Wednesday, May 5, 2010

వీలునామా ఎవరు రాయవచ్చు..?

వీలునామా ఎవరు రాయవచ్చు..?
May 4th, 2010

ఒక వ్యక్తి తన మరణం తర్వాత తనకున్న ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలో, ఎలా పంపకాలు జరగాలో తెలియబరిచే చట్టబద్ధమైన ప్రకటనగల డాక్యుమెంటును వీలునామా అంటారు. వీలునామా దాని కర్త తదనంతరమే అమల్లోకి వస్తుంది.

వీలునామా ఎవరు రాయవచ్చు?

-మైనరు కాకుండా స్థిరచిత్తంగల ఏ వ్యక్తి అయినా తన ఆస్తిని ఇతరులకు వీలునామా ద్వారా హస్తగతం చేయవచ్చు.
-మత్తులో వున్నప్పడుగానీ తీవ్ర అనారోగ్యంతో వున్నప్పుడుగానీ వేరే ఇతరమైన కారణాలలోనైనా వుండి తానేం చేస్తున్నాడో తెలియని పరిస్థితిలో వున్న వ్యక్తులు వీలునామా రాయడానికి వీల్లేదు (సె.59 భారతీయ వారసత్వ చట్టం)
-తన జీవితకాలంలో తన ఆస్తిని ఇతరులకు హస్తగతం చేసే అధికారం గల ఏ స్ర్తి అయినా, పెళ్ళైనప్పటికీ, వీలునామా ద్వారా ఇతరులకు తన ఆస్తిని సంక్రమింపచేయవచ్చు.
-చెవిటి, మూగ, అంధత్వంగల వ్యక్తులు కూడా వీలునామా ద్వారా తమ ఆస్తిని ఇతరులకు హస్తగతం చేయవచ్చు. అయితే ఆ వ్యక్తులకి తాము ఏం చేస్తున్నామోనన్న విషయం తెలిసి వుండాలి.
-పిచ్చివున్న వ్యక్తి అయినా పిచ్చి విరామం వుండే కాలంలో వీలునామా వ్రాయవచ్చు.

వీలునామా ఎలా రాస్తారు?

-రాతపూర్వకంగా వుండాలి.
-వీలునామా రాసిన వ్యక్తి సంతకం వుండాలి.
-ఇద్దరు సాక్షుల సంతకం కలిగి వుండాలి.
వీలునామా రాతపూర్వకంగా వుండాలి. అంటే అది టైపులోగానీ ప్రింటులోగానీ వేరే ఇతర రూపంలోనైనా రాయబడి వుండాలి. వీలునామా తప్పనిసరిగా కాగితంపైనే రాసి వుండాలని ఏమీ లేదు. దేనిమీదనైనా రాసి వుండవచ్చు. పశ్చిమ దేశాల్లో వీడియోల ద్వారా టేప్‌ల ద్వారా వున్న వీలునామాలను కూడా ఆమోదిస్తున్నారు. కాని మన దేశంలో ఇంకా అటువంటి పరిస్థితి లేదు.

వ్యక్తి సంతకం

వీలునామా పత్రంపై అది రాయించిన వ్యక్తి సంతకంగానీ, వేలిముద్రగానీ వుండాలి. ఒకవేళ అతను వేలిముద్రగానీ సంతకం గానీ పెట్టలేని పరిస్థితిలో వున్నప్పుడు అతను తన సమక్షంలో వేరే వ్యక్తులని సంతకం పెట్టమని ఆదేశించవచ్చు. సాధారణంగా సంతకాలు చివర్లో వుంటాయి. చివర్లోనే వుండాలన్న నియమం ఏమీ లేదు.

