Tuesday, July 20, 2010

భర్త విదేశాల్లో ఉన్నప్పటికీ భార్య విడాకులు కోరవచ్చు!

భర్త విదేశాల్లో ఉన్నప్పటికీ
భార్య విడాకులు కోరవచ్చు!
July 20th, 2010

హిందూ వివాహ చట్టప్రకారం అమెరికాలోగానీ ఇతర విదేశాల్లోగాని జరిగిన వివాహాన్ని రద్దుచేయమని భారతదేశంలోని కోర్టులో దరఖాస్తు దాఖలు చేసుకోవచ్చా?
ప్రపంచీకరణ నేపథ్యంలో విదేశాల్లో నిసించడం అక్కడే వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. మనవాళ్లు విదేశాల్లో వివాహాలు చేసుకుంటున్నప్పటికీ మన పద్ధతుల ప్రకారమే వివాహాలు చేసుకుంటున్నారు. అలాంటి వివాహం జరిగిన తరువాత వాళ్ళిద్దరూ కలిసి జీవించలేని పరిస్థితులు ఏర్పడితే వాళ్ళు హిందూ వివాహ చట్టంలోని సె.13 ప్రకారం విడాకుల దరఖాస్తుని భారతదేశంలో దాఖలు చేసుకోవచ్చు. భార్యా భర్తలో ఒకరు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఈ దరఖాస్తుని భారతదేశంలో వేసుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి సమస్యే ఒకటి మద్రాసు హైకోర్టు ముందుకు ఇటీవల వచ్చింది.
ఆర్.సుకన్య సినీనటి. ఆమె భర్త ఆర్.శ్రీ్ధరన్. అతను అమెరికా దేశ పౌరుడు. వారిద్దరి వివాహం ఏప్రియల్ 2002 రోజున హిందూ ఉత్సవాల ప్రకారం అమెరికా దేశంలోని న్యూజెర్సీలోని బాలాజీ దేవాలయంలో జరిగింది. వివాహం జరిగిన సంవత్సరం తరువాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చేసింది. సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. 2004 సంవత్సరంలో విడాకులకోసం మద్రాసులోని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తుని దాఖలు చేసింది. కోర్టునుంచి నోటీసు అందుకుని కోర్టుముందు హాజరు కాకపోవడంవల్ల కుటుంబ న్యాయస్థానం ఏకపక్షంగా సుకన్య పక్షాన విడాకుల డిక్రీని మంజూరు చేసింది.
కొంతకాలం తరువాత శ్రీ్ధరన్ కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు దాఖలు చేసి ఏకపక్షంగా మంజూరు చేసిన విడాకులను రద్దుచేయించుకున్నాడు. అక్కడితో ఆగిపోలేదు. ఈ కేసు విచారణ చేపట్టడానికి కుటుంబ న్యాయస్థానానికి అధికార పరిధి లేదని మద్రాసు హైకోర్టులో మరో దరఖాస్తుని దాఖలు చేశాడు. తమ వివాహం అమెరికాలో జరిగిందని అందుకని భారతదేశంలోని కోర్టుకి అధికార పరిధి లేదని అతని వాదన.
మద్రాసు హైకోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. అతని దరఖాస్తును కొట్టివేసింది. కుటుంబ న్యాయస్థానం సుకన్య దాఖలుచేసిన దరఖాస్తుని రెండు మాసాల్లో పరిష్కరించాలని ఆదేశించింది. కోర్టు ఈ కారణాలతో అతని దరఖాస్తుని కొట్టివేసింది.
గతంలో హిందూ వివాహ చట్ట ప్రకారం దాఖలు చేసుకోవాల్సిన దరఖాస్తుని వారి వివాహం ఏ కోర్టు అధికార పరిధిలో జరిందో అక్కడ లేదా దరఖాస్తు దాఖలు చేసే సమయానికి ప్రతివాది ఎక్కడ నివశిస్తున్నాడో ఆ కోర్టు పరిధిలో లేదా పార్టీలిద్దరు కలిసి చివరిసారి ఎక్కడ నివశించారో ఆ కోర్టు పరిధిలో మాత్రమే విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ నిబంధనవల్ల చాలా ఇబ్బందులు వున్నాయని గమనించి శాసనకర్తలు హిందూ వివాహ చట్టంలోని సె.19కి సవరణలు తీసుకునివచ్చారు. వివాహాల (సవరణల) చట్టం, 2003 ద్వారా ఈ నిబంధనకి సవరణలు తీసుకునివచ్చాయి. కొత్త నిబంధనని సె.19 (జజజఎ)ని చట్టంలో పొందుపరిచారు.
ఈ నిబంధన ప్రకారం- భార్య ప్రతివాది అయినపుడు, ఆమె ఈ చట్టప్రకారం దరఖాస్తు చేసే సమయానికి ఏ కోర్టు అధికార పరిధిలో నివశిస్తుందో ఆ కోర్టులో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిబంధన 23.12.2003 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకని సుకన్య మద్రాసులోని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు దాఖలు చేసుకోవడం సమంజసమేనని, చట్టబద్ధమేనని కోర్టు పేర్కొంది.
సుకన్య, శ్రీ్ధరన్‌ల వివాహం హిందూ వివాహ చట్టప్రకారం జరిగింది. ఆమె విడాకుల దరఖాస్తుని హిందూ వివాహ చట్టప్రకారం దాఖలు చేసింది. ఈ సందర్భంలో తమ వివాహం అమెరికాలో జరిగిందని, తాను అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నానని అతను వాదించడంలో ఎలాంటి పస లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆ కారణాలతో ఈ కోర్టు పరిధినుంచి అతను మినహాయింపు కోరలేదని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
సవరణలు తీసుకరావడానికన్నా ముందు వున్న నిబంధనవల్ల మహిళలు చాలా ఇబ్బందులకి, అసౌకర్యానికి లోనయ్యేవారు. ఆ క్లిష్టమైన నిబంధనవల్ల వారి వివాహం ఎక్కడ జరిగిందో ఆ కోర్టులో లేక చివరిసారి వారిద్దరూ కలిసి ఎక్కడ నివశించినారో అక్కడ తమ దరఖాస్తులని దాఖలు చేసుకునేవాళ్లు. ఆ నిబంధన అనుచితంగా వుందని భావించి సె.19కి సవరణలు తీసుకొనివచ్చారు.
వివాహం విదేశాల్లో జరిగినా భారతదేశంలోని కోర్టుల్లో విడాకులకోసం స్ర్తిలు దరఖాస్తులని దాఖలు చేసుకోవచ్చు. అయితే వారి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగి ఉండాలి. ఇదే మద్రాసు కోర్టు తీర్పులోని సారాంశం.
*

No comments:

Post a Comment

Followers