Monday, March 23, 2009

surya 21-9-09 saturday

వ్యతిరేక ఓటు అవసరమా?

మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎన్నికల చర్చ వస్తుంది. తర్వాత మూలన పడుతుంది. విద్యావంతులు ఓటు వేయడానికి ఉత్సాహం చూపరు. ఎండలో వెళ్ళి క్యూలో నిలబడి ఓటు వేయడం ఇష్టం ఉండదు. అలాగే ఓటు వేద్దామనుకొన్నా తమ పేరు ఓటరు లిస్టులోంచి మాయం కావడం వల్ల కొందరు ఓటు వేయలేరు. ఓటు వేద్దామనుకొన్నా తమ ఓటు వేరెవరో వేసి ఉంటారు. ఇలా ఎన్నో కారణాలవల్ల చాలా మంది ఓటు వెయ్యరు. ఈ కారణాలతో బాటు మరో కారణం కూడా ఉంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులెవరూ నచ్చకపోవడం వల్ల కూడా ఓటు వేయడానికి కొంత మంది ఇష్ట పడరు. వ్యతిరేక ఓటు వేసే అవకాశం మన దేశంలో లేదు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వ్యతిరేక ఓటు, అభ్యర్థుల నేర చరిత్ర, రీకాల్‌ వంటి విషయాలమీద చర్చ కొనసాగుతుంది. ఎన్నికల సంస్కరణలు అత్యంత అవసరమన్న అభిప్రాయం వినిపిస్తుంది. వ్యతిరేక ఓటు మీద చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. వ్యతిరేక ఓటు అవసరం లేదన్న వాదనకు, అవసరమన్న వాదనకు తగు కారణాలు ఉన్నాయి. ఓటరుకు ఇష్టమైన వ్యక్తులు ఎవరూ పోటీ చేయనప్పుడు, అందరికీ నేర చరిత్ర ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా ఓటు వేద్దామని ఓటరుకు అనిపించవచ్చు. కానీ మన దేశంలో ఆ అవకాశం లేదు. అమెరికాలోని నెవదా రాష్ట్రంలో ఈ పద్ధతి అమల్లో ఉంది. అక్కడి బ్యాలెట్‌ పత్రాలలో `వీరెవరికీ ఓటు వేయడం లేదు' అన్న కాలమ్‌ కూడా ఉంటుంది. అందులో ఓటు వేసి ఓటర్లు అభ్యర్థుల పట్ల తమ వ్యతిరేకతను తెలియజేసే అవకాశం ఉంది. ఇష్టమైన అభ్యర్థులు లేనప్పుడు ఎన్నికలను బహిష్కరించకుండా ఓటు వేసే అవకాశం లేదు. ప్రజలు తమ నిరసనను వ్యక్తపరచడానికి ఎన్నికలను బహిష్కరిస్తూ ఉంటారు. మరి కొంత మంది పోలింగ్‌ బూత్‌ల దాకా వెళ్ళి ఎవరికీ ఓటు వేయకుండా ఖాళీ బ్యాలెట్‌ పత్రాన్ని వేసి వస్తూ ఉంటారు. ఇంకా కొంత మంది ఇద్దరు, ముగ్గురికి కూడా ఓటు వేసి తమ ఓటు చెల్లకుండా చేసి తమ నిరసనను వ్యక్తపరిచే అవకాశం ఉంది. `వ్యతిరేక ఓటు' వేసే అవకాశం ఉంటే తమ నిరసనను చెప్పడానికి ఇటువంటి పద్ధతులు వెతికే అవసరం ఉండదు. బ్యాలెట్‌ పత్రాలలో వ్యతిరేక ఓటు కాలమ్‌ కూడా ఉంచే విషయాన్ని లా కమిషన్‌ కూడా పరిశీలించింది. ఎన్నికల సంస్కరణల గురించి లా కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన 170వ నివేదికలో ఈ వ్యతిరేక ఓటు వ…ల్ల కలిగే ప్రయోజనాలను ఈ విధంగా వివరించింది- `వ్యతిరేక ఓటు పద్ధతి వల్ల రాజకీయ పక్షాలపై నైతిక పరమైన ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల వారు అనవసరమైన వ్యక్తులను, అవినీతి పరులను, నేరచరితులను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం తగ్గుతుంది'. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం కంటె వ్యతిరేక ఓటుకు ఎక్కువ ఓట్లు వస్తే, ఆ నియోజక వర్గంలో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని, ఆ అభ్యర్థులు తిరిగి పోటీ చేయకుండా నిరోధించాలని ఈ పద్ధతిని సమర్ధిస్తున్న వారి వాదన. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మన దేశంలో ఈ వ్యతిరేక ఓటు పద్ధతి ప్రవేశ పెట్టడం సాధ్యమా? ఒక వేళ ప్రవేశపెట్టినా అదేమన్నా ఫలితాన్ని ఇస్తుందా? ఇది ప్రస్తుతం జవాబు దొరకని ప్రశ్న. వ్యతిరేక ఓటు గురించిన ఒక ప్రజాహిత కేసు కూడా సుప్రీం కోర్టులో 2004లో దాఖలయింది. ఈ కేసును సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచి 2009 ఫిబ్రవరి 23వ తేదీన పరిష్కరించింది. ఈ కేసును కొట్టి వేయాలని కేంద్ర ప్రభుత్వం వాదించింది. కానీ సుప్రీం కోర్టు అలా చేయకుండా దీనిని విస్తృత ధర్మాసనానికి పంపించాలని సూచించింది. వ్యతిరేక ఓటు అన్నది పూర్తిగా తిరస్కరించలేని అంశమని ఇందువల్ల మనకు బోధపడుతోంది. వ్యతిరేక ఓటు పద్ధతిని ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న విషయూన్ని ఎన్నికల కమిషన్‌ పరిశీలించింది. ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని ఎన్నికల కమిషన్‌ను చాలా మంది కోరుతున్నారు. ఓటర్లకు ఇష్టం లేని వ్యక్తులను తిరస్కరించడానికి వ్యతిరేక ఓటు కూడా అవసరమని ఎన్నికల కమిషన్‌ భావించింది. ఈ విషయమై 2001లో ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని సంప్రదించింది. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. తరువాత, 2004లో యుపిఎ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించింది. ఆ ప్రభుత్వం నుంచి కూడా స్పందన రాలేదు. వ్యతిరేక ఓటు గానీ, తటస్థ ఓటు పద్ధతిని గానీ ప్రవేశపెడితే బాగుంటుందని ఎన్నికల కమిషన్‌ ప్రభుత్వానికి సూచించింది. అయితే, వ్యతిరేక ఓటును ఎక్కువ మంది ఉపయోగిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, తటస్థ ఓటును ఎక్కువ మంది ఉపయోగిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అన్న విషయం మీద చర్చ జరగవలసిన అవసరం ఉంది.

రచయిత నిజామాబాద్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers