Wednesday, January 27, 2010

పోలీసులకు ముందుజాగ్రత్త అధికారాలు

January 26th,2010

కాగ్నిజబుల్ నేరాలు జరగకుండా నిరోధించడం, గందరగోళాలు జరగకుండా చూడడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, ప్రజల ఆస్తికి రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత. అదేవిధంగా ఎవరైనా కాగ్నిజబుల్ నేరం చేస్తారని అన్పించినప్పుడు అవి జరగకుండా నిరోధించడం కూడా పోలీసుల విధి. పోలీసుల చట్టం, 1861లో ఈ విధులను ఏర్పరిచారు. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్‌కోడ్‌లోని అధ్యాయం తినిలోని సె.149-153 వరకు వున్న నిబంధనల్లో కూడా చెప్పడం జరిగింది.
నేరాలను నిరోధించడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో రెండు రకాల అధికారాలున్నాయి. మరోరకంగా చెప్పాలంటే దీన్ని రెండు విభాగాలుగా విభజించవచ్చు. అవి- మొదటిది, మేజిస్ట్రేట్ తన అధికార పరిధిని వినియోగించి నేరాలను నిరోధించడం, వీటి గురించి అధ్యాయం నినిలో చెప్పారు. అలాగే క్వాసీ జ్యుడీషియల్, క్వాసీ ఎగ్జిక్యూటివ్ అధికారాలను అధ్యాయం తిలో చెప్పారు.
రెండవది- దీన్ని మూడు ఉప విభాగాలుగా విభజించవచ్చు. 1. కాగ్నిజబుల్ నేరాలు జరగకుండా నిరోధించడం (సె.149-151) 2. ప్రభుత్వ ఆస్తులకు విధ్వంసం జరగకుండా నిరోధించడం (సె.152) 3. తూనికలు కొలతలను తనిఖీ చేయడం (సె.153)
మొదట విభాగానికి సంబంధించి కొంత విచారణ చేసే అవకాశం ఉంటుంది. రెండో విభాగంలో విషయాలు అత్యవసరమైనవి. పోలీసు అధికారి తనకు వున్న సమాచారాన్ని బట్టి చొరవ తీసుకోవాల్సి వుంటుంది. ఈ అధికారాలు విస్తృతమైనవి.

నేరాలను నిరోధించడానికి పోలీసు
అధికారి జోక్యం చేసుకునే అవకాశం వుందా?

కాగ్నిజబుల్ నేరాలను నిరోధించాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై వుంటుంది. కాగ్నిజబుల్ నేరమంటే ఏమిటో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సె.2(సి)లో నిర్వచించారు. వారెంట్ లేకుండా పోలీసు అధికారి నేరస్తులను అరెస్టు చేయడానికి అవకాశం వున్న నేరాలను కాగ్నిజబుల్ నేరాలంటారు. ఈ నేరాలని పోలీసులు మేజిస్ట్రేట్ అనుమతితో నిమిత్తం లేకుండావిచారించే అవకాశం వుంది.
కాగ్నిజబుల్ నేరాలు జరగకుండా నిరోధించడానికి ప్రతి పోలీసు అధికారి జోక్యం చేసుకునే అవకాశం వుంది. జోక్యం చేసుకున్న తరువాత వాటిని నిరోధించడానికి తన సామర్థ్యం మేరకు అతను కృషి చేయాల్సి వుంటుంది. ఈ అధికారం ప్రతి పోలీసు అధికారికి అతని హోదాతో నిమిత్తం లేకుండా వుంది. భారతదేశంలో ఎక్కడైనా ఈ అధికారాన్ని ఉపయోగించవచ్చు.
కాగ్నిజబుల్ నేరాలను నిరోధించడానికి ఈ అధికారం పోలీసు అధికారులకు విస్తృతంగా ఉంది. (సె.149(క్రి.ప్రొ.కో.)

కాగ్నిజబుల్ నేర సమాచారాన్ని
పై అధికారికి అందించాల్సి వుంటుందా?

కాగ్నిజబుల్ నేరాలు జరగడానికి ప్రణాళిక జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిన పోలీసు అధికారి ఆ సమాచారాన్ని తన పై అధికారికి, లేదా వాటిని నిరోధించే అధికారం ఎవరికి వుందో ఆ అధికారులకు అందించాలి. (సె.150 (క్రి.ప్రొ.కో)

నేరం చేసే వ్యక్తులను పోలీసు అధికారి
అరెస్టు చేయవచ్చా?

కాగ్నిజబుల్ నేరం ఎవరైనా వ్యక్తి చేసే అవకాశం వుందని ఏ పోలీసు అధికారికైనా సమాచారం అందినప్పుడు, ఆ వ్యక్తిని ఆ పోలీసు అధికారి మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా, వారంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. అరెస్టు చేయడం మినహా మరోరకంగా ఆ నేరాన్ని నిరోధించలేకున్న అభిప్రాయం కలిగినప్పుడు ఈ ముందు జాగ్రత్త అరెస్టుని చేయాల్సి వుంటుంది.

అరెస్టు చేసిన తరువాత
ఏం చేయాల్సి ఉంటుంది?

అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల వరకు కస్టడీలో వుంచుకునే అవకాశం వుంది. అంతకుమించి అతని కస్టడీ అవసరమైతే ఏదైనా అమల్లో వున్న చట్ట ప్రకారంకాని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లో పేర్కొన్న నిబంధనల మేరకు మాత్రమే కస్టడీలో వుంచాల్సి వుంటుంది. (సె.151 క్రి.ప్రొ.కో.)

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా
నిరోధించే అధికారం పోలీసు అధికారికి వుందా?

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా తన చొరవతో పోలీసు అధికారి జోక్యం చేసుకొని నిరోధించాలి. అవి స్థిరాస్తులు కావచ్చు, చరాస్తులు కావచ్చు.

తూనికల కొలతలని తనిఖీ చేసే అధికారం
పోలీసులకు వుందా? అధికారికి వుంది?

ఏదైనా ప్రదేశంలో దొంగ కొలతలు, తూనికలు ఉపయోగిస్తున్నారన్న సమాచారం అందినపుడు తన పరిధిలోని ఏ ప్రదేశాన్నైనా వారంట్ లేకుండా ఆ పోలీసు స్టేషన్ ఇంచార్జి అధికారి వాటిని తనిఖీ చేయవచ్చు.
వాటి కొరకు వెతకవచ్చు. అలాంటివి దొరికితే వాటిని జప్తు చేయవచ్చు. అయితే సమాచారాన్ని వెంటనే సంబంధిత మేజిస్ట్రేట్‌కి తెలియపరచాలి. (సె.153 క్రి.ప్రొ.కో.)
* ఈ నిబంధన ప్రకారం చర్య తీసుకునే అధికారి పోలీసు స్టేషన్ ఇంచార్జి అధికారికి మాత్రమే వుంటుంది.
* అది కూడా తన అధికారంలోని ప్రదేశాన్ని మాత్రమే తనిఖీ చేసే అధికారం వుంది.
* ఈ చర్యలకు ఎలాంటి వారెంట్ అవసరం లేదు.

No comments:

Post a Comment

Followers