Tuesday, July 28, 2009

గుప్తత హక్కు సంపూర్ణమా?


కొత్త చట్టాలు వస్తున్నాయి. సాంకేతికంగా అభివృద్ధిచెంది ఎక్కడ ఏమి జరుగుతోందో తెలుసుకోవలసిన అవసరం ఏర్పడుతోంది. గతంలో సమాచార హక్కు చట్టం లేదు. స్టింగ్‌ ఆపరేషన్లు లేవు. మొబైల్‌ ఫోన్లు లేవు. వీటి రాక వల్ల వ్యక్తికి ఉండే గుప్తత హక్కు ఈ మధ్య కాలంలో చర్చనీయాంశం అయింది.మన రాజ్యాంగంలో గుప్తత హక్కుకి అభయం ఇవ్వలేదు.

వ్యక్తి గుప్తతకి సంబంధించిన సూత్రాలను మాత్రమే ఇప్పుడు ఉన్న చట్టాలు తెలియచేస్తున్నాయి. న్యాయ వ్యవస్థ క్రియాత్మకంగా వ్యవహరించి ఈ గుప్తత హక్కుని విస్తరింప చేసింది. ఇందుకు రాజ్యాంగ అభయాన్ని కల్పించే దిశగా తీర్పులను ప్రకటించింది. ఈ హక్కు ఏ విధంగా అభివృద్ధి చెందింది, ప్రజాహితం కోసం ఈ హక్కుకి భంగం కల్గించవచ్చా, అవసరమైన పరిస్థితులలో టెలిఫోన్లను కూడా ట్యాప్‌ చేయవచ్చా?

‘గుప్తత హక్కు’ మొదటి సారిగా ‘కరక్‌ సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర ప్రదేశ్‌’ కేసులో 1963 ప్రాంతంలో సుప్రీంకోర్టు ముందు చర్చకు వచ్చింది. రాజ్యాంగం అభయం ఇచ్చిన అధికరణల్లో (19(1) (డి), 19(1) (ఇ), 21) ఈ హక్కు ఉన్నదా అన్న విషయం చర్చకు వచ్చింది. ఈ కేసులో మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఈ హక్కును రాజ్యాంగం గుర్తించలేదు. కానీ మైనారిటీ అభిప్రాయం ఈ హక్కును రాజ్యాంగం గుర్తించిందని, రాజ్యాంగంలోని ‘స్వేచ్ఛ’ హక్కులో ఈ హక్కు కూడా మిళితమై ఉందని న్యాయమూర్తి సుబ్బారావు అభిప్రాయపడినారు.

ఈ హక్కు గురించిన చర్చ మళ్ళీ ‘గోవింద్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌’ కేసులో మరోసారి చర్చకు వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసులో గుప్తత హక్కును గుర్తించింది. రాజ్యాంగంలోని అధికరణలు 19(1)(ఎ), 19(1)(డి), 21లలో ఈ హక్కు ప్రసారితం అవుతుందని న్యాయమూర్తులు ఈ కేసులో ప్రకటించారు. అయితే ఈ హక్కు సంపూర్ణం కాదని కూడా సుప్రీంకోర్టు తీర్పులో ప్రకటించింది. అధికరణ 19(2)లో ఉన్న పరిమితులు ఈ హక్కుకు కూడా వర్తిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఈ అంశం సుప్రీంకోర్టు ముందుకు మళ్ళీ ‘ఉన్ని క్రిష్ణన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ (ఏ.ఐ.ఆర్‌ 1993 సుప్రీంకోర్టు 2178) కేసులో మళ్ళీ చర్చకు వచ్చింది. వ్యక్తి స్వేచ్ఛ హక్కులో గుప్తత హక్కు మిళితమై ఉందని సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. వ్యక్తి హితం, ప్రతిహితం అనేవి చర్చకు వచ్చినప్పుడు ఈ వ్యక్తిగత హక్కులో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందా అన్న విషయం వి. రాజ్‌గోపాల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు (ఏ.ఐ.ఆర్‌ 1998 సుప్రీంకోర్టు 264) కేసులో చర్చకు వచ్చింది. ప్రజాహితానికి సంబంధించినప్పుడు ఈ గుప్తత హక్కు ఉండదని కోర్టు ఈ కేసులో స్పష్టం చేసింది. అయితే కొన్ని మినహాయింపులను కోర్టు ప్రకటించింది. గుప్తత హక్కుకు రాజ్యాంగ హోదాను సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రకటిస్తూనే కొన్ని సూత్రీకరణలు చేసింది. అవి-

1. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21లో గుప్తత హక్కు మిళితమై ఉంది. తన విషయంలో, తన కుటుంబం విషయంలో, వివాహం, సంతానం, చదువు తదితర విషయాల్లో ప్రతి పౌరునికి గుప్తత హక్కు ఉంటుంది. అయితే స్వచ్ఛందంగా ఏదైనా వివాదంలో చిక్కుకుంటే, వివాదాన్ని స్వచ్ఛంధంగా ఆహ్వానిస్తే, లేదా ఏదైనా వివాదాన్ని సృష్టిస్తే ఈ గుప్తత హక్కు ఉండదు. 2. ఈ నియమానికి ఒక మినహాయింపు ఉంది. విషయం ప్రజల రికార్టు అయినప్పుడు, ఈ గుప్తత హక్కు ఉండదు. కానీ ఎవరైనా మహిళ ఏదైనా అత్యాచారానికి గురైనప్పుడు, కిడ్నాప్‌ అయినప్పుడు ఏదైనా నేరంలో ఇరుక్కున్నప్పుడు వారిని అగౌరవపరిచే విధంగా ప్రసార మాధ్యమాలలో, అచ్చు మాధ్యమాల్లో ప్రచారం చేయకూడదు. 3. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా సుప్రీంకోర్టు రెండవ మినహాయింపును ప్రకటించింది. వారి విద్యుక్త ధర్మానికి, నడవడికలకు ఈ గుప్తత హక్కు వర్తించదు.

గుప్తత హక్కును విస్తరింపచేసినప్పటికీ సుప్రీంకోర్టు అది సంపూర్ణం కాదని స్పష్టం చేసింది. ఈ హక్కుకీ పరిమితులు ఉన్నాయని కూడా ప్రకటించింది. ఇదే విషయం ఎక్స్‌ వర్సెస్‌ హాస్పిటల్‌ కేసులో కూడా చర్చకు వచ్చింది. ఈ కేసులో ఒక వ్యక్తికి హెచ్‌.ఐ.వి. వైరస్‌ సోకిందన్న విషయం ఆ వ్యక్తి వివాహం చేసుకోబోతున్న కుటుంబ సభ్యులకు తెలియచేశాడు అతణ్ణి పరీక్షించిన డాక్టరు. ఆ విధంగా తెలియచెయ్యడం తన గుప్తత హక్కుకు భంగం కలిగించడమేనని అతడు కోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు వ్యక్తి గుప్తత హక్కును పునఃపరిశీలించి ఈ హక్కు సంపూర్ణం కాదని ఇతరుల స్వేచ్ఛను, హక్కులను, ఆరోగ్యాలను కాపాడటానికి జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రకటించింది.

టెలిఫోన్‌ సమాచారాన్ని ట్యాపింగ్‌ చేయడం వ్యక్తి గుప్తత హక్కులోకి జోరబడటమే అవుతుందా? అది వ్యక్తిగత సంభాషణ అని, రహస్యమైనదని సుప్రీంకోర్టు ముందు పీపుర్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా((1997) ఎస్‌.సి.సి.301) కేసులో వాదించారు. టెలిఫోన్‌ సంభాషణను ట్యాపింగ్‌ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టు తీర్పులో ప్రకటించింది. అయితే ఈ ట్యాపింగ్‌ చేయడం ఇటీవలి కాలంలో కొన్ని సందర్భాలలో అవసరం అవుతుంది. అందుకోసం చట్టాన్ని తయారు చేసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ విధంగా కాకుండా వ్యక్తుల సంభాషణను ట్యాపింగ్‌ చేస్తే అది ఆ వ్యక్తుల ప్రాథమిక హక్కులలోకు జోక్యం చేసుకోవడమే అవుతుంది.

ఇంటర్నెట్‌ వచ్చిన తర్వాత వ్యక్తులపైన, వాళ్ళ అలవాట్లపైన నిఘా పెట్టడం సులువై పోయింది. ప్రైవేట్‌ యాజమాన్యాలు తమ ఉద్యోగుల మెయిల్స్‌ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా కనక్కొంటున్నాయి. ఇది వ్యక్తుల గుప్తత హక్కులోకి జోరబడడమే. వారిని నియంత్రించడానికి ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ చట్టంలో 2000లో సె.43 ఏర్పరిచారు. ఏ యాజమాన్యమైనా అనుమతి లేకుండా కంప్యూటర్‌లోని సమాచారాన్ని చూస్తే నష్టపరిహారం ఇచ్చే విధంగా చట్టంలోని ఈ నిబంధన ఉపయోగపడుతుంది. అయితే ఈ నిబంధన సరిపోదని అనిపిస్తోంది.

స్టింగ్‌ ఆపరేషన్లు అవసరమే. కానీ ప్రసార మాధ్యమాలు తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి తప్పుడు విషయాలను కూడా ప్రసారం చేసి వ్యక్తుల గుప్తత హక్కుల్లో జోరబడుతున్నాయి. వీటిని నియంత్రించుకోవడానికి చట్టం లేదు. ప్రసార మాధ్యమాలు కూడా ఎలాంటి నిబంధనలను, నియమాలను ఏర్పరచుకోలేదు.

సమాచార హక్కు చట్టం వచ్చిన తరువాత గుప్తత హక్కు మరోసారి చర్చనీయాంశం అయింది. పబ్లిక్‌ అధారిటీస్‌ దగ్గర ఉన్న వివిధ వ్యక్తుల సమాచారాన్ని ఇవ్వవచ్చా లేదా, ఇస్తే అది వాళ్ళ వ్యక్తిగత హక్కుల్లో జోరబడినట్లు అవుతుందా అన్న ప్రశ్న కూడా వస్తుంది. అది వాళ్ళ వ్యక్తిగత హక్కులో జోరబడినట్లు కాదని చట్టం భావిస్తున్నది. పారదర్శకత, జవాబు దారీతనం అవసరమని ఈ చట్టం భావిస్తుంది.

గుప్తత హక్కు అనేది జీవించే హక్కులో భాగమే కానీ అది సంపూర్ణమైనది కాదు. నేరాలను నిరోధించడానికి, ఇతరుల ఆరోగ్యాలను, స్వేచ్ఛలను రక్షించడానికి, నీతి నియమాలను పరిరక్షించడానికి గాను ఈ హక్కుకు దీనికి పరిమితులను ఏర్పరచవచ్చు. వ్యక్తి ప్రాథమిక హక్కులకి సమాజ హితానికు, మధ్య సమస్య తలెత్తినప్పుడు సమాజ హితమే ప్రాధాన్యతని సంతరించుకుంటుంది.

No comments:

Post a Comment

Followers