Monday, November 29, 2010

వివాహ వ్యవస్థకు ఇది విఘాతం కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల

వివాహ వ్యవస్థకు ఇది విఘాతం
కేంద్రం చేతిలో విడాకులు సులువు చేసే బిల్లు

వివాహ బంధంలోని దంపతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించాలన్న ఉద్దేశంతో వివాహాల (సవరణల) బిల్లు, 2010ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. ఈ బిల్లు ఇంకా చట్టరూపం ధరించవలసి ఉంది. హిందూ వివాహ చట్టం 1955కి, ప్రత్యేక వివాహ చట్టం, 1954కి సవరణలు తీసుకురావడం ఈ బిల్లు ఉద్దేశం. దీని ద్వారా ‘సరిదిద్దడానికి వీల్లేని’ వివాహాలను విడాకులు పొందడానికి ఒక ఆధారంగా రూపొందిస్తున్నారు. వివాహ వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉన్న భారతదేశంలో అందుకు సంబంధించిన ఏ చట్టం వచ్చినా అది చర్చనీయాంశమే అవుతుంది. ఈ బిల్లు విషయం కూడా అంతే. ఇది చట్టరూపం ధరించిన తరువాత అది కలుగచేసే ప్రభావాన్ని, పరిణామాలని గురించి చర్చించుకోవడం తప్పనిసరి. విడాకులు పొందగోరే వారికి ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ ఒక ప్రాతిపదికను చేయాలని లా కమిషన్ సంవత్సరం క్రితం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. లా కమిషన్ తనకు తానుగా సమస్యని పరిశీలించి, సుప్రీంకోర్టు ఈ తరహా కేసులలో వెలువరించిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలని’ విడాకులు పొందడానికి ఒక ఆధారంగా చేయాలని లా కమిషన్ తన 271వ నివేదికలో 2009 మార్చిలో నివేదించింది.

న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ వెల్లడిం చిన వివరాల ప్రకారం మన దేశంలో 55,000 విడాకుల కేసులు విచారణలో ఉన్నాయి. రోజురోజుకీ వీటి సంఖ్య పెరిగిపోతున్నది. ఇదే సమయంలో ఇంకో వాస్తవాన్ని కూడా గమనించాలి. ఒక పక్క విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉన్నా, విడాకులు తీసుకోవడం అనేది ఇప్పటికీ ఒక ‘సాంఘిక కళంకం’గా భావించేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కొంతమంది నిపుణులు ఇస్తున్న సమాచారం ప్రకారం మన దేశంలో ప్రతి 1,000 వివాహాలకి 11 వివాహాలు విడాకులకు దారితీస్తున్నాయి. అమెరికాలో ప్రతి 1,000 వివాహాలకి 400 విడాకులకి దారితీస్తున్నాయి. అన్ని విషయాలలోను అమెరికాను అనుసరించడానికి ఉవ్విళ్లూరే మనదేశంలో విడాకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టానికి సవరణలు తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది.

ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం ప్రకారం ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. వివాహం విఫలం కావడం వల్ల విడాకులు ఇచ్చే అవకాశం గురించిన చర్చ మాత్రం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈ విషయం గురించి చాలా మందిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వివాహమనేది పవిత్రమైన బంధం. సమాజం వివాహబంధం, వివాహ వ్యవస్థ కొనసాగాలనే కోరుకుంటుంది. సమాజ హితం కోరి న్యాయమూర్తులు విభేదాలతో తమ ముందుకు వచ్చిన పార్టీల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేయాలని చాలామంది భావన. కానీ వాస్తవాలు విరుద్ధంగా ఉంటాయి. ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాలను’ కొనసాగించాలని ఆలోచించడం వల్ల ఫలితం లేదని, వాటిని రద్దు చేయడమే మంచిదన్న సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిన వాస్తవాన్ని విస్మరించలేం. వివాహబంధం చెడిపోయి, కలిసి జీవించడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ వాస్తవాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పు చెప్పింది.

‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఉన్నప్పుడే విడాకులు మంజూరు చేసే అవకాశం ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఉంది. అలాగని ‘వైవాహిక జీవితం లో తప్పిదం’ చేసిన వారు, అంటే తప్పుకు పాల్పడిన వారు దాని ఆధారం మేరకు విడాకులు పొందడానికి అవకాశం లేదు. ఉదాహరణకి వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వ్యక్తి, భార్య పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తి ‘వైవాహిక జీవితంలో తప్పిదం’ ఆధారంగా విడాకులు పొందే అవకాశం ఉండదు. వాటి వల్ల గాయపడ్డ వ్యక్తి లేదా బాధిత వ్యక్తి మాత్రమే విడాకులు పొందడానికి అవకాశం ఉంది. ‘వైవాహిక జీవితంలో తప్పిదం’తో సంబంధం లేకుండా ‘సరిదిద్దడానికి వీల్లేని వివాహాల’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే పద్ధతిని సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల్లో వెలువరించింది. అయితే గత సంవత్సరం విభిన్నమైన తీర్పుని విష్ణుదత్ శర్మ వర్సెస్ మంజుశర్మ, 2009(3) స్కేల్ 425 కేసులో వెలువరించింది. వీరి వివాహం ఫిబ్రవరి 26, 1993లో జరిగింది. డిసెంబర్ 1993లో కూతురు పుట్టింది. క్రూరత్వం ఆధారంగా శర్మ విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేశాడు. తన భార్య 25 రోజులే తనతో కాపురం చేసిందని, ఆ తరువాత గర్భవతిగా ఉన్నప్పుడే తన నుంచి దూరంగా వెళ్లిపోయిందని తన దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆమె తండ్రి, తమ్ముడు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారని, వాళ్లు తమ పలుకుబడిని ఉపయోగించి తనపైన తప్పుడు కేసులు పెట్టి హింసించారని ఆరోపించాడు. మంజు శర్మ తన జవాబులో ఈ ఆరోపణలని ఖండించింది. విష్ణుదత్ తననే కొట్టి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారని ఆరోపిస్తూ, హాస్పిటల్ రికార్డును కోర్టులో ప్రవేశపెట్టింది. కేసుని విచారించిన కోర్టు, భార్య తప్పిదంలేదనీ, ఆమె భర్తపట్ల క్రూరంగా వ్యవహరించలేదనీ నిర్ధారణకు వచ్చి కేసు కొట్టివేసింది. హైకోర్టు కూడా అతని అప్పీలుని తోసిపుచ్చింది. విష్ణుదత్ సుప్రీంకోర్టులో అప్పీలు చేశాడు.

తమ వివాహం సరిదిద్దడానికి వీల్లేని విధంగా మారిపోయింది కాబట్టి తమ వివాహాన్ని రద్దు చేయాలని శర్మ సుప్రీంకోర్టు ముందు వాదించాడు. సుప్రీంకోర్టు హిందూ వివాహ చట్టంలోని 13వ సెక్షన్‌ను ఉదహరించి విడాకులు పొందడానికి అది ఆధారం కాదని పేర్కొంది. క్రూరత్వం, వేరుగా ఉండటం, వివాహేతర సంబంధాలు వంటి తప్పిదాల ఆధారంగా విడాకులు పొందడానికి అవకాశం ఉంది కానీ ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి విడాకులు మంజూరు చేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి గతంలో సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసిందన్న వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. శాసనం లేకుండా గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా తీర్పు చెప్పలేమని సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రకటించింది. ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ ఆధారంగా విడాకులు మంజూరు చేసే విధంగా శాసనాన్ని మార్చాల్సిన బాధ్యత శాసనకర్తలదని, కోర్టుది కాదని సుప్రీంకోర్టు ఈ తీర్పులోనే స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల్ని పక్కనపెట్టింది.

సుప్రీంకోర్టు తీర్పుల్లో నిలకడ లేకపోవడం ఇబ్బంది కలిగించే విషయమైనా ఈ తీర్పు ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. భర్తే భార్యపట్ల క్రూరంగా వ్యవహరించాడు. పైగా తమ వివాహాన్ని ‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’గా పరిగణించి రద్దు చేయాలని కోరాడు. కాబట్టి ఈ తీర్పు వల్ల స్ర్తీలకి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ తన నివేదికలో ఈ సూచన చేయడం, ప్రభుత్వం బిల్లును తయారుచేయడం కూడా జరిగింది. సరిదిద్దడానికి వీలులేని వివాహాల ఆధారంగా విడాకులు మంజూరు చేయాలన్న నిబంధనను చేర్చడం గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా వాదనలు వస్తాయి.

పరస్పర ఆమోదంతో విడాకులు పొందే అవకాశం ఉండగా మళ్లీ ఈ కొత్త ‘ఆధారం’ ఎందుకు అన్న ప్రశ్న కూడా వస్తుంది. పరస్పర ఆమోదంతో విడాకులంటే ఎలాగూ ఇరువురి సమ్మతితోనే జరుగుతుంది. ఇక్కడ ఆ ‘ఆధారం’తో పనిలేదు. వారి వివాహం సరిదిద్దే విధంగా లేకపోతే చాలు. ఎదుటి వారి తప్పిదంతో సంబంధం లేకుండా వైవాహిక జీవితాన్ని చక్కదిద్దే వీల్లేనప్పుడు, వివాహ బంధాన్ని రక్షించలేనప్పుడు కోర్టు ఆ అభిప్రాయానికి వచ్చి వివాహాన్ని ఈ ప్రతిపాదిత నిబంధన ఆధారంగా రద్దు చేయాల్సి ఉంటుంది.
సరిదిద్దడానికి వీలులేని వివాహాలు అన్న సూత్రం హిందూ వివాహ చట్టానికి కొత్తది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి 23(2)వ సెక్షన్‌ను చదవాల్సి ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం దంపతుల మధ్య సామరస్యం నెలకొనడానికి రాజీ ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉంటుంది. ఈ ప్రయత్నంలో విఫలం అయినప్పుడు కోర్టు 12వ సెక్షన్‌లో విశదీకరించిన తప్పిదాలను అనుసరించి విడాకులు మంజూరు చేయాల్సి ఉంటుంది. సరిదిద్దడానికి వీలులేని వివాహం స్వల్ప భేదంతో హిందూ వివాహచట్టంలోని 13(1ఎ) సెక్షన్‌లో మిళితమై ఉంది. ఈ నిబంధన ప్రకారం- న్యాయ నిర్ణయ వేర్పాటు డిక్రీ పొందిన తరువాత లేదా దాంపత్య జీవన హక్కుల డిక్రీ పొందిన తరువాత సంవత్సర కాలం వారి మధ్య సంసారిక జీవితం పునరుద్ధరణకు నోచుకోకుంటే అలాంటి వారు విడాకులు పొందడానికి అవకాశం ఉంది. దంపతుల్లో ఎవరైనా ఈ దరఖాస్తుని దాఖలు చేసుకోవచ్చు.

‘సరిదిద్దడానికి వీలులేని వివాహం’ అన్న కొత్త ప్రతిపాదన విడాకులు పొందడానికి ఇప్పుడున్న నిబంధనలకి పూర్తిగా భిన్నమైనది. హిందూ వివాహచట్టం, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ఎదుటివారి తప్పిదాలు ఉన్నప్పుడే విడాకులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బిల్లులో ప్రతిపాదించిన నిబంధన ప్రకారం దంపతులిద్దరూ 3 సంవత్సరాలకి మించి వేరుగా ఉన్నట్టు కోర్టు సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఆ విధంగా సంతృప్తి చెందినప్పుడే కోర్టు విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన నేపథ్యం వేరు. వినీతా సక్సేనా వర్సెస్ పంకజ్ పండిట్ (అప్పీలు-సివిల్- 1687/2006 తీర్పు తేదీ 21.3. 2006) కేసులో భార్యా భర్తలిద్దరూ కలిసి శారీరక సంబంధాలు లేకుండా 5 నెలలు జీవించారు. ఇది కాకుండా ఆ తరువాత వాళ్లిద్దరూ వేరువేరుగా జీవిం చడం మొదలుపెట్టి 13 సంవత్సరాలు దాటింది. అందుకని వారి మధ్య సంబంధం మృతప్రాయంగా మారిన బం ధంగా సుప్రీంకోర్టు భావించింది. సరిదిద్దలేని వివాహంగా పరిగణించి విడాకులు మంజూరు చేసింది. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలోనే ఈ విధంగా వివాహాలని రద్దుచేసి విడాకులను మంజూరు చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధన 13ిసీ ప్రకారం వైవాహిక జీవితంలో తప్పిదాలు చేసిన భర్త మూడు సంవత్సరాలు భార్య నుంచి వేరుగా ఉండి విడాకులు పొందడానికి అవకాశం కల్పిస్తుంది. ఎలాగంటే మూడేళ్ల ఎడబాటు తరువాత తప్పు చేసినవారు కూడా దరఖాస్తు చేసి విడాకులు పొందవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే చిటికెన వేలితో విడాకులు పొందే అవకాశం ఏర్పడుతుంది. ఇది అమల్లోకి వస్తే అప్పుడు హిందూ వివాహ వ్యవస్థ రూపురేఖలే మారతాయి. దీంతో స్ర్తీలు ఇంకా అశక్తులవుతారు. దోపిడీ, పీడనలకు మరింతగా గురవుతారు. వాస్తవానికి ఇప్పటికే హిందూ వివాహ చట్టంలో ఉన్న సెక్షన్ 13(1ఎ)లో ఈ అవకాశం (మూడేళ్ల ఎడబాటుతో విడిపోయే అవకాశం) ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అది సరిపోతుంది. అలా కాకుండా దీనికి శాసన రూపం కల్పిస్తే హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహ చట్టాల మౌలిక లక్షణమే దెబ్బతింటుంది. ఇది స్ర్తీలే కాదు, తల్లిదండ్రులూ, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.

మంగారి రాజేందర్‌ ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి
More Headlines

No comments:

Post a Comment

Followers