Friday, April 17, 2009

వైద్య ఖర్చులు మనోవర్తిలో భాగమే

భార్య వైద్యం కోసం అయిన ఖర్చు కూడా మనోవర్తిలో భాగమే. ఇది పురోగతి ఉన్న తీర్పు. వైద్య ఖర్చులను భార్య భర్త నుంచి పొందవచ్చు. వైద్యం ఖర్చులను కూడా భర్త చెల్లించవలసి ఉంటుందా?

మనోవర్తి అన్న నిర్వచనంలో వైద్యం ఖర్చులు కూడా ఉంటాయా? మనోవర్తి (మెయింటైనెన్స్‌), చేయూత (సపోర్ట్‌) అన్న పదాలలో వైద్యఖర్చులు కూడా ఉంటాయా? భార్య, ఆమె వైద్యానికి పెట్టుకొన్న ఖర్చులను భర్త తిరిగి చెల్లించవలసి ఉంటుందా? ఈ ప్రశ్నలు రాజేశ్‌ బర్మన్‌ వర్సెస్‌ మిధుల్‌ ఛటర్జీ 2008 (14) స్కేల్‌ 372 కేసులో సుప్రీం కోర్టు ముందు తలెత్తినాయి.

మనోవర్తి, చేయూత అన్న పదాల్లో జీవనం, ఆహారం, దుస్తులు, నివాసం, వినోదం, ఆరోగ్యం, సరైన రక్షణ, నర్సింగ్‌, ఆరోగ్యం బాగోలేనప్పుడు వైద్యసహాయం లాంటివన్నీ ఇమిడి ఉన్నాయని సుప్రీంకోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది. మనోవర్తిలో భాగంగా భార్య వైద్యం కోసం అయిన ఖర్చులను తిరిగి పొందే అవకాశం ఉందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. కేసులోని విషయాలకు వస్తే, రాజేశ్‌ బర్మన్‌కి మిధుల్‌ చటర్జీకి మధ్య వివాహం 2000 జనవరి 26న కొల్‌కతాలో జరిగింది. వివాహం తరువాత మిధుల్‌ ముంబాయికి వచ్చి భర్తతో నివసించడం మొదలు పెట్టింది. వివాహమైన సంవత్సరం తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. చివరికి పోలీసు స్టేషన్‌కు, కోర్టులకు వెళ్ళారు.

2001 జూన్‌ 16న ఆఫీసులో పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల రాత్రి 9.20 గంటల వరకు ఉండిపోవాల్సి వచ్చిందని, సమయానికి ఇంటికి రానందుకు కోపగించుకొన్న భార్య ఆఫీసుకి వచ్చి గొడవ చేసి వెళ్ళిందని, రాత్రి 1.30 గంటల ప్రాంతంలో తాను ఇంటికి వెళ్ళానని, తన భార్య అందరి ముందు కోపంతో ఊగిపోయి తిట్ల పురాణం అందుకొందని, ఆమె కోపం చల్లారకపోవడంతో తాను బయటకు వెడుతుంటే తనని ఆపే ప్రయత్నంలో మెట్లమీంచి జారి పడిందని అందువల్ల ఆమెకు ఎడమ చెయ్యి విరిగిందని రాజేశ్‌ తన జవాబులో పేర్కొన్నాడు.

తనని బెదిరించి హింసించినారని, తనను కొట్టడం వల్ల తన చెయ్యి విరిగిందని చటర్జీ వాదన. ఈ సంఘటన జరిగిన తర్వాత పది రోజులకు 2001 జూన్‌ 26వ తేదీన చటర్జీ పోలీసుకు ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సె.498 ఎ, సె.325, 406, 506 ప్రకారం కేసు నమోదు చేసి రాజేశ్‌ని, అతని తల్లిని అరెస్టు చేశారు. ఈ క్రిమినల్‌ కేసును రద్దు చేయాలని రాజేశ్‌ హై కోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకొన్నాడు.

ఇది ఇలా ఉండగా, మిధుల్‌ చటర్జీకి 2001 జూన్‌ 19 నాడు, 2002 మే2వ తేదీన రెండు సార్లు ఆపరేషన్లు జరిగాయి. ఆమె పశ్చిమ బెంగాల్‌లోని ఆలీపూర్‌ జిల్లా కోర్టులో వివాహం రద్దు గురించి 2001 జూలై 1వ తేదీన దావాను దాఖలు చేసింది. తన భర్త ఆధీనంలోని వస్తువులను తనకు తిరిగి ఇప్పించాలని, భరణం కూడా ఇప్పించాలని ఆమె దరఖాస్తులో కోరింది. తన వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు రూ.382,262.75లను తన భర్తనుంచి తనకు తిరిగి ఇప్పించాలని కూడా మరో దరఖాస్తును ఆ కేసులో దాఖలు చేసింది.

