Wednesday, February 17, 2010

వారెంట్ లేకుండా సోదాలు చేయవచ్చా?

February 16th,2010

వారంట్ లేకుండా పోలీసు స్టేషను ఇంచార్జి అధికారి లేదా కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారి అత్యవసర పరిస్థితుల్లో దర్యాప్తులో భాగంగా సోదా జరుపవచ్చు.

* తన అధికార పరిధిలోని ఏదైనా స్థలంలో దర్యాప్తుకి అవసరమైన వస్తువులు / పత్రాలు వున్నాయని సహేతుకంగా నమ్మినపుడు వారంట్ తీసుకోవడం వల్ల జాప్యం జరుగుతుందని భావించినప్పుడు వారంట్ లేకుండా సోదా జరుపవచ్చు.
* అయితే తగు కారణాలను రాతపూర్వకంగా రాసి సోదా జరపాల్సి ఉంటుంది.
* ఆ పోలీసు అధికారి ఈ సోదాని స్వయంగా నిర్వర్తించాల్సి వుంటుంది. తన క్రింది అధికారులని కూడా సోదా జరుపమని రాత పూర్వకంగా ఆదేశించవచ్చు.
* సంబంధించిన రికార్డుని వెంటనే మేజిస్ట్రేట్‌కి పంపించాలి. ఆ రికార్డు ప్రతిని ఉచితంగా ఆ స్థల (ఇంటి) యజమానికి ఇవ్వాల్సి వుంటుంది (సె.165 క్రి.ప్రొ.కో.).

అధికార పరిధి వెలుపల కూడా సోదా జరుపవచ్చా?

------------------------------------------------------------
పోలీసు అధికారులు తమ అధికార పరిధి వెలుపల (అదే జిల్లాలో కావొచ్చు, వేరే జిల్లాలో కావొచ్చు) కూడా వారంట్ సె.165 క్రి.పొ.కో.లో చెప్పినట్టు సోదా జరుపవచ్చు.
అయితే ఈ సోదాని పోలీసు స్టేషన్ ఇంచార్జి అధికారికి తగ్గని అధికారి గానీ లేక సబ్ ఇన్స్‌పెక్టర్ స్థాయికి తగ్గని అధికారిగానీ ఈ సోదా జరుపవచ్చు. జాప్యంవల్ల ఏ వస్తువు కోసం అయితే వెతుకుతున్నామో అది దాచి వుంచే అవకాశం వుందని భావించినపుడు సోదా జరుపవచ్చు. అప్పుడు తయారు చేసిన లిస్టు ప్రతిని సంబంధిత పోలీసు స్టేషన్‌కి పంపించాలి. అదేవిధంగా నేరాన్ని గుర్తించే మేజిస్ట్రేట్‌కి పంపించాలి. ఆ పోలీసు అధికారి తాను కాకుండా ఏ ప్రాంతంలోనైతే సోదా చేస్తున్నారో ఆ ప్రాంత పోలీసు స్టేషన్ ఇంచార్జి అధికారిని కూడా కోరే అవకాశం ఉంది. అప్పుడు ఆ అధికారికి కేసు దర్యాప్తు చేస్తున్న అధికారికి వుండే అధికారాలు లభిస్తాయి. ఈ సోదాలకి సె.100 క్రి.ప్రొ.కో. నిబంధనలు వర్తిస్తాయి.
సోదా ఎలా జరపాలి?
------------------------
దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారి తన అధికార ప్రాంతంలో ఏ ప్రాంతాన్నైనా నమ్మదగిన సమాచారం అందినపుడు సోదా చేయవచ్చు.
సాధారణంగా ఏదైనా ఇంటిని బలమైన కారణం వున్నపుడు పోలీసులు సోదా చేస్తారు. ఆ ఇంటిలో నిందితులకు ఆశ్రయం ఇచ్చినపుడు, ఏదైనా ప్రేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులకి నమ్మదగిన సమాచారం ఉన్నపుడు పోలీసులు సోదా చేయవచ్చు. సోదా చేయడానికి వారంట్ వుండాలి. కొన్ని పరిస్థితుల్లో వారంట్ లేకుండా సోదాలు చేయవచ్చు.
సోదా ఎలా జరుపాలన్న పద్ధతిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.100లో వివరించారు.
పోలీసు అధికారి గానీ లేదా వారంట్ అమలుచేస్తున్న ఇతర అధికారులకి ఆ స్థలం యజమానులు సోదా చేయడానికి అవసరమైన సౌకర్యాలని కల్పించాలి. ఆ విధంగా కల్పించినపుడు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లే అధికారం వాళ్లకు ఉంటుంది.
ఈ సోదా చేసేముందు, ఆ ప్రాంతంలోని ఇద్దరు గౌరవప్రదమైన వ్యక్తులనుగానీ అంతకుమించిగానీ పిలిచి వాళ్ళ సమక్షంలో సోదా జరపాల్సి వుంటుంది. ఒకవేళ ఆ సమయంలో అలాంటి వ్యక్తులెవరూ లేనపుడు, ఉన్నా సహకరించనప్పుడు పోలీసులే నేరుగా సోదా చేయవచ్చు. అయితే స్వతంత్ర వ్యక్తులని పిలవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా సోదా చేస్తే అది అక్రమమవుతుంది. ఒకవేళ ఆ ప్రాంతంలోని సాక్షులు సహకరించనప్పుడు వేరే ప్రాంతాలలోని స్వతంత్ర వ్యక్తులను సాక్షులుగా తీసుకోవాల్సి ఉంటుంది. అలా లేనపుడు కోర్టులు ఆ సోదాని విశ్వసించవు.
సోదా సమయంలో వీటిని పాటించాల్సి ఉంటుంది.
----------------------------------------------------------
* సాక్షుల సమక్షంలో సోదా జరపాలి.
* స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు, అవి ప్రదేశాలలో లభించాయో వాటి వివరాల జాబితాను తయారుచేయాలి.
* స్వాధీనం చేస్తున్న వస్తువుల వివరాల ప్రతిని ఎవరి ఇంటినుంచైతే స్వాధీనం చేసుకున్నారో అతనికి ఇవ్వాల్సి వుంటుంది.
* సోదాని చూసిన వ్యక్తులు విధిగా కోర్టులో విచారించాల్సిన అవసరం లేదు.
* ఆ ఇంటి యజమానిని లేదా ఆ ఇంటిలో నివశిస్తున్న వ్యక్తిని సోదా చూడటానికి అనుమతించాలి. అంటే వారి సమక్షంలోనే సోదా జరపాల్సి వుంటుంది.
* వ్యక్తులని సోదా చేసి ఏవైనా స్వాధీనం చేసుకున్నపుడు దాని వివరాలు రాసి అతనికి ఇవ్వాల్సి వుంటుంది.
సాక్షిగా పిలిచినపుడు ఎవరైనా నిరాకరించినా, నిర్లక్ష్యం చేసినా వారు భారతీయ శిక్షాస్మృతిలోని సె.187 ప్రకారం శిక్షార్హులవుతారు.

No comments:

Post a Comment

Followers