Saturday, July 11, 2009

కేసు ముందా దర్యాప్తు ముందా?

సమాజంలో గౌరవ ప్రదమైన వ్యక్తుల మీద ప్రథమ సమాచార నివేదిక విడుదల కాగానే ఆ వ్యక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. తప్పుడు కేసు పెట్టారని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని ఆందోళనలు మొదలవుతాయి. ప్రథమ సమాచార నివేదిక విడుదల తరువాత దర్యా ప్తు ఉంటుందా? దర్యాప్తు తరువాత ప్రథమ సమాచార నివేదిక ఉంటుందా? ఆధునికసమాజంలో న్యాయపరిపాలన ముఖ్యమైన అంశం. ఇది లేకుండా నాగరిక సమాజాన్ని ఊహించలేం. కాగ్నిజబుల్‌ నేరాలనేవి బాధితులకు వ్యతిరేకంగా జరిగేవి మాత్రమే కాదు, మొత్తం సమాజానికి వ్యతిరేకంగా జరిగేవి. నేరస్థుడు సమాజ హక్కుల్లోకి జొరబడే వ్యక్తి. శాంతి భద్రతలకు, వ్యక్తుల హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం తన విధి నిర్వర్తించాలంటే నేర సమాచారం తెలియా లి. నేర సమాచారంలో మొట్టమొదటి అడుగు ప్రథమ సమాచారం.ఇది అందిన తరువాతే క్రిమినల్‌ చట్టంలో చలనం కలు గుతుంది. ఆ తర్వాతే దర్యాప్తూ, విచారణ. ఆ తరువాత శిక్ష పడే అవకాశం. ప్రాసిక్యూషన్‌ కేసుకు బలాన్ని ఇచ్చే సాక్ష్యం- ప్రథమ సమాచార నివేదిక.పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జి అధికారి దర్యాప్తు మొదలు పెట్టడానికి, సాక్ష్యాలు సేకరించడానికి అవసరమైనది- ప్రథమ సమాచార నివేదిక. ఇది అతి ముఖ్యమైన, ప్రాధాన్యత కలిగిన పత్రం. ఇది స్థిరమైన సాక్ష్యం కానప్పటికీ, దీనికి అత్యంత విలువ ఉంది. ఇది ముద్దాయి ప్రయోజనాలను కాపాడుతుంది. సమాజహితాన్ని కలుగజేస్తుంది. అందుకని వివేకం కలిగిన ప్రతి మనిషి కాగ్నిజబుల్‌ నేరం జరుగగానే అది పోలీసులకు తెలియాలని కోరుకుంటాడు.ప్రథమ సమాచారం అందించడంలో జాప్యం జరిగితే దాని మీద అనుమానం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. అందులో కల్పనలు చోటు చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది. జాప్యం వల్ల సమాచార ప్రవాహం పోతుంది. జాప్యం అనేది ప్రతిసారి ప్రాసిక్యూషన్‌ కేసుకి ప్రాణాంతకం కాదు. దాని వల్ల ముద్దాయి విముక్తి పొందుతాడని అనలేం. అయితే జాప్యానికి గల కారణాలు తెలియచెయ్యాలి. ఎలాంటి వివరణ లేని జాప్యం ఉంటే కల్పితాలకు అవకాశం ఉందని కోర్టులు భావించే అవకాశం ఉంది. అలా అని సత్వరంగా ప్రథమ సమాచారాన్ని అందించ డంవల్ల ప్రాసిక్యూషన్‌ కేసు బలంగా ఉంటుందని కూడా అన లేం. కేసులోని వాస్తవ పరిస్థితులను బట్టి ప్రథమ సమాచార నివేదిక ప్రాముఖ్యతను నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే జాప్యం అనేది పోలీసులు స్వీకరించడంలో జరుగకూడదు.జాప్యాలను డిఫెన్స్‌ న్యాయవాది శ్రద్ధగా గమనించాలి. ఏ రకంగా జాప్యం ఉన్నా డిఫెన్స్‌ న్యాయవాది దాన్ని ఆయుధంగా మలుచుకుంటాడు. కేసు తొలిదశలో ప్రథమ సమాచార నివేదికలోని కథనాన్ని బట్టి పరిశోధన అధికారి దర్యాప్తు మొదలుపెడతాడు. అది సరైందే. కానీ ప్రతిసారి అలాగే చెయ్యడం సమం జసం కాదు. గుడ్డిగా ప్రథమ సమాచార నివేదికలోని విషయాలను నమ్మకూడదు. కొంతమంది తమ ప్రత్యర్థులకు ఇరికించడానికి తప్పుడు నివేదికను ప్రణాళికాబద్ధంగా ఇచ్చే అవకాశం ఉంది. అందుకని కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రథమ సమాచార నివేదికకు భిన్నంగా సాక్ష్యాలు వస్తే అందుకు తగిన సాక్ష్యాధారాలను దర్యాప్తు అధికారి సేకరించాలి. ప్రాథమిక దృష్టిలో చూసినప్పుడు, నేర సమాచారం కాగ్నిజబుల్‌ నేరానికి సంబంధించినది అయినప్పుడు ప్రథమ సమాచార నివేదికను తప్పక నమోదు చేయాల్సిన బాధ్యత పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌చార్జ్జి అధికారిపై ఉంటుంది. సె.154 సి.ఆర్‌.పి.సి. ప్రకారం ప్రథమ సమాచార నివేదికను తప్పక నమోదు చేయాలి ఈ విషయంలో ఎంపిక చేసుకొనే అవకాశాన్ని చట్టం అతనికి ఇవ్వలేదు. సమాచారంలో విశ్వనీయత కనిపించడం లేదన్న కారణంగా గాని లేదా అవసరమైన వివరాలు లేవనిగాని ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయకుండా ఉండే అవకాశం లేదు. కేసు ప్రాథమిక దశలో సమాచారం అన్నదే నిర్ణయాత్మకమైన విషయం. అందులోని విశ్వసనీయత గురిం చి చూడాల్సిన అవసరం లేదు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారన్న విషయం తేలితే కేసుని మూసివేసి పోలీసు అధికారి తుది నివేదికను కోర్టుకు సమర్పించవచ్చు.అవసరమని భావించినప్పుడు తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిపై చర్య తీసుకోవచ్చు (తులసీరామ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఎం. పి. 1993, క్రిమినల్‌ లా జనరల్‌ 1165 ఎం.పి).అందిన సమాచారంలో కాగ్నిజబుల్‌ నేర సమాచారం ఉన్నప్పుడు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్జి అధికారి తప్పక కేసు నమోదు చేయాల్సి ఉంటుందని కురుక్షేత్ర యూనివర్సిటి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ హర్యానా, 1977, క్రిమినల్‌ లా జనరల్‌ 1990 కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ప్రథమ సమాచార నివేదికను నమోదు చేయడానికి విశ్వసనీయ సమాచారం అవసరం లేదు. ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయడానికి కావలసిన అంశాలు రెండే రెండు.
మొదటిది:అది సమాచారం అయి ఉండాలి.
రెండవది:అది కాగ్నిజబుల్‌ నేర సమాచారం అయి ఉండాలి.కేసు నమోదు దశలో ఈ రెండు అంశాలను మాత్రమే పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్జి అధికారి పరిశీలించాలి. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె-154 అదేశం ఇది ఈ దశలో సంబంధిత పోలీస్‌ అధికారి సమాచారంలోని విశ్వసనీయత గురించి, నిజా- నిజాల గురించి ప్రాథమిక విచారణను చేపట్టడానికి వీల్లేదు. శాసనకర్తలు తమ వివేకాన్ని అనువర్తింప చేసి చాలా జాగ్రత్తగా నేర్పుగా క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె-154(1)ను పొందుపరిచారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సె-41(ఎ) లేదా (జి) సహేతుకమైన ఫిర్యాదును విశ్వసనీయ సమాచారంగా పేర్కొన్నాయి. అలాంటి గుణాత్మకమైన భావాన్ని సూచించే పదబంధాలను సె-154 లో పొందుపరచలేదు. అందుకు కారణం- కాగ్నిజబుల్‌ నేర సమాచారం అందినప్పుడు ప్రథమ సమాచార నివేదికను అందులోని సమాచారంలో సహేతుకత లేదా విశ్వసనీయత లేదన్న కారణంగా పోలీసు అధికారి నిరాకరించడానికి వీల్లేదు. కేసు నమోదు కావడానికి అవి రెండు షరతులు కావు. మరో విధంగా చెప్పాలంటే అందిన సమాచారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం అయితే చాలు. పోలీసు అధికారి సెక్షన్‌ 154(1) ప్రకారం కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఆయనకు ఎలాంటి అధికారం లేదు. సె-154(1) ప్రకారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం అందినప్పుడు తప్పకుండా వెంటనే ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది (స్టేట్‌ ఆఫ్‌ హర్యానా వర్సెస్‌ భజనేలాల్‌, 1992 క్రిమినల్‌ లా జనరల్‌ 527 సుప్రీం కోర్టు).అస్పష్ట సమాచారం ఆధారంగా పోలీసు అధికారి ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాల్సిన అవసరం లేదు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సె-154 ప్రకారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం రాత పూర్వంగా అందినప్పుడు దాని ఆధారంగా కేసు నమోదు చేయాలి. ఎవరైన మౌఖికంగా సమాచారం అందచేసినప్పుడు, దాన్ని రాతపూర్వకంగా నివేదిక రాసి, అతనికి చదివి వినిపించి, అతని సంతకం తీసుకొని కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ సమాచారంలోని సారాంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన పుస్తకంలో రాయాల్సి ఉంటుంది. ప్రథ మసమాచార నివేదికను సంబంధిత మెజిస్ట్రేటుకి పంపించాల్సి ఉంటుంది. అంతేకాని అస్పష్ట సమాచారం అందినప్పుడు ప్రథ మ సమాచార నివేదికను విడుదల చేయాల్సిన అవసం లేదు. అయితే అలాంటి సమాచారం అందినప్పుడు ఆ సమాచార వివరాలను జనరల్‌ డైరీలో నమోదు చేసి మరికొంత సమాచారాన్ని సేకరించుకొన్న తర్వాత కేసు నమోదు చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు సోమాబాయి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌ ఏ.ఐ.ఆర్‌. 1975, ఎస్‌.సి.1453; జహుర్‌, ఇతరులు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యు.పి., 1990, క్రిమినల్‌ లా జర్నల్‌ 56, తుల్వకాలి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు ఏ.ఐ.ఆర్‌. 1973, సుప్రీంకోర్టు 501 కేసులలోని సారాంశాన్ని గ్రహించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గుడిసె వెంకప్ప, ఇతరులు వర్సెస్‌ స్టేట్‌ 1995(3) సి.సి.ఆర్‌. 129. ఆంధ్రప్రదేశ్‌ డివిజన్‌ బెంచ్‌ కేసులో ఈ విధంగా అభిప్రాయపడింది- ‘క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌’లోని సె-154 ప్రకారం కాగ్నిజబుల్‌ నేర సమాచారం పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జీ అధికారికి అందినప్పుడు దాని ఆధారంగా ప్రథమ సమాచార నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది సమాచారం ఎవరైనా వ్యక్తి నుంచి వచ్చినది కావచ్చు లేదా టెలిఫోన్‌ ద్వారా వచ్చినది కావచ్చు. దాన్ని సాధారణంగా పోలీస్‌స్టేషన్‌లోని జనరల్‌ డైరీలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ సమాచారాన్ని ప్రథమ సమాచారంగా లేదా దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడాన్ని చేపట్టారని అనుకోవడానికి వీల్లేదు సమాచారం అస్పష్టంగా ఉన్నప్పుడు దాని గురించి ప్రాథమిక విచారణ జరిపి ప్రథమ సమాచార నివేదిక విడుదల చేసే అధికారం పోలీసు అధికారికి ఉంటుంది’.

No comments:

Post a Comment

Followers