వైద్యం ఖర్చులు చెల్లించాలని చట్టంలో ఎక్కడా లేదని, తన భార్య కూడా ఉద్యోగం చేసి సంపాదిస్తున్నదని, ఇన్స్యూరెన్స్‌ కంపెనీ నుంచి కూడా డబ్బును వైద్య ఖర్చుల కింద పొందిందని రాజేశ్‌ జిల్లా కోర్టులో వాదించాడు. ఆ వాదనలను జిల్లా జడ్జి అంగీకరించలేదు. కానీ, ఇన్స్యూరెన్స్‌ కంపెనీ నుంచి ఆమెకు లభించిన రూ.76181ని తగ్గించి మిగతా మొత్తం రూ.306,181ను భార్యకి చెల్లించాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుకి వ్యతిరేకంగా రాజేశ్‌ హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు. విమాన ఖర్చులు రూ.21,668లను అదే విధంగా రూ.62,155లను తగ్గించి మిగతా డబ్బు చెల్లించాలని రాజేశ్‌ను హైకోర్టు ఆదేశించింది.

చివరికి రాజేశ్‌ సుప్రీం కోర్టుకు వచ్చాడు. ప్రమాదం వల్ల ఆమె చెయ్యి విరిగిందని, దానికి తన పాత్ర లేదని, అందుకని కింది కోర్టుల ఉత్తర్వులు సరి కాదని కోర్టు ముందు వాదనలు చేశాడు. చట్టం, 1954 ప్రకారం వైద్యఖర్చులను చెల్లించాల్సిన అవసరం లేదని కూడా వాదించాడు. తాను ఉద్యోగం చేస్తున్నదన్న విషయాన్ని, ఇన్స్యూరెన్స్‌ కంపెనీ నుంచి డబ్బులు వచ్చిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మరుగు పరిచిందని, ఈ కేసులు తనను వేధించడానికి మాత్రమే దాఖలు చేసిందని కూడా వాదనలు చేశాడు. తనని భర్త తోసివేయడం వల్లనే గాయాలైనాయని, తాను అదృష్టవశాత్తు బతికి బట్ట కట్టానని, విమాన ఖర్చులను హైకోర్టు తొలగించింది కానీ వైద్యఖర్చులను పొందడానికి అర్హత లేదని అనలేదని, మనోవర్తి, చేయూత అన్న పదాల్లో వైద్యఖర్చులు కూడా ఇమిడి ఉన్నాయని కోర్టు ముందు మిధుల్‌ చటర్జీ వాదనలు చేసింది.

ప్రత్యేక వివాహ చట్టం, 1954 ప్రకారం భార్య కేసును దాఖలు చేసింది. ఈ చట్టంలోని సె.36 ప్రకారం, ప్రొసీడింగ్స్‌ విచారణలో ఉన్నప్పుడు తాత్కాలిక మనోవర్తిని ఇప్పించే అధికారం జిల్లా కోర్టుకు ఉంటుంది. అదే విధంగా సె.37 ప్రకారం శాశ్వత మనోవర్తిని నెలవారీగా గానీ, క్రమానుగతంగా గానీ, ఏకమొత్తంగా కానీ భార్యకి చెల్లించాల్సి ఉంటుంది. మనోవర్తి, చేయూత అన్న పదాలకు విస్తృత అర్ధం ఉందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ రెండింటిలో వైద్యం ఖర్చులు కూడా వస్తాయని స్పష్టం చేసింది. మనోవర్తి, చేయూత అన్న పదాలలో జీవనం, ఆహారం, దుస్తులు, నివాసం, వినోదం, రక్షణ, నర్సింగ్‌, వైద్య సదుపాయాలు ఉంటాయని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది. ఈ కారణాలను పేర్కొంటూ భర్త అప్పీలు ను తోసిపుచ్చింది. వైద్యంకోసం అయిన ఖర్చు కూ డా మనోవర్తిలో భాగమే. ఇది పురోగతిఉన్న తీర్పు. వైద్యఖర్చులను భార్య భర్తనుంచి పొందవచ్చు.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers