Monday, November 8, 2010

భర్త హాజరు కానప్పుడు.

.
November 2nd, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందాలంటే దరఖాస్తు దాఖలు చేసిన తరువాత కనీసం 6 నెలలపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ గడువుని ఏర్పర్చడానికి కారణం పార్టీలు తొందరపాటు వల్ల విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకోలేదని, ఒత్తిడి వల్ల, బెదిరింపువల్ల అలాంటి నిర్ణయానికి రాలేదని కోర్టు అభిప్రాయ పడటానికి. అదే విధంగా పార్టీలు పునరాలోచించుకోవడానికీ ఈ గడువు దోహదపడుతుంది.
ఒక్కసారి కోర్టు ద్వారా విడాకుల కోసం పార్టీలు వచ్చినారంటే అది ఒక్క కేసులోనే ఉండదు. క్రిమినల్ కేసులు, ఆస్తి తగాదాలు, పిల్లల కస్టడీలో లాంటి కేసులు కూడా ఉంటాయి. కొంతమంది భర్తలు (్భర్యలు కూడా) పరస్పర ఆమోదంతో విడాకులు కోరడానికి దరఖాస్తుని దాఖలు చేసుకొని ఆ తరువాత సహకరించరు. అప్పటికే వాళ్లు కొన్ని కేసుల్లో లబ్ధి పొందుతారు. లబ్ధి పొంది మిగతా వ్యక్తులని ఇబ్బందులకు గురిచేస్తారు.
మొదటి సారే కాకుండా ఆరు నెలల నుంచి 18 మాసాలలోపు మళ్లీ పార్టీలు కోర్టు ముందుకు వచ్చి మేము విడాకులు తీసుకోవడానికి ఇష్టపడుతున్నామని చెప్పాలి. ఆ విధంగా చెప్పినప్పుడు కాని కోర్టు మంజూరు చేయవు. ఇలాంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలి? కోర్టు ఏం చెయ్యాలి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం రాజస్థాన్ హైకోర్టు శ్రీమతి సుమన్ వర్సెస్ సురేంద్ర కుమార్ ‘ఎఐఆర్ 2003 రాజస్థాన్ 155-ఐ (2003) డిఎమ్‌సి 805 కేసులో సమాధానాలు చెప్పింది.
పరస్పర ఆమోదంతో దాఖలు చేసిన దరఖాస్తుని కుటుంబ న్యాయస్థానం 2-12-1999 రోజున తిరస్కరించింది. దీనిపైన రాజస్థాన్ హైకోర్టులో డివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరు న్యాయవాదుల వాదనలు విన్న తరువాత కోర్టు దరఖాస్తుని ఆమోదించింది.
కేసు విషయాల్లోకి వస్తే - పార్టీల మధ్య 24, మే 1995 రోజున వివాహం జరిగింది. ఆ తరువాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఇద్దరూ వేరువేరుగా నివసించడం మొదలు పెట్టారు. ఆ తరువాత 15-1-1999 రోజున హిందూ వివాహ చట్టంలోని సె.-13బి ప్రకారం విడాకుల కోసం దరఖాస్తుని దాఖలు చేశారు. వారిద్దరి స్టేట్ మెంట్లని కోర్టు నమోదు చేసి, ఆరు నెలల తరువాత వారి హాజరు గురించి తేదీని నిర్ణయించింది. ఆ తరువాత భర్త కోర్టు ముందు హాజరు కాలేదు. భార్య హాజరైంది. రెండు, మూడు వాయిదాలు ఇచ్చినప్పటికీ భర్త కోర్టు ముందు హాజరు కాలేదు. భర్త నడవడిక చూసి విసుగు చెందిన భార్య, అతను కోర్టు ముందు హాజరు అయ్యే విధంగా, అదే విధంగా అతని స్టేట్ మెంట్ నమోదు చేసుకోవడానికి సమన్స్ పంపించాలని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తుని దాఖలు చేసింది. ఆ విధంగా చేయడానికి చట్టంలో అలాంటి ప్రొసీజర్ లేదని కోర్టు పేర్కొంటూ దరఖాస్తుని కొట్టివేసింది. ఐదవసారి పార్టీలు హాజరు కావడం లేదన్న కారణంగా కోర్టు వారి కేసుని కొట్టివేసింది. దీనిపైన అప్పీలుకి రాజస్థాన్ హైకోర్టులో దాఖలు చేసింది భార్య. దానిపైన రివ్యూ దరఖాస్తుని దాఖలు చేశారు. రివ్యూని కోర్టు ఆమోదించింది.
ఇద్దరూ కలిసి దరఖాస్తుని దాఖలు చేసినప్పుడే కోర్టు పరస్పర ఆమోదంతో విడాకులు మంజూరు చెయ్యాలి తప్ప వారు హాజరు కానప్పుడు మంజూరు చేయడానికి వీల్లేదని భర్త న్యాయవాది కోర్టు ముందు వాదనలు చేశాడు. మొదటి సారి విడాకుల కోసం సమ్మతిని తెలియజేసి ఆ తరువాత కోర్టు ముందు హాజరు కాకపోవడం ద్వారా తనను ఇబ్బంది పెట్టి కేసు డిస్మిస్ అయ్యే విధంగా చేయడం సరైంది కాదని, వరుసగా హాజరు కాకుండా చేయగా అలాంటి తనని ఇబ్బందికి గురి చేయడమేనని కోర్టు ముందు భార్య న్యాయవాది వాదనలు చేశాడు.
తీర్పులోని ముఖ్యాంశం
మొదటిసారి తరువాత ఇంకొకసారి ఇద్దరూ హాజరై విడాకుల కోసం తమ సమస్యలు తెలియజేయాలి. అలాంటి సందర్భాల్లోనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. కోర్టు గడువు ఇచ్చిన సమయంలో తమ సమ్మతిని తెలియజేస్తూ భార్యా భర్తలలో ఎవరైనా ఉపసంహరించుకోవచ్చు. కానీ ఈ కేసులో భర్త ఆ విధంగా చేయలేదు.
అతను కోర్టు ముందుకు రాకుండా వౌనంగా ఉన్నాడు. ఆ వౌనాన్ని, సమ్మతిని ఉపసంహరించుకున్నట్టుగా భావించడానికి వీలు లేదు. అతను ఆ విధంగా మూడు సంవత్సరాల పాటు వౌనంగా ఉన్నాడు. అతను తన సమ్మతిని ఉపసంహరించుకో దలిస్తే కోర్టు ముందుకు వచ్చి ఆ విషయాన్ని తెలియజేయవచ్చు. కానీ అతను ఆ పని చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే కోర్టు ముందుకి రాకుండా అతను భార్యని వేధించాడు. రెండవసారి ఇద్దరు పార్టీలు హాజరు వుండాలన్న సాంకేతిక అభ్యంతరాన్ని మేం పట్టించుకోదల్చుకోలేదు. రెండవసారి అతను హాజరు కాకపోవడం వల్ల అతను సమ్మతిని ఇచ్చాడన్న భావనకి రావల్సి ఉంటుంది. భర్త పూర్తిగా వౌనంగా ఉండటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది రెండవ సందర్భంలో కొన్ని నెగటివ్‌గా తీసుకోవాలా, పాజిటవ్‌గా తీసుకోవాలా? తను తన సమ్మతిని ఉపసంహరించుకోవాలంటే అతనికి ఎలాంటి ఆటంకాలు లేవు. అతన్ని ఎవరూ నిరోధించలేదు. అందుకని అతను సమ్మతిని ఉపసంహరించాడని కాకుండా ఇచ్చాడన్న అభిప్రాయానికి కోర్టు రావాల్సి ఉంటుంది. అందుకని ఈ కేసులో భర్త సమ్మతిని ఇచ్చాడన్న నిర్ణయానికి వచ్చి వారి వివాహాన్ని రద్దు చేస్తున్నాం’’.
భర్త హాజరు కాకున్నా కోర్టు పరస్పర ఆమోదంతో విడాకులను మంజూరు చేసింది. దీని ఉద్దేశం ఇద్దరు హాజరు కాకున్నా మంజూరు చేయవచ్చని కాదు. తన సమ్మతిని ఉపసంహరించుకోకుండా నిరాటంకంగా హాజరు కానప్పుడు కోర్టు ఇలాంటి భావనకి రావల్సి ఉంటుందని ఈ తీర్పు ఉద్దేశం.

No comments:

Post a Comment

Followers