సాక్షుల సంతకాలు

ప్రతి వీలునామా తప్పనిసరిగా ఇద్దరు సాక్షులతో సంతకం చేసి వుండాలి. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఒకేసారి సంతకాలు చేయాలన్న నియమం ఏమీ లేదు. కాని వీలునామా రాసిన వ్యక్తి వాళ్ళ సమక్షంలో వీలునామా పత్రంపై సంతకమన్నా చేసి వుండాలి. లేదా ఆ విషయాన్ని వాళ్ళ సమక్షంలో ఒప్పుకొనైనా వుండాలి. సాక్షులిద్దరూ వీలునామా కర్త సమక్షంలోనే సంతకాలు చేయాలి.
మైనరు కాని ఏ వ్యక్తులైనా సాక్షులుగా వుండవచ్చు. ఈ సాక్షులకి వీలునామా పత్రంలోని విషయాలు మొత్తం తెలిసి వుండాల్సిన అవసరం లేదు. కాని వీలునామా కర్త వాళ్ళ సమక్షంలో సంతకమన్నా చెయ్యాలి. లేదా చేసినట్టు ఒప్పుకోనైనా వుండాలి (సె.63, భారతీయ వారసత్వ చట్టం).
సాక్షి లబ్దిదారుడైనప్పుడు
వీలునామాలోని సాక్షికి కూడా ఏమైనా ఆస్తి చెందేట్టు వుండి, లబ్దిదారుడైనప్పటికీ, వీలునామా అమలు అది ఆటంకం కాదు. అయితే లబ్దిదారులకు మాత్రం ఆ వీలునామా చెల్లదు. ఈ నిబంధన హిందువులకి వర్తించదు. (సె.67 భారతీయ వారసత్వ చట్టం)

వీలునామా భాష

వీలునామాలోని భాష సరళంగా స్పష్టంగా ఎలాంటి అనుమానాలకి తావు లేకుండా వుండాలి. సాంకేతిక చట్టపరమైన పరిభాష ఉండాలని ఏమీ లేదు. కానీ వీలునామా చదవగానే వీలునామా కర్త ఉద్దేశ్యం స్పష్టంగా అర్థమయ్యేట్లు వుండాలి.

వీలునామాలో కింది విషయాలు స్పష్టంగా వుండాలి

-వీలునామా ద్వారా ఆస్తి ఎవరికి చెందాలో స్పష్టంగా పేర్కొనాలి.
-అలాగే ఆస్తిలో ఎలాంటి హక్కులు అతనికి ధారాదత్తం చేయబడ్డాయో పేర్కొనాలి.
-ఆస్తి వ్యక్తికి ఎప్పటినుంచి చెందాలో (అంటే మైనారిటీ తీరిన తరువాత గానీ లేక వివాహమైన తరువాత) స్పష్టంగా పేర్కొనాలి.
ఎవరైనా వ్యక్తి జైల్లో వున్నప్పుడు వీలునామా రాయవచ్చు. జైల్లో వీలునామా రాసినంత మాత్రాన ఎవరి ఒత్తిడి వల్లనో రాసినట్టు అనుకోవడానికి వీల్లేదు (సె.61, భారతీయ వారసత్వ చట్టం).

వీలునామా ఎప్పుడు చెల్లదు?Bold

ఎవరైనా వ్యక్తి మోసం చేసిగానీ, ఒత్తిడి చేసిగానీ వీలునామా రాయిస్తే అది చెల్లదు.
ఉదాహరణకు వీలునామా కర్తని చంపుతామని బెదిరించి వీలునామా రాయించినపుడు, అతని పరువు ప్రతిష్ఠలకి భంగం కలిగిస్తామని ఒత్తిడి తెచ్చినపుడు, అతని కొడుకు తప్పు పని చేసాడని తెలియకుండా వుండాలంటే వీలునామా వ్రాయాలని రాయించినపుడు అవి చెల్లవు (సె.61, భారతీయ వారసత్వ చట్టం).
పెళ్ళి అయిన తరువాత...
వీలునామా కర్త పెళ్లయిన తర్వాత వీలునామా దానంతట అదే రద్దవుతుంది. కానీ ఈ నిబంధన హిందువులకి, ముస్లింలకు వర్తించదు. *

2 comments:

  1. ఆస్తులు సంగతి తర్వాత అప్పుల మాటేమిటీ ?పక్కింటి వాళ్ళకి రాసేయ్యోచ్చoటారా?jk ;)

    ReplyDelete

Followers