Friday, April 10, 2009

soodalu avasarame kaani...surya daily 11-4-09

సోదాలు అవసరమే, కానీ...

సోదా అనేది మామూలు విషయం కాదు. వ్యక్తుల గుప్తత హక్కులలోకి జోరబడటమే. సమాజ శ్రేయస్సు రీత్యా సోదాలు అవసరమే. అయితే సోదాలు చట్టం నిర్దేశించిన పద్దతుల్లో జరగాలి. సమాజ శ్రేయస్సుకి తగినట్టుగా చట్టం లేకపోతే తగు మార్పులు చట్టంలో తీసుకొని రావాలి.ఈ పరిస్థితుల్లో సోదాలని ఆమోదించలేం. అట్లా అని వద్దని కూడా అనలేని పరిస్థితి.

కారులో వెళ్తున్న వ్యక్తులని ఆపి కారుని సోదా చేస్తున్నారు. ఆ కారులో ఏమైనా డబ్బులు ఉంటే వాటిని పోలీసులు జప్తు చేసుకుంటున్నారు. వివాహం ఉందని, నగలు కొనడానికి డబ్బులు తీసుకెళ్తున్నామని చెబుతున్నా జప్తు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వ్యక్తులు తమ బంథువుల కోసం డబ్బు పంపిస్తూ ఉంటారు. ఆ మనీటాన్స్‌ఫర్‌ ఏజంట్లు డబ్బు తీసుకొని వెళ్ళి అందించలేని పరిస్థితి ఏర్పడింది. బీడీి కార్మికులకి జీతం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటికి కార ణం ఎన్నికలు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి పోలీసులు సోదా చేసి డబ్బుని జప్తు చేస్తున్నారు. ఇది మంచి పనే, కానీ ఇందు వల్ల కొంత మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ ఓ ప్రశ్న తలెత్తుతుంది. పోలీసులకి ఈ విధంగా సోదా చేసే అధికారం ఉందా?ఈ అధికారం లేకపోతే తలెత్తె పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ అధికారం పోలీసులకి లేకపోతే అక్రమ డబ్బు రవాణాను నియంత్రించే అవకాశం ఉండదు. ఉగ్రవాదులు పారిపోతున్నప్పుడు వాళ్ళని పట్టుకునే అవకాశం ఉండదు. ఆర్‌డిఎక్స్‌ లాంటి ప్రేలుడు పదార్థాలను, ఆయుధాలను తరలించడాన్ని అపే పరిస్థితి ఉండదు. అందువల్ల పోలీసులు చేసే సోదాలకి అంద రూ సహకరించాలి. అయితే ఈ విధంగా సోదా చేసే అధికారం పోలీసులకి ఉందా? లేకపోతే చట్టంలో తీసుకరావల్సిన మార్పు లేమిటి? సోదాలు చేయడం గురించి, దర్యాప్తు గురించి వివరించే పద్ధతులు ఉన్న చట్టం ‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’. ప్రత్యేకమైన చట్టాల్లో ప్రత్యేకమైన దర్యాప్తు పద్ధతులు ఉంటాయి. వాటి విషయం ప్రక్కన పెట్టి, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం పోలీసులకి ఉన్న అధికారాలు ఏమిటి? ఓ కారుని సోదా చేసే అధికారం పోలీసులకి చట్ట ప్రకారం ఉందా?పరిశీలించడం, సోదా, జప్తు అన్న మూడు పద బంధాల అర్థాలను తెలుసుకోవాలి. ‘పరిశీలించడం’ అంటే దగ్గరగా చూడడం లేదా అధికారికంగా పరిశీలించడం. ‘సోదా’ అంటే మామూలుగా చూడటం మాత్రమే కాదు, ఏదైనా వస్తువును మరుగు పరిచినారా లేదా దాచి ఉంచినారా అన్నది కనుక్కోవడం. ఇక ‘జప్తు’ అంటే ఏదైనా వస్తువుని ఆధీనంలోకి తీసుకోవడం.సోదాలు రెండు రకాలు. అవి- వ్యక్తుల కోసం వెతకడం, వ్యక్తులని వెతకడం. పత్రాల కోసం, వస్తువుల కోసం వెతకడమంటే సోదా జరపడం. వ్యక్తుల కోసం వెతికే పద్ధ్దతిని మరి రండు రకాలుగా విభజించే అవకాశం ఉంది. ఆరెస్టు చేయాల్సిన వ్యక్తుల కోసం సోదా (సె.44 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, అక్రమంగా నిర్బంధించిన వ్యక్తుల కోసం వెతకడం (సె.97 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌). అరెస్టైన వ్యక్తులను సోదా చెయ్యడం (సె. 51 క్రి.ప్రొ.కో).పత్రాల కోసం, వస్తువుల కోసం జరిపే సోదాలని రెండు రకాలుగా వర్గీకరించే అవకాశం ఉంది. వారంట్‌ ద్వారా సోదా జరపడం (సె. 93,94,95,100 ్రక్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌), అత్యవసరమైన పరిస్థితుల్లో వారంట్‌ లేకుండా సోదా జరపడం (సె.165,166 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌).సోదా జరుపకుండా జప్తు కూడా చేసే అవకాశం ఉంది. నేరం చేసే ఆయుధాలు ఉన్నప్పుడు వాటిని జప్తు చేసే అవకాశం ఉంది (సె. 52 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌). కొన్ని రకాలైన ఆస్తులను పోలీసులు జప్తు చేసే అధికారం (సె. 102 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌). తన సమక్షంలో సోదా చెయ్యమని మేజిస్ట్రేట్‌ ఆదేశించే అధికారం (సెజ 103 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌). ఈ నిబంధనల ప్రకారం పోలీసులకి ఏ అధికారాలు ఉన్నా యో, వాళ్ళ అధికార పరిధి ఏమిటో పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.వ్యక్తుల కోసం సోదాను రెండు నిబంధనల ప్రకారం జరపడానికి అవకాశం ఉంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సె. 47,97 ప్రకారం, అలాగే అరెస్టు చేయాల్సిన వ్యక్తుల కోసం సె. 47 ప్రకారం సోదా జరుపవచ్చు. ఈ అధికారం పోలీసులకు ఉంది, ఇతర వ్యక్తులకూ ఉంది. ఈ సోదా పోలీసులు వారంట్‌ అమలు చేయడం ద్వారా చేయవచ్చు. వారంట్‌ లేకుండా కూడా సోదా జరుపవచ్చు. ఇతర వ్యక్తులు మాత్రం వారంట్‌ లేకుండా సోదా చేసే అవకాశం లేదు. ఏ ప్రాంతంలో ఈ సోదాను చేస్తున్నారో, ఆ ప్రాంతం (ఇల్లు) ఎవరి ఆధీనంలో ఉందో, ఆ వ్యక్తి పోలీసులకు సహకరించాలి. అవసరమైన సౌకర్యాలను కల్పించాలి. ఎవరి కోసమైతే సోదా చేస్తున్నారో ఆ వ్యక్తి పారిపోయడని భావించినప్పుడు, ఆ ఇంటి యజమాని సహకరించనప్పుడు పోలీసులకి తలుపులని బద్దలు కొట్టే అధికారం ఉంటుంది. సోదా పూర్తి ఆయన తరువాత ఎవరినైతే అరెస్టు చేయాల్సి ఉందో వాళ్ళని అరెస్టు చేయవచ్చు. అరెస్టయిన వ్యక్తిని సోదా చేసే అధికారం సె. 51 ప్రకారం పోలీసులకు ఉంది.ఎవరినైనా అక్రమంగా నిర్బంధించినప్పుడు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సె. 97 ప్రకారం వారంట్‌ ద్వారా సోదా జరిపి వాళ్ళని ఆ నిర్బంధం నుంచి విడిపించే అవకాశం ఉంది. ఈ వారంట్‌ని జిల్లా మేజిస్టేట్‌ నుంచి గానీ, సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ నుంచి గానీ, జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ నుంచి గానీ పొందవచ్చు. వస్తువుల కోసం, పత్రాల కోసం వారంట్‌ ద్వారా సోదా జరపాలి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సె. 100 ప్రకారం మూసి ఉన్న ‘ప్రదేశాన్ని’ ఏ విధంగా సోదా చేయవచ్చో తెలుసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వారంట్‌ లేకుండా కూడా సోదా జరుపవచ్చు.క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సె. 165 పోలీస్‌ స్టేషన్‌ ఇంచార్జి అధికారి లేదా కేసుని దర్యాప్తు చేస్తున్న అధికారి తన పోలీసు స్టేషన్‌ అధికార పరిథిలో సోదా ఎలా చెయ్యాలో వివరిస్తుంది. తన అధికార పరిథి వెలుపల సోదా ఏ విధంగా జరుపాలో సె. 166 వివరిస్తుంది.తన దర్యాప్తుకి అవసరమైన వస్తువులు ఏ ప్రదేశంలోనైనా ఉన్నాయని ఆ పోలీసు అధికారికి అన్పించినప్పుడు, వారంట్‌ తీసుకోవడం వల్ల జాప్యం జరుగుతుందని భావించనప్పుడు, ఆ కారణాలని రాసి ఆ ‘ప్రదేశాన్ని’ సోదా చేయాలి. తయారు చేసిన రికార్డును సంబంధిత జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కి పంపించాలి. తన అధికార పరిథి వెలుపల సోదా చేసినప్పుడు, ఆ విషయాన్ని సంబంధిత పోలీసు అధికారికి తెలియచెయ్యాలి. అతన్నీ సోదా జరుపమని కోరాలి. అత్యవసర పరిస్థితుల్లో నోటీసు ద్వారా సంబంధిత పోలీసు అధికారికి తెలియపరిచి అధికార పరిధి వెలుపల సోదా చేయవచ్చు. ‘ప్రదేశాన్ని’ సోదా చేయవచ్చు.‘ప్రదేశం’ అంటే ఏమిటో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని 2(పి)లో వివరించారు. ఆ ప్రకారం ఇల్లు, బిల్టింగ్‌, వాహనం, గుడారం, ఓడల్లాంటివి. అయితే ఏదైనా కేసులో దర్యాప్తులో భాగంగా మాత్రమే సోదా చెయ్యడానికి అవకాశం ఉంది. ఎలాంటి కేసు దర్యాప్తులో లేకుండా కారుని సోదా జరుపడానికి అవకాశం లేదు. ‘ప్రదేశాన్ని’ (కారుని కూడా) సోదా చెయ్యాలంటే ఇద్దరు గౌరవ ప్రదమైన సాక్షుల సమక్షంలోనే సె. 100 ప్రకారం సోదా జరుపాల్సి ఉంటుంది. మిగతా విధంగా చేస్తున్న సోదాలు చట్టబద్ధ్దమైనవి కాదు.సె. 102 ప్రకారం సోదా చెయ్యకుండా రెండు షరతుల ప్రకారం ఏదైనా ఆస్తిని జప్తుచేసే అధికారం ఉంది. మొదటిది, ఆ ఆస్తి దొంగలించిన ఆస్తి కావాలి. రెండవది, ఏదైనా నేరం జరిగిందన్న అనుమానం ఉన్న ఆస్తి అయినా కావాలి. అంతే కానీ ఇలాంటి ఆస్తిని వాహనాల నుంచి జప్తు చేసే అధికారాన్ని చట్టం పోలీసులకి ఇవ్వలేదు. జప్తు చేసిన ఆస్తిని సంబంధిత జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కి పంపించాలి.కానీ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌కి కాదు. అదాయపు పన్ను చట్ట ప్రకారం జప్తు చేయాలంటే కూడా వారంట్‌ అవసరం.జరుగుతున్న సోదాలని గమనిస్తే అవి చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో జరుగుతున్నట్టు అనిపించడం లేదు. ఆస్తులని జప్తు చేస్తున్నారు. జప్తు చేసిన ఆస్తులని ఎగ్జిక్యూటివ్‌ మేడిస్ట్రేట్‌ దగ్గరికి పంపిస్తున్నారు. సోదా అనేది మామూలు విషయం కాదు. వ్యక్తుల గుప్తత హక్కులలోకి జోరబడటమే. సమాజ శ్రేయస్సు రీత్యా సోదాలు అవసరమే. అయితే సోదాలు చట్టం నిర్దేశించిన పద్దతుల్లో జరగాలి. సమాజ శ్రేయస్సుకి తగినట్టుగా చట్టం లేకపోతే తగు మార్పులు చట్టంలో తీసుకొని రావాలి. ఈ పరిస్థితుల్లో సోదాలని ఆమోదించలేం. అట్లా అని వద్దని కూడా అనలేని పరిస్థితి. ఎందుకంటే ఇది ఎన్నికల సందర్భం.

రచయిత నిజామాబాద్‌ జిల్లాన్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

3 comments:

  1. ఈ ఎన్నికల తరువాత, ఈ కారు సోదాలు ఆగగలవని ఆశిద్దాము.

    ReplyDelete
  2. మంచి సమాచారం ఇచ్చారు .

    ReplyDelete
  3. మంచి సమాచారం. ధన్యవాదాలు.

    ReplyDelete

Followers