Saturday, January 3, 2009

surya daily 3-01-08
క్రిమినల్‌ చర్యలు తీసుకొన్నప్పుడే!
చిన్న చిన్న కేసుల్లో ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు కూడా కోర్టులు విపరీతంగా స్పందిస్తాయి. అది మంచిదే. కానీ తీవ్ర ఆరోపణలు ఉన్న కేసుల్లో కోర్టుల స్పందన కరువైనప్పుడు ప్రజలు నిరాశకు, నిస్పృహకు లోనవుతారు. కోర్టుల మీద ప్రజలకు విశ్వాసం ఉండేలా చూడాల్సిన బాధ్యత కోర్టుల మీదే కాదు, ప్రజల మీద కూడా ఉంది. బూటకపు ఎన్‌కౌంటర్లు అని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఊరుకుంటే సరిపోదు. వాటిని కోర్టుల దాకా తీసుకెళ్ళాలి. చిన్న దొంగతనం చేసిన పన్నెండు సంవత్సరాల బాలుడు అస్లాం చేతులకు సంకెళ్ళు వేసి ఉత్తరప్రదేశ్‌ పోలీసులు వీధుల వెంట తిప్పారు. ఈ కేసులో అతని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిందని న్యాయవాది ఇందిరా జైసింగ్‌ నష్టపరిహారం కోసం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రంగనాథ్‌ మిశ్రా, కె. రామస్వామి విచారించి అస్లామ్‌కి రూ. 20,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసులో రాజ్యమే కాదు, రాజ్యానికి ప్రతినిధి అయిన కానిస్టేబుల్‌ కూడా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించడం ద్వారా, ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లచేసిన ప్రభుత్వోద్యోగులు కూడా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఒక వార్నింగ్‌ ఇచ్చింది. ముద్దాయిలకు సంకెళ్ళు వేయడాన్ని సుప్రీంకోర్టు చాలా సార్లు నిరసించింది. ఈ కేసులో ముద్దాయి వయస్సు 12 సంవత్సరాలు. అతనికి సంకెళ్ళు వేయడం ద్వారా అతని ప్రాథమిక హక్కులకు ఖచ్చితంగా భంగం కలిగించినట్టే. అతని వయస్సు దృష్టా్య కూడా సంకెళ్ళు వేయకూడదు. దేశపౌరుల జీవనవిధానాన్ని కష్టపెట్టే విషయాల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు సమాజంలోకి ప్రవహించనందునకు, ముఖ్యంగా శాంతి భద్రతల గురించి పట్టించుకొనే ప్రభుత్వోద్యోగులకు తెలియక పోవడం మాకు అత్యంత బాధాకరంగా అనిపిస్తోంది.సంకెళ్ళు వేయడాన్ని వ్యతిరేకిస్తూ 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన తీర్పు ఇంకా ప్రభుత్వోద్యోగులకు తెలియకపోవడం, పోలీసుల పద్ధతుల్లో కనీస మార్పు కూడా రాకపోవడం చాలా దయనీయమైన పరిస్థితి. కానిస్టేబుల్‌ పాండే చేసిన పనిని కించపరుస్తూ, ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని ప్రతివాదులు, న్యాయవాది ఇచ్చిన హామిని పరిగణనలోకి తీసుకున్నాం. అయినప్పటికీ ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలు భంగం కలిగిన అస్లామ్‌కి నష్టపరిహారం ఇచ్చే ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకని అతనికి రూ. 20 వేలు చెల్లించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం. అందులో రూ. 19 వేలు ఉత్తప్రదేశ్‌ ప్రభుత్వం, రూ.1000 పాండే చెల్లించాలని ఆదేశిస్తున్నాం. మొత్తం రూ.20 వేలు ప్రభుత్వం మూడువారాల్లోగా కోర్టులో జమచేయాలి. ప్రభుత్వం ఆ తరువాత రూ.1000 పాండే జీతం నుంచి మినహాయించాలి. ఆ విధంగా మినహాయించినట్టు ఉత్తరప్రదేశ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సర్టిఫికేట్‌ దాఖలు చేయాలి. ఆ వెయ్యి రూపాయలు ప్రభుత్వనిధి నుంచి చెల్లించకూడదు. ప్రభుత్వం ఈ డబ్బును రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జమచేసిన తరువాత, ఆ మొత్తాన్ని