Friday, April 24, 2009

గృహహింస కేసులు రక్షణాధికారుల పాత్ర

రక్షణాధికారులు మేజిస్ట్రేట్‌ పర్యవేక్షణలో, నియంత్రణలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. అదే విధంగా ప్రభుత్వ నియంత్రణలో చట్టానికి లోబడి పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములను అమలు చేసే దిశగా దృష్టి సారించాలా, లేక కోర్టు ఉత్తర్వుల అమలు కోసం దృష్టి సారించాలా అన్న మీ మాంసకు రక్షణాధికారులు గురయ్యే అవకాశం ఉంది. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్లకు అర్థంకాని పరిస్థితి. చట్టం అమలులో ఏవైనా లోపాలుంటే కోర్టు ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. గృహహింస సంఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. బాధితులకు సహాయం అందించడానికి ప్రభుత్వం రక్షణాధికారులను నియమించింది. బాధితులు రక్షణాధికారుల దగ్గరికే కాకుండా సేవా సంస్థల దగ్గరికి, పోలీసుల దగ్గరిి, మేజిస్ట్రేట్‌ దగ్గరికి కూడా వెళ్ళవచ్చు. అయితే రక్షణాధికారి పాత్ర ఎక్కువగా ఉంటుంది. రక్షణాధికారి పాత్రను రెండు దశలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది.

వివాదానికి ముందు రక్షణాధికారి బాధితురాలికి సహాయం చేయాల్సి ఉంటుంది. వివాదం తర్వాత కోర్టు ఉత్తర్వులు అమలు అయ్యేటట్టు చూడాలి. అంటే ఈ దశలో రక్షణాధికారి బాధితురాలికి, కోర్టుకి తన సహాయాన్ని అందిస్తారన్న మాట. వివాదానికి ముందు రక్షణాధికారి నిర్వహించే పాత్రలో ఇవి ఉంటాయి. గృహహింస ఫిర్యాదులను స్వీకరించడం. గృహహింస నిరోధించే విధంగా చర్యలు తీసుకోవడం లేదా అత్యవసర చర్యలను చేపట్టడం. బాధితురాలికి న్యాయసేవలను, ఇతర సహాయక సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా రక్షణాధికారి చూడాలి.

వివాదం తర్వాత రక్షణాధికారి చాలా విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనవి- నోటీసులను ప్రతివాదులకు అందించటం, అవసరమైన విచారణలను జరపడం, కోర్టు ఉత్తర్వులకు సహాయాన్ని అందించడం. గృహహింస చట్ట ప్రకారం మూడు విధాలుగా ఉపశమనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గృహహింస సంఘటన నివేదిక అనేది తొలి దశ. దీన్ని రక్షణాధికారి గాని లేదా సేవాసంస్థ గాని తయారు చేస్తారు. ఫారం నెం.1 ప్రకారం దీన్ని తయారు చేయాలి. ఇది పబ్లిక్‌ డాక్యుమెంట్‌. దీన్ని పూర్తి చేసినప్పుడు రక్షణాధికారి, సేవాసంస్థలను ప్రభుత్వ ఉద్యోగులుగా భావించవలసి ఉంటుంది. చట్ట పరమైన చర్యలు తీసుకొన్నా, తీసుకోకపోయినా గృహహింస సంఘటన నివేదికను సంబంధిత మేజిస్ట్రేట్‌కు పంపించాలి. ఉత్తర్వులు జారీ చేసే ముందు గృహహింస సంఘటన నివేదిక లేకుండా కూడా బాధితురాలు నేరుగా ఉపశమానాల కోసం మేజిస్ట్రేట్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.

గృహహింస చట్ట ప్రకారం బాధితురాలు పలు విధాలుగా రక్షణాధికారిని సంప్రదించే అవకాశం ఉంది. నేరుగా సంప్రదించవచ్చు. సేవా సంస్థలు పంపించడం ద్వారా సంప్రదించవచ్చు. పోలీసులు పంపించడం ద్వారా సంప్రదించ వచ్చు. కోర్టు పంపించడం ద్వారా సంప్రదించవచ్చు. చాలా కేసుల్లో బాధితులు నేరుగా రక్షణాధికారిని సంప్రదిస్తున్నారు. అందుకు కారణం గృహహింస చట్టం గురించి బాగా ప్రచారం జరగడం. బాధితురాలు నేరుగా గాని, ఎవరైనా పంపడం ద్వారా కాని రక్షణాధికారిని కలిసినప్పుడు ఆమె ఫిర్యాదు ప్రకారం చట్టం నిర్దేశించిన ప్రకారం గృహహింస సంఘటన నివేదికను తయారు చేయాలి. ఆమెను వైద్య పరీక్షలకు పంపించినప్పుడు ఆ నివేదికను కూడా దీనితో పాటు జతచేయాలి.

