Saturday, May 23, 2009

నార్కో పరీక్షల్లో విశ్వపనీయత?

నార్కో అనాలిసిస్‌ పరీక్షలు, పాలియోగ్రాఫ్‌, బ్రెయిన్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌ పరీక్షలు మళ్ళీ చర్చలోకి వచ్చాయి. ఇందుకు కారణం భారత లా కమిషన్‌ ఈ పరీక్షలను తక్షణం నిలిపిచేయాలని భారత ప్రభుత్వానికి సూచించడమే. నిజాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఉపయోగించే ఈ పద్ధతులు మౌలికమైన మానవ హక్కులకు భంగం కలిగిస్తున్నాయని లా కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. కమిషన్‌ ఇక్కడితో ఊరుకోలేదు. ఈ పరీక్షలు ఒత్తిడితో చేస్తున్న చర్యలని తన నివేదికలో పేర్కొంది. ఎక్కడ ఏ నేరం జరిగినా, అది ప్రజల దృష్టిని ఆకర్షించినప్పుడు ప్రజల నుంచి ఈ పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్‌ వస్తున్నది. అనుమానితుల పైన, ముద్దాయి పైననే కాదు సాక్షుల పైన కూడా ఈ పరీక్షలు నిర్వహించాలన్న డిమాండ్‌ చాలా ఎక్కువ సార్లు వస్తోంది. ఈ పరీక్షల విలువ, వాటి పరిణామాలు ప్రజలకి తెలియవు. ఈ పరీక్షలు నిర్వహిస్తే ముద్దాయిలు దొరికిపోతారన్న భ్రమలో ప్రజలు ఉన్నారు. అందుకని ఆ డిమాండ్‌ ఎక్కువగా చేస్తున్నారు. ఈ అభిప్రాయంలో నిజం ఉందా?దేశ వ్యాప్తంగా ఈ పరీక్షల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ పరీక్షలు నిర్వహించడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. కోర్టులు కూడా ఈ పరీక్షలకు అనుమతి ఇస్తున్నాయి. పోలీసులు కూడా ఈ పరీక్షల కోసం అత్యంత ఉత్సా హం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను తక్ష ణం నిలిపివెయ్యాలని లా కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించడం ఓ శుభపరిణామం. లా కమి షన్‌ ఈ సిపారసు చేయడానికి కారణం- ఫోరెన్సిస్‌ సైన్స్‌ సోసైటీ ఆఫ్‌ ఇండియా ఈ పరీక్షల వినియోగం పై తీవ్ర ఆందోళన వ్యక్త పరుస్తూ లా కమిషన్‌కి మహజరును సమర్పించింది. ఈ మహజరుకు స్పందించి లా కమిషన్‌ నేరన్యాయ వ్యవస్థలోని అన్ని విభాగాల నుంచి ప్రతిస్పందనలను కోరింది. ఫోరెన్సిస్‌ సొసైటీ ఈ పరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రపంచంలోని నాగరిక దేశాలు ఐదు దశాబ్దాల క్రితమే వదిలి వేసిన ఈ పరీక్షలను మన దేశంలో నిర్వహించడం సరైంది కాదని తగు సాక్ష్యాధారాలతో కమిషన్‌ ముందు వాదించింది. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని లా కమిషన్‌ ఈ పరీక్షలు తక్షణం మాని వేయాలని ప్రభుత్వానికి సూచించింది. పోలీసులు క్రమశిక్షణ గలిగిన దళమని, అది రాజ్యాంగానికి ఇతర శాసనాలకి లోబడి తన విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో అభిప్రాయపడింది. తమ సైంటిఫిక్‌ పద్ధతుల ద్వారా సైంటిస్టులు పోలీసులను ఉత్తేజపరచాలి తప్ప, మానవ హక్కుల ఉల్లంఘనలో పోలీసులకు తమ సహాయాన్ని అందించకూడదు. ప్రపంచం ఈ పరీక్షలని వదిలి పెట్టడానికి ప్రధాన కారణాలు రెండు- ఈ పరీక్షల్లో విశ్వసనీయత లేదని పోలీసులకు తెలుసు. అది మొదటి కారణం. ఇక, రెండవ కారణం మానసిక శాస్తవ్రేత్తలు నీతిగా ప్రవర్తించి, పోలీసులు కోరిన విధంగా సహకరించకపోవడం. ఈ రెండు కారణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ పరీక్షలను దర్యాప్తు సంస్థలు వదిలి వేశాయి. కమిషన్‌ ఈ విషయాన్ని తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. మందుల ప్రభావం వల్ల అనుమానితులు చెప్పే విషయాల్లో విశ్వసనీయత తక్కువ. అంతే కాదు ఈ మందుల ప్రభావం ఉన్న మామూలు వ్యక్తి కూడా తనకు తెలిసి ఉన్న విషయాలని మరుగుపరిచే అవకాశం ఉంది. ఈ పరీక్షల విధానాన్ని చాలా దేశాలు అధ్యయనం చేశాయి. ఈ పరీక్షల ద్వారా నిజాలను దాచడం కష్టమే కానీ దాచి ఉంచే అవకాశం మాత్రం ఉంది. అదే విధంగా చెయ్యని నేరాలని అంగీకరించే ప్రమాదం కూడా ఉంది. పరీక్షలు నిర్వహిస్తున్న వ్యక్తిపై పరీక్షలు నిర్వహించే వ్యక్తులు తమ అభిప్రాయాలను రుద్దే అవకాశం ఏర్పడుతుంది. ఈ కారణాల వల్ల ఈ పరీక్షల విశ్వసనీయత సందేహాస్పదమే. లా కమిషన్‌ ఈ విషయాలను పరిగణనలోకి తీసుకొని తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. బెంగళూర్‌లోని పరిశోధన సంస్థలో నిర్వహించిన పరీక్షలు కూడా కమిషన్‌ దృష్టిలోకి వచ్చాయి. పోలీసులు కోరిన విధంగా స్టేట్‌మెంట్‌ రావడం కోసం ఒకే వ్యక్తి మీద ఎన్నో సార్లు ఈ పరీక్షలను అక్కడ నిర్వహించారు. ఈ పరీక్షల్లో విశ్వసనీయత లేదని అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. ఫాలిగ్రాఫ్‌ పరీక్షలు లేదా లైడిటెక్టర్‌ పరీక్షల్లో విశ్వసనీయత లేదని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ పరీక్షల్లో రెండు రకాల ప్రశ్నలు అడుగుతారు. వంచించే ప్రశ్నలు, మోసపుచ్చే ప్రశ్నలు వాటిలో ఉంటాయి. అందుకని ఈ పరీక్షలు శాస్ర్తీయమైనవని అనలేమని కమిషన్‌ తన నివేదికలో పేర్కొంది. అదే విధంగా బ్రెయిన్‌ ఫింగర్‌ ప్రింటింట్‌ పరీక్షలు కూడా.మందులు మనిషిని ఉత్సాహపరచాలి. అంతే కానీ ఆందోళన పరచకూడదు. ఈ నార్కో పరీక్షలను మందులు ఇవ్వడం ద్వారా నిర్వహిస్తారు. ఈ మందుల ప్రభావం వల్ల మనిషికి అపాయం సంభవించే అవకాశం ఉంది. అలాంటి పరీక్షలు ఇంకా కొనసాగడం సరైందేనా? ప్రపంచం వద్దనుకున్నా ఈ పరీక్షలను మనం ఇంకా కొనసాగించడం సమంజసమేనా? భారత లా కమిషన్‌ నివేదికను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆశించాలి.

No comments:

Post a Comment

Followers