Friday, June 26, 2009


నేరబాధితులకు మేలు చేసే నిబంధనలు 27.6.09

‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సవరణల) బిల్లు 2008’ చట్ట రూపంగా మారింది. కానీ అది అమల్లోకి రాలేదు. అమలు తేదీని ప్రభుత్వం ప్రకటించలేదు. దేశ వ్యాప్తంగా ఈ చట్టం గురించి క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థతో సంబంధం ఉన్న అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. న్యాయవాదులు తమ విధులను బహిష్కరించారు. ఆ ఒత్తిడి వల్ల ఆ చట్టం అమలుకు నోచుకోలేదు. ఏ చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుందో తెలియని పరిస్థితి మనదేశంలో నెలకొన్నది. ఆ చట్టంలో అరెస్టు విషయం గురించి తెచ్చిన సవరణల పట్ల తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. అయితే బాధితుల గురించి గతంలో కొంత చర్చించడం జరిగింది. ఈ సరవణల గురించి న్యాయ వాదులకు అభ్యంతరాలు లేవు. కనీసం ఈ నిబంధనలనైనా ప్రభుత్వం అమల్లోకి తెచ్చే విధంగా ప్రకటన జారీ చేస్తే బాగుండేది. కానీ అది ఇంకా జరగలేదు. వీటి అమలు కోసం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే బాగుండేది. ఆ సవరణలను పరిశీలిద్దాం. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో ఎక్కడైనా నేరస్థుల ప్రస్తావన, ముద్దాయిల హక్కుల గురించిన నిబంధనలే కనిపిస్తాయి కానీ బాధితుల ప్రస్తావన కనిపించదు. ఒకటి రెండు నిబంధనల్లో వీరి ప్రస్తావన ఉంది. బాధితుల గురించిన నిర్వచనం కూడా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో లేదు. ఒక రకంగా చెప్పాలంటే, నేర న్యాయ వ్యవస్థ మరిచి పోయిన వ్యక్తి బాధితుడు/ బాధితురాలు.

ప్రతి చట్టంలో సాధారణంగా సె.2లో నిర్వచనాలు ఉంటాయి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కూడా సె.2లో చాలా పదాలను నిర్వచించారు. నేరస్థులని, బాధితులని నిర్వచించలేదు కానీ నేరస్థుల ప్రస్తావన చట్టం మొదటి నుంచి చివరి దాకా ఉంటుంది. కానీ బాధితుల గురించి రెండు, మూడు నిబంధనల్లో మినహ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. మానభంగానికి గురైన బాధితురాలికి వైద్య పరీక్ష జరిపించాలన్న నిబంధన కూడా కోడ్‌లో కనిపించదు. ఈ నేపథ్యంలో బాధితులను ఈ కొత్త చట్టంలో నిర్వచించినారు. 2(ఠ్చీ) ప్రకారం ‘బాధితులు’ అంటే నేరారోపణ ఎదుర్కొంటున్న ముద్దాయి చర్యల వల్ల, లేదా ఏదైనా చేయాల్సిన ఆ చర్య చేయకలేకపోవడం వల్ల బాధపడుతున్న వ్యక్తి. బాధితుల సంరక్షకులు, వారి చట్ట బద్ధ ప్రతినిధులు కూడా ఈ నిర్వచనంలోకి వస్తారు. వాళ్ళని కూడా బాధితులుగానే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

బాధితులు తమకి తాముగా న్యాయవాదిని నియమించుకునే అవకాశం లేదు. సె.301(2) ప్రకారం ప్రైవేట్‌ వ్యక్తులు న్యాయవాదులను నియమించుకోవచ్చు. అయితే ఆ వ్యక్తి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆదేశాలకు లోబడే పని చేయాల్సి ఉంటుంది. కోర్టు అనుమతితో రాతపూర్వకంగా వాదనలు సమర్పించే అవకాశం ఉంది. నేరాలన్నీ రాజ్యానికి వ్యతిరేకంగా చేసేవని చట్టం భావిస్తుంది. అందుకని బాధితుల తరపున ప్రభుత్వం నియమించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదిస్తాడు. కొన్ని సందర్బాలలో బాధితులు న్యాయవాదులని నియమించుకోవచ్చు. కానీ వాళ్ళు పై నిబంధన ప్రకారం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆజామాయిషీలోనే పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించి ఈ సవరణలు తీసుకొచ్చిన చట్టంలో సె.24(8) క్రింద ప్రొవిసోని ఏర్పరిచారు. ఆ ప్రకారం బాధితురాలు తనకు ఇష్టమైన న్యాయవాదిని నియమించుకోవడానికి కోర్టు అనుమతించవచ్చు.

నేరం జరిగిన సమాచారం అందగానే పోలీసు అధికారి కేసు నమోదు చేసి నేరస్థలానికి వెళ్ళాలి. నేరానికి సంబంధించిన సాక్ష్యాలు అక్కడ ఉన్నాయా లేదా పరిశీలించాలి. అదే విధంగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మానభంగానికి గురైన వ్యక్తులని కూడా కొన్ని సందర్భాలలో నేరస్థలంలోనే విచారించాల్సి రావచ్చు. అది వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ పరిస్థితిని గమనించి కోడ్‌లోని సె.157 క్రింద ప్రొవిసోని ఏర్పాటు చేశారు. మానభంగానికి గురైన బాధితురాలి వాంగ్మూలాన్ని ఆమె ఇంటి దగ్గర గానీ లేదా ఆమె ఎంపిక చేసుకున్న స్థలంలో గానీ నమోదు చేయాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఆమె వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి ఆ బాధితురాలి సంరక్షకుల సమక్షంలో లేదా తల్లిదండ్రుల సమక్షంలో లేదా బందువుల సమక్షంలో లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన సాంఘిక సేవా కార్యకర్త సమక్షంలో నమోదు చేయాల్సి ఉంటుంది.

పిల్లలపైన జరిగిన లైంగిక దాడుల కేసులు, మానభంగానికి సంబంధించిన కేసుల దర్యాప్తు నిర్దేశించిన కాల పరిమితిలోగా జరగాలి. ఈ విధంగా సె. 173 (ఐఎ) నిబంధనను ఏర్పరిచారు. ఈ నిబంధన ప్రకారం ఆ నేర సమాచారం నమోదు చేసిన తేదీ నుంచి 3 నెలల్లోగా ఈ దర్యాప్తులను పోలీసు అధికారులు తప్పక పూర్తి చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఈ నేరాల విచారణను సాధ్యమైనంతవరకు మహిళా న్యాయమూర్తులు, మహిళా మేజిస్ట్రేట్‌లు జరపాలి. అంతే కాదు, ఈ నేరాల విచారణ గోప్యంగా జరపాల్సి ఉంటుంది. ఈ నేరాలకి సంబంధించిన సమాచారాన్ని పత్రికల్లో ప్రచురించవచ్చు కానీ బాధితురాలి చిరునామా వివరాలు రహస్యంగా ఉంచాల్సి ఉంటుంది.

బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో సె.357 నిబంధన ఉంది. ఈ నిబంధన బాధితుల అవసరాలని పూర్తిగా తీర్చడం లేదు. ఈ విషయాన్ని గమనించి చట్టంలో సె.357(డి) అన్న కొత్త నిబంధనను చేర్చారు. సె.357 ప్రకారం ముద్దాయిల నుంచి మాత్రమే నష్టపరిహారాలను కోర్టులు మంజూరు చేసేవి. ముద్దాయిల ఆర్థిక స్తోమత బాగులేకపోతే బాధితులకు కోర్టు మంజూరు చేసిన నష్టపరిహారం లభించక పొయేది. ఈ కొత్త నిబంధన ఆ పరిస్థితిని అధిగమిస్తుంది.

అదే విధంగా ముద్దాయికి శిక్ష పడినప్పుడు మాత్రమే కోర్టులు నష్టపరిహారం చెల్లించమని ముద్దాయిని ఆదేశించే పరిస్థితి ఉంది. సె.357(ఎ) ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ఓ స్కీమును తయారు చెయ్యాలి. నేర బాధితుల, వారిపై ఆధారపడ్డ వ్యక్తులకు జరిగిన నష్టాన్ని పూరించడానికి, వారికి పునరావాసం కల్పించే విధంగా ఈ స్కీముని తయారు చెయ్యాలి. కోర్టులో నేర విచారణ పూర్తి అయిన తరువాత నేర బాధితుల పునరావాసానికి అవసరమైన నష్టపరిహారాన్ని కోర్టు సె.357 ప్రకారం చెల్లించమని ఆదేశించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ విధంగా ఆదేశించిన మొత్తం బాధితుల పునరావాసానికి సరిపోదని కోర్టు భావించినప్పుడు వాళ్ళకి తగిన నష్టపరిహారం చెల్లించమని సిఫారసు చేసే అవకాశం ఉంది.

రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు ఈ సిఫారసులను పరిశీలించి అవసరమైన నష్టపరిహార మొత్తాన్ని నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ నిర్ధారించిన మొత్తాన్ని ఈ స్కీమ్‌ ద్వారా ఏర్పరిచిన మొత్తం నుంచి చెల్లించాల్సి ఉంటుంది. నేర విచారణ జరగనప్పుడు కూడా బాధితులు ఈ స్కీము ద్వారా నష్టపరిహారాలని కోరే అవకాశం ఉంది.సె.372కి కూడా ఒక ప్రొవిసోని ఏర్పరిచారు. ఈ ప్రొవిసో ప్రకారం బాధితులు అప్పీలు చేసే అవకాశం ఉంది. ముద్దాయిని విడుదలచేసినప్పుడు, తక్కువ శిక్ష పడినప్పుడు ఈ ప్రొవిసో ఉపయోగపడుతుంది. సవరణలు తీసుకొచ్చిన చట్టం అమల్లోకి రాకపోవడం వల్ల ఈ నిబంధనలు కూడా అమల్లోకి రాకుండా పోతున్నాయి. ఫలితంగా నేర బాధితులు నష్టపోతున్నారు. కనీసం ఈ నిబంధనల అమలు గురించి ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుండేది.

No comments:

Post a Comment

Followers