జిల్లా జడ్జి లక్నోకి బదిలీ చెయ్యాలి. ఆ విషయాన్ని అస్లాంకి తెలియజేసి, జాతీయ బ్యాంకులో ఆరు సంవత్సరాలకు డిపాజిట్‌ను అస్లాం పేర చేయాలి. అస్లాం సంక్షేమాన్ని పట్టించుకునే అతని బంధువులు ఆ డబ్బుపై వడ్డీ తీసుకునే అవకాశం కల్పించాలి. ఆ వడ్డీ డబ్బుతో అస్లాంకి పునరావాసం లభిస్తే సంతోషపడతాం. అస్లాంని జేబుదొంగతనాల వృత్తి మాన్పించి, చదువు నేర్చుకోవడానికి స్కూల్‌కి పంపించాలి. ఈ ఉత్తర్వుల ప్రకారం తీసుకున్న చర్యల్ని, ఇతర విషయాల్ని ఆరునెలలోగా జిల్లా జడ్జి ఈ కోర్టుకి తెలియజేయాలి' (మిస్‌ ఇందిరా జైసింగ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, ఇతరులు, రిట్‌ పిటిషన్‌ (క్రిమినల్‌)నెం.118/90, తీర్పు ప్రకటించిన తేదీ 23-03-1990). ఇదివరలో భీమ్‌సింగ్‌ (ఏఐఆర్‌ 1986 సుప్రీంకోర్టు 495) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అస్లాం కేసు తీర్పు విభిన్నమైంది. ఈ రెండు కేసుల ప్రాథమిక హక్కులకు (మానవ హక్కులకు) భంగం వాటిల్లింది పోలీసులవల్లే. భీమ్‌సింగ్‌ కేసులో పోలీసుల చర్యను సుప్రీంకోర్టు ఖండించి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది కాని బాధ్యులైన పోలీసులను కాదు. కానీ అస్లాం కేసులో పోలీసుల చర్యను ఖండించడమే కాదు, ప్రభుత్వంతోపాటు కానిస్టేబుల్‌ కూడా కొంత నష్టపరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. `భీమ్‌సింగ్‌ను ఆరెస్టు చేసింది, రిమాండ్‌ని పొందింది అధికారస్థాయిలో దిగువలో ఉన్న అధికారులు, వాళ్ళ చర్యలకు బాధ్యత వహించాల్సిన వ్యక్తులపై అధికారస్థాయిలో ఉన్న జమ్మూ- కాశ్మీర్‌ రాష్ట్రప్రభుత్వ అధికారులు. కానీ ఖచ్చితంగా వారి బాధ్యతను గుర్తించడానికి సరైన అధారాలు మా దగ్గర లేవు' అని సుప్రీంకోర్టు భీమ్‌సింగ్‌ కేసులో అభిప్రాయపడింది. ఈ రెండు కేసులను గమనించినప్పుడు, రాజ్యం తరపున బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న ప్రభుత్వోద్యోగులు కూడా మానవహక్కుల ఉల్లంఘనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది, నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. చట్టం పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వోద్యోగులు గుర్తించుకోవాలి. కోర్టులు క్రియాత్మకంగా వ్యవహరించాలి. కోర్టులు ఆ విధంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. ఈ ప్రయాణం ఇంకా కొనసాగాల్సిన అవసరం ఉంది. అప్పుడే అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లు ఆగుతాయి. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు, అందుకు కారణం ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పుడు దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని 80 వ దశాబ్దంలో కోర్టులు తీర్పులు చెప్పాయి. ఆ తరువాత 90 వ దశాబ్దంలో కోర్టులు ఇంకా కొంచెం ముందుకు ప్రయాణంచేసి రాజ్యమే కాదు, ప్రభుత్వోద్యోగులు కూడా నష్టపరిహారాలు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులు జారీ చేశాయి. ఆ తరువాత రాజ్యమే కాదు, ఆ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని తీర్పులు చెప్పాయి. ఈ పరిణామం కొనసాగాల్సిన అవసరం ఉంది. నష్టపరిహారాలు మంజూరు చెయ్యడంతోనే సరిపోదు, క్రిమినల్‌ చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి చర్యలకు ముగింపు లభిస్తుంది.
రచయిత నిజామాబాద్‌జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers