినైతే అరెస్టు చేయాల్సి ఉందో వాళ్ళని అరెస్టు చేయవచ్చు. అరెస్టయిన వ్యక్తిని సోదా చేసే అధికారం సె. 51 ప్రకారం పోలీసులకు ఉంది.ఎవరినైనా అక్రమంగా నిర్బంధించినప్పుడు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సె. 97 ప్రకారం వారంట్‌ ద్వారా సోదా జరిపి వాళ్ళని ఆ నిర్బంధం నుంచి విడిపించే అవకాశం ఉంది. ఈ వారంట్‌ని జిల్లా మేజిస్టేట్‌ నుంచి గానీ, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ నుంచి గానీ, జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ నుంచి గానీ పొందవచ్చు. వస్తువుల కోసం, పత్రాల కోసం వారంట్‌ ద్వారా సోదా జరపాలి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సె. 100 ప్రకారం మూసి ఉన్న ‘ప్రదేశాన్ని’ ఏ విధంగా సోదా చేయవచ్చో తెలుసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వారంట్‌ లేకుండా కూడా సోదా జరుపవచ్చు.క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సె. 165 పోలీస్‌ స్టేషన్‌ ఇంచార్జి అధికారి లేదా కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారి తన పోలీసు స్టేషన్‌ అధికార పరిథిలో సోదా ఎలా చెయ్యాలో వివరిస్తుంది. తన అధికార పరిథి వెలుపల సోదా ఏ విధంగా జరుపాలో సె. 166 వివరిస్తుంది.తన దర్యాప్తుకి అవసరమైన వస్తువులు ఏ ప్రదేశంలోనైనా ఉన్నాయని ఆ పోలీసు అధికారికి అన్పించినప్పుడు, వారంట్‌ తీసుకోవడం వల్ల జాప్యం జరుగుతుందని భావించనప్పుడు, ఆ కారణాలని రాసి ఆ ‘ప్రదేశాన్ని’ సోదా చేయాలి. తయారు చేసిన రికార్డును సంబంధిత జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కి పంపించాలి. తన అధికార పరిథి వెలుపల సోదా చేసినప్పుడు, ఆ విషయాన్ని సంబంధిత పోలీసు అధికారికి తెలియచెయ్యాలి. అతన్నీ సోదా జరుపమని కోరాలి. అత్యవసర పరిస్థితుల్లో నోటీసు ద్వారా సంబంధిత పోలీసు అధికారికి తెలియపరిచి అధికార పరిధి వెలుపల సోదా చేయవచ్చు. ‘ప్రదేశాన్ని’ సోదా చేయవచ్చు.‘ప్రదేశం’ అంటే ఏమిటో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని 2(పి)లో వివరించారు. ఆ ప్రకారం ఇల్లు, బిల్టింగ్‌, వాహనం, గుడారం, ఓడల్లాంటివి. అయితే ఏదైనా కేసులో దర్యాప్తులో భాగంగా మాత్రమే సోదా చెయ్యడానికి అవకాశం ఉంది. ఎలాంటి కేసు దర్యాప్తులో లేకుండా కారుని సోదా జరుపడానికి అవకాశం లేదు. ‘ప్రదేశాన్ని’ (కారుని కూడా) సోదా చెయ్యాలంటే ఇద్దరు గౌరవ ప్రదమైన సాక్షుల సమక్షంలోనే సె. 100 ప్రకారం సోదా జరుపాల్సి ఉంటుంది. మిగతా విధంగా చేస్తున్న సోదాలు చట్టబద్ధ్దమైనవి కాదు.సె. 102 ప్రకారం సోదా చెయ్యకుండా రెండు షరతుల ప్రకారం ఏదైనా ఆస్తిని జప్తుచేసే అధికారం ఉంది. మొదటిది, ఆ ఆస్తి దొంగలించిన ఆస్తి కావాలి. రెండవది, ఏదైనా నేరం జరిగిందన్న అనుమానం ఉన్న ఆస్తి అయినా కావాలి. అంతే కానీ ఇలాంటి ఆస్తిని వాహనాల నుంచి జప్తు చేసే అధికారాన్ని చట్టం పోలీసులకి ఇవ్వలేదు. జప్తు చేసిన ఆస్తిని సంబంధిత జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కి పంపించాలి.కానీ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌కి కాదు. అదాయపు పన్ను చట్ట ప్రకారం జప్తు చేయాలంటే కూడా వారంట్‌ అవసరం.జరుగుతున్న సోదాలని గమనిస్తే అవి చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో జరుగుతున్నట్టు అనిపించడం లేదు. ఆస్తులని జప్తు చేస్తున్నారు. జప్తు చేసిన ఆస్తులని ఎగ్జిక్యూటివ్‌ మేడిస్ట్రేట్‌ దగ్గరికి పంపిస్తున్నారు. సోదా అనేది మామూలు విషయం కాదు. వ్యక్తుల గుప్తత హక్కులలోకి జోరబడటమే. సమాజ శ్రేయస్సు రీత్యా సోదాలు అవసరమే. అయితే సోదాలు చట్టం నిర్దేశించిన పద్దతుల్లో జరగాలి. సమాజ శ్రేయస్సుకి తగినట్టుగా చట్టం లేకపోతే తగు మార్పులు చట్టంలో తీసుకొని రావాలి. ఈ పరిస్థితుల్లో సోదాలని ఆమోదించలేం. అట్లా అని వద్దని కూడా అనలేని పరిస్థితి. ఎందుకంటే ఇది ఎన్నికల సందర్భం.

రచయిత నిజామాబాద్‌ జిల్లాన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Saturday, April 4, 2009

హీనాతి హీనమైన నేరానికి శిక్ష

`నిజం చెప్పాలంటే, ఈ విషయం గురించి విన్నా, చదివినా, మాట్లాడినా వెన్నులోంచి వణుకు మొదలవుతుంది. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే అత్యంత హీనమైన నేరం మృగప్రాయమైన నేరం. ఈ విధంగా అనడం మృగాన్ని కించపరచడమే' - సుప్రీంకోర్టు న్యాయమూర్తి అరిజిత్‌ పసాయత్‌ ఓ మానభంగం కేసులో వెలిబుచ్చిన అభిప్రాయం ఇది. హంతకుడు ఆ బాధితురాలిని భౌతికంగా చంపివేస్తాడు. కానీ ఓ మానభంగం చేసిన వ్యక్తి ఆమెను భౌతికంగానే కాదు, ఆమె ఆత్మపైన కూడా దాడి చేస్తారు. ఈ మాట కూడా అదే తీర్పులో న్యాయమూర్తి ప్రకటించారు.

ఇది మామూలు వ్యక్తి చేసిన నేరం. అదే నేరం ఆ అమ్మాయిని ఎత్తుకొని పెంచి పోషించిన తండ్రి చేస్తే ఎలా ఉంటుంది? జీవితం మీదే విరక్తి ƒలుగుతుంది. అదే తండ్రి తన కూతురి మీద కొన్ని సంవత్సరాలు తరబడి ఆ పని చేస్తూ, ఇంకో వ్యక్తి కూడా మానభంగం చెయ్యడానికి సహకరించడం, ఆమె తల్లి కూడా సహకరించడం అన్న వార్త వింటే కళ్ళ వెంట నీళ్ళు రావడమే కాదు, చేతులు కూడా బిగుసుకుంటాయి.
ముంబాయి సంఘటన మరిచిపోకముందే అమృత్‌సర్‌లో ఇలాంటిదే మరో సంఘటన. మొన్న నిజామాబాద్‌లో కూడా ఓ తండ్రి వేధిస్తున్నాడన్న విషయం బయట పడింది. పోలీసులు సత్వర చర్య తీసుకునేట్లుగా న్యాయ సేవాధికార సంస్థ పనిచెయ్యడం వల్ల ఈ ఘోరమైన సంఘటనని నివారించ కలిగారు. 21 సంవత్సరాల కూతురిని 9 సంవత్సరాల పాటు లైంగికంగా అనుభవించిన తండ్రి వార్త విన్నప్పుడు దేశంలోని ప్రతి మానవుని రక్తం శీతలమై పోతుంది. తల్లులు నిశ్చేష్ఠులవుతారు. తండ్రులు దిక్కు తో చక తలలు పట్టుకుం టున్నారు. ఇది వాస్తవమేనా అని మరికొం త మంది ఆందోళన చెందుతున్నారు. దోషి తండ్రి, సహకరించిన వ్యక్తి తల్లి. వీళ్ళిద్దరితోపాటు మరో తాంత్రికుడూ దోషే. తల్లి భావోద్వేగంతో కూతురుని బ్లాక్‌మెయిల్‌ చేసింది. తండ్రి ఈ హీనమైన నేరం చెయ్యడానికి తోడ్పడింది.

తాంత్రికుడు కూడా ఆమెను అనుభవించడానికి ఆ తల్లి తోడ్పడింది. ఆ సంఘటన ఇలా ఉండగా, అమృత్‌సర్‌లో రాజకీయ నాయకుడైన తన తండ్రి తనను ఆరు సంవత్సరాలుగా మానభంగానికి గురి చేస్తున్నాడని 21 సంవత్సరాల కూతురు ఆరోపించింది. వావి వరసలని కాలదన్ని స్వంత కూతురిని మానభంగం చెయ్యడం వెనక మూఢనమ్మకాలు కూడా ఉండవచ్చు. దిగువ తరగతి, మధ్యతరగతిలో స్త్రీలపై జరుగుతున్న నేరాలు ఎక్కువ కుటుం బ సభ్యుల వల్లే జరుగుతున్నాయి. బయటకు వస్తున్న సంఘటనల కన్నా బయటకు రాని సంఘటనలు ఎన్నో. వావివరుసలు లేకుండా ఇంట్లో జరుగుతున్న ఇటువంటి నేరాలను నిరోధించడం ఎలా? ఇందుకోసం మరో ప్రత్యేక చ…ట్టం అవసరం ఉందా? ఉన్న చట్టాలతోనే వీటిని నిరోధించే అవకాశం ఉందా?హత్య కన్నా మానభంగమనేది తీవ్రమైన నేరం. హత్యా నేరానికి జీవిత ఖైదు ఉంది. అరుదైన కేసుల్లో అరుదైన వాటికి మరణ శిక్ష కూడా ఉంది. కాని మానభంగం నేరానికి 7 సంవత్సరాలకు తక్కు వ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉంది. జీవిత ఖైదును లేక పది సంవత్సరాల వరకు జైటు శిక్షను విధించే అవకాశం కూడా ఉంది.

సె. 376(2)లో పేర్కొన్న వ్యక్తులు నేరం చేసినప్పుడు కనీస శిక్ష 10 సంవత్సరాల వరకూ పడుతుంది. నేరం నిరూపణ జరిగిన తరువాత కోర్టులు విధించే శిక్ష ఎక్కువలో ఎక్కువ 7 సంవత్సరాల నుం చి 10 సంవత్సరాల వరకు పడుతుంది. అరుదైన కేసులో మాత్రమే జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం ఉంది. మానభంగం చేసిన వ్యక్తులకు మరణశిక్ష విధించే విధంగా చట్టాన్ని సవరించాలన్న ప్రతి పాదన గతంలో వచ్చింది. ఈ ప్రతిపాదనను చాలా మంది వ్యతిరేకించారు. ఈ సమస్యకు మరణ శిక్ష పరిస్కారం కాదని వాళ్ళ వాద న. నిజానికి మరణ శిక్ష దేనికీ పరిష్కారం కాదు. అట్లా అని అరుదైన కేసుల్లో, అరుదైన హత్య కేసుల్లో కూడా మ రణ శిక్షను తొలగించా లా? తొలగించాలని వాద నచేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు.భారతీయ శిక్షాస్మృతి లోని సె. 53 ప్రకారం ఐదు రకాలైన శిక్షలను కోర్టులు విధించే అవకాశం ఉంది. అవి మరణ శిక్ష, జీవిత ఖైదు, కఠిన లేదా సాధారణ కారాగార శిక్ష, అస్తి జప్తు, జరిమానా.

జీవిత ఖైదు శిక్ష గురించి శిక్షాస్మృతిలో చెప్పారు కానీ జీవిత ఖైదు అంటే ఏమిటో చెప్పలేదు. ఏ చట్టంలో కూడా దీన్ని నిర్వచించలేదు. నిజానికి జీవిత ఖైదు అంటే జీవితాంతం వరకు. కారాగార శిక్ష విధించడం సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది. అయితే జీవిత ఖైదును శాసన ప్రకారం నిర్దేశించేఅధికారం ప్రభుత్వానికి ఉంటుందని కూడా చెప్పింది. మంచి నడవడిక కారణంగా గానీ, ఇతర కారణాల వల్లగానీ ఈ శిక్షా కాలాన్ని తగ్గించే అవకాశం ఆయా ప్రభుత్వాలకి ఉంది. ప్రభుత్వానికి ఉన్న ఈ అధికారం వల్ల నేరస్తులు బయట పడుతున్నారు. మానభంగానికి గురైన మహిళ మీద పడిన మచ్చ తొలగి పోదు. అది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. జీవిత ఖైదు పడిన వ్యక్తి మంచి నడవడిక కారణంగా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. రేప్‌ కేసులో జీవిత ఖైదును సాధారణంగా కోర్టులు విధించవు. ఎక్కువ ఎక్కువ 10 సంవత్సరాల వరకు శిక్షను విధిస్తాయి. మంచి నడవడిక ఉంటే అతను నాలుగైదు సంవత్సరాల్లో బయటకు వస్తాడు. ఇదీ ఇప్పుడున్న పరిస్థితి.

ఈ పరిస్థితిని అధిగమించడానికి ఏం చేస్తే బాగుటుంది? మరణ శిక్ష లేకపోయినా పర్వాలేదు కానీ ఈ నేరం చేసిన వ్యక్తులు శిక్షా కాలం మొత్తం జైల్లో ఉండే విధంగా చట్టం ఉంటే కొంతలో కొంత మేలు. ఇంట్లో జరిగే నేరాలను రిపోర్టు చేయడానికి ెహల్‌‌పలైను అత్యంత అవసరం. వాటిని నిరోధించే యంత్రాంగం మరింత అవసరం. హీనతిహీనమైన నేరాల్లో శిక్షలను ఏ కారణంగానైనా తగ్గించే అవకాశం ప్రభుత్వానికి ఉండకూడదు. ఈ దిశగా ఆలోచించాలి.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

Followers