వివాదానికి ముందు రక్షణాధికారిని కౌన్సిలింగ్‌ చేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అయితే తన అధికార పరిధిలో ఉన్న కౌన్సిలర్ల వివరాలను సేకరించి పెట్టుకోవాల్సిన బాధ్యత రక్షణాధికారిపై ఉంటుంది. పార్టీల మధ్య కౌన్సిలింగ్‌ చేసే వ్యక్తులకు అనుభవం, నేర్పు ఉండాలి. వివాదం తర్వాత మాత్రమే పార్టీలని కౌన్సిలింగ్‌కు పంెపే విధానాన్ని చట్టంలో పొందుపరిచారు. కాని వివాదానికి ముందు కౌన్సిలింగ్‌ విషయంలో చట్టం మౌనంగా ఉంది. వివాదానికి ముందు రక్షణాధికారులు కౌన్సిలింగ్‌ చేయకూడదన్న నిషేధాన్ని కూడా చట్టంలో ఏర్పరచలేదు. ఈ కారణంగా రక్షణాధికారులు పార్టీలకు కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తున్నారు. అందువల్ల చిన్నచిన్న పొర పొచ్చాలు తొలగిపోయే అవకాశం ఉంది.

గృహహింస చట్టంలోని సె-9, నియమం-10 ప్రకారం దరఖాస్తు దాఖలైన తర్వాత రక్షణాధికారి తన బాధ్యతలను కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం కొన్ని సందర్భాలలో క్రిమినల్‌ ప్రొసిజర్‌ను మరికొన్ని సందర్భాలలో సివిల్‌ ప్రొసిజరను పాటించాల్సి ఉంటుంది. కోర్టులో అప్లికేషన్‌ దాఖలైన తర్వాత కోర్టు ప్రొసిడింగ్స్‌ ఈ విధంగా ఉంటాయి- ప్రతివాదిపై నోటీసును జారీ చేయ్యాలి. నోటీసు అందుకున్న తర్వాత ప్రతివాది కోర్టు ముందు హాజరై తన జవాబును ఇవ్వాలి. కొన్ని సందర్భాలలో కోర్టు డాక్యుమెంట్లు ఆధారంగా ఉన్నప్పుడు ఏకపక్షంగా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయవచ్చు. పార్టీల గృహాలని సందర్శించమని రక్షణాధికారిని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసే ముందు ఆదేశించవచ్చు. కేసును విచారిస్తున్నప్పుడు కోర్టు సాధ్యమైనంత వరకు క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని సె-125 దరఖాస్తును పరిష్కరించే క్రమంలో అవలబించే పద్ధతులను ఇక్కడ కూడా అవలంబించాలని సె-28, నియమం-6(5) చెబుతోంది. సె-28(2) ప్రకారం అవసరమైనప్పుడు కోర్టు తనకు తోచిన పద్ధతిని కూడా అవలంబించే అవకాశం ఉంది.

కోర్టులో ప్రొసిజర్‌ మొదలైన తర్వాత ప్రతివాదికి కోర్టు నోటీసును జారీ చేస్తుంది. కోర్టు ముందు అతని హాజరు అవసరం. ఎందుకంటే అతను ఫిర్యాదులోని అంశాలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. సివిల్‌ కేసుల్లో కోర్టు సిబ్బంది నోటీసులను ప్రతివాదులకు అందచేస్తారు. క్రిమినల్‌ కేసుల్లో పోలీసులు అందచేస్తారు. గృహహింస చట్టం ప్రకారం నోటీసును ప్రతివాదికి అందించే బాధ్యత రక్షణాధికారిపై ఉంది. నియమం-12లో ఈ విషయాన్ని చెప్పారు. నోటీసును అందచేసిన విషయం గురించిన ప్రకటనను రక్షణాధికారి కోర్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. సివిల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని అర్డర్‌-5లోని విషయాలు. క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌లోని అధ్యాయం-6లోని విషయాలు కలిపి నియమం-12ను రూపొందించాయి. ఈ నియమం ప్రకారం ఈ విధంగా నోటీసును జారీచేయవచ్చు- ప్రతివాది ఎక్కడైతే నివసిస్తున్నాడో, లేదా ఎక్కడైతే పని చేస్తున్నాడో అక్కడ అతనికి నోటీసును జారీ చేయవచ్చు. నోటీసును స్వీకరించడానికి ప్రతివాది నిరాకరించినప్పుడు, లేదా ఎదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ నోటీసును ఆ పనిచేసే స్థలంలోని ఇన్‌చార్జికి అందచేయవచ్చు, లేదా ఆ స్థలంలో ప్రముఖమైన ప్రదేశంలో నోటీసును అతికించవచ్చు.

రక్షణాధికారే స్వయంగా నోటీసును అందచేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. నియమం-12(2) ప్రకారం నోటీసును అందచేసే బాధ్యతను ఇతరులకు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కోర్టు కూడా ఇతరుల ద్వారా నోటీసును జారీ చేయించ వచ్చు. రక్షణాధికారి స్వయంగా నోటీసు అందచేయవచ్చు. ఇతర ఏజెన్సీల ద్వారా నోటీసును రక్షణాధికారి అందేట్టు చేయవచ్చు. కోర్టుల్లో ఉన్న ప్రాసెస్‌ సర్వర్ల ద్వారా నోటీసును అందించవచ్చు. పోలీసుల ద్వారా నోటీసులను అందించవచ్చు. నోటీసు జారీ అయిన తర్వాత కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలుకు రక్షణాధికారి కృషి చేయాల్సి ఉంటుంది. ఏక పక్ష మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి రక్షణాధికారి గృహాన్ని సందర్శించి నివేదికను అందించవచ్చు. ప్రతివాది ఆర్థిక హోదా గురించి అవసరమైన విచారణ జరిపి నివేదికను ఇవ్వవచ్చు. ఇవి కాకుండా మేజిస్ట్రేట్‌ అప్పగించిన ఇతర బాధ్యతలు కూడా నిర్వర్తించాలి. గృహహింస చట్ట ప్రకారం విచారణ తేదీల్లో తప్పకుండా రక్షణాధికారి హాజరు ఉండాలన్న నియమం లేదు కాని ప్రొసిడింగ్స్‌ వివరాలను తెలుసుకొని కోర్టుకు తన సహాయాన్ని అందించడం అత్యంత అవసరం.

గృహహింస చట్టంలోని సె-23(2) ప్రకారం మధ్యంతర ఏకపక్ష ఉత్తర్వులను మేజిస్ట్రేట్‌ సె-18,19,20,21 లేదా 22లను అన్వయిస్తూ జారీ చేయవచ్చు. అయితే నియమం -10 (1)(ఎ) ప్రకారం గృహాన్ని సందర్శించి నివేదికను సమర్పించమని మేజిస్ట్రేట్‌ రక్షణాధికారిని కోరవచ్చు. ఈ ఒక్క సందర్భంలోనే గృహాన్ని సందర్శించే అధికారం రక్షణాధికారికి ఉంటుంది. మేజిస్ట్రేట్‌ కోరిన పద్ధతుల్లోనే ఈ విచారణని జరపాల్సి ఉంటుంది. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిన బాధ్యత రక్షణాధికారిపై ఉంటుంది. ఇందుకు అవసరమైన సహాయాన్ని కోర్టుకు అందించాలి. అవసరమైనప్పుడు పోలీసుల సహాయాన్ని మేజిస్ట్రేట్‌ కల్పించవచ్చు.
సె-9(2) ప్రకారం రక్షణాధికారులు మేజిస్ట్రేట్‌ పర్యవేక్షణలో, నియంత్రణలో బాధ్యతలు నిర్వర్తిస్తారు. అదే విధంగా ప్రభుత్వ నియంత్రణలో చట్టానికి లోబడి పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కీములను అమలు చేసే దిశగా దృష్టి సారించాలా, లేక కోర్టు ఉత్తర్వుల అమలు కోసం దృష్టి సారించాలా అన్న మీ మాంసకు రక్షణాధికారులు గురయ్యే అవకాశంఉంది. ఈ రెండిం టిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్లకు అర్థం కాని పరిస్థితి. చట్టం అమలులో ఏవైనా లోపాలుంటే కోర్టు ముందు దోషిగా నిలబడాల్సి వస్తుంది. అదే విధం గా ప్రభుత్వ స్కీముల అమల్లో లోపాలుంటే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో రక్షణాధికారులు పని చేస్తున్నారు.

రచయిత నిజామాబాద్‌ జిల్లా
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers