Monday, November 8, 2010

పరస్పర ఆమోదంతో విడాకులు పొందడానికి అవసరమైన అంశాలు

October 20th, 2010

పరస్పర ఆమోదంతో విడాకులను కోరే పద్ధతి గతంలో లేదు. దీన్ని 1976లో ప్రవేశపెట్టారు. ఇది ఇద్దరు భార్యాభర్తలు కలిసి దాఖలు చేస్తారు. మామూలుగా విడాకులు కోరినపుడు ఆ విధంగా కోరిన వ్యక్తి దరఖాస్తుదారుగా అవతలి వ్యక్తిని ప్రతివాదిగా చూపిస్తారు. అయితే ఈ పరస్పర ఆమోదంతో వేసే దరఖాస్తులో ఇద్దరు దంపతులు సంయుక్తంగా కలిసి దాఖలు చేస్తారు.
ఈ దరఖాస్తులో ఏ అంశాలు ఉండాలి
పరస్పర ఆమోదంతో వేసే దరఖాస్తులో ప్రధానంగా మూడు అంశాలు వుండాలి. అవి-
* వారిద్దరి మధ్య వివాదం జరిగి వుండాలి. ఏ చట్ట ప్రకారమైతే వివాహం జరిగిందో, వారు ఆ మతానికి చెందినవారై వుండాలి. ఆ విషయాన్ని అందులో పేర్కొనాలి.
* సంవత్సరం నుంచి కానీ అంతకుమించి గానీ వారిద్దరూ వేరుగా నివశిస్తూ ఉండాలి.
* వాళ్ళిద్దరూ కలిసి జీవించి వుండలేని పరిస్థితులు ఏర్పడి, పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని వుండాలి.
వివాహం జరిగి ఉండాలి అంటే?
హిందూ వివాహ చట్టం అమల్లోకి రాకముందుగానీ ఆ తరువాత గానీ వారిమధ్య వివాహం జరిగి ఉండాలి. దరఖాస్తుతో తమ వివాహం హిందూ మతాచారం ప్రకారం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. దానికి సంబంధించిన పత్రాలని దరఖాస్తుతోబాటు జత చేయాలి. వారి వివాహ పత్రిక, సంయుక్తంగా వున్న ఫొటో, అవి లేనప్పుడు ఇద్దరివి వేరువేరుగా వున్న ఫొటోలని దరఖాస్తుతోబాటూ జత చేయాలి. వీలైతే వాటిని గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయించి దాఖలుచేయాలి.
వేరుగా నివసిస్తూ వుండాలంటే?
పరస్పర ఆమోదంతో సంయుక్తంగా దంపతులిద్దరు కలిసి దాఖలుచేసే దరఖాస్తు తాము సంవత్సరం నుంచి గానీ అంతకుమించిగానీ వేరుగా నివశిస్తున్నామని పేర్కొనాలి. వాస్తవంగా ఇద్దరిమధ్య విభేదాలు పొడసూపి వేరువేరుగా నివశిస్తారు.
అయితే కొన్ని సందర్భాలలో ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో వుంటున్నప్పటికీ వేరు వేరు జీవితాలని గడుపుతుంటారు. అంటే వారి మధ్యన దాంపత్య జీవనం వుండదు. ఇలాంటి సందర్భాన్ని కూడా వేరువేరుగా నివసించడంగా పరిగణించవచ్చా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దీన్ని కూడా వేరుగా నివశిస్తున్నట్టుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు ఒక తీర్పులో పేర్కొంది. దాంపత్య జీవనం లేకపోవడం అంటే భార్యాభర్తల మధ్యన శారీరక సంబంధాలు లేకపోవడమని అర్ధం. ఒక గూడులో నివశిస్తున్నప్పటికీ వారిమధ్యన సెక్స్ సంబంధాలు లేకపోతే దాన్ని వేరుగా నివసిస్తున్నట్టుగానే భావించాల్సి వుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి.
కలిసి జీవించి వుండలేని పరిస్థితులు అంటే
దంపతులిద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు ఏర్పడి కలిసి జీవించి వుండలేని పరిస్థితులు వుండాలి. రాజీ ప్రయత్నాలు కూడా విఫలమై వుండాలి. ఈ పరిస్థితుల కారణంగా వారిద్దరూ కలిసి పరస్పర ఆమోదంతో విడాకులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకొని వుండాలి.
షరతులు పెట్టుకోవచ్చా?
ఈ విడాకులు తీసుకునే క్రమంలో కొన్ని షరతులని కూడా దంపతులు ఏర్పరచుకుంటారు. ఆస్తి విభాగాల గురించి, భరణం గురించి, నెలవారీ చెల్లించే మనోవర్తి గురించి, పిల్లల కస్టడీ గురించి, పిల్లలని చూడటానికి సంబంధించిన సమయాలు, తేదీల గురించి కూడా ఈ దరఖాస్తు పరిష్కారంలో కోరుకోవచ్చు. ఇవి ప్రైవేట్ హక్కులకి, పబ్లిక్ పాలసీకి భంగం కలిగించకుండా వుండాలి.
ఈ దరఖాస్తు దాఖలు తరువాత ఎంతకాలం
వేచి వుండాలి?
పరస్పర ఆమోదంతో విడాకుల కోసం దాఖలుచేసిన దంపతులు తిరిగి ఆలోచించుకోవడానికి, రాజీచేసుకొని దాంపత్య జీవనం తిరిగి కొనసాగించడానికి చట్టపరంగా 6 నెలల కాలాన్ని కనీస సమయంగా ఏర్పరిచారు. దాన్ని 18 నెలల కాలం వరకు ఈ సమయాన్ని పొడిగించే అవకాశం వుంది. దీని ఉద్దేశ్యం- వివాహం తిరిగి పునరుద్ధరించబడటానికి తొందరపాటు వల్ల విడాకులు తీసుకోకుండా వుండటానికి ఈ కాలపరిమితిని ఏర్పాటుచేశారు.
ఈ కాలపరిమితిలో పార్టీలు తమ దరఖాస్తుని ఉపసంహరించుకొని దాంపత్య జీవనాన్ని కొనసాగించవచ్చు. వివాహం చెదిరిపోకుండా వుండటానికి, దంపతుల మధ్య ఆవేశకావేశాలు, కోపతాపాలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ షరతుని ఏర్పరచి శాసనకర్తలు కొంత జాగ్రత్తని తీసుకున్నారని అన్పిస్తుంది.
ఆరునెలల తరువాత పార్టీలు ఏం చెయ్యాలి?
ఆరునెలల తరువాత కోర్టు పార్టీలని విచారించాయి. ఈ ఆరునెలల కాలం గడిచిన తరువాత పార్టీలు ఇంకా అదే అభిప్రాయంతో వున్నారా అన్న విషయాన్ని పరిశీలించి, కోర్టు సంతృప్తి చెందిన తరువాత కోర్టు విడాకులను మంజూరు చేస్తుంది. ఇందుకుగానూ పార్టీలు తమ ప్రమాణ పత్రాలని సమర్పించవచ్చు. లేదా కోర్టు వారి స్టేట్‌మెంట్లని నమోదు చేయవచ్చు. ఈ క్రమంలో పార్టీలు సమ్మతిని మోసం ద్వారా ఒత్తిడి ద్వారా ప్రభావితం చేయడం ద్వారా పొందినవా అన్న విషయాన్ని కోర్టు పరిశీలించాల్సి వుంటుంది. భార్య తన మనోవర్తి గురించి, పిల్లల అధీనం గురించిన హక్కులను వదులుకున్నారా అన్న విషయాన్ని కూడా కోర్టు పరిశీలిస్తుంది.
ఫొటోలు, స్టేట్‌మెంట్లు నమోదు అవసరమా?
గతంలో విడాకుల దరఖాస్తులో ఫొటోలని కావాలని కోర్టులు అడిగేవి కావు. దీనివల్ల కొన్ని ప్రాంతాలలో మోసాలు జరిగిన సంఘటనలు కోర్టుల దృష్టికి వచ్చాయి. వేరే ఎవరినో తీసుకొనివచ్చి విడాకులు పొందిన సందర్భాలని కోర్టులు గమనించి ఆ పార్టీల ఫొటోలు అవసరమని కోర్టులు అంటున్నాయి.
అదేవిధంగా దరఖాస్తుని దాఖలుచేసిన సందర్భంలో మళ్లీ విడాకులు మంజూరు చేసే సందర్భంలో పార్టీలని స్టేట్‌మెంట్లని కోర్టు నమోదు చేయడం అవసరం. అలా చెయ్యడంవల్ల తమ దరఖాస్తులో రాసిన విషయాలు ఈ పార్టీలకి బోధపడతాయి.
ఒకవేళ ప్రమాణ పత్రాలను దాఖలు చేసినపుడు కూడా వాటిలోని కోర్టు వారికి తెలియచెప్పి తిరిగి వారి సంతకాలు తీసుకుంటోంది. కాబట్టి అందులో ఏమి రాసి వుందో ఆ విషయం పార్టీలకు మళ్ళీ ఒకసారి అవగతం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
మోసాలు జరగకుండా వుండటానికి కోర్టు వివాహానికి సంబంధించిన ఫొటోను అదేవిధంగా కొత్త పాస్‌పోర్టు ఫొటోను తమ దరఖాస్తుతోబాటు జతచేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. పార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మోసాలు జరగకుండా వుండటానికి కోర్టులు ఈ పని చేస్తున్నాయని గ్రహించాలి.


*
*
*

* Releated Articles

No comments:

Post a Comment

Followers