Sunday, July 19, 2009

ద్వేషించే నేరాలు !

భారత దేశస్థులపై ఆస్ట్రేలియాలో జరుగుతున్న దాడులు ఒక్క భారతీయులను మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలామంది ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఒక్క నెలలో నాలుగు దాడులు జరిగాయి ఒక జాతిపై జరుగుతున్న దాడుల వల్ల ఆస్ట్రేలియా జాతికి ఉన్న మంచి పేరు కాస్తా తొలగిపోతోంది మెల్‌బోర్న్‌ లోనే ముగ్గురు విద్యార్థులపై దాడులు జరిగాయి. స్క్రూడైవర్‌తో ఒకరిపైన, మిగతా ముగ్గురిపైన కత్తితో దాడులు జరిగాయి. సిడ్నీలో భారతీయ విద్యార్థిమీద పెట్రోలు బాంబుతో దాడి జరిగింది. ఒక జాతికి చెందిన ప్రజల మీద, ఒక మతానికి చెందిన ప్రజల మీద దాడులు ఒక్క ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. మన దేశం 1670లో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ఇంచు మించు ఈ విషయంలో అదే విధంగా ఉంది. రక రకాల మతాలకు, జాతులకు చెందిన వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి దాడుల సంఘటనలు జరగడానికి అవకాశం ఉన్నా,అవి జరగకుండా నియంత్రించడానికి సరైన యంత్రాం గం, చట్టాలు అవసరం. ఇప్పుడు ఉన్న చట్టాలు సరిపోవా, కొత్త చట్టాలు అవసరమా అన్నది ప్రశ్న.మామూలుగా చూసినప్పుడు అత్యల్ప విషయంగా కనిపించే సంఘటన ఇలాంటి దాడులు జరగడానికి అవకాశం కల్పిస్తుంది. స్వార్ధ ప్రయోజనాలు ఉన్న వ్యక్తులు ఆ చిన్న సంఘటనని మతపరమైన దాడిగా చిత్రీకరించి ఘోరమైన సంఘటనలు జరగడానికి కారణమవుతున్నారు. చిన్న సంఘటనల వల్లనే కాదు, ఒక్కోసారి పెద్ద సంఘటనల వల్ల కూడా ‘ద్వేషించే నేరాలు’ (హేట్‌ క్రైమ్స్‌) జరిగే అవకాశం ఉంది. అందుకు ఉదాహరణలు- ఇందిరా గాంధీ హత్య తరువాత మన దేశంలో చెలరేగిన అల్లర్లు, సెప్టెంబర్‌ 11 సంఘటన తర్వాత అమెరికాలో జరిగిన సంఘటనలు వంటివి ఎన్నో! సెప్టెంబర్‌ సంఘటన తర్వాత 2001లో సిక్కు మతానికి చెందిన బల్‌బీర్‌ సింగ్‌ సోధీని అమెరికాకు చెందిన ఫ్రాంక్‌ సిల్వారోక్‌ చంపేశాడు అమెరికా జ్యూరీ అతడికి మరణ శిక్ష విధించింది. క్రిష్టియన్‌ మిషనరీకి చెందిన గ్రాహమ్‌ స్టేన్స్‌ని అతని కుమారుని సజీవ దహనం చేసిన కేసులో దారాసింగ్‌ అనే వ్యక్తికి మన దేశంలోని కోర్టు మరణశిక్ష విధించింది. జాతి సంబంధమైన, మత సంబంధమైన నేరాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. రోజు రోజుకీ ఈ నేరాల సంఖ్య పెరుగుతోంది. విద్వేష పరమైన ప్రసంగాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఇలాంటి దాడులను, ‘ద్వేషించే నేరాలు’ అనీ, ఇలాంటి ప్రసంగాలను ‘అసహ్యకరమైన ప్రసంగాలు’ అని అంటున్నారు. ఏదైన ఒక ప్రత్యేకమైన సాంఘిక బృందంలో ఎవరైనా ఒక వ్యక్తి సభ్యుడైనందున ఆ వ్యక్తిపై ఎవరైనా దాడికి పాల్పడితే దానిని ‘అసహ్యకరమైన నేరం’అని అంటున్నాం. ఆ ప్రత్యేకమైన బృందం మతపరమైనది కావచ్చు, అంగ పరమైనది కావచ్చు, రాజకీయ పరమైనది కావచ్చు. ఆ బృందంలో సభ్యుడైనందుకు దాడులు జరిగితే దానిని ‘ద్వేషించే నేరం’ అని అంటున్నారు. ఆ దాడులు భౌతికంగా ఉండవచ్చు, మానసికంగా ఉండవచ్చు. ఆ నేరాలు ఆస్తికి నష్టం కలిగించడం ద్వారా, వేధించడం ద్వారా,తిట్టడం ద్వారా, అవమానించడం ద్వారా జరగవచ్చు. పిచ్చి పిచ్చి బొమ్మ లు రాయడం ద్వారా కూడా జరగవచ్చు. ఎవరైన వ్యక్తి చర్యలు విద్వేష పూరితంగా ఉన్నాయని, హాని కలిగించేవిగా ఉన్నాయని బాధితులు గానీ, లేక ఇతర వ్యక్తులు గానీ భావిస్తే వాటిని ఇంగ్లాండ్‌లో ‘హేట్‌ క్రైమ్స్‌’గా పరిగణిస్తున్నారు. ఈ దాడులు భౌతికంగా కాని, మాటల ద్వారా కాని, భయపెట్టడం ద్వారా కాని,అవమానించడం ద్వారా కాని కావచ్చు అవి ఉద్దేశపూర్వకంగా చేసి ఉండాలి. నల్ల జాతికి చెందిన వ్యక్తులమీద, మైనారిటీలకు చెందిన 87 వేల మంది వ్యక్తుల మీద బ్రిటన్‌లో 2004 సంవత్సరంలో దాడులు జరిగాయని ఆ దేశంలో జరిపిన ఒక సర్వే చెబుతోంది. అమెరికాలో 1991లో ‘హేట్‌ క్రైమ్‌’ను నిర్వచించారు. ఒక వ్యక్తి తెగకు సంబంధించి,వర్ణానికి సంబంధించి, జాతీయతకు సంబంధించి ఎవరైనా నేరం చేస్తే అది హేట్‌ క్రైమ్‌ అవుతుంది. 31 రాష్ట్రాలలో ఇందుకు సంబంధించిన చట్టాలు అమలులో ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారం సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.మన దేశంలో హేట్‌ క్రైమ్స్‌ను నిర్వచించలేదు. ఇందుకు సంబంధించి ప్రత్కేక చట్టం కూడా లేదు. ఇందుకు ప్రత్యేక చట్టం అవసరం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ద్వేషించే నేరాలను నియంత్రించకపోతే అవి తీవ్ర రూపం దాల్చుతాయి. ఫలితంగా ఉగ్రవాదం ప్రబలే అవకాశం ఉంది. అందుకని ద్వేషించే నేరాల గురించి దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మత పరంగా, జాతి పరంగా, వర్ణ పరంగా జరిగే నేరాలను అదుపు చెయ్యడానికి మన దేశంలో లెక్కలేనన్ని చట్టాలు ఉన్నాయి. ద్వేషించే నేరాలను నియంత్రించడానికి సంబంధించి భారతీయ శిక్షా స్మృతిలో చాలా నిబంధనలు ఉన్నాయి మత విద్వేషాలను,జాతి విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులపై కేసులు నమోదు చేయడానికి చాలా నిబంధనలు ఆ కోడ్‌లో ఉన్నాయి. అలాగే ఆ నేరాలను ప్రేరేపించే వ్యక్తులపైనా, కుట్రలు పన్నే వ్యక్తులపైనా చర్యలు తీసుకోవడానికి కూడా నిబంధనలు భారతీయ శిక్షా స్మృతిలో ఉన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వ్యక్తులపైన, తిరుగుబాటు చేసే వ్యక్తులపైన, దేశద్రోహానికి పాల్పడే వ్యక్తులపైన, విద్వేషం కలిగించే అన్ని నేరాలకు సంబంధించి ఈ చట్టంలో నిబంధనలున్నాయి. అయితే వాటిని సక్రమంగా దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఉపయోగించుకోవాలి. 2001 సెప్టెంబర్‌ 8న దర్బన్‌లో జాతి వివక్షకి, విదేశీ వస్తువుల వ్యతిరేకతకి సంబంధించి అంతర్జాతీయ సదస్సు జరిగింది. జాతి వివక్షకు వ్యతిరేకంగా చట్టాలను ఉపయోగించి బాధితులకు రక్షణ కల్పించాలని ఆ సదస్సు ప్రకటన జారీ చేసింది. ఈ నేర బాధితులకు చట్టం అందుబాటులో ఉండి, వారికి రక్షణ కల్పించే విధంగా అన్ని దేశాలూ ప్రయత్నించాలని, అవసరమైతే కొత్త చట్టాలను కూడా తీసుకురావాలని ఈ సదస్సు కోరింది. ఈ నేపథ్యంలో ద్వేషించే నేరాలను అదుపు చేయడానికి కొత్తచట్టం తీసుకు రావాలన్న డిమాండ్‌ సహజంగానే వస్తుంది. అయితే, ఇప్పటికీ మన దేశంలో లెక్కలేనన్ని చట్టాలు ఉన్నాయి. ద్వేషించే నేరాలను అదుపు చెయ్యడానికి, అందుకు పాల్పడ్డ వ్యక్తులపై చర్య తీసుకోవడానికి అవసరమైన నిబంధనలు భారతీయ శిక్షాస్మృతిలో ఉన్నాయి. కాబట్టి కొత్త చట్టం అవసరం లేదు గానీ, వాటిని దర్యాప్తు చేయడానికి యంత్రాంగం అవసరం ఉంది. నిర్ణీత గడువులో దర్యాప్తు పూర్తి చేసే విధంగా యంత్రాంగాన్ని రూపొందించాలి ఇటువంటి ద్వేషించే నేరాలకు సంబంధించిన కేసులను సత్వరంగా పరిష్కరించే కోర్టులను ఏర్పాటు చేయాలి. నేరాలు జరిగినప్పుడు వాటిని అందరూ ఖండించాలి. అంతర్జాతీయంగా ఒకరికొకరు ఈ నేరాలను నియంత్రించడానికి సహకరించుకోవాలి. ఎందుకంటే, ఒక దేశంలో జరిగిన సంఘటన ప్రభావం మరో దేశంలో పడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Followers