Wednesday, February 24, 2010

మహిళలకు ప్రత్యేక సదుపాయాలు సమంజసమా?

February 24th ,2010

స్ర్తిలని అరెస్టు చేసినప్పుడు గానీ వాళ్ళని సోదా జరపాల్సి వచ్చినప్పుడుగాని పోలీసులు కొన్ని పద్ధతులు పాటించాల్సి వుంటుంది. స్ర్తిల గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది. మానభంగానికి గురైన స్ర్తిలకు కూడా కొన్ని ప్రత్యేకమైన హక్కులు వున్నాయి. అయితే అవి పుస్తకాలవరకే పరిమితం అవుతున్నాయి. వాస్తవంలో వాటిని పట్టించుకునే నాథుడే లేడు. మహిళలకి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఇవ్వడం సమంజసమేనా? చట్టంముందు అందరూ సమానులేకదానన్న అనుమానం మనకి వస్తుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం భారతదేశంలో నివశిస్తున్న వ్యక్తులందరూ చట్టం ముందు సమానులే. అందరికీ ఒకేరకమైన రక్షణని రాజ్యం ఇవ్వాల్సి వుంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(1) ప్రకారం- మతం, జాతి, జెండర్, జన్మించిన స్థలం కారణంగా భారతదేశ పౌరులపట్ల రాజ్యం ఎలాంటి వివక్షత చూపకూడదు. ఈ హక్కు భారతదేశ పౌరులకి మాత్రమే వర్తిస్తుంది. కానీ ఆర్టికల్ 15 (3) ప్రకారం స్ర్తిల గురించి పిల్లల గురించి ప్రత్యేకమైన నిబంధనల్ని రాజ్యం తయారుచేయవచ్చు. ఈ ఆర్టికల్సుని ఆధారం చేసుకొని స్ర్తిల ప్రయోజనాలు రక్షించడానికి సివిల్ క్రిమినల్ శాసనాల్లో కొన్ని ప్రత్యేక నిబంధనల్ని రూపొందించారు.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో కూడా మహిళల ప్రయోజనాలను ఉద్దేశించి కొన్ని నిబంధనల్ని పొందుపరిచారు. నేరాలు మగవాళ్ళు చేసినా ఆడవాళ్ళు చేసినా వాటి దర్యాప్తు విచారణ రెండూ ఒకేరకంగా వుంటాయి. కానీ స్ర్తిలని అరెస్టు చేయాల్సి వచ్చినపుడు వారిని సోదా చేయాల్సి వచ్చినపుడు వారి గౌరవాల్ని కాపాడటం కోసం కొన్ని కనీస ప్రమాణాలను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో నిర్దేశించారు. సె.51(2) సె.53, సె.100 (3) సె.157, సె.160, సె.163ఎ, సె.100(2)లలో కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు పొందుపరిచారు.

అరెస్టు చేసినప్పుడు..
------------------------
మహిళలని వారెంటు ద్వారా కానీ, వారెంటు లేకుండా గానీ పోలీసు అధికారి అరెస్టు చేసినపుడు, ఆ నేరాలను బట్టి బెయిల్ మంజూరు చేయాల్సి వుంటుంది. ఒకవేళ బెయిల్ మంజూరు చేయలేని పరిస్థితుల్లో వున్నట్లయితే వారిని సోదా చేసి దుస్తులను తప్ప అన్ని వస్తువులు వారి దగ్గరనుంచి తీసుకోవాల్సివుంది. అవి తీసుకున్నట్టుగా రసీదు కూడా ఇవ్వవలసి ఉంటుంది. అరెస్టు చేసిన వ్యక్తి మహిళ గనుక ఆమెను ఇతర మహిళలతో మాత్రమే సోదా జరిపించాలి. అంతేకాదు ఆమె గౌరవానికి భంగం కలగకుండా సోదా జరపాలి. (సెక్షన్ 51)

మహిళలను వైద్య పరీక్ష చేసేటప్పుడు..
---------------------------------------------
ముద్దాయిలని వైద్య పరీక్ష చేయించినట్టయితే ఆ నేరం చేసారనడానికి సాక్ష్యం లభించే అవకాశం వుందని పోలీసు అధికారి భావించినపుడు, ఆ ముద్దాయిలను వైద్య పరీక్షలకు పంపించడం జరుగుతుంది. అలాంటి అభ్యర్థన అందుకున్నప్పుడు వైద్యాధికారి ఆ ముద్దాయిలకు వైద్య పరీక్ష చేయాల్సి వుంటుంది. ముద్దాయి మహిళ అయితే లేడీ డాక్టర్లు వైద్య పరీక్షలు చేయవలసి వుంటుంది. కనీసం ఒక లేడీ డాక్టర్ పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరగాల్సి వుంటుంది (సె.53)
సాక్ష్యం ఇవ్వడానికి పోలీసు అధికారిని పిలవవచ్చా!
-----------------------------------------------------------
నేరం గురించిన సమాచారం తెలిసిన వ్యక్తులని స్టేషన్‌కి పిలిపించి వారిని విచారించడానికి పోలీసు అధికారికి అధికారం వుంది. ఆ విధంగా రాతపూర్వకంగా ఉత్తర్వులు అందుకున్నట్టయితే ఆ వ్యక్తులు ఆ పోలీసు అధికారుల ముందు హాజరుకావాల్సి వుంటుంది. కానీ మహిళల్ని కానీ పదిహేను సంవత్సరాల లోపల వున్న పిల్లల్నిగానీ పోలీసు అధికారులు స్టేషనుకు పిలవడానికి అధికారం లేదు. వాళ్ళని విచారించడానికి పోలీసు అధికారే ఆ వ్యక్తులు వున్న ప్రదేశాలకు వెళ్ళాల్సి వుంటుంది (సెక్షన్ 160).

అరెస్టు చేయడానికి వచ్చినపుడు..
----------------------------------------
ముద్దాయిలను అరెస్టు చేయడానికి, ఆ ముద్దాయిలు ఏ ఇంట్లోనైనా వున్నట్టు అనుమానం వస్తే ఆ ఇంటిని కూడా సోదా చేయడానికి పోలీసులకి అధికారం వుంది. పోలీసులు సోదా చేయడానికి వచ్చినపుడు వారికి సహకరించాల్సిన బాధ్యత ఆ ఇంటి యజమానిపై వుంటుంది. ఒకవేళ సహకరించనట్టయితే పోలీసులు బలప్రయోగం చేసే అవకాశం వుంది. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడానికి అధికారం వుంది. అయితే ఆ ఇంట్లో ఘోషాలో వున్న స్ర్తిలు ఉన్నట్లయితే వాళ్ళు అక్కడినుండి వైదొలగడానికి పోలీసులు అవకాశం కల్పించాలి (సె.47).
ఏదైనా వస్తువు కోసం సోదా చేసినప్పుడు...
------------------------------------------------
ఏదైనా వస్తువు పరిశోధన నిమిత్తం అవసరం అయినపుడు పోలీసులు ఏ ప్రదేశాన్నైనా సోదా చేయవచ్చు. ఒకవేళ ఆ వస్తువు అక్కడ వున్న వ్యక్తుల దగ్గర వున్నట్టుగా భావించినపుడు పోలీసు అధికారి ఆ వ్యక్తులని సోదా చేయవచ్చు. అయితే ఆ వ్యక్తులు మహిళలైనప్పుడు వేరే మహిళతో సోదా చేయించాల్సి వుంటుంది. ఆ సోదా కూడా వారి గౌరవానికి భంగం కలగకుండా జరపాల్సి వుంటుంది.

మానభంగానికి గురైనప్పుడు..
---------------------------------
మానభంగానికి గురైన మహిళలను వైద్య పరీక్షలకు పంస్తారు. ఆవిధంగా పంపించే ముందు ఆమె సమ్మతి తీసుకునే పంపించాలి. ఆమె సమ్మతి ఇవ్వలేనప్పుడు ఆమె తరఫున సమ్మతి ఇచ్చే యోగ్యత గల వ్యక్తులనుంచి సమ్మతి తీసుకొని పంపించాల్సి వుంటుంది. డాక్టర్ కూడా ఆమె సమ్మతిగానీ, ఆమె తరఫున ఆమె సంబంధీకుల సమ్మతిగానీ పొందాలి. ఆ విషయాన్ని నివేదికలో ప్రత్యేకంగా పేర్కొనవలసి వుంటుంది (సె.164ఎ).

No comments:

Post a Comment